ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

– పి. చంద్రశేఖర ఆజాద్‌

‌సన్నగా వాన చినుకులు!

బాల్కనీలోకి వచ్చాడు రిత్విక్‌. ‌చేతిలో కాఫీ మగ్‌ ఉం‌ది. మెల్లగా తాగుతూ ప్రకృతిలోకి చూస్తున్నాడు.

దూరంగా కొండ కనిపిస్తోంది. అక్కడక్కడ చెట్లు. కొమ్మలు వూగుతున్నాయి. వాటి మీద వాన చినుకులు పడుతున్నాయి.

ఇక్కడ నుండి నగరంలో ఓ భాగం కనిపిస్తుంది. అందుకే కాస్త దూరం అయినా మూడు గదుల ఫ్లాట్‌ని తీసుకున్నాడు. హైదరాబాద్‌కి వచ్చి అప్పుడే ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి.

చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదో సాధించాలనుకున్నాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే… నో రిగ్రెట్స్!

అక్కడే వుంటే కాస్త జీతం పెరిగి వుండేది. పెన్షన్‌ ఇం‌కాస్త ఎక్కువ వచ్చేది. తను మాత్రం కేవలం బతుకు కోసం, ఫైళ్ల మధ్య ఓ యంత్రంలా మిగిలిపోయి వుండేవాడు.

‘‘నువ్వు చేయాల్సిన పని ఇది కాదు’’ అని మనసు ఎప్పటి నుంచో హెచ్చరికలు పంపుతూనే వుంది. అవసరాలు ఓ నిర్ణయాన్ని తీసుకోనివ్వలేదు. అవసరాలు-ఆశలు-ఆరాటాల మధ్య మనుషులు నలిగిపోతుంటారు. అందుకే కనీస జీవితాన్ని కాదనుకుని రిస్క్ ‌చేయటానికి ధైర్యం చేయరు. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. రిటైర్‌మెంట్‌కి రోజులు దగ్గరబడతాయి.

ఉద్యోగంలో వుండుంటే ఇదే రోజు చివరి రోజు!

నాలుగు మంచి మాటలు చెబుతారు. శాలువాలు కప్పుతారు. మెమొంటోలు ఇస్తారు. కారులో చివరిసారి ఇంటి దగ్గర విడిచిపెడతారు. ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది ఇదే.

ఆ చివరి క్షణాల్లో, ఉద్వేగంతో కళ్లు తడిసి పోతున్నాయి.

‘‘ఇది మీరు కోరుకున్న జీవితం. కన్నీళ్లు ఎందుకు?’’ అంది హారిక నా చేతిని అందుకుని.

‘‘మీ అమ్మా నాన్నల్ని వదిలి వస్తున్నప్పుడు నీకు దుఃఖం రాలేదా’’.

ఆమె మాట్లాడలేకపోయింది.

‘‘నాతో కొత్త జీవితం ఎలా వుంటుందో తెలియదు. అయినా ఓ ఆశ. మనదైన బతుకు బతుకు తామన్న ఉత్సాహం వుంటుంది. అంత మాత్రాన నిన్నటి జీవితం మనల్ని అంత త్వరగా వదులు తుందా?’’ అన్నాడు.

వాన చినుకుల వేగం పెరిగింది.

గాలి ఓ జల్లుని ముఖాన్ని తాకేలా చేసింది.

రెండడుగులు వెనక్కి వేసాడు.

చినుకుల్ని చూడటం రిత్విక్‌కి కొత్తకాదు. జడివానలు చూశాడు. మెరుపులు, ఉరుములు, ప్రచండగాలుల్ని అనుభూతి చెందాడు.

అతను తన జీవితాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించా లనుకుంటాడు. సమయం దొరకదు.

నిరంతరం అతన్ని సృజన ఆవరించింది. అక్షరాలు అతన్ని పెనవేసు కున్నాయి. మనసు మళ్లీ హెచ్చరికలు పంపిస్తోంది. ‘నువ్వు అనుకున్నదేమిటి? నువ్వు చేస్తున్న దేమిటి? ఇది నీకు తృప్తిని ఇస్తోందా?

ఇవ్వదు. ఆలోచనాపరులకీ, సృజనకారులకీ ఏదీ తృప్తిని ఇవ్వదు. ఏదో కావాలి! అదేంటో తెలుసు. అయినా ఆ గమ్యం ఎప్పుడూ దూరంగానే వుంటుంది.

అప్పుడు ‘మానస’ గుర్తొచ్చాడు.

రెండు సంవత్సరాలుగా అడుగుతున్నాడు.

‘‘చినుకులు… వాన… నిన్నటివి. ఓ కథ రాసివ్వు. నేను గూడు రిక్షాబండి మీద చూసాను. ‘అలనాటి వానచినుకులు’ అని రాసుంది. అదే అంశం మీద పుస్తకం తీసుకురావాలనుంది. కథకుల్ని అడుగు తున్నాను. కొంత మంది యిచ్చారు. నీదే ఆలస్యం’’.

‘‘అలనాటి వానచినుకులు’’

ఆ పేరు వెనక రొమాంటిసిజం వుంది. అద్భుత మైన ప్రేమ కథ రాయవచ్చు. బీభత్స ప్రధానమైన బతుకు వాస్తవాల్ని చెప్పవచ్చు. అయినా రిత్విక్‌ ‌కలం కదలలేదు.

‘‘నేను ఓ సినిమా చర్చల్లో పాల్గొన్నప్పుడు నాకు కొంత డబ్బు వచ్చింది. అది బ్యాంకులో వేసాను. ఆ డబ్బుని ఎన్ని అవసరాలు వచ్చినా తీయలేదు. ఓ కలల పుస్తకం. అది నా తొలిపుస్తకం. ఇంతకు ముందెప్పుడో రెండు మూడు కథలు రాసాను. మీ అందరితో పాటు నేనూ ఓ కథ రాస్తున్నాను’’.

మానసకి ఎప్పటి నుండో రాస్తున్నవారు, కొత్తగా రాస్తున్న వారు, తమ కథల్ని పంపించారు.

‘‘నువ్వు పోటీలకు మాత్రమే రాస్తావా? బహుమ తులు కావాలా? నువ్వు ఎంత త్వరగా రాస్తావో నాకు తెలుసు. ఎందుకని రాయలేకపోతున్నావు?’’

అది రిత్విక్‌కి తెలియదు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా రాసిన రచనలెన్నో వున్నాయి. పోటీలకు, బహుమతులకు మాత్రమే అయితే రిత్విక్‌ ఇన్ని రచనలు చేసుండేవాడు కాదు.

వానంటే భయమా?

చినుకులంటే ద్వేషమా?

రిత్విక్‌ ‌జీవితంలో వాన చినుకుల వెనక భయానక అనుభవాలున్నాయా?

కలం కదలదు.

ఆలోచనలు గడ్డకట్టుకుపోతాయి.

చివరిసారిగా నిన్న చెప్పాడు.

‘‘రెండు రోజుల్లో ప్రింటింగ్‌కి వెళ్తోంది పుస్తకం. రేపటి వరకూ అవకాశం వుంది. ఇంక నీఇష్టం’’.

‘‘ఇప్పుడు రాస్తాను. అనుకోని ఈ వాన చినుకులు నన్ను హెచ్చరిస్తున్నాయి’’ అనుకున్నాడు రిత్విక్‌.

అప్పుడు ఫోన్‌ ‌రింగయిన శబ్దం.

హారిక తీసుకొనివచ్చింది. ఎవరు అన్నట్లు చూసాడు.

‘‘కొత్త నెంబర్‌’’ అం‌ది. అందుకుని టాక్‌ ‌బటన్‌ ‌ప్రెస్‌ ‌చేసి ‘హలో’ అన్నాడు.

‘‘నేను బుద్ధ… గోవింద్‌ ‌బుద్ధ’’.

‘‘మీరా!’’ అరిచినంత పని చేసాడు నమ్మలేనట్లుగా.

‘‘ఎలా వున్నావు రిత్విక్‌?’’

‘‘‌బాగున్నాను సర్‌’’.

‘‘‌నీ కమిట్‌మెంట్స్ ‌గురించి నాకు తెలియదు. నువ్వు నా కోసం మినిమమ్‌ ‌రెండు నెలల టైమ్‌ ‌స్పెండ్‌ ‌చేయగలవా?’’

‘‘అదీ… సర్‌’’ అని నసుగుతున్నాడు.

‘‘కంగారు పడకు. ముందు నీ పనులు పూర్తి చేసుకో. నీకు ఎప్పటికి వీలు అవుతుందో చెప్పు. నీకు పాస్‌ ‌పోర్ట్ ‌వుందా?’’

‘‘వారం రోజుల్లో అది లాప్సవుతుంది. రెన్యూల్‌ ‌చేయించాలి సర్‌’’.

‘‘‌వెంటనే ఆ పని చెయ్యి. ఇది నా పర్సనల్‌ ‌నెంబర్‌. ‌ఫీడ్‌ ‌చేసుకో. నువ్వు ఎప్పుడయినా నాతో మాట్లాడవచ్చు. ఓ వేళ నేను ఫోన్‌ ‌తీయకపోయినా ఏమీ అనుకోవద్దు. తర్వాత నేను చేస్తాను’’.

‘‘అలాగే సర్‌’’.

‘‘‌మరో విషయం. కొంత కాలం పాటు ఏదీ ఒప్పుకోవద్దు. అది రెండు నెలలు కావచ్చు. ఆరు నెలలు కావచ్చు.’’

‘‘సర్‌…’’.

‘‘‌నా ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు రిత్విక్‌. ‌మరీ ఆలస్యం చేయకు. ఉంటాను.’’ అని ఫోన్‌ ‌కట్‌ ‌చేసాడు.

వాన చినుకులు తగ్గాయి.

‘‘ఎవరు మాట్లాడింది?’’ అడుగుతోంది హారిక.

‘‘గోవింద బుద్ధ’’.

‘‘వారా!’’ అంది ఆశ్చర్యంగా. తలూపాడు.

‘‘ఏమంటున్నారు?’’

‘‘రెండు నెలల నుంచి ఆరు నెలల దాకా నేను వారితో వుండాలంట’’.

‘‘అదెలా కుదురుతుంది? నిన్ననే ఓ సీరియల్‌ ‌వాళ్లు పిలిచారు. ఈ రోజు మాట్లాడాలి అన్నారు’’ అంది హారిక.

‘‘ఆలోచిద్దాం. ఇంత సడన్‌గా గోవింద ఫోన్‌ ‌చేయగలరని ఎలా అనుకుంటాను? ఆయన ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. అందులోనూ తన ఆరోగ్యం బాగుండటం లేదు అన్నారు’’.

‘‘నిజంగానా! సరే. ఏదొకటి చేయవచ్చు. మీరు టెన్షన్‌ ‌పడవద్దు’’ అని లోపలకు వెళ్లింది.

వాన చినుకులు మళ్లీ మొదల య్యాయి.

ఇంతకు ముందు వచ్చినవి ఆనాటి వాన చినుకులా? ఈనాటి వాన చినుకులా? అయిదు నిమిషాల క్రితం కురిసినవి కూడా నిన్నటివే. ఆనాటివే కదా? అసలు ఆ నాటి అనుకోవటానికి కొలబద్ద ఏమిటి అనుకున్నాడు.

‘మానస’ గుర్తొచ్చాడు.

‘‘మానసగారూ మీరు ప్రింటింగ్‌కి వెళ్లిపోండి. ఆ కథ నేను రాయలేక పోతున్నాను’’.

కొద్ది సేపు మానస మాట్లాడలేదు.

‘‘అలాగే రిత్విక్‌’’ అన్నాడు తర్వాత.

* * * * *

రిత్విక్‌ ఆలోచనల్లో వున్నాడు.

మూడు దశాబ్దాల క్రితం అతను రాసిన నవల గుర్తొచ్చింది. నల్లటి దట్టమైన ఓ రాక్షస మేఘం ఓ బీభత్స వాతావరణాన్ని సృష్టించటానికి కమ్ము కొస్తోంది. అది ప్రారంభ వాక్యం. ఆ నవల పేరు ‘వర్షం కురవని రాత్రి’. అయిదు రోజుల్లో రాసాడు. రెండు మూడు పత్రికలు ఆ నవలను తిరస్కరించి నప్పుడు బాధపడ్డాడు. మంచి నవలలు రాయ మనటం వేరు. ఆదరించటం వేరు. ఆ నవలకు బహుమతి ఇచ్చింది గోవింద్‌ ‌బుద్ధ.

రిత్విక్‌ ‌రచనా జీవితంలో అది పెద్ద మలుపు. ఆ నవల పేరుని గోవింద మార్చాడు. అంతకు ముందు రెండు నవలలు ఆయన ప్రచురించారు. అప్పుడు ఆయన రాసిన నాలుగు మంచి మాటలు అతనికి ఎప్పుడూ గుర్తుంటాయి. మానస అలనాటి వాన చినుకుల మీద కథ రాయమన్నప్పుడు ఆ నవల గుర్తు వచ్చింది. వాన మీద కొన్ని కథలు కూడా రాసాడు.

ఇప్పుడు గోవింద్‌ ‌ఫోన్‌ అం‌దుకున్నప్పుడు కూడా వాన చినుకులు. ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనలు రిత్విక్‌ ‌జీవితంలో అనేకం వున్నాయి. అతని ఆలోచనలు గోవింద్‌ ‌మీదకు మళ్లాయి.

మూడున్నర దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం వుంది. ఈ మధ్య కాలంలో తన కథలూ, నవలలు ప్రచురించటం లేదు. మూడు సంవత్స రాలయింది. ఏది పంపినా వెనక్కి తిరిగి వస్తోంది. ఇన్ని సంవత్సరాల్లో అతన్ని కలుసుకుంది కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే. అందులో ఒకటి వాళ్ల అమ్మాయి పెళ్లిలో.

నిజానికి గోవింద్‌ ‌పత్రిక కోసం రిత్విక్‌ ‌నవలలు రాసాడు. ఆయన ప్రచురించకపోతే ఇంకే పత్రిక ప్రచురించదు. ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకని అరుదుగానే రాస్తున్నాడు. ఆ సంస్థకి రెండు పత్రికలు. ఒకటి మాస పత్రిక. ఇంకోటి వార పత్రిక. మాస పత్రికలో క్రమంగా సీరియస్‌ ‌రచనలకు చోటు తగ్గిపోయింది. అయినా అరుదుగా వచ్చేవి.

అలాంటిది ఇప్పుడు గోవింద్‌ ‌నుండి ఫోన్‌! ‌పాస్‌పోర్ట్ ‌గురించి అడుగుతున్నారు. కొన్ని నెలల సమయం కావాలంటున్నారు. తనను మాత్రమే పిలవ టానికి కారణం ఏమిటి? కొన్ని వందల మంది గోవింద్‌కి తెలుసు. ఆయన రమ్మంటే మరో సంశయం లేకుండా వెళ్లేవారున్నారు. అలాంటిది…?

ఇది ఇతరులతో పంచుకునే అంశం కాదు. రహస్యంగా వుంచాలి. రిత్విక్‌కి తెలిసినంత వరకు గోవింద్‌ ‌బుద్ధ అత్యంత సున్నితమైన మనిషి. ఆయన ఎప్పుడు ఎలాంటి మూడ్‌లో వుంటారో తెలియ దంటారు. అలాంటి వ్యక్తితో తను ప్రయాణం చేయగలడా? అనే సందేహం కలవరపెడుతోంది.

దానికి ముందు తనకు వస్తున్న అవకాశాలన్నీ వదులుకోవాలి. అందుకు అభ్యంతరం లేదు. తమకున్న ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటు న్నారు. ఒకడు విశాఖలో, ఇంకొకడు బెంగళూరులో వుంటున్నాడు.

తనూ, హారిక సినీ, టీ.వీ. ఇండస్ట్రీ వుంది కాబట్టి హైదరాబాద్‌లో వుంటున్నారు.

‘‘ఎందుకింత సీరియస్‌గా ఆలోచిస్తున్నారు?’’ అంటూ హారిక వచ్చింది.

‘‘కూర్చో’’ అన్నాడు. సోఫాలో ఎదురుగా కూర్చుంది.

‘‘ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వారం పది రోజులయితే ఫర్వా లేదు. నెలలంటున్నారు. ఇక్కడ మనిద్దరం వుంటున్నాం. రేపటి నుండి నువ్వు ఒక్కదానివి వుండాలి’’.

‘‘నా గురించా మీ దిగులు? కొంతకాలం నేను విశాఖ, బెంగళూరుల మధ్య తిరుగుతాను. పిల్లలు కూడా మీరు హైదరాబాద్‌ ‌నుండి కదలటం లేదంటున్నారు. నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను’’.

‘‘అదేంటి?’’

‘‘మీరు సినిమాలకు పని చేయాలని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. తర్వాత టీ.వీ. సీరియల్స్ ‌రాస్తున్నారు. ఇప్పుడవన్నీ వదిలి వెళ్లటానికి బాధగా వుందేమో అనుకుంటున్నాను’’ అంది హారిక.

‘‘అలా అని కాదు. ఈ మధ్య సీరియల్స్ ‌రాయటం తగ్గించాను. కథలూ, నవలలూ ఇది వరకటిలా రాయలేకపోతున్నాను. నా ఆరోగ్యం ఇది వరకటిలా లేదు. నాకూ బీ.పీ., షుగర్‌ ఎటాక్‌ అయ్యాయి. అవి పక్క నుంచు. నేను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకున్నప్పుడు అందరూ వద్దన్నారు. అప్పుడు నేను కలుసుకుంది గోవింద్‌ ‌గారిని. ఆ రోజు గేట్‌ ‌దాకా వచ్చి పంపించారు. అప్పుడాయన అన్నమాట మరిచిపోలేను. ఇన్‌ ‌కేస్‌ ఆఫ్‌ ‌ఫెయిల్యూర్‌ ‌డోంట్‌ ‌వర్రీ రిత్విక్‌. ఐ ‌విల్‌ ‌బీ విత్‌ ‌యు. నువ్వు ఎప్పుడయినా మన సంస్థలోకి రావచ్చు అన్నారు. నీకు గుర్తుందా?’’

‘‘ఎలా మరిచిపోతానండి!’’

‘‘అనుకున్నట్లుగా నేను సినిమాలకు పని చేయలేకపోయాను. బతకటం కోసం టీ.వీ.కి రాసాను. కొన్ని వేల ఎపిసోడ్లు రాసాక నాకు ఆ మోజు పోయింది. మరీ ఖాళీగా వుంటున్నాను. మిత్రులు బలవంతం చేసారు – ఈ ఒక్క సీరియల్‌ ‌రాయమని. అందుకు ఒప్పుకున్నాను. మనం కుదరదంటే ఇంకొకరిని చూసుకుం టారు’’.

‘‘మరేంటి సమస్య?’’

‘‘గోవింద్‌ ‌గారు పాస్‌పోర్ట్ అం‌టున్నారు. అంటే విదేశాలు కూడా వెళ్లాల్సి వుంటుందా అని అనుమానం వస్తోంది’’.

‘‘అంతకంటే ఏం కావాలి?’’

ఆశ్చర్యంగా చూసాడు రిత్విక్‌.

‘‘‌మీరు పాస్‌పోర్ట్ ‌తీసుకుంది విదేశాలు వెళ్లటానికే కదా! ఇప్పటికి రెండు సార్లు రెన్యూవల్‌ ‌చేయించారు. అరవై దాటాక మీకు అదృష్టం కలిసి వస్తుందేమో!’’

‘‘నువ్వు లేకుండానా?’’ అన్నాడు. ఆమె కళ్లు పెద్దవయ్యాయి.

‘‘ఇది అదృష్టం అంటావా?’’ అంతలోనే అడిగాడు.

‘‘నాకు విదేశాలు చూడాలని ఎప్పుడూ లేదు. అందుకే మీరు నాకూ పాస్‌పోర్ట్ ‌తీసుకుంటానన్నా వద్దన్నాను. అది అదృష్టం కాదు అని మీరు అను కుంటే అదే మాట గోవింద్‌ ‌గారికి చెప్పండి’’.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram