‌రైతాంగాన్ని నిలువునా ముంచేసిన పాలకులు రేషన్‌ ‌బియ్యాన్ని రీసైక్లింగ్‌ ‌చేసి వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని బీజేపీ మండిపడింది. జగనన్న మద్యం షాపుల్లో తీసుకొంటున్న నగదు ఎటు పోతోందని నిలదీసింది. ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో రూ.వందల కోట్లు దోపిడీ చేసిన వైసీపీ నేతలు. కేంద్రం కేటాయించిన 22 లక్షల గృహాల నిర్మాణంలోనూ పూర్తిగా చేతులెత్తేశారని విమర్శించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అధికార పార్టీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వ దోపిడీని తమ శ్రేణులు గుర్తించి ఛార్జిషీట్‌ను దాఖలు చేస్తున్నాయని పేర్కొంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి పార్టీ జాతీయ నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటి కప్పుడు తెలియజేస్తున్నట్లు వివరించింది.

వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఎదురుదాడి చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయిం చింది. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మే 19న గన్నవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని, ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ధ్వజమెత్తింది.

వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా అక్రమాలు, అవినీతికి పాల్పడుతోందంటూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్‌ ‌కార్యక్రమం చేపట్టింది. 576 మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. స్థానికంగా పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలను బీజేపీ దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 20,107 మంది ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా ఆయా ప్రాంతాల్లో చేసిన పరిశీనలలో వైసీపీ నేతల అక్రమాలు ఎన్నింటినో గుర్తించారు. ఈ ఆరోపణలపై స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లలో బీజేపీ ఫిర్యాదు చేయనుంది. అలాగే ఈ ఛార్జిషీట్‌లు అన్నిటినీ పుస్తకం రూపంలో ప్రచురించాలని భావించింది.

ప్రజల నుంచి ఆరోపణలు

ఛార్జిషీటు కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వరకు అవినీతి జరుగుతోందని ప్రజలు ఆరోపించారు. ఒక పక్క ఇసుక నుంచి మట్టి వరకు అక్రమంగా తవ్వుకుని అమ్మేసుకుంటుంటే, మరోపక్క భూకబ్జాలు పెరిగిపోయాయి. అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు రౌడీయిజంతో చెరువులు, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను ఆక్రమించుకుంటున్నారు. ఆ పార్టీ పెద్దలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని రామేశ్వరం మెట్ట వద్ద భారీ ఎత్తున తవ్వకాలు జరిపి వందల కోట్ల విలువైన మట్టిని తరలించుకుపోతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కడియంలో ప్రకృతి అందాలకు మారుపేరైన వేమగిరి కొండలను చెరువులుగా మార్చారు. ఆవ భూములు, మడ అడవులను విధ్వంసం చేశారు. విశాఖ మన్యంలో రూ. 15 వేల కోట్ల విలువైన బాక్సైట్‌ ‌దోపిడీకి అధికారపక్షం నేత వైవీ సుబ్బారెడ్డి కుట్ర పన్నారని ఆరోపణ. లేటరైట్‌ ‌ముసుగులో అడ్డగోలుగా తవ్వకాలకు స్కెచ్‌ ‌వేశారంటున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం రవ్వలకొండను సైతం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అక్రమంగా తవ్వుకుని రూ. కోట్లు కొల్లకొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పోలవరం కుడికాలువ ప్రాంతంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కొత్తూరు రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో కోట్ల విలువైన గ్రావెల్‌ అ‌క్రమంగా తరలిపోతోంది. కృష్ణా జిల్లా కొండపల్లి కొండ రిజర్వ్ ‌ఫారెస్ట్‌ను సైతం వదలలేదు. అక్కడ స్థానిక శాసనసభ్యుడి అనుచరులు, బంధువులు అక్రమంగా గ్రావెల్‌ ‌తరలిస్తూ కోట్లు గడిస్తున్నారనేది ఆరోపణ. నెల్లూరు జిల్లాలో పెన్నా నది నుంచి మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అండదండలతో లక్షలాది క్యూబిక్‌ ‌మీటర్ల గ్రావెల్‌ అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. మైనింగ్‌ ‌మాఫియా ఆగడాలతో వందలాది పొక్లైనర్లతో గ్రావెల్‌, ఇసుకను తవ్వి టిప్పర్లలో తరలించుకుపోవడంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆ రిజర్వాయర్‌ ‌భద్రత ప్రమాదంలో పడింది. వరదలు వస్తున్నా ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం గేట్లు తెరవకపోవడం వల్ల గేట్లు కొట్టుకుపోయి పదుల సంఖ్యలో గ్రామాలు వరదనీటిలో మునిగిపోతున్నాయి. కుప్పం శాంతిపురం అటవీభూముల్లో గల ఓ కొండను తవ్వుతూ పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌ ‌ద్వారా వందలకోట్లు కొల్లగొడుతున్నారు.

టిడ్కో ఇళ్లు ఎందుకు పంపిణీ చేయలేదు?

టిడ్కో ఇళ్ల నిర్మాణం, పంపిణీలో అలసత్వంపై కూడా బీజేపీ కార్యవర్గం మండిపడింది. 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేందప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించింది. టిడ్కో ఇళ్ల కోసం ఒక ఇంటికి 1.80 లక్షల చొప్పున 9 వేల కోట్లు కేంద్రం ఇస్తే వైసీపీ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పైగా భూముల కొనుగోళ్లల్లో గోల్‌ ‌మాల్‌ ‌చేశారని, రూ. ఆరు లక్షలు విలువచేసే ఎకరం భూమిని రూ.18 లక్షలకు, రూ. పది లక్షలు విలువ గల స్థలాలు రూ. 30 లక్షలకు కొన్నారని ఆరోపించింది. ఎనభై, తొంభై శాతం పూర్తి అయిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని, వాటిని వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ ‌చేసింది.

పాలకులా – వ్యాపారులా

నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ తీరును పరిశీలిస్తే పాలన ముసుగులో వ్యాపారం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలున్నా వేటినీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ధ్వంసమైన రోడ్లను కొత్తగా నిర్మించడం అటుంచి మరమ్మతులు కూడా చేయలేదు. పాత పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పలు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో రోడ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాక అలాగే ఉండిపోవడం ప్రతి పట్టణంలో కనిపిస్తుంది. ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టక సొంత వ్యాపారం చేసుకుంటూ రెండు చేతులా డబ్బును పోగేసుకుంటున్నట్లు ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇసుక, మద్యం అమ్మకాల విషయంలో జరిగే అవినీతిని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇసుకకు గత ప్రభుత్వ హయాంలో కన్నా నాలుగింతల డబ్బు వసూలు చేస్తున్నారు. ఇక మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టింది. మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లోనే ఉంది.

రైతు వ్యతిరేక ప్రభుత్వం

జగన్‌ ‌ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు ఆరోపించారు. రైతుభరోసా కింద నగదు సాయాన్ని సగానికి తగ్గించి, కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇస్తున్నారు. రైతులకు సబ్సిడీలు తీసేశారు. వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయలేదు. ఏనాడూ ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు. తీసుకున్న ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించలేదు. ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయినప్పుడు సకాలంలో స్పందించ లేదు. ఇటీవల వచ్చిన వరదలు, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు బీమా సొమ్ము సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మిర్చి పంట నీళ్లపాలై, ఇతర పంటలు పొలాల్లోనే కుళ్లి, మగ్గిపోతుంటే.. మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని, అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడటం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ధాన్యం తరలింపునకు రైతులకు కనీసం సంచులను కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రైతులను మోసగిస్త్తూ, మిల్లర్లకు కొమ్ము కాస్తోంది. రైతు భరోసా కేంద్రాలు..  రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని విమర్శించారు. పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రూ.2వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి, రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగన్‌ ‌సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ ‌చేసింది. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పరిష్కరించకపోగా జీతాలు కూడా విడతల వారీగా ఇస్తుండటంతో వారంతా కార్మిక నాయకులుగా మారిపోయి అందోళనలు చేస్తున్నారు. జీతాలు లేవని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE