వైసీపీ ప్రభుత్వం హిందు ధర్మం పట్ల చూపుతున్న నిర్లక్ష్యధోరణి హిందువులకు ఆగ్రహం తెప్పిస్తోంది. నాలుగేళ్లుగా హిందు వుల పట్ల వ్యతిరేక వైఖరి చూపుతున్న ఈ ప్రభుత్వం అదే నిర్ల్యక్ష ధోరణిని ప్రదర్శిస్తూ, హిందువులను రెచ్చగొడుతోంది.  పరమ పవిత్రంగా భావించే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్స వానికి (స్వామి నిజరూప సందర్శనం) వచ్చిన భక్తులకు తీవ్ర ఆటంకం కలిగించి చోద్యం చూసింది. స్వామి వారి దర్శనాన్ని సైతం ఆదాయవనరుగా పరిగణించి రూ.1,500, రూ.1000 టిక్కెట్లు ధర పెంచి పిండేసింది. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. కిలోమీటర్ల పొడవాటి క్యూలైన్లు, కొండమీద బారుల తీరిన బస్సులు, వాహనాలు, ఎక్కడికక్కడ ఆగిపోయిన ట్రాఫిక్‌తో సింహాచలంలో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులు, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ అధి కారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వారి వెంట పదుల సంఖ్యలో అనుచర గణం దర్శనానికి ముందువైపు నుంచి వెళ్లడంతో క్యూలైన్‌లు ముందుకు సాగలేదు. కనీసం 4 గంటల సేపు ఆగిపోయిన క్యూలైన్‌లో నిలుచున్న వృద్ధులు, మహిళలు, పిల్లలతో కూడిన భక్తులు తీవ్రంగా అసౌకర్యానికి గురయ్యారు. వారికి కనీసం మంచినీరు కూడా లభించలేదు. తోపులాటలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. మంచినీరు తాగుతారా? అని అడిగినవారే లేరు. కనీసం వాలంటీర్లు కూడా కనిపించలేదు. తమకు కనీసం తాగునీరు ఇచ్చేవారు లేరని, గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నామని, స్వామివారి దర్శనం ఎప్పుడు కల్పిస్తారంటూ దర్శనం చేసుకుని వస్తున్న మంత్రులను భక్తులు నిలదీశారు. వారెవరూ భక్తులను పట్టించుకోలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు భక్తులకు ‘పుండు మీద కారం చల్లిన’ట్లు ఉన్నాయి. ఇబ్బందులు పడిన భక్తులకు సాంత్వన కలిగించాల్సింది పోయి ‘దేవుడి దర్శనానికి వచ్చినవారు ఎంతసేపైనా నిలుచుని ఉండాల్సిందే’ నని అని కసురుకోవడం భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో ఇదే పరిస్థితి నెలకొంది.

నిర్వహణ వైఫల్యం

చందనోత్సవం నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ మాట అనేకన్నా నిర్ల్యక్షం వహించింది అనడం సరైనదని భక్తులు విమర్శి స్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలా జరగలేదని, ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరుగు తుండటం వెనుక తమ పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య భావనగా హిందువులు ఆరోపిస్తున్నారు. క్రైస్తవ, ముస్లిం మతాచార్యులకు జీతాలివ్వడం, ప్రార్ధనా మందిరాల నిర్మాణాలకు వందల కోట్లు నిధులివ్వడం, హిందువేతర ప్రార్ధనామందిరాల అక్రమ నిర్మా ణాలను ప్రోత్సహించడం, హిందు దేవాలయాలు, విగ్రహాలు, రథాలను అన్యమతస్తులు ధ్వంసం కొనసాగిస్తున్నా ఆపలేకపోవడం, పైగా నిందితులు మతిస్థిమితం లేని వారుగా పేర్కొనడం, నేరస్తులను తప్పించడం, క్రైస్తవ మతంలో మారిన దళితులకు ఎస్సీ హోదా ఇస్తామని తీర్మానించి మతమార్పిడు లను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని హిందువులు, హిందూధర్మ సంస్థలు, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నాయి.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి దేహంపై ఏడాది మొత్తం పూసిన చందనాన్ని వైశాఖ శుక్ల పక్ష తదియ నాడు తొలగించి కల్పించే స్వామివారి నిజరూప దర్శనం (చందనోత్సవం) గొప్ప ఉత్సవం. ఈ నిజరూపదర్శనం కోసం ఉత్తరాంధ్ర నుంచే కాక రెండు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఈ ఏడాది కూడా లక్షలాది మంది వేకువజాము నుంచే దర్శనానికి వరుస కట్టారు. దర్శనానికి దేవస్థానం ఉచిత, రూ.300, రూ.1,000, రూ.1,500 టిక్కెట్లు జారీ చేసింది. ఈసారి అంతరాలయ దర్శనం పేరుతో రూ.1,500 టిక్కెట్లు ప్రవేశపెట్టారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి కిలోమీటర్ల దూరానికి విస్తరించాయి. అయితే క్యూలైన్లు ఏమాత్రం కదలలేదు. భక్తులు గంటల తరబడి ఎలా ఉన్నవారు అలాగే నిలుచుండి పోయారు. ఉచిత, రూ.300 టికెట్లు తీసుకున్న భక్తులు సుమారు పది కి.మీ. పొడవున క్యూలైన్లలో నడవాల్సి వచ్చింది. రూ.1,500 టిక్కెట్‌లు కలిగిన వీవీఐపీలు కూడా కనీసం 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇన్చార్జి ఈవో త్రినాథరావు, చీఫ్‌ ‌ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఆజాద్‌, ‌ప్రొటోకాల్‌ ‌దర్శనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో సామాన్య భక్తులు నరకం చూశారు.

 ఇదిలా ఉంటే కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీవీఐపీల ప్రొటోకాల్‌ ‌పేరుతో పదేపదే అంత రాలయంలోకి వెళ్లడం, వైసీపీ ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవిన్యూ అధికారులు, మరోపక్క ప్రభుత్వ సిబ్బంది వారి కుటుంబాలు, వేలాది మంది అడ్డగోలుగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగి పోతోంది. కళ్లముందు నుంచే వారు లోపలికి వెళ్లడం, దర్శనం చేసుకుని తాపీగా రావడం ఇవన్నీ భక్తులు గమనించారు. ఇవికాక పోలీసులు వారి బంధుమిత్రులను తీసుకొచ్చి లైన్లలో కలుపుతున్నారు. ఉదయం నుంచి అయిదారు గంటలు క్యూలైన్లో వేచి ఉన్న తమకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వక పోవడంతో భక్తులు అలసిపోయారు. మధ్యలో దూరిపోయిన వారితో క్యూలైన్లు బిగుసుకుపోయి లోపలున్నవారికి ఊపిరాడలేదు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో చాలామందికి గాయాల య్యాయి. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. క్యూలైన్లో ఉండలేని వారంతా బయటికి వెళ్లి పోయారు.

మంత్రులకు నిరసన సెగ

ఇలా గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులు, తమకు కనిపించిన మంత్రుల ముందు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. సకాలంలో దర్శనం కాకపోవడం, వీవీఐపీలకు పెద్దపీట వేయడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో మంత్రులపై, అధికారులపై భక్తులు విరుచుకుపడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్య నారాయణ, కలెక్టర్‌ ‌మల్లికార్జున, సీపీ త్రివిక్రమవర్మ క్యూలైన్ల వద్దకు వచ్చినప్పుడు భక్తులు, ‘మంత్రులు డౌన్‌… ‌డౌన్‌’, ‘‌కలెక్టర్‌ ‌డౌన్‌…. ‌డౌన్‌’, ‘‌సీపీ డౌన్‌. ‌డౌన్‌, ‘ఈవో డౌన్‌… ‌డౌన్‌’ అని నినాదాలు చేశారు. గంటల కొద్దీ క్యూలో నిల్చొంటే కనీసం మంచినీరు కూడా ఇవ్వ లేరా?అని బొత్సను నిలదీశారు. దర్శనం అనంతరం మళ్లీ ఆయన అటు వైపు రాగా మరోసారి నిరసన వ్యక్తం చేశారు. శాపనార్థాలు పెట్టారు. మంత్రి కొట్టుతో వాగ్వాదానికి దిగారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో గాలి గోపురం వద్ద భక్తులను అనుమతించేందుకు పోలీసులు గేటు తీయడంతో ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. పోలీసులు భక్తులను తోసేసి, కొట్టి దురుసుగా ప్రవర్తించారు. భక్తులు ఎదురుతిరిగ్గానే పరిస్థితి విషమించిందని తెలుసుకున్న అధికారులు అంతరాలయ దర్శనం తీసేసి నీలాద్రి మండపం నుంచే దర్శనం చేయించి వెనక్కి పంపేశారు. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి శాపనార్థాలు పెట్టారు.

అన్ని టిక్కెట్లు ఎలా వచ్చాయ్‌?

‌వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాలను ఆదాయ వనరులుగా చూస్తోంది. అన్ని ఆలయాల్లో దైవదర్శనానికి టిక్కెట్లు పెంచేసిన ప్రభుత్వం ఇప్పుడు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సైతం డబ్బు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సారి అంతరాలయ దర్శనం చేసుకునేలా రూ.1,500 ధర గల వీవీఐపీ టికెట్లు ఐదు వేలు ముద్రించామని కలెక్టర్‌ ‌ప్రకటించారు. అయితే విచిత్రంగా ఈ వీవీఐపీ లైన్లో 20 వేల మందికి పైగా టికెట్లు తీసు కొచ్చారు. ఇన్ని ఎలా వచ్చాయో అధికారులు పెదవి విప్పడంలేదు. పైగా ఈ టికెట్లకు ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా నగదు వసూలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో త్రినాథరావు ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా ఉన్నారు. ఆయనకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదంటున్నారు. ఆ విషయం ప్రభుత్వానికి చెప్పినా ఇంత పెద్ద దేవా లయానికి రెగ్యులర్‌ ఈవోను నియమించ కుండా కాలక్షేపం చేస్తోంది. చంద నోత్సవానికి చీఫ్‌ ‌ఫెస్టివల్‌ ఆఫీసర్‌గా ఆజాద్‌ను నియమించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వీరిద్దరినీ డమ్మీగాచేసి అంతా తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు.

భక్తులకు ఉచిత రవా ణా సదుపాయం కల్పిం చినా బస్సులు సక్రమంగా నడపలేదు. కొండమీదకు వేల సంఖ్యలో వ్యక్తిగత వాహనాలకు పాస్‌లు ఇచ్చేశారు. అలా ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ఘాట్‌రోడ్డులో ఉదయం 9 గంటలకే ట్రాఫిక్‌ ‌స్తంభించిపోయింది.

అప్పటి నుంచి ఈ సమస్యను రాత్రి తొమ్మిది గంటల వరకు పోలీసులు పరిష్కరించ లేదు. బస్సులు ముందుకు కదలకపోవడంతో భక్తులు దిగి కాలినడకన దర్శనాలకు వెళ్లారు. ఈ మార్గంలో ఇసుకేస్తే రాలనంతగా జనం చేరారు. చంద నోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ఆరు నెలలుగా ఈవోను ఎందుకు నియమించలేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందూ ఆలయాల పట్ల ద్వేషభావం, చిన్నచూపు కారణంగా ఈ ఉత్సవాన్ని జరపడంలో ఉత్సాహం చూపించలేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

దేవుడిని దూరం చేసే కుట్ర: ‘స్వరూపానంద’

చందనోత్సవం నిర్వహణ తీరుపట్ల శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు దేవుడిని దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం వచ్చిన ఆయన, భక్తుల ఇబ్బందులు, ఉత్సవ లోపభూయిష్ట ఏర్పాట్లను స్వయంగా చూసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అప్పన్న పేదల దేవుడు. ఆయనని వివీఐపీలకే పరిమితం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారు. గర్భాలయం, క్యూలైన్లలో పోలీసుల జులుం పెరిగి పోయిందన్నారు. ఇది వరస్ట్ ‌చందనోత్సవం. భక్తులకు దేవుడిని దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

భక్తుల కళ్ల వెంబడి నీళ్లు వస్తున్నాయి. దర్శనానికి ఎందుకు వచ్చానా? అని బాధపడు తున్నారు. ఇంత పెద్ద దేవస్థానానికి ఆరు నెలలుగా ఈవో లేకపోవడం అత్యంత దారుణమన్నారు. అంతరాలయాన్ని చూస్తే భయమేసిందని. ఆచారం, సంప్రదాయం లేకుండా పోయింది. సింహాచలం క్షేత్ర చరిత్రలోనే ఇది దుర్దినం’ అని మండిపడ్డారు.

దృష్టి మళ్లింపు నాటకం

 కాగా, ‘రాష్ట్రంలో హిందూ వ్యతిరేక కార్యకలా పాలతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేం దుకే శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహ నాటకం ఆడుతున్నారు’’ అని సాధుపరిషత్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద ఓ ప్రకటనలో విమర్శించారు. మతమార్పిడులు ప్రోత్సహించే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించినా పట్టించుకోని ఆయన.. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE