సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ఆషాఢ అమావాస్య –  17 జూలై 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఉమ్మడి పౌరస్మృతి గురించి చర్చలు వెల్లువెత్తకపోయినా, ఆరోగ్యకరమైన రీతిలో సుసంపన్నంగా జరుగుతున్నాయి. మంచి సమాచారం ప్రపంచం దృష్టికి వస్తున్నది. అంతరంగాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఒక పెనుమార్పు తీసుకు రావడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న తపన వ్యక్తమవుతున్నది. సమాజం, చట్ట వ్యవస్థ ఆధునికం కావడానికి ఇదొక మార్గమన్న నమ్మకం కుదురుతున్నది. ఈ చట్టం మహిళలకు ఎక్కువ మేలు చేస్తుంది. ఏదో ఒక కాలంలో ప్రతి మతం స్త్రీని చిన్నచూపు చూసిన మాట వాస్తవం. కొన్ని మతాలు ఇప్పటికీ మహిళను పిల్లలను కనే యంత్రంగాను, భోగవస్తువుగాను పరిగ ణిస్తున్నాయి. మతం ఆధారంగా నిర్మితమయ్యే పర్సనల్‌ ‌లా చీకట్ల నుంచి ఉమ్మడి పౌరస్మృతి వెలుగులోకి రావాలని అన్ని వర్గాలకు కోరిక ఉంది. అది సహజం. అదే వ్యక్తమవుతున్నది.

కానీ ఇందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి భగ్నం చేయాలని చూస్తున్న శక్తులు ఎప్పటిలాగే పొంచి చూస్తున్నాయి. ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డ్ ఇం‌దులో ముందు ఉన్నది. ఇది ముస్లింల మీద పరిమిత ప్రభావం కలిగిన పిడికెడంత సంస్థ మాత్రమే. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించాలని పార్లమెంట్‌ ‌సభ్యులకు ఈ బోర్డ్ ‌పిలుపునిచ్చింది. ఇలాంటి పిలుపులోని హేతువు ఎంతో తేల్చడానికి చర్చలు ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చినదే న్యూస్‌ 18 ‌మెగా యూసీసీ పోల్‌. ‌సరైన సమయంలో, సరైన పంథాలో వచ్చిన సర్వే. ఆ ప్రముఖ న్యూస్‌ ‌చానల్‌  ‌చేయించిన ఈ సర్వే కొందరు నాయకులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి లేదా యూసీసీ పరిధిలోకి వచ్చే 25 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్నుకుని దాదాపు 800 మంది విలేకరులు 8.035 మంది ముస్లిం మహిళలను నేరుగా కలుసుకుని అభిప్రాయాలను సేకరించారు. వాటన్నిటి సారాంశమే ఈ సర్వే. జూలై 4-8 తేదీల మధ్య జరిపిన ఈ సర్వేలో ఏడు ప్రశ్నలు ఉన్నాయి. అవి- విడాకులు, వివాహం వంటి వ్యక్తిగత అంశాలకు దేశ పౌరులందరికీ ఒకే చట్టం మంచిదేనా? ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండడం అనివార్యమా? విడాకులు పొందిన మహిళ ఎలాంటి ఆంక్షలు లేకుండా పునర్‌ ‌వివాహం చేసుకునే వెసులుబాటు ఉండాలా? దత్తత చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటే మంచిదేనా? ఆస్తిహక్కుకు ఒకే చట్టం అమలు చేయవచ్చా? వివాహ వయసు 21 సంవత్సరాలుగా ఉంటే మంచిదేనా? వంటి ప్రశ్నలు అడిగారు. అయితే ఈ సర్వే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన యూసీసీ కోసమని ప్రత్యేకంగా వెల్లడించలేదు. కానీ ప్రశ్నలన్నీ అందుకు సంబంధించినవేనని వెంటనే అర్ధమవుతుంది.

  ఈ సర్వే ప్రకారం వివాహం, విడాకులు, వారసత్వ హక్కుకు సంబంధించి దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఉండడం అవసరమని 67 శాతం ముస్లిం మహిళలు అభిప్రాయపడుతున్నారు. వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండాలని 78.7 శాతం ముస్లిం మహిళలు కోరుకుంటున్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో గృహిణులు, విడాకులు తీసుకున్నవారు, వితంతువులు, సున్నీలు, షియాలు కూడా ఉన్నారు. అలాగే పోస్ట్ ‌గ్రాడ్యుయేట్ల నుంచి ప్రాథమిక విద్యకు మాత్రమే నోచుకున్నవారు కూడా ఉన్నారు.  ఈ మార్పును, ఫలితాలను  ఇస్లామిక్‌ ‌పండితుడు జీనత్‌ ‌షౌకత్‌ అలీ స్వాగతించారు.

అరేబియా దేశాల నుంచి (ఎక్కువమంది వయోవృద్ధులు) హైదరాబాద్‌  ‌వచ్చి, పాత నగరానికి చెందిన కొందరు మైనర్‌ ‌బాలికలను పెళ్లి పేరుతో ఎత్తుకు వెళ్లడం అందరికీ తెలుసు. డబ్బు తీసుకుని బాలికల తల్లిదండ్రులు ఈ అకృత్యాలకు సహకరిస్తున్న సంగతీ నిజం. ఇదంతా షరియా ముసుగులో సాగుతున్న ఒక పీడన. ఇలాంటివి నివారించడమే యూసీసీ ధ్యేయం. కానీ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తామని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జూలై 10న ప్రకటించడం హాస్యాస్పదం. ఇది యథాతథవాదులకు కొమ్ము కాయడమే. ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందో లేదో కూడా తెలియని ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు విన్నవించినంతనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వింతగా ఉంది. ఈ తేనెతుట్టెను కదపవలసిన అవసరం ఏమిటి అంటూ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు చిదంబరం ఒక మాట అన్నా, యూసీసీ ముసాయిదా వచ్చిన తరువాత వైఖరిని వెల్లడిస్తామని తాజాగా ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ ‌చెప్పడం సబబుగానే ఉంది. అంటే బుజ్జగింపు ధోరణులకు తాత కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ‌దగ్గులు నేర్పించే ప్రయత్నం చేశారు. ముసాయిదా అయినా బయటకు రాకుండానే తాము యూసీసీకి వ్యతిరేకమని ప్రకటించిన ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డుకు కేసీఆర్‌ ‌వత్తాసు పలికారు.

ఉమ్మడి పౌరస్మృతి విషయంలో నాటి జిన్నా వాదనను నేడు కొందరు నాయకులు తలకెత్తుకున్నట్టే ఉంది. ఇందుకు కాంగ్రెస్‌ ‌సందేహించినా కేసీఆర్‌ ‌సందేహించలేదు. అదే చిత్రం. డాక్టర్‌ అం‌బేడ్కర్‌, ‌డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌, ‌జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ, కేఎం మున్షీ వంటి వారంతా ఉమ్మడి పౌరస్మృతి వాంఛనీయమని వాదించినవారే. రాజ్యాంగం, సుప్రీంకోర్టు పలుసార్లు యూసీసీ అవసరాన్ని నొక్కి చెప్పాయి. ముస్లిం పర్సనల్‌ ‌లా శిలాశాసనం కాదని పాకిస్తాన్‌, ఈజిప్ట్ ‌వంటి దేశాల అనుభవాలు చెబుతున్నాయి. తాజాగా హద్దిత్‌ (‌ముస్లిం న్యాయసూత్రాలు) పునర్‌ ‌నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ఒక సంఘాన్ని నియమించారు. ఈ వాస్తవాలు, అనుభవాలు ఉండగా ఈ దేశ ముస్లిం పెద్దలకు, బుజ్జగింపు జాడ్యంతో బాధపడుతున్న హిందూ రాజకీయ నేతలకు ఇదేం బుద్ధి?

About Author

By editor

Twitter
YOUTUBE