– సూరిసెట్టి వసంతకుమార్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బైకు మీద రిత్విక్‌ ‌వేగంగా వచ్చి ఒక చిన్న వీధి మొదట్లో ఆగి, కనిపించినంత మేర వీధినంతా ఒకసారి పరిశీలనగా చూశాడు. ఎదురు చూస్తున్నవాళ్లు కనిపించకపోయేసరికి దీర్ఘంగా నిట్టూర్పు విడిచి బైకుని రోడ్డు పక్కన చెట్టు కింద పార్కు చేశాడు. ఎవరో తననే చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసారు. ఎదురుగా ఉన్న ఇంటి అరుగుమీద వాలు కుర్చీలో కూర్చుని, తననే చూస్తూ రమ్మని చేతులు ఊపుతున్న ముసలతను కనిపిం చాడు. దాదాపు ఎనభై సంవత్సరాలుండొచ్చు. అతనికి తలంతా పండిపోయి, నుదుట విభూతి రేఖలతో, మెడలో రుద్రాక్ష మాలలతో కూర్చుని ఉన్నాడు.

‘‘ఏం కావాలి తాతగారు? ఏవైనా కొని తెమ్మం టారా?’’ అని అడిగాడు రిత్విక్‌ ‌దగ్గరగా వెళ్లి.

‘‘ఏం వద్దుగానీ, చాలా సేపట్నించీ రోడ్డునే చూస్తూ ఉండిపోయావు.  ఇలా వచ్చి కూర్చో. నువ్వు ఎదురుచూస్తున్న అమ్మాయి రాగానే వెళ్లిపోదువు గానిలే’’ ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు ఆయన.

తననే సందేహంగా చూస్తున్న రిత్విక్‌ని చూసి ‘‘ఇదేమిట్రా, ముక్కూ, మొఖం తెలవని ముసలోడు మనకింత మర్యాద ఇస్తున్నాడేమిటి? అని ఆలోచిస్తున్నావు కదూ!’’ అన్నాడు. అవునన్నట్లుగా తలవూపాడు రిత్విక్‌.

‘‘‌నాకు నీలాంటి హుషారైన పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నీ అమ్మడు వచ్చేవరకూ నీతో మాట్లాడదామని నిలిచాను’’ అంటూ ఇంకా మాట్లాడబోతుండగా ఇంట్లో నించి టిప్‌టాప్‌గా తయారైన ఒకతను బయటికి వచ్చి ఇంటిముందున్న బైక్‌ని స్టార్టు చేసి కూర్చుని ఎవరికోసమో ఎదురు చూడసాగాడు. కొద్దిసేపైన తర్వాత లోపల్నించి అందమైన అమ్మాయి అత్యవసరంగా వచ్చి బైకు వెనక సీటు మీద కూర్చున్న వెంటనే బైకు బయలుదేరి పోయింది.

‘‘ఎవరు తాతా వాళ్లు? మీ అబ్బాయి, కోడలా’’ అని అడిగాడు రిత్విక్‌.

‘‘‌కాదు, నా మనవడూ, వాడి భార్యా, ఇద్దరూ ఆఫీసుకి వెళ్తున్నారు.’’

‘‘అలాగా! మరి వాళ్లు మీ ప్రక్కకు తిరిగి చూడనుకూడా చూడలేదేం తాతా?’’

‘‘ఇదేం చూసావ్‌ ‌మనవడా, లోపల నా కొడుకు ఉన్నాడు. కొంచెం సేపట్లో ఆఫీసు కారు వస్తుంది. దానిలో కూర్చుని జుమ్మని వెళ్లిపోతాడు. వాడు కూడా నా పక్క తిరిగి చూడడు. వాడు వెళ్లిపోయిన తర్వాత నా కోడలు ఒక్కర్తే ఇంట్లో ఉంటుందిగానీ బయటికి వచ్చి మాట్లాడదు. ఏవైనా కావాలా? ఏమైనా తింటారా? అని కూడా అడగదు.’’

‘‘ఏమిటి తాతా ఇది, వినడానికే చాలా కష్టంగా ఉంది. మీరెలా భరిస్తున్నారో?’’

‘‘నువ్వు ఎందుకు బాధపడతావ్‌. ‌నేను చాలా జాలీగా, సంతోషంగా ఉన్నాను’’ అన్నాడు ముసలతను బాధను మనసులోనే దాచుకుని.

సరిగ్గా అప్పుడే గుర్తుకొచ్చి తాత కూర్చుని ఉన్న చోటంతా కలయ చూసాడు రిత్విక్‌. అదొక పాతకాలపు పెంకుటిల్లు, అయినా ఎక్కడా పాతతరం  వాసన కనిపించడం లేదు. గుమ్మానికి ఇరువైపులా కూర్చోడానికి వీలుగా పెద్దపెద్ద అరుగులు. అందులో ఒక అరుగుని పెద్ద చెక్కలతో చిన్న  రూములా తయారుచేశారు. లోపల తాతగారి కోసం పాతకాలపు మంచం, దానిమీద పాడైపోయిన పరుపు. ప్రక్కనే చిన్న టేబిల్‌ ‌ఫ్యాను. కూర్చోవడానికి ఈజీ చైర్‌.  ఆ ‌రూములో మూలగా చిన్న బాత్రూం. మొత్తానికి తాతగారు ఇంటి లోపలికి కాలుపెట్టకుండా ఉండడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఇంట్లోని రక్తసంబంధీకులు. అది చూసిన రిత్విక్‌కి మనుస్సులో బాధనిపించి ‘‘అయితే అందరూ ఇలా మిమ్మల్ని బయటికి విసిరేశా•రన్న మాట’’ అన్నాడు.

‘‘అలా అనుకోకు మనవడా, అయినా బాధపడ డానికి ఏముంది. ప్రపంచమంతా బయటే కదా ఉంది!’ అని మాట మార్చాలని ‘‘ఒరేయ్‌ ‌మనవడా, ఆ అమ్మాయి నీకు ఎప్పట్నించి తెలుసు?’ అని అడిగాడు.

‘‘ఆరు నెలల నుండే తమ ఫస్టు ఇయర్‌, ‌నేను ఫైనలియర్‌.’’

‘‘‌బాగుంది. ఇద్దరికీ వయసు వ్యత్యాసం కూడా బాగా కుదిరింది. కానీ మీరెప్పుడైనా, దేని గురించైనా దెబ్బలాడుకున్నారా?’’

‘‘దెబ్బలాట  ఎందుకు? నేను తనని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను తాత.’’

‘‘అరె…దెబ్బలాడుకోకపోతే అదేం లవ్వురా? ప్రేమికులన్న తర్వాత దెబ్బలాడుకోవాలి. తర్వాత ఒకరినొకరు బ్రతిమాలుకోవాలి. రాజీ అయిన తర్వాత చూడూ…మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత గాఢమవుతుంది. మీరిద్దరూ ఇంకా దగ్గరవుతారు.

ముసలాయన్ని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు రిత్విక్‌.

ఆ ‌విస్మయాన్ని భంగపరుస్తూ ‘‘పోనీ ఇద్దరూ కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్లారా?’’ అడిగాడు ముసలాయన. వెంటనే ‘లేదు’ అంటూ సమాధానం వచ్చింది రిత్విక్‌ ‌నించి.

‘బయటికి అంటే ఏ ఊటికో, బెంగళూరుకో కాదు. మనూళ్లో  చెరువు గట్టుకో, కొండమీద వెంకన్న గుడికో, లేదా రోజూ చూస్తున్న ఏపుగా పెరిగిన పంట పొలాల గట్టుకో, ఊరికి దూరంగా ఉన్న మామిడి తోటలోకో…ఇలా ఎక్కడికైనా కలిసి వెళ్లాలి. వెళ్లుంటే మీకు తెలిసేది ప్రేమలోని గమ్మత్తు. ఎప్పుడు చూసినవైనా అన్నీ కొత్తగా, మనసుకి ఉల్లాసంగా కనిపించేవి. ప్రక్కన ప్రేయసి ఉంటే ముళ్లచెట్టు కూడా పూలచెట్టులా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు కలిసి తిరిగి చూడండి. అప్పుడు తెలుస్తుంది. మీకు నేను చెప్పింది నిజమని’’.  ఆ తర్వాత పంచుకున్న ఆనందాల్నీ, సంతోషాల్నీ మనస్సులో చక్కగా భద్రపరచు కోండి. ఎప్పటికైనా ఉపయోగపడతాయి.

కళ్లింత చేసుకుని గురువు చెప్పే పాఠాల్ని శ్రద్ధగా వింటున్న శిష్యుడిలా వినసాగాడు రిత్విక్‌. ఇం‌కా ఏం చెపుతాడో అని.

‘‘ఒరేయ్‌ ‌మనవడా! అమ్మాయి ప్రేమ పొందడం అంత వీజీ కాదు. ఎప్పుడూ సెల్‌ఫోన్లో మాట్లాడు కోవడం, నవ్వుకోవడమో కాకుండా అప్పుడప్పుడు మీరు సూపర్‌ అనో, మీకు చాలా ధైర్యమండీ అని పొడగించుకొనే పనులు చేసి చూపించాలి.  చదువుల్లోనూ, ఆటల్లోనూ ఇద్దరూ ఒకరికొకరు పోటీపడాలి. ఒకసారి నువ్వు గెలిచి చూపించు. తను ఓడిపోయానని బుంగమూతి పెట్టుకుంటుంది. అలిగి కూర్చుంటుంది. వెళ్లి నాలుగు మంచి మాటలు చెప్పి ఓదార్చు. అలాగే నువ్వు మరోసారి కావాలని ఆమె దగ్గర ఓడిపో. అప్పుడు ఆమె ము•ఖంలో కనిపించే సంతోషాన్ని భద్రంగా దాచుకో. ఆమె ముఖంలో మారే రకరకాల భావాల్ని చూడు. ఆ సమయాల్లో ఆమె కళ్లల్లో వెయ్యి అర్థాలు స్ఫురిస్తాయి. పెదవులు చెప్పలేని రాగాల్ని పలికిస్తాయి. వీటన్నింటినీ ఒక్కటి కూడా వదలకుండా భద్రంగా గుండెలో భద్ర పరుచుకో. ఇటువంటి అనుభూతులు డబ్బిచ్చి కొందా మన్నా  దొరకవు. అలాగే కొన్నిసార్లు బాధపడుతూ ‘‘నువ్వు చెప్పినట్టూ చేసి ఉండవలసింది తప్పు చేశాను’’ అంటూ ఆమెని పొగుడుతూ ఉంటే నీమీద ప్రేమ అలా… అలా వెలిగిపోతుంది’’ అన్నాడు ముసలాయన. ఈ సంగతుల్ని చెబుతు న్నప్పుడు ఆయన ముఖంలో ఏదో తెలియని సంతోషం.

‘‘ఎందుకు తాత మళ్లీ మళ్లీ ప్రేమించుకున్నప్పుడు జరిగిన తీపి గురుతుల్ని జ్ఞాపకం ఉంచుకోమంటు న్నావు’’ అని అడిగాడు ఫస్టు బెంచ్‌ ‌స్టూడెంట్‌లో రిత్విక్‌.

‌ముసలాయన ఒక్క నిమిషం ఆగి మళ్లీ చెప్పడం ప్రారంభించాడు.

‘‘ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టాను. కొడుకూ, కోడలూ మనవలూ, మనవరాళ్లలో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఏమయింది? వాళ్లందరూ ఇంటిలో ఉండి నన్ను బయటికి తోసేసారు. నా ప్రేమని పంచుకున్న మా ఆవిడ ఇది చూడలేనన్నట్లు  రెండేళ్ల క్రితం హాయిగా వెళ్లిపోయింది. ఇది చెబుతున్నప్పుడు ముసలాయన కళ్లల్లో నీళ్లు తిరగడం గమనించాడు రిత్విక్‌.

‌వాళ్లు తరిమేశారని నేను బాధపడలేదురా. నేను ఈ రోజుకీ సంతోషంగానే ఉన్నాను. మా ఆవిడతో గడిపిన ప్రతిక్షణం మధురక్షణాలే. మొట్టమొదటిసారి పెళ్లి చూపుల్లో తనని చూసినప్పుడు కలిగిన ఫీలింగు, తర్వాత పెళ్లిలో మా ఇద్దరి మధ్య చేయించిన చిలిపి చేష్టలూ, తను మొదటిసారి నెల తప్పినప్పుడు కలిగిన ఆనందం, ఇలా ప్రతి క్షణం తనతో నేను పంచుకున్న ఆనందాల్ని తలుచుకుంటూ ఉంటే నాకు కాలమే   తెలియడంలేదు. తెలుసా?’’ అన్నాడు ముసాలాయన.

ఇంతలో రిత్విక్‌ ఎదురుచూస్తున్న అమ్మాయి రావడంతో ‘‘చాలామంచి విషయాలు తెలుసుకు న్నాను తాత. చాలా చాలా థాంక్సు తాత. మీరు మా మామ్మతో డ్యూయెట్‌ ‌పాడుకుంటూ ఉండండీ. మేం వెళ్లి వస్తాం’’ అంటూ బైకు స్టార్టు చేసాడు రిత్విక్‌.

 ‌కన్నీరు జలజలా రాలుతూ ఉంటే ఆనందంతో చెయ్యి ఊపాడు ముసలాయన.

About Author

By editor

Twitter
YOUTUBE