సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌చైత్ర  శుద్ధ త్రయోదశి – 03 ఏప్రిల్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆ ‌సందర్భంలో, ఆ క్షణంలో వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌పేరును ప్రస్తావించవలసిన అవసరం వీసమెత్తయినా ఉందా? జరిగిన దానికి పశ్చాత్తాపం ప్రకటిస్తారా? అని అడిగినందుకు ఐదు దశాబ్దాల క్రితం కన్ను మూసిన ఒక స్వాతంత్య్రం సమరయోధుడి పేరును ఇప్పుడు నిందాపూర్వకంగా ఉదహరించడం సంస్కారమనిపించుకుంటుందా? ‘నా పేరు సావర్కర్‌ ‌కాదు. నా పేరు గాంధీ. గాంధీ క్షమాపణలు అడగరు’ ఇదీ కాంగ్రెస్‌ ‌నాయకుడు, వాయినాడ్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ పలికిన మాట. వాగ్ధోరణిలో అసందర్భం అనే మాటకు నిర్వచనంలా లేదా ఇది! తనకు జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్పందించమంటే ఆ మహనీయుడి పేరును రాహుల్‌ ఎం‌దుకు తెచ్చినట్టు?

పంథా వేరు కావచ్చు. ఆయన చింతన భిన్నమైనది కావచ్చు. అది గాంధీజీకి నచ్చనిదే కావచ్చు. కానీ సావర్కర్‌ (1883-1966) ‌భారత స్వాతంత్రోద్యమంలో సమున్నత యోధుడు. యోధానుయోధుడు. చరిత్ర పుస్తకాలలో సరైన చోటు దక్కకుండా చేసినంత మాత్రాన్నే కనుమరుగయ్యే జీవితం కాదాయనది. ఆయన 1911 నుంచి 1924 వరకు అండమాన్‌ ‌జైలులో ఉన్నారు. అదెంత ఘోరమైన శిక్షో బరీంద్రనాథ్‌ ‌ఘోష్‌ (అరవిందుల సోదరుడు) వంటి వారి కొన్ని ఆత్మకథల వల్ల తెలుస్తుంది. చదివితే కళ్ల నుంచి రక్తకన్నీరు ఉబుకుతుంది. ఆ అక్షరాలలో నిక్షిప్తమైన అనంతమైన బాధ వెంటాడుతుంది. లండన్‌ ‌నుంచి తీసుకువచ్చి, అప్పీలుకు అవకాశం లేని, డిఫెన్స్ ‌లేని విచారణ జరిపారు. కాలాపానీ అని పిలిచే సెల్యులార్‌ ‌జైలులో కుక్కారు. అది జైలు కాదు, భారత స్వాతంత్య్రేచ్ఛకు సిద్ధం చేసిన సమాధి. అక్కడ స్వాతంత్య్ర సమరయోధులను పశువులను చూసినట్టు చూశారు. పశువులను హింసించినట్టే హింసించారు. గానుగలకు కట్టి పశువుల్లా పనిచేయించారు. సరైన తిండి లేదు. కంటి నిండా నిద్ర లేదు. అండమాన్‌ ‌జైలు శిక్ష కొందరికే పడేది. బ్రిటిష్‌ ‌జాతి పగబట్టిన వారే వారంతా. ఆ కొందరిలో దాదాపు మరెవరికీ పడని శిక్ష సావర్కర్‌కు పడింది. రెండు జీవితకాలాల శిక్ష. అంటే యాభయ్‌ ‌సంవత్సరాలు. విక్రమ్‌ ‌సంపత్‌ ‌వంటి చరిత్రకారులు సావర్కర్‌ ‌క్షమాభిక్షకు విన్నపాలు పంపిన మాటను కాదనడం లేదు (కానీ సావర్కర్‌ ‌మనుమడు రంజిత్‌ ‌సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరినట్టు రుజువు చెయ్యమని రాహుల్‌ను సవాలు చేశారు). ఆ ఒక్క విషయమే తరతరాల పాటు ఆయన్ను బోనులో నిలబెట్టి ఉంచే నేరం అవుతుందా అన్నదే ప్రశ్న. భారత్‌ ‌జోడో యాత్రలో ఇంకొక అడుగు ముందుకు వేసి క్షమాభిక్ష కోరడమే కాదు, సావర్కర్‌ ‌బ్రిటిష్‌ ‌వారికి సహకరించారని, అందుకు పింఛను కూడా వచ్చిందని మహారాష్ట్రలోనే రాహుల్‌ ఆరోపించడం ఊహకు అందని తెంపరితనం.

అది జాత్యహంకార బ్రిటిష్‌ ‌ప్రభుత్వం వేసిన శిక్ష. వలస పాలకుల రాక్షస ప్రవృత్తికి తిరుగులేని నిదర్శనం. అసలు సావర్కర్‌ ‌చేసిన నేరాలు (1909 చట్టాన్ని ధిక్కరించడం, నాసిక్‌ ‌కలెక్టర్‌ ‌జాక్సన్‌ ‌హత్య కుట్ర, ఉద్రేకపూరిత ప్రసంగాలు) ఏమిటి? అందుకు రెండు జీవితకాలాల కారాగారం. ఇవే నేరాలకు ఇంత శిక్ష పడిన మరొక భారతీయుడు కనిపిస్తాడా? ఇది కక్ష సాధింపు. యాభయ్‌ ఏళ్ల శిక్ష ఏమిటసలు? అది అంతర్జాతీయ సమాజం ఎదుట ఫిర్యాదు ఉండగా కూడా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆదరాబాదరా విచారించి వేసిన శిక్ష. విజ్ఞత, దేశంలోని నాటి పరిస్థితులు, ఆ కాలంలో నిండు చైతన్యం కలిగిన మనిషి అవసరం, జీవితం విలువ తెలిసిన వారు ఎవరైనా ఐదు దశాబ్దాలు కారాగారంలో ఉండిపోవాలని అనుకుంటారా? దేశ సేవాతత్పరతతోనే జైలుకు వెళ్లినవారు అలా అనుకోవలసిన అవసరం ఏమిటి? ఆ నేపథ్యంతో క్షమాభిక్షకు అర్జీలు పెట్టినందుకు ఒక మహనీయుడిని సదా అవమానించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తినీ, దీనిని మౌనంగా భరిస్తున్న ఆయన పార్టీని ఏమనాలి? ‘భాయి’ అంటూ ఒక లేఖలో గాంధీజీ సంబోధించిన వ్యక్తి సావర్కర్‌. ‌భారత గణనీయ పుత్రుడు అంటూ ఇందిరాగాంధీ గౌరవించిన వ్యక్తి వీర్‌ ‌సావర్కర్‌. ‌కానీ ఆ కాలం, ఆ పరిస్థితులు, ఆ పరిస్థితులలో ఒక సమరయోధుడి విజ్ఞాపనను ఆ కాలం వారు అర్ధం చేసుకున్నట్టు వర్తమాన సమాజంలో బతుకుతున్న వ్యక్తి ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారన్నదే ప్రశ్న. హక్కుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్న కాలంలో కూడా వలస పాలకులను క్షమాభిక్ష కోరాడంటూ రాహుల్‌ ఆ ‌మహనీయుడి చరిత్ర మీద నిరంతరం బురద చల్లడం, సదా వేలెత్తి చూపడం అజ్ఞానానికి పరాకాష్ట. ఇది గతంలోని బాధితుల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్న కాలమని రాహుల్‌కు తెలియదా?

కసబ్‌ను, యాకూబ్‌ ‌మెమన్‌ను, నక్సలైట్లను క్షమించి వదిలిపెట్టాలని దేశంలో గగ్గోలు పెట్టే మూకలను అంటకాగే రాహుల్‌ ‌గాంధీకి సావర్కర్‌ ‌క్షమాభిక్ష కోరడం ఘోర తప్పిదంలా ఎందుకు కనిపిస్తున్నది? దీనికి మొదటి కారణం సావర్కర్‌ ‘‌హిందుత్వ’ ప్రబోధకుడు కావడమే అనుకోవాలి. ఇక్కడ మేం హిందుత్వ ప్రస్తావన తీసుకురావడం అప్రస్తుతం కాదని మనవి. సూరత్‌ ‌కోర్టు తీర్పు గురించి స్పందిస్తూ రాహుల్‌ ‌సోదరి ప్రియాంక మాటలు గుర్తు చేసుకోవాలి. నిరంతరం గాంధీ-నెహ్రూ వారసులమంటూ మమ్మల్ని విమర్శించేవారు, రాముడు అలా వారసత్వంగా అధికారంలోకి వచ్చినవారు కాదని అనగలరా? అని త్రేతాయుగాన్ని మోసుకొచ్చారు. నిజానికి తనకే కాదు, రాజకీయ ఖైదీలందరికీ క్షమాభిక్ష పెట్టడం న్యాయమని చెప్పినవారు సావర్కర్‌. ఆయన అండమాన్‌ ‌వీడి వచ్చి విలాసవంతమైన జీవితం గడపలేదు. రత్నగిరి జిల్లాకు పరిమితమై గొప్ప సంఘసంస్కరణోద్యమాన్ని నిర్మించారు. 1942 తరువాత మరొకసారి ఉద్యమించారు కూడా. అయినా చౌకీదార్‌ ‌చోర్‌ ‌హై అన్న వ్యాఖ్యతో సాక్షాత్తు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన వ్యక్తే క్షమాపణలు ‘చెప్పడు’ అంటూ గొంతు చించుకోవడమే పెద్ద దగా.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram