గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో ఓ అంశంపై సాగుతున్న వాదోపవాదాలను యావత్‌ ‌సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. దీనిపై వచ్చే తీర్పు సెక్సువాలిటీ పట్ల సభ్యసమాజానికి ఉన్న అభిప్రాయంలో మార్పు తెస్తుందని ఓ వర్గం ఆశపడుతోంది. ఇంతకీ ఏమిటా అంశం? అందులో ఆసక్తి రేపే అంశం ఏమిటి?

సేమ్‌సెక్స్ ‌మ్యారేజ్‌ ‌లేదా స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత గురించిన చర్చ చిరకాలంగా జరుగుతోంది. సమాజంలో తమకూ సమానమైన గౌరవం లభించాలని ఈ వర్గాలు కోరుకుంటు న్నాయి. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు అందుకోవచ్చన్న ఆశ వారిలో కలుగుతోంది. ఈ అంశంపైన పౌరసమాజం, కేంద్ర ప్రభుత్వం, చట్టాలు కూడా భిన్నాభి ప్రాయా లతో ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు వేదికగా దీనిపైన సాగుతున్న వాదోపవాదాలు చివ రకు ఈ అంశాన్ని ఒక తార్కికమైన ముగిం పును ఇస్తాయన్న అభిప్రాయంలో ఉన్నారు. మొత్తం సమాజంపై ప్రభావంచూపే ఇలాంటి అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలని సుప్రీంకోర్టు భావిస్తోంది.

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు తుదివాదనలను వింటోంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానిని ప్రత్యక్షప్రసారాలను కూడా చేస్తున్నారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని స్వలింగ సంపర్కులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వారు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వంతో పాటు మతనాయకులు కూడా స్వలింగ సంపర్కుల వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించాలని 15కు పైగా జంటలు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. కలిసి పిల్లలను పెంచుతున్న జంటలుకూడా మూడుకు పైగా పిటీషన్లు దాఖలు చేశారు. ఇది ప్రాధాన్యత గల అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ‌పేర్కొన్నారు. చట్టపరమైన సవాళ్లను అన్నింటిని పర్యవేక్షించి ఈ అంశంపై తీర్పు నివ్వటానికి ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆయన ఏర్పాటు చేశారు.

భారత్‌లో ఎల్జీబీటీక్యూ ప్లస్‌ ‌జనాభా కోట్లల్లో ఉంటుందని ఒక అంచనా. 2012లో వీరి సంఖ్య 25 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం భావించింది. ఇప్పటి జనాభా ప్రకారం అంచనా వేస్తే వీరి జనాభా దాదాపు 10 శాతం లేదా 13.5 కోట్ల• ఉంటుం దని అంచనా వేస్తున్నారు. ‘మా డిమాండ్లను పార్లమెంటుకు పంపకుండా, సుప్రీంకోర్టు దానికదే ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రభు త్వంపైన మాకెలాంటి నమ్మకం లేదు. ఆర్టికల్‌ 377 ‌విషయంలో కూడా మా పక్షాన నిలబడి, మా బాధలను విన్నది’  లెస్బియన్‌, ‌బైసెక్సువల్‌ ‌ట్రాన్స్ ‌పర్సన్‌ ‌నెట్‌ ‌వర్క్ ఇన్‌ ‌స్టిట్యూట్‌కు చెందిన రితిక వ్యాఖ్యానించారు.

ఆర్టికల్‌ 377‌కి ఆమోదం ఇచ్చినప్పుడు పెళ్లికి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. సింగిల్‌ ‌పేరెంట్స్ ‌పిల్లలు దత్తత తీసుకుని వారికి ప్రేమను, సంరక్షణను అందిస్తున్నప్పుడు, స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకుని ఎందుకు అందించలేరు అని అడుగుతున్నారు. అలాంటి వాళ్లకు ఇద్దరు తల్లులు లేదా ఇద్దరు ఉంటారు అందులో తప్పేం ఉంది? అని నిలదీస్తున్నారు.

స్వలింగ సంపర్కులు ఏకం కావటాన్ని భారత్‌లో అన్ని మతాలు.. హిందూ, ముస్లిం, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు నాయకులు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. వివాహం అనేది సంతానం కోసం తప్ప వినోదం కోసం కాదని వారు  అభిప్రాయ పడుతున్నారు.

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత అనేది సమాజం, కుటుంబం, పిల్లలపై ప్రమాద కరమైన ప్రభావాలను చూపుతుందని 21 మంది రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయ పడ్డారు. స్వలింగ వివాహాల వల్ల భారత్‌ ‌లో ఎయిడ్స్ ‌కేసులు పెరగొచ్చని, ఇలాంటి జంటల దగ్గర పెరిగే పిల్లల మానసిక, ఉద్వేగాల అభివృద్దిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి భిన్నమైన వాదనను ఇండియన్‌ ‌సైకియాట్రిక్‌ ‌సొసైటీ (ఐపీఎస్‌) ‌పైకి తెచ్చింది. ‘స్వలింగ సంపర్కం అనేది ఒక వ్యాధి కాదు. ఎల్జీబీటీక్యూ ప్రజల పట్ల చూపే వివక్ష వారిలో మానసిక సమస్యలకు దారి తీస్తుంది’ అని ఈ సొసైటీ పేర్కొంది.

 గే సెక్స్‌ను నేరంగా పరిగణించకూడదని ఐపీఎస్‌ ‌చేసిన అభిప్రాయాన్ని 2018లో సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది.

మరో వైపు స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిన పిటీషన్లను తిరస్కరించాలని సుప్రీంకోర్టును భారత ప్రభుత్వం కోరింది. భారత్‌లో వివాహాలు ఆడ, మగ మధ్య మాత్రమే జరుగుతాయని కోర్టుకు చెప్పింది. స్వలింగ సంపర్కులు ఒకరితో మరొకరు భాగస్వాములుగా, లైంగిక సంబంధాలను ఏర్పరచుకుంటూ కలిసి జీవించటం అనేది భారత కుటుంబ వ్యవస్థ అయిన భార్య, భర్త, పిల్లలు అనే అంశంతో పోల్చలేమని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో భారత న్యాయవ్యవస్థ ఆదేశించింది. మత, సామాజిక కట్టుబాట్లతో లోతుగా మమేకమైన దేశ శాసన విధానాన్ని కోర్టులు మార్చకూడదని, ఈ అంశాన్ని పార్లమెంటుకు వదిలేయాలని కోర్టుకు విన్నవించింది.

స్వలింగ జంటలకు సామాజికపరమైన హక్కుల్ని కల్పించేందుకు కేంద్రం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అలాంటి జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలను ఇవ్వటం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్‌ ‌చేయటం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో పార్లమెంట్‌ ‌తీర్మానమే కీలకం. ఆ విషయం సుప్రీంకోర్టు అంగీకరిస్తోంది. స్వలింగ వివాహాన్ని ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా దానికొక లేబుల్‌ అవసరం అని అభిప్రాయపడింది. ఈ పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పించకుండా వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాను ఆదేశించింది. ప్రేమించటం, సహజీవనం చేయటం, జీవితభాగస్వామిని ఎన్నుకోవటం వంటివి ప్రాథమిక హక్కులే అయినా, స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని కోరటం ప్రాథమిక హక్కుకాదని తుషార్‌ ‌తేల్చిచెప్పారు.

చాలా మంది ఎల్జీబీటీక్యూ ప్లస్‌ ‌వ్యక్తులు బయటకు రావటం లేదని, కనీసం తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా తమ గుర్తింపును వెల్లడించలేదు. కొన్నిసార్లు సమాజం నుంచి అవమానాలను, దాడులను ఎదుర్కొంటున్నారు. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే, సామాజిక ప్రయోజనాలు కూడా పొందవచ్చని ఆశపడు తున్నారు. ఒకవేళ ప్రభుత్వం వారికి అనుకూలంగా తీర్పుఇస్తే ప్రపంచంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించిన 35వ దేశంగా భారత్‌ ‌నిలుస్తుంది. సమాజంలో ముఖ్యమైన మార్పులకు దారి తీస్తుంది. దీని ప్రకారం దత్తత, విడాకులు, వారసత్వం తదితర చట్టాల్లో సవరణ చేయవలసి ఉంటుంది.

ఈ జంటలు భారతదేశంలో ఎలాంటి అనుభవా లను ఎదుర్కొంటున్నారో చూద్దాం? ఇవన్నీ వారు చేస్తున్న వాదనలుగానే పరిగణించాలి. ప్రస్తుతానికి మాత్రం ఇలాంటి వారికి సంఘంలో గౌరవనీయమైన స్థానం లేదు. దానిని గమనిస్తూనే వీరి అనుభవాలు ఏమిటో గమనించాలి. ఈ అనుభవాలు, అభిప్రాయాలు మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలోకి వెల్లువెత్తుతు న్నాయి. కాబట్టి వీటిలోని వాస్తవికత గురించి తెలుసుకోవడం అవసరం. ఇలాంటివి ప్రచురిస్తున్నా, ప్రసారం చేస్తున్నా అలా సమాచారం తెలుసు కోవడానికే.

అంకిత, కవిత.. ఇద్దరూ సహోద్యోగులు.

అంకిత థెరపిస్టు. కవిత సైక్రియాటిస్టు. ఇద్దరూ కలిసి వైకల్యాలతో బాధపడే చిన్నపిల్లల కోసం ఒక క్లినిక్‌ ‌నడుపుతున్నారు.వాళ్లు కలుసుకుని 17 ఏళ్లయ్యింది. కలిసి జీవించటం మొదలుపెట్టి పదేళ్లు దాటింది. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని  సెప్టెంబరు 23, 2020 న దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో అంకిత తల్లికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ‘అప్పుడు అంకితతోపాటు ఆస్పత్రికి వెళ్ళిన తను కన్సెంట్‌ ‌పత్రంలో సంతకం చేయలేకపోయాను. ఎందుకంటే తాను అంకిత అమ్మకు కూతుర్ని కాదు. కోడలుగా కూడా పరిగణించరు’ అని తన అనుభవాన్ని కవిత వివరించారు. దానితో సెప్టెంబరు 30న తన వివాహానికి చట్టబద్ధత కల్పించాలని స్థానిక మెజిస్ట్రేట్‌ ‌ను ఆశ్రయించారు. కాని వారికి నిరాశ ఎదురైంది. స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తమ వివాహానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని అధికారులకు సూచించాలని కోర్టును కోరారు.

సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టులో స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిన అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. జనవరిలో ఈ పిటీషన్లంటినీ ఒక చోటకు చేర్చిన సుప్రీంకోర్టు ఈ ముఖ్యమైన అంశంపై విచారిస్తామని ప్రకటించింది. ‘‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయమని మేం కోరటల్లేదు. మమ్మల్ని కూడా అందరితో సమానులుగా గుర్తించే హక్కును మేం అడుగు తున్నాం’’ అని ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు. వారిద్దరి తరపున సీనియర్‌ ‌న్యాయవాది మేనక గురుస్వామి ఈ పిటీషన్‌ ‌దాఖలు చేశారు. ఆరు స్వలింగ సంపర్కుల కేసులను మేనక టీం వాదిస్తోంది. లైంగిక ధోరణి ఆధారంగా పౌరులపై వివక్షను రాజ్యాంగం నిషేధిస్తోంది. సామాజిక నైతికత కంటే రాజ్యాంగ నైతికత ఎక్కువ కాబట్టి తమ పిటీషన్‌ను అనుమ తించాలని ఆమె వాదిస్తున్నారు. ఈ కేసును ఎంచుకోవటంతో ఆమెను సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

మౌసమి బెనర్జీ. వయసు 35. లెస్బియన్‌ ఒక ఎంఎన్సీలో అసిస్టెంటు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరిలో కుటుంబం,స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

‘‘మా పెళ్లికి చట్టబద్ధత లేకపోవటంతో ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు పొందలేకపోతున్నాం సాధారణంగా పెళ్లయిన జంటలకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను మేం కూడా పొందాలి’’ అని కోరారు.

సాత్విక్‌.. ‌వయసు 37. గే. 2007లో యూకె వెళ్లి మాస్టర్స్ ‌చేశారు. తర్వాత లండన్‌ ‌లో కొంత కాలం పనిచేసి వచ్చిన తర్వాత భారత్‌ ‌కు వచ్చారు. తన పార్ట్‌నర్‌ ‌తో ఎనిమిదేళ్లుగా కలిసి ఉన్న సాత్విక్‌కి ఇక్కడ వాతావరణం సహకరించలేదు. ఇంటి అద్దె కూడా పొందటం కష్టమైంది. అనేక చేదు అనుభవాల తర్వాత చివరకి ఆగస్టు 2020లో దేశం విడిచి వెళ్లారు. తనకు భారతదేశం అంటే ఇష్టమని.. ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆయన చెబుతున్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతి ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. మన దేశంలో దీనికి చట్టబద్ధత లేకపోవటంతో అనేక జంటలు దేశం విడిచి పోతున్నాయి.

సుబోధ్‌.. ‌వయసు 30. ఫ్యాషన్‌ ‌డిజైనర్‌. ‌హోమో సెక్సువల్‌. ‌ముందుగా తన విషయాన్ని తల్లితో పంచుకుని కుటుంబ ఆమోదాన్ని పొందారు. ఆర్టికల్‌ 377‌కి ఆమోదం ఇచ్చినప్పుడు పెళ్లికి ఎందుకు ఇవ్వరు అని సుబోధ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. సింగిల్‌ ‌పేరెంట్స్ ‌పిల్లలు దత్తత తీసుకుని వారికి ప్రేమను, సంరక్షణను అందిస్తున్నప్పుడు, స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకుని మేమెందుకు అందించలేం అని అడుగుతున్నారు? ఇద్దరు తల్లులు లేదా ఇద్దరు ఉంటారు అందులో తప్పేం ఉంది? అని ప్రశ్ని స్తున్నారు?

అభిషేక్‌.. ‌వయసు 28. గే. ఐఐటీ విద్యార్థిగా ఉన్న అభిషేక్‌ ‌డేటింగ్‌ ‌యాప్‌ ‌ద్వారా 28 ఏళ్ల సూరజ్‌ ‌తోమర్‌ని కలిశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ఇంకా పెళ్లి చేసుకోలేదని చెబుతున్నారు. సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తిస్తుందనే ఆశాభావంలో ఉణ్నారు. ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే, తాము కూడా విద్య, వైద్యం వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతామని చెబుతున్నారు.

ఈ జంటలన్నీ సుప్రీంకోర్టు ఏం తేలుస్తుందనే అంశంపై ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు కచ్చితంగా చారిత్రాత్మకం అవుతుంది. సమాజంలో ముఖ్యమైన మార్పులకు అది దారి తీస్తుంది. అయితే స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరంగా ఆమోదం లభించినా, ప్రజల ఆలోచనలో మార్పులు వస్తాయని అనుకోలేం. అదే సమయంలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత దత్తత, విడాకులు, వారసత్వం తదితర చట్టాల్లో సవరణ చేయవలసి ఉంటుంది. ఇదంతా పూర్తికావటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.

2018 సెప్టెంబరులో స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుఇచ్చింది. దీన్ని నేరంగా పరగణించే బ్రిటిష్‌ ‌కాలం నాటి సెక్షన్‌ను కోర్టు కొట్టేసింది.

సెక్షన్‌ 377… ‌బ్రిటిష్‌ ‌వారు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించారు. క్రైస్తవానికి, స్వలింగ సంపర్కానికి సరిపడదని బ్రిటిష్‌ ‌వారు ఆ నిబంధనను తెచ్చారనే ప్రచారం ఉంది.

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram