సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌జ్యేష్ఠ శుద్ధ తదియ – 22 మే 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వెంటనే విశ్లేషణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ‌మీద ప్రేమ మాటేమో కానీ, బీజేపీ మీద పట్టలేనంత ద్వేషం ఉన్న విశ్లేషకులంతా టన్నుల కొద్దీ వాదనలను దేశం మీదకు వదిలి పెట్టారు. బీజేపీ ఓడిపోయింది, ఇదొక వాస్తవం. కానీ ప్రజాస్వామ్యంలో అసాధారణమేమీ కాదు. ఒక విశ్లేషకుడు అన్నట్టు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ను గెలిపించింది. కాంగ్రెస్‌ ఓటింగ్‌ ‌శాతం పెరిగింది. బీజేపీ కోల్పోయిన ఓటింగ్‌ ‌కేవలం .2 శాతం. దీనిని గుర్తిస్తే కొన్ని భ్రమలు వీడతాయి. కాంగ్రెస్‌ 36 ‌శాతం నుంచి 43కు ఓటింగ్‌ ‌శాతం పెంచుకుంది. ఆ మేరకు జనతాదళ్‌ (‌సెక్యులర్‌) ‌కోల్పోయింది. ఏమైనా ప్రజాతీర్పును గౌరవించడం ప్రజాస్వామిక వ్యవస్థ ధర్మం. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఎన్నికలు ఇచ్చిన అసలు ఫలితం ఏమిటో పరిశీలించడం చాలా అవసరం.

కాంగ్రెస్‌ ‌గెలుపు కన్నా, బీజేపీ ఓటమినే దేశంలో కొన్ని శక్తులు కోరుకున్నాయి. ప్రధానంగా కొన్ని ముస్లిం సంస్థలు, కొందరు ముస్లింలు అందుకు మొక్కుకున్నారు. ఒక్క రాష్ట్రంలో జాతీయ పార్టీ .2 శాతం ఓట్లు కోల్పోయిన సంగతి మరచిపోయి వారంతా పూనకం వచ్చినట్టే మోదీ హవా చల్లబడిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభ మసకబారిందని తీర్పు ఇచ్చారు. నిజం ఏమిటి! కర్ణాటక కమలం ఓటమిలో వారంతా చూస్తున్నది హిందూత్వ ఓటమినే. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన రెండు రోజులకే సున్నీ ఉలేమా బోర్డ్ ‌ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి సహా ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని హుకుం జారీ చేసింది. ఆ శాఖలు హోం, రెవెన్యూ, విద్య, ఆరోగ్యం వంటి కీలకమైనవే అయి ఉండాలి. ఉప ముఖమంత్రి మహమ్మ దీయుడు అయి ఉండాలని ఎన్నికలు జరగడానికి చాలా ముందే తాము కాంగ్రెస్‌ ‌చెవిన వేశామని బోర్డ్ ‌సభ్యులు దేవ రహస్యం వెల్లడించారు. కాంగ్రెస్‌ 15 ‌మంది ముస్లింలకు టిక్కెట్లు ఇస్తే 9 మంది గెలిచారు. అంతేకాదు, 72 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు దక్కిన విజయం వెనుక ఉన్నది ముస్లింలేనని వక్ఫ్ ‌బోర్డ్ ‌పెద్దలు చెప్పారు. బీజేపీ రద్దు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పినందుకు కాంగ్రెస్‌కు ఎంతో చేశామన్నారు. కాబట్టి ముస్లింలకు కృతజ్ఞత ప్రకటించుకోవలసిన బాధ్యత కాంగ్రెస్‌ ‌మీద మిగిలి ఉందని ఎలాంటి శషభిషలూ లేకుండానే చెప్పారు. ఇవన్నీ వక్ఫ్ ‌బోర్డ్ అధ్యక్షుడు షఫీ సాది విలేకరులకు చెప్పినవే. చిత్రంగా ఈయన బీజేపీ మనిషి అని వెంటనే కాంగ్రెస్‌ ‌ముద్ర వేసేసింది. అయితే సున్నీ బోర్డ్ ‌కాంగ్రెస్‌కు ఒక వెసులుబాటు మాత్రం కల్పించింది. నెగ్గిన తొమ్మిది మంది ముస్లిం ఎమ్మెల్యేలలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలో మీ ఇష్టం అంటూ దయతలచింది. ఆ మేరకు కాంగ్రెస్‌ ‌సంతోషించాల్సిందే. ఎందుకంటే ఏ శాఖ ఏ ముస్లిం ఎమ్మెల్యేకి కట్టబెట్టాలో సున్నీ ఉలేమా బోర్డ్, ‌లేదా వక్ఫ్ ‌బోర్డ్ ‌చెబితే బొత్తిగా బాగుండదు కదా! ఎన్నికలకు ముందే ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి నెరవేర్చి తీరాలని ముస్లిం పెద్దలు అంటున్నారు. ‘మేం ఉప ముఖ్యమంత్రి పదవే అడుగుతున్నాం. నిజానికి 90 లక్షల ముస్లిం జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో వారికి ముఖ్యమంత్రి పదవే ఇవ్వాలి, ఇంతకు పూర్వం ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు’ అంటున్నారు. ఎస్‌డీపీఐ, మజ్లిస్‌ ‌పార్టీలు సోదిలోకి లేకుండా పోయాయి అనుకోవడం అమాయకత్వం. అవి తమ ఓటును తాత్కాలికంగా కాంగ్రెస్‌కు బదలీ చేశాయంతే. 25 సీట్లకు పోటీ చేస్తానని మొదట చెప్పిన మజ్లిస్‌ ‌నాయకుడు అసదుద్దీన్‌ ‌తరువాత రెండు స్థానాలకే పరిమితమయ్యారు. దేవెగౌడ కుటుంబ పార్టీ జనతాదళ్‌ (‌సెక్యులర్‌) 23 ‌మంది ముస్లింలకి టిక్కెట్లు ఇచ్చింది. ఒక్కరు కూడా నెగ్గలేదు. కాబట్టి ముస్లింలంతా గంపగుత్తగా కాంగ్రెస్‌ను అంటకాగారు. రాష్ట్రంలో 88 శాతం ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని ఆ వర్గం నాయకులు చెప్పుకుంటున్నారు.

తమ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కన్నడ ముస్లింలలో ఇలాంటి కోర్కెకు జన్మ ఇవ్వగా, ఓ అస్సాం ముస్లిం నాయకుడికి భారీ కలకే అవకాశం ఇచ్చాయి. కర్ణాటక బీజేపీ ఓటమిలో, ఉమ్మడి పౌరస్మృతి వెనుకడుగును చూస్తున్నారాయన. ఆ చట్టాన్ని భారతదేశంలో అమలు చేయలేమన్న సంగతి బీజేపీకి తెలుసునని, కానీ తీసుకువస్తామని చెప్పడం కేవలం ఓట్ల కోసమేనని ఆలిండియా యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) ‌ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రఫీకుల్‌ ఇస్లామ్‌ ‌రెండు రోజుల క్రితమే తేల్చి చెప్పేశారు. ఆ పార్టీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయలేదన్న సంగతి భారతదేశానికి కూడా తెలుసునని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి సహజత్వం కలిగినది కాదట. అన్ని కులాలు, వర్గాల వారి హక్కుల గురించి రాజ్యాంగంలో ఇదివరకే నిర్వచించారని కూడా చెప్పారు. కాబట్టి ఉమ్మడి పౌరస్మృతి అంటూ బీజేపీ ప్రత్యేకంగా ఏ ప్రయత్నమూ చేయనక్కరలేదని చెప్పారు. గోవా, మేఘాలయా, అరుణాచల్‌‌ప్రదేశ్‌, ‌మిజోరం, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయలేరని అన్నారు. భారతదేశంలో అనేక కులాలు, వర్గాలు ఉన్నాయి. వివిధ మతాల వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తే దేశానికి చేటేనని గడచిన అక్టోబర్‌లో కూడా రఫీకుల్‌ ఆ‌క్రోశించాడు. బీజేపీ లక్ష్యం, ముస్లింలు, ఇతర మతావారేనని కూడా చెప్పాడు. భారతదేశ భౌగోళిక పటంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతాలను ఇలా ఎత్తి చూపాడితడు.

కర్ణాటక ఫలితాలు కొత్త విషయాన్ని దేశం ముందుకు తీసుకువచ్చాయి. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, సెక్యులర్‌ ‌పార్టీలు ముస్లింలకు ఏవో తాయిలాలు ఇచ్చి తమ వైపు తిప్పుకుంటూ పబ్బం గడుపుకున్నారు. ఇకపై పద్ధతి మారాలని ముస్లింలు కోరుకుంటున్నట్టు కర్ణాటక ఫలితాలు, ఆ తరువాత ఆయా ముస్లిం వర్గాలు బయటపెట్టిన కోర్కెలు చెబుతున్నాయి. ఇప్పుడు ఓట్లతో పదవులను బేరమాడే పంథాను ప్రవేశపెట్టారు. ఇదెక్కడికి దారి తీస్తుందో వెంటనే ఆలోచించడం మంచిది.

About Author

By editor

Twitter
Instagram