సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌వైశాఖ శుద్ధ  ఏకాదశి – 01 మే 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


కరుడగట్టిన నేరగాళ్ల కోసం కన్నీరు కార్చడం, రక్తపిపాసుల హక్కుల రక్షణకు, భద్రతకు అంతర్జాతీయ వేదికల మీద గొంతు చించుకోవడం, నేరగాడు మైనారిటీ అయితే మతం కార్డు సంధించడం ఇవాళ సర్వ సాధారణమైంది. ఆతిక్‌ అహ్మద్‌, అ‌ష్రాఫ్‌ అనే ఇద్దరు నేరగాళ్ల హత్య విషయంలో ఇదే జరుగుతోంది. రెండు దశాబ్దాలుగా యథేచ్ఛగా నేరాలు చేస్తున్న ఆ ఇద్దరిని ఏప్రిల్‌ 15 ‌రాత్రి పోటీ మాఫియా ముఠా సభ్యులు ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపారు. ఈ పరిణామానికి చాలా భారత రాజకీయ పార్టీలు తమదైన శైలిలో భాష్యాలు వెలగబెడుతూ, కన్నీరుమున్నీరయ్యాయి. అంతేనా! గల్ఫ్ ‌దేశం బహ్రెయిన్‌ ‌కూడా అన్ని దౌత్య విలువలను మంట కలిపేసి ఆతిక్‌ ‌హత్యకు గుండెలు బాదుకోవడమే జుగుప్సాకరంగా ఉంది. ఒక మాఫియా నాయకుడిని తమ మతస్థుడిగా నిస్సిగ్గుగా ప్రకటించి తమ మత పవిత్రతను ఈద్‌ ఉపవాసాల వేళ ఆ ముస్లిం దేశమే దారుణంగా దిగజార్చింది. ఆ దేశ పార్లమెంట్‌ ఒక మాఫియా డాన్‌ ‌హత్యను ముస్లింల మీద జరుగుతున్న రక్తపాతంగా చిత్రించి మొత్తం మతస్థులను అవమానించింది. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే బాటలో ప్రయాణించి, అది అన్ని విలువలను వదిలేసిన సంగతి మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒక విధంగా ప్రపంచ ఆలోచనా ధోరణినే, విజ్ఞతనే శంకించక తప్పని పరిణామాలలో ఇదొకటి.

ఆతిక్‌ అహ్మద్‌ను చంపడమంటే ముస్లింల మీద పెరిగిన హిందూ ఉగ్రవాదానికి కొండ గుర్తుగా బహ్రెయిన్‌ ‌పార్లమెంట్‌ ‌వ్యాఖ్యానించడం అత్యంత హేయం. భారత ముస్లింలకు బహ్రెయిన్‌ ‌పార్లమెంట్‌ ఆతిక్‌ను ప్రతినిధిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం ఎంత విపరీతం? కాకపోతే ఇకపై ముస్లింల మీద ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలంటూ, ముస్లిం సమాజం మీద జరిగే రక్తపాతాన్ని ఆపాలంటూ భారత్‌కు సుద్దులు నేర్పే సాహసం ఎందుకు చేస్తుంది? ఒక ఎంపీ అయితే, భారత్‌లో ముస్లింలకు రక్షణ కల్పించాలని అరబ్‌ ‌దేశాలన్నీ కోరస్‌గా కోరాలని సలహా పడేశాడు. ఆతిక్‌ ‌హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అల్‌ ‌కాయిదా ఇండియన్‌ ‌సబ్‌కాంటినెంట్‌ ‌రంకెలు వేసింది. ఆతిక్‌, అ‌ష్రాఫ్‌ ‌మృతవీరులు అంటూ ఈద్‌ ‌నాడే ప్రకటించి తమ మత విలువల మీద మాయని మచ్చను మిగిల్చింది. అంతమంది పోలీసులు పహారా కాస్తుండగా జర్నలిస్టుల పేరుతో వచ్చిన ముగ్గురు ఆతిక్‌ను ఎలా హత్య చేయగలిగారని బీబీసీ అనే అబద్ధాల పుట్ట ప్రశ్నించింది. ఆతిక్‌ను టీవీ కెమేరాల ముందే హత్య చేశారంటే భారత్‌లో కోర్టుతో పనిలేకుండా మరణశిక్షలు అమలు జరుగుతున్నవని చెప్పడానికి నిదర్శనమని వాషింగ్టన్‌ ‌పోస్ట్ ‌వ్యాఖ్యానించింది. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ అయితే ఉత్తర ప్రదేశ్‌ ‌నాథూరామ్‌ ‌గాడ్సే బాటలో నడుస్తున్నదని తేల్చిపారేశాడు.

 ఇంతకీ వీళ్లందరికీ ఆతిక్‌ అనేవాడు వంద కేసులలో నిందితుడనీ, అతని కుటుంబం మొత్తం రెండు దశాబ్దాలుగా కనీవినీ ఎరుగనంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించిందనీ, ఇతడి బారిన పడినవారిలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారనీ తెలుసా? జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆతిక్‌ ఉత్తరప్రదేశ్‌ ‌జైళ్లలో ఉన్నా వ్యాపారస్థులను వదిలిపెట్టడం లేదు కాబట్టి, గుజరాత్‌ ‌జైలుకు పంపించమని సాక్షాత్తు సుప్రీంకోర్ట్ ఆదేశించిన సంగతైన తెలుసుకున్నారా వీళ్లు? తన సోదరుడు అష్రాఫ్‌ను ఎన్నికలలో ఓడించిన బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ ‌హత్య, ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి ఉమేశ్‌ ‌పాల్‌ ‌హత్య కూడా ఆతిక్‌ ‌కనుసన్నలలో జరిగినవేనని తెలుసా? ఉమేశ్‌ ‌పాల్‌ ‌హత్యలో కీలకంగా ఉన్న ఆతిక్‌ ‌కొడుకు అసద్‌ను ఈ ఇద్దరి హత్యకు రెండు రోజుల ముందు పోలీసులు ఎన్‌కౌంటర్‌ ‌చేశారు. అతడి మీద ఉన్న నేరారోపణలు కూడా తక్కువేమీ కాదు. అయితే 19 ఏళ్ల యువకుడి వల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చే ప్రమాదం ఏమిటో అంటూ సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ వేసిన రాజ్యసభ ఎంపీ భిక్షతో వెలుగుతున్న ఒక నాయకుడు వ్యాఖ్యానించాడు. అదే పార్టీ ఎంపీ షఫీక్‌ ఉర్‌ ‌రహ్మాన్‌ ‌బుర్క్ అనేవాడు ఆ ఇద్దరు అపూర్వ సహోదరులకు చట్టబద్ధమైన న్యాయం అందలేదని ప్రకటించాడు. ఇక ఆ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌, ఎంఐఎం ‌నాయకుడు అసదుద్దీన్‌ ‌వీళ్లంతా కూడా దేశంలో రాజ్యాంగబద్ధ పాలన మృగ్యమైపోయిందంటూ బరువైన మాటలు మళ్లీ ప్రయోగించారు.

ఇంతకీ ఎందుకీ ఆక్రోశం? అని అడిగితే, ఇలా నడిరోడ్డు మీద హత్యలు జరిగితే ప్రజాస్వామ్యం బలహీనమైపోవడం లేదా? అని వీరంతా ఆవేశపడిపోతున్నారు. శాసనసభకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని హత్య చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కాదా!? ఆతిక్‌ అహ్మద్‌ ‌చేసింది అదికాదా? ఆతిక్‌, అ‌ష్రాష్‌, అసద్‌ ‌చనిపోయిన తరువాత వాళ్ల ఫోన్లలోనే దొరికిన వీడియోలు చూస్తే అసలు ప్రజాస్వామ్యం అన్న మాటను ఆ కుటుంబం ఎప్పుడైనా విన్నదా? అన్న అనుమానం కలుగుతుంది. వ్యక్తులను వంటి మీద గుడ్డలు లేకుండా చేసి చావగొడుతున్న దృశ్యాలు, సొంత సైన్యంతో కబ్జాల కోసం ఉరుకుతున్న దృశ్యాలతో ఉన్న వీడియోలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్యమేనా? ఒక ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షి (ఉమేశ్‌పాల్‌)‌ని సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన వ్యక్తి (ఆతిక్‌) ‌పట్టపగలే చంపించాడు. ఎంత చిత్రమంటే, ఆ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ ఈ ఉదంతాన్ని శాసనసభలో ప్రస్తావించి రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ గొంతు చించుకున్నారు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యాన్ని ఎంత పరిహాసం చేయడమో వీరెవరికీ అర్ధం కావడం లేదా? పోలీసులకీ, ప్రభుత్వాలకీ, కోర్టులకీ సుద్దుల మీద సుద్దులు చెప్పేవారు, ప్రశ్నించేవారు నేర మనస్తత్త్వం గురించి ఒక్కసారైనా నిలదీయరేమి?

About Author

By editor

Twitter
Instagram