సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  అధిక శ్రావణ చతుర్దశి – 31 జూలై 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ప్రజా జీవితంలో చిరకాలం పనిచేసిన వారికీ, కొద్దికాలం పార్ల మెంటును కూడా ఉద్ధరించిన వాళ్లకీ, అందునా కాటికి కాళ్లు చాచుకున్న వాళ్లకీ కాస్తంతయిన ఇంగితజ్ఞానం ఉండాలి. పిసరంతయినా విజ్ఞత కావాలి. వాళ్ల నుంచి సమాజం ఆ మాత్రం ఆశిస్తుంది. అంతేకానీ ఇంత సిగ్గూ ఎగ్గూ లేనితనం ఏమిటి, ఇంత బరితెగింపు ఏమిటి, వీళ్ల బుద్ధులన్నీ ఇంత జుగుప్సాకరమైనవా, ఈ బుర్రలన్నీ ఇంత కుళ్లిపోయాయా అని సమాజం ఈసడించుకునే వైఖరి ప్రదర్శించకూడదు. సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యురాలు, కాన్పూర్‌ ‌మాజీ ఎంపీ సుభాషిణి అలీ సరిగ్గా అలాంటి వైఖరినే ప్రదర్శించారు. పరమ నైచ్యానికి ఒడిగట్టారు. గణవేష్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యూనిఫారమ్‌)‌లో ఇద్దరు వ్యక్తులు కలసి ఉన్న ఫోటోను పెట్టి ‘మణిపూర్‌ ‌ఘటన నిందితులు వీళ్లే. వీరిని ఆ దుస్తులను బట్టి గుర్తు పట్టండి’ అంటూ జూలై 23న ఒక ట్వీట్‌ను దేశం మీదకు వదిలి తన బుర్ర పరిపూర్ణంగా పుచ్చిన వాస్తవాన్ని ఆమె బయట పెట్టుకున్నారు. ఆ ఇద్దరు మే 4 నాటి మణిపూర్‌ ‌ఘోర ఉదంతాన్ని దగ్గర ఉండి జరిపించారని తేల్చిపారేశారామె. ఒక స్త్రీ అయి ఉండి, స్త్రీల హక్కుల పోరాటం మీద గుత్తాధికారం మాదే అన్నట్టు వీరంగం వేసే వామపక్షి అయి ఉండి ఒక గిరిజన స్త్రీ మీద జరిగిన అత్యాచారాన్ని ఇంత నీచంగా, దగుల్బాజీతనంగా ద్వేష రాజకీయాల కోసం, విద్వేష సృష్టికి ఉపయో గించుకోవాలని అనుకున్నందుకు నెటిజన్లు ఆమె మొహం మీద ఉమిసినంత పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మహిళకు ఎలాంటి గౌరవం ఇస్తుందో ఈ ఎర్రరోగులకీ, ఈ విదేశీ సిద్ధాంత పీడితులకీ, ఏ భారతీయ విలువలూ లేని ఈ దొంగ ప్రగతివాదులకీ తెలియకపోయినా భారతజాతికి తెలుసు. అందుకే ఆమెకు బుద్ధి చెప్పే పనిని వారే స్వచ్ఛందంగా తీసుకున్నారు. కళ్లు మూసుకుపోయి సుభాషిణి తన పోస్టులో పెట్టిన ఆ ఇద్దరు ఎవరో తెలియచేసి నెటిజన్లే ఈ మతి చెడిన వృద్ధ నారీ నేత కళ్లు తెరిపించే ప్రయత్నమూ చేశారు. ఆ ఫొటో లోని ఇద్దరిలో ఒకరు సాక్షాత్తు బీజేపీ మణిపూర్‌ ఉపాధ్యక్షుడు చిదానంద్‌సింగ్‌. ‌మరొకరు ఆయన 14 ఏళ్ల కుమారుడు సచిదానంద సింగ్‌. ఈ ఇద్దరు ఒక శాఖలో పాల్గొన్నప్పుడు తీయించుకున్న ఫొటో అది. మణిపూర్‌లో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంతటి నేరానికి బాహాటంగా పాల్పడతాడని ‘సీనియర్‌’ ‌సీపీఎం నేత ఎలా అనుకున్నారు? బుద్ధీజ్ఞానం ఉన్నవారు ఎవరైనా అలా భావించగలరా? ఆయన ఎవరో తెలియకుండానే బుద్ధికి ఏది తోస్తే అది దేశం మీదకు వదిలేస్తారా? గోబెల్స్ ‌కూడా ఇంతకు తెగించి ఉండడు.

 ఇంకా నీచమైన విషయం- ఇంతవరకు ఏ వీడియో లేదా పత్రిక ఇవ్వనంత స్పష్టంగా వివస్త్రగా దుండగులు ఊరేగించిన ఆ నిర్భాగ్య మహిళ చిత్రాన్ని ఈ సీపీఎం మహిళా నేత జాతికి ప్రదర్శించారు. వాళ్లే చెప్పే ‘ఈ వ్యాపార పత్రికలు’ కూడా అంత నైచ్యానికి పాల్పడలేదు. తల్లి కుక్క మొరిగితే పిల్లకుక్కలు గొంతు కలిపినట్టు సుభాషిణి ట్వీట్‌ ‌వదలడం ఏమిటి, విద్రోహ చింతనల,శక్తుల అడ్డా జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషా ఘోష్‌ ‌వంత పాడారు. ఇంకొంతమంది ప్రగతిశీల సిద్ధాంతులూ తమ వంతు హంగు చేశారు. ఐషా ఘోష్‌ అయితే సిలువ మీద ఒక నగ్న స్త్రీని, ఎదురుగా గణవేష్‌ధారి బొమ్మను వేసే నీచత్వానికి ఒడిగట్టింది. వాళ్ల భాషలోనే ప్రశ్నిద్దాం. ‘ఆధిపత్యకులాల’ స్త్రీ అయి ఉంటే సుభాషిణి ఆ ఫొటోను అంత స్పష్టంగా ప్రదర్శిస్తారా? ఇంతకీ ఈమె ‘బేషరతు క్షమాపణలు’ చెప్పారు. నకిలీ వార్తను దేశం మీదకు వదిలి పెట్టానని  అంగీకరించారు. ట్వీట్‌ను మాత్రం తొలగించలేదు. ఇదో వల్లమాలిన తెంపరితనం.

చిదానంద సింగ్‌ ‌సుభాషిణి మీద కేసు పెట్టారు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా సుభాషిణి వెంట నడిచిన తరుణ్‌ ‌భారతీయ (మేఘాలయ), కమాలుద్దీన్‌ ఎం (‌తమిళనాడు) మీద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయవలసిందని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ‌మణిపూర్‌ ‌పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ను ఆదేశించింది. సుభాషిణి పోస్ట్ ‌వల్ల ఆ బాలుడి ప్రాణాలకు ముప్పు కూడా ఉందని బాలల హక్కుల కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌ప్రియాంక కానుంగో మాట. ఇప్పుడు మాత్రం లేదని ఎలా చెబుతాం? సీపీఎం గత చరిత్రే ఇందుకు సాక్ష్యం. కాబట్టి ఇంకా పటిష్టమైన రక్షణ అవసరం.

ఆమె రాజకీయ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. ఒక స్త్రీగా, ప్రజా జీవితం తెలిసిన నేతగా సుభాషిణిని గౌరవించవలసిందే. కానీ ఇంతటి నీచమైన చర్యకు పాల్పడి ఆ గౌరవానికి ఆమె అర్హురాలు కారని స్వయంగా నిరూ పించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో, కేరళలో సీపీఎం కార్యకర్తలు సొంత పార్టీ మహిళల మీద, ఇతరుల మీద; ఇక అడవులలో మావోయిస్టులు ‘మహిళా కామ్రేడ్‌ల’  మీద అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆ బాధిత మహిళలే పలు సందర్భాలలో ఒప్పుకున్న నిష్టుర సత్యం వార్తల ద్వారా దేశమంతటికీ అందిన సంగతి సుభాషిణికి తెలియదా? ఆశ్రయం ఇచ్చిన కుటుంబాల మహిళలను లోబరుచుకుని ఆ కుటుంబాలను మావోయిస్టులు ఛిద్రం చేసిన ఘటనలూ దేశమంతటికీ తెలుసు. అలాంటి అభాగ్య మహిళల గురించి ఒక్క సానుభూతి వాక్యమైన వీళ్ల నోటి నుంచి ఎందుకు రాదు? ఇదే ఎర్ర మార్కు క్రమశిక్షణా? పశ్చిమబెంగాల్‌లో వీళ్ల శత్రువు పాలిస్తున్నారు. అక్కడా ఇలాంటివి నిత్యకృత్యం.  సుభాషిణి వంటి ప్రగతిశీల మార్కు మహిళలు నోరు విప్పరేమి? మణిపూర్‌లో ఆ స్త్రీలని ఆ నీచులు నగ్నంగా ఊరేగించి ఎంత అవమానించారో, దానిని రాజకీయం చేయదలిచిన సుభాషిణి అంతకంటే ఎక్కువగానే ఆమెను అవమానించారు. ఇదైనా ఆమెకు, ఆమె పార్టీకి అర్ధమయిందా? అర్ధమైనా, ఇదీ ఓ చారిత్రక తప్పిదం. అంతేగా!

About Author

By editor

Twitter
Instagram