– క్హణ

జ్ఞాపకాలన్నీ ఒకటి కాదు. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, వాటితో మాట్లాడుతూ ఉండాలని తరువాతి తరాలు తపించేటట్టు ఉండేవి. తుమ్మలపల్లి హరిహరశర్మ జ్ఞాపకాలు ఇలాంటివి. ఎందుకు అన్నారో మరి, ఆయన పుట్టినప్పుడు ఒక స్వాముల వారొచ్చి హరిహర అని పేరు పెట్టమన్నారట. అంటే విష్ణువు, శివుడు ఒకచోటే ఉంటారు. ఆ ఇద్దరు పురాణ పురుషుల మధ్య అభేదాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నమొకటి జరుగుతున్న కాలమది. అంతే, ఆ పేరులోని తత్త్వంతో ఆ జీవితం పెనవేసుకుంది. హరిహరశర్మగారి జీవితాన్ని పరిశీలిస్తే జ్ఞానమూ ఆయనే, జ్ఞానాన్వేషీ ఆయనే అనిపిస్తుంది. రాం మోహన్‌ ‌కండ్లకుంట వెలువరించిన ‘సిద్ధాంతంతో నడుస్తూ.. సిద్ధాంతం వైపు నడిపించిన… ‘‘ఓ తపస్వీ’’ గ్రంథం హరిహరశర్మ నిండైన, నిబద్ధతతో కూడిన జీవితం నుంచి సేకరించిన జ్ఞాపకాల సంకలనమే.

న్యాయవ్యవస్థలో పనిచేస్తూ, తనను చేయి పట్టుకు నడిపించిన తండ్రి జ్వాలాపతి మూడోఏటనే కన్నుమూశారు. ఆస్తి దాయాదుల పాలై చిన్న పశువుల పాకను నివాసంగా మార్చుకున్నారు. తల్లి మహాలక్ష్మమ్మ దిద్దించిన ఓనమాలు జీవితాన్ని నడిపాయి. కూరలేని అన్నాన్ని పంచదార పలుకులతో తిన్న రోజులు. ఇంటర్‌ ‌తరువాత ఎవరో ఉచితంగా ఇచ్చిన పుస్తకాలతో బీఏ ఇంగ్లిష్‌ ‌సాహిత్యం చదివి బంగారు పతకం సాధించుకున్నారు. తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఎమ్మే చేసి, టాపర్‌గా నిలిచారు. మంచి మంచి కళాశాలల్లో అధ్యాపకులయ్యారు. అప్పటిదాకా  ఆర్‌ఎస్‌ఎస్‌ ఆయనను నడిపించింది. తరువాత సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ‌నిర్మాణం పనిని అప్పగించింది. ‘శర్మగారికి 9 యేళ్ల వయసున్నప్పుడే  రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌తో పరిచయం. అది శర్మగారి 79 సంవత్సరాల జీవితానికి బాటలు వేస్తుందని, తత్ఫలితంగా వారు కొన్నివేల లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతారని ఆ రోజు వారికి కూడా తెలిసి ఉండదు.’ కానీ ఇది చరిత్రగా నమోదైంది. భారతదేశంలో చాలా విద్యా సంస్థలను ఎర్ర దుమ్ము నుంచి కాపాడిన ఘనత ఏబీవీపీదే.

విద్యార్థి ఉద్యమాలలో జాతీయ భావాల స్థానాన్ని సరైన సమయంలో గుర్తించడంలో ఏబీవీపీ విజయవంతమైంది. ఆ విజయం వెనుక ఉన్నవారు హరిహరశర్మ వంటివారే. ఆయనకు అండాదండా ఎస్వీ శేషగిరిరావు, గౌరీశంకర్‌ (ఏబీవీపీ త్రిమూర్తులు). ఒక మార్పునకు ఉద్యమం శరీరమైతే, దానికి ఆత్మ జాతీయత అయినప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. 1994లో కాకతీయ విశ్వ విద్యాలయం పేరును కాస్తా కారల్‌మార్కస్ ‌విశ్వవిద్యాలయంగా మార్చాలని నక్సల్స్ ‌కుట్ర పన్నుతున్నారని ఒక చర్చలో ఆందోళన వ్యక్తమైంది. దీనికి క్షణంలోనే శర్మ పరిష్కారం చూపారు. ఆ ప్రాంతాన్ని అద్భుతంగా పాలించిన కాకతీయుల సాంస్కృతిక, చారిత్రక చిహ్నాలు (తోరణం, కాకతి రుద్రమ ప్రతిమ) ప్రతిష్టించాలని చెప్పారు. ఆ సూచనకు విద్యార్థి పరిషత్‌ ‌సభ్యులు ఆకృతి ఇచ్చారు. నిజంగానే నక్సల్స్ ‌హింస వేడిలో ఆ పేరే పెట్టి ఉంటే! కమ్యూనిజం అనేది ప్రపంచంలో ఒక అంటరాని సిద్ధాంతంగా మారిన ఈ కాలంలో దానిని తలుచు కుంటే శర్మ తీసుకున్న నిర్ణయంలోని గొప్పతనం తెలుస్తుంది. నిజానికి జిల్లాకొక విశ్వవిద్యాయం వస్తుందని ఆయన ఆనాడే చెప్పారు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఏబీవీపీ మీద దాడులు ఎన్నో, సంస్థ కోల్పోయిన వీరులు ఎందరో! వాటికి శర్మగారు ఎలా స్పందించారు? ఆ ఉద్విగ్నతలు, ఉద్రేకాలను సమన్వయం చేసి సంస్థను నిలబెట్టడంలో ఎలా పాటు పడ్డారో, ఎంత మథనపడ్డారో ఇందులో ఎన్నో ఉదంతాలను ఆయన అనుభవాల రూపంలో చదవవచ్చు. ఆఖరికి వారి అర్థాంగి ‘ఏమయ్యా…! సార్‌ను ఉంచుతారా? చంపేస్తారా? అని కార్యకర్తలను అడగవలసి వచ్చింది. ఆ ఆవేదనను అర్థం చేసుకోవలసిందే. నక్సల్‌ ‌హింసకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 14,1983 ‌హైదరాబాద్‌లో ఏబీవీపీ నిర్వహించిన భారీ ప్రదర్శన, ఆపై రెండు వారాలకే కొండపల్లి సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్న నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తల మీద పెరిగిన దాడులు సంస్థ సిద్ధాంతకర్త ప్రాణం గురించి ఆందోళన కలిగించక మానవు. ఈ బైఠక్‌లో ఉన్నవారు వచ్చే బైఠక్‌ ‌నాటికి ఉంటారా లేదా అన్న ప్రశ్న మెదళ్లను కాల్చిన కాలం. కాబట్టి శర్మగారి అర్ధాంగి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో కూడా ఆయన ఏబీవీపీ కార్యకర్తలను కాపాడు కుంటూనే కర్తవ్యోన్ముఖులను కూడా చేశారు. ఇదెలా సాధ్యం! ఆయన ‘గృహస్తే.. కానీ మానసికంగా ప్రచారక్‌’.

ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో తెలుగు ప్రాంతాల ఏబీవీపీ కార్యకర్తలలో వచ్చిన మీమాంసలను కూడా శర్మ నిర్మాణాత్మక దృక్పథంతో నివృత్తి చేశారు.

ఆయన ఒక అవిశ్రాంత పథికుడు. ఒక పక్క విద్యార్థి ఉద్యమ నిర్మాణం. మరొక పక్క జాగృతి, సాందీపని, శంకరకృప వంటి పత్రికలకు రచనలు, విద్యారంగ గమనాన్ని పరిశీలించే సునిశిత బాధ్యత అహరహం నిర్వర్తించేవారు. శంకరకృప సంపాదకత్వం, సాందీపనిలో క్రీడాశీర్షక నిర్వహణ ఒక్క చేతి మీదుగానే సాగాయంటే నమ్మడానికి కొంచెం సమయం తీసుకున్నా, ఈ విన్యాసాన్ని అలవోకగా సాగించిన ఆ అమృతహస్తం శర్మగారిదే. యాభయ్‌ ఏళ్లు కలసి నడిచిన శర్మగారికి తాను ఇవ్వగలిగే స్మృత్యంజలి కేవలం ‘నిశ్శబ్దం’ అన్నారు ఆచార్య ఎస్వీ శేషగిరిరావు. కానీ ఆ నిశ్శబ్దంలో జాతీయతా భావాలను ఘోషించే నయాగారాలనూ, మాతృదేశ సేవను వినిపించే విస్ఫోటనాలనూ వినవచ్చు. అందుకే ఆయన జ్ఞాపకాల నిండా అవే ప్రతిధ్వనిస్తాయి. వినండి మరి!

సిద్ధాంతంతో నడుస్తూ…

సిద్ధాంతం వైపు నడిపించిన

                    ఓ తపస్వి

రచన: రాంమోహన్‌ ‌కండ్లకుంట

ప్రతులకు: సాహిత్య నికేతన్‌, ‘‌కేశవనిలయం’ బర్కత్‌పుర, హైదరాబాద్‌

‌సాహిత్య నికేతన్‌, ఏలూరు రోడ్‌, ‌విజయవాడ.

పేజీలు: 136,  వెల: రూ.100/-

About Author

By editor

Twitter
Instagram