సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  అధిక శ్రావణ మహుళ త్రయోదశి – 14 ఆగస్ట్ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌జాతుల నిర్మూలన అనే అకృత్యం, అనాగరిక చేష్ట, మధ్య యుగాల మౌఢ్యం చరిత్రను కలత పెడుతూనే ఉంది. ఒక తెగ లేదా జాతి మొత్తాన్నీ ఏదో పేరు పెట్టి భౌతికంగా నిర్మూలించడం, లేదా ఒక ప్రాంతం నుంచి తరిమికొట్టడం అందులో కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్‌లో దాదాపు యాభయ్‌ ‌సంవత్సరాల పాటు సాగిన పాతకానికి ఇదే సరైన పేరు. కాంగ్రెస్‌ ‌సంతుష్టీ కరణ, మేధావుల వెన్నెముక లేనితనం, సెక్యులరిస్టుల, ఇతర సెక్యులర్‌ ‌పార్టీల విద్రోహ ధోరణి, పత్రికల పక్షపాత వైఖరి కలగలసి ఆ ఘోర ఉదంతాన్ని వెలుగులోకి రాకుండా చేశాయి. మతోన్మాదుల, రక్తపిపాసుల చేతులలో ప్రత్యక్ష నరకం అనుభవించిన కశ్మీరీ పండితవర్గం తరఫున కొన్ని హిందూ సంఘాలు, జనసంఘ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తప్ప ఎవరూ నోరు విప్పలేదు. క్రీస్తుశకం 14,15 శతాబ్దాల నుంచి అక్కడి హిందువులు, ముఖ్యంగా పండిత్‌లు ఏడుసార్లు వలస బాట పట్టవలసి వచ్చింది. అందులో దారుణమైనది జనవరి 19, 1990లో మొదలయింది. అప్పుడు 3.5 లక్షల మంది పండిత్‌లు లోయ వీడి ప్రాణాలరచేత పట్టుకుని వలసపోయారని నార్వేజియన్‌ ‌రిఫ్యూజీ కౌన్సిల్‌ ‌లెక్క వేసింది. కానీ ఆ సంఖ్య ఐదు లక్షలని చెబుతారు. నిస్సహాయంగా చని పోయినవారు వందలలో ఉన్నారు. లైంగిక అత్యాచారాలు, లూటీలకు లెక్కలేదు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 370వ అధికరణాన్ని రద్దు చేసి లోయలో కొత్త చరిత్రకు శ్రీకార చుట్టింది. దాని ఫలితంగానే కశ్మీర్‌లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. న్యాయం కోసం ఆక్రోశిస్తున్న కశ్మీరీ పండిత్‌లకు ఇది శుభవార్త. పండిత్‌ల మీద జరిగిన హత్యాకాండకు సంబంధించిన కేసులను తిరగదోడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జే&కే రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) ఈ ‌దర్యాప్తు చేపడుతుంది. అంటే ఆ అకృత్యాలకు బలైన వారికి 33 సంవత్సరాల తరువాత అయినా న్యాయం అందించే పక్రియ మొదలయింది. 1989-1990లలో జరిగిన హత్యలన్నింటి మీదా ఇప్పుడు దర్యాప్తు జరుపుతారు. ఆగస్ట్ 7‌న ఇందుకు శ్రీకారం చుట్టారు.

జస్టిస్‌ ‌నీల్‌కంఠ్‌ ‌గంజూ హత్యతో దర్యాప్తులు మొదలుకానున్నాయి. 1990 డిసెంబర్‌ ‌నాటి దారుణ మారణకాండకు దాదాపు ఏడాది ముందు, అంటే నవంబర్‌ 4,1989‌న జస్టిస్‌ ‌గంజూను పట్టపగలే హత్య చేశారు. జస్టిస్‌ ‌గంజూను అంత దారుణంగా చంపడానికి కారణం- జేకేఎల్‌ఎఫ్‌ ‌వ్యవస్థాపకుడు మహమ్మద్‌ ‌మక్బూల్‌ ‌భట్‌కు హైకోర్టులో మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఆయన కావడమే. 1966లో జరిగిన పోలీస్‌ అధికారి అమర్‌చంద్‌ ‌హత్యకు సంబంధించిన కేసులో ఆ శిక్ష పడింది. ఒక బ్యాంకు దోపిడీ, ఆ బ్యాంకు ఉద్యోగి హత్యకు సంబంధించి కూడా భట్‌పై కేసులు ఉన్నాయి. రాజధాని శ్రీనగర్‌లోనే, హరిసింగ్‌ ‌మార్కెట్‌లో ఉగ్రవాదులు ఆయనను కాల్చి చంపారు. చిత్రంగా ఆ హత్య జరిగిన తరువాత ఒక్క అరెస్టు కూడా జరగలేదని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొందరు ‘గుర్తు తెలియని దుండగులు’ ఈ దురాగతానికి పాల్పడినట్టు చెప్పినా ఒక్క అరెస్టు కూడా జరగకపోవడం వింతల్లో కెల్లా వింత. జే&కే హైకోర్టు ఇచ్చిన తీర్పునే 1982లో సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. ఇంగ్లండ్‌లో భారత దౌత్యవేత్త రవీందర్‌ ‌మాత్రేను జేకేఎల్‌ఎఫ్‌ ఉ‌గ్రవాదులు చంపిన కొద్దిరోజులకే, భట్‌ను ఫిబ్రవరి 11,1984న తీహార్‌ ‌కారాగారంలో ఉరి తీశారు. నాడు కశ్మీర్‌ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న అబ్దుల్‌ ‌గనీ లోనే (తరువాత హురియత్‌ ‌కాన్ఫరెన్స్‌కు నాయకత్వం వహించారు) ఈ ఉరి అన్యాయమని గొంతు చించుకున్నారు. భట్‌ ‌తరువాత జేకేఎల్‌ఎఫ్‌ ‌నాయకత్వం చేపట్టి లోయను మరింత నెత్తుటిమయం చేసిన యాసిన్‌ ‌మాలిక్‌కు ఇటీవల జీవిత ఖైదు విధించారు.

కశ్మీరీ పండిత వర్గ ప్రముఖులను తుదముట్టించాలన్న తమ పథకాన్ని జస్టిస్‌ ‌గంజూ హత్యతోనే కశ్మీర్‌ ‌వేర్పాటువాద ముఠాలు మొదలుపెట్టాయి. జస్టిస్‌ ‌గంజూ హత్యకు సంబంధించిన సమాచారం తమకు తెలియచేయాలని, తద్వారా జేకేఎల్‌ఎఫ్‌ ఉ‌గ్రవాదుల మీద పటిష్టమైన రీతిలో కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని ఎస్‌ఐఏ ఆగస్టు 7న ప్రకటన వెలువరించింది. సమాచారం ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం, నగదు బహుమతి వంటివన్నీ మామూలే. పండిత్‌లపై జరిగిన మారణకాండలో భాగస్వాములైన ఫరూక్‌ అహ్మద్‌ ‌దార్‌ (‌బిట్టా కరాటే) వంటివారు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగు తున్నారు. ఇది న్యాయవ్యవస్థకు ఒక సవాలు. బాధితులకు హృదయశల్యమైన పరిణామం. దర్యాప్తు నిర్ణయం పట్ల జే&కే మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత కవీందర్‌ ‌గుప్తా హర్షం వ్యక్తం చేశారు.ఆ హత్యాకాండ మీద దర్యాప్తు చేయించాలని కశ్మీర్‌ ‌ప్రాంత బీజేపీ నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు చిరకాలంగా కోరుతూనే ఉన్నారు. 1990 నుంచి లోయలో పండిత్‌లే లక్ష్యంగా జరిగిన అన్ని హత్యల మీదా దర్యాప్తు జరపాలని ఆ వర్గం చిరకాలంగా కోరుకుంటున్నది కూడా. ఇందులో న్యాయం ఉంది.

నిజానికి ఈ సంవత్సరం ఆదిలో జరిగిన ఏటీఎమ్‌ ‌గార్డ్ ‌సంజయ్‌ ‌శర్మ అనే పండిత్‌ ‌హత్యకు సంబంధించి జూన్‌ 14‌వ తేదీనే దక్షిణ కశ్మీర్‌లో అనుమానిత ప్రాంతాల మీద ఎస్‌ఐఏ ఆకస్మిక దాడులు జరిపింది. అవన్నీ ఉగ్ర వాదానికి అలవాలంగా ఉన్న అనంతనాగ్‌, ‌పుల్వామా, సొఫియాన్‌ ‌వంటి ప్రాంతాలే కావడం విశేషం. ఎన్‌డీయే ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఇంకా ఉంది. పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకుని, కశ్మీర్‌ను, ఆసియాను, ఇంకా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులకు ఇదొక తీవ్ర హెచ్చరిక వంటిదే. ఇందుకు ప్రపంచ దేశాలు కూడా సహకరించాలి. కశ్మీర్‌లో ఉగ్రవాదం పీచమణచిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమన్న వాస్తవాన్ని అంతా గుర్తించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE