– సుజాత గోపగోని, 6302164068

బీఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ దర్యాప్తు సంస్థ వస్తుందో, ఎవరికి నోటీసులు ఇస్తారో, ఎవరిని అరెస్టు చేస్తారో అన్న చర్చ కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఎవరినీ స్థిమితంగా ఉండనీయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసుకు సంబంధించి ఈ పరిస్థితి నెలకొంది.

ఢిల్లీ మద్యం స్కామ్‌ ‌కేసులో ఫిబ్రవరి 26న కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని అనూహ్య ఘటన జరిగింది. ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసోడియాను సీబీఐ అరెస్ట్ ‌చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీలో సిసోడియా ముఖ్యనేత. అంతేకాదు, ప్రభుత్వంలోనూ ఆయనది కీలక పాత్ర. సీఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌తర్వాత స్థానం ఆయనదే. అయితే, సీబీఐ మాత్రం ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏమాత్రం ఆలోచించ లేదు. మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించింది.

సిసోడియా అరెస్ట్ అయితే.. తెలంగాణలో ప్రభుత్వ పెద్దలకు భయమెందుకన్న ఆలోచన సహజమే. కానీ, లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి ఢిల్లీలో తీగలాగితే డొంకలన్నీ తెలంగాణలోనే కదులు తున్నాయి. ఆంధప్రదేశ్‌కూ లింకులు బయట పడ్డాయి. ఇప్పటివరకు ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఐదుగురు అరెస్టయ్యారు. అంతేకాదు, అసలు ఈ స్కామ్‌కి సంబంధించిన వ్యవహారమంతా తెలంగాణ నుంచే జరిగిందన్నది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌, ‌సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌చెబుతున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లు అన్నింటిలో ఈ సంకేతాలు బయట పడ్డాయి. ఇక ఈ కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచడంతో తర్వాత ఏం జరుగుతుందో! అని బీఆర్‌ఎస్‌ ‌వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. స్కామ్‌కు కేంద్ర బిందువుగా చెబుతోన్న సౌత్‌ ‌లాబీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ నడిపించారని మొదటి నుంచి ప్రచారం జరుగు తోంది. ఈ స్కామ్‌లో ఇప్పటివరకు 12 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ ‌చేశాయి. గతంలో ఎమ్మెల్సీ కవితను ఈ స్కామ్‌లో సాక్షిగా సీబీఐ విచారించింది. కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారి రిమాండ్‌ ‌రిపోర్టులు, దాఖలు చేసిన చార్జ్‌షీట్లలో కవిత పేరు ప్రస్తావించారు. స్కామ్‌ ‌సమయంలో కవిత పలు ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఆప్‌ ‌నేత విజయ్‌ ‌నాయర్‌ ‌ద్వారా సౌత్‌ ‌లాబీ సిసోడియాకు వంద కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి.

ఈ కేసులో మొదటగా మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారికి సహకరించిన వారినీ అరెస్టు చేశారు. ఆడిటర్లను, ఢిల్లీ ఎక్సైజ్‌ అధికారులను కూడా అరెస్టు చేశారు. చార్జిషీట్లలో ఇప్పటి వరకూ 15 మంది పేర్లను పేర్కొంటే.. వారిలో మెజారిటీ నిందితులు ఇప్పటికే అరెస్టయ్యారు. తాజాగా మనీశ్‌ ‌సిసోడియాను అరెస్టు చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఆయన పేరు చార్జిషీట్లలో ఎక్కడా లేదు. అయినా.. విచారణ పేరిట ఆయనకు నోటీసులు జారీచేసి పిలిచిన సీబీఐ.. తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేసింది. మరి, కేంద్ర దర్యాప్తు సంస్థల తదుపరి లక్ష్యం ఎవరన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే, ఇప్పటిదాకా ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఎవరిపై చార్జిషీటు దాఖలు చేసినా అందులో తప్పనిసరిగా సౌత్‌ ‌గ్రూప్‌ ‌తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడైన సమీర్‌ ‌మహేంద్రుపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌నేతలకు వణుకు పుట్టిస్తోంది. 181 పేజీలతో దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును 28సార్లు ప్రస్తావించారు. అసలు ఈ స్కామ్‌ని తెరవెనక ఉండి నడిపించింది కవితే అనీ.. తెరపైన ఉన్నది సమీర్‌ ‌మహీంద్రు అని ఈడీ మొదటినుంచీ వాదిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తదుపరి లక్ష్యం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో రాబిన్‌ ‌డిస్టిలరీస్‌ ‌డైరెక్టర్‌ అభిషేక్‌ ‌బోయిన్‌పల్లిని అరెస్టు చేశారు. ఆయనకు, కవిత కుటుంబంతో బంధుత్వం ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కే చెందిన రాబిన్‌ ‌డిస్టిలరీస్‌ ‌మరో డైరెక్టర్‌ అరుణ్‌ ‌రామచంద్ర పిళ్లైని అరెస్టు చేశారు. సమీర్‌ ‌మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ ‌కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టు బడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చి బాబును ఇటీవలే అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌ ‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్‌ ‌తదితరు లనూ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కవిత, శరత్‌చంద్రా రెడ్డిలతో కూడిన సౌత్‌ ‌గ్రూప్‌ ‌ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల తరఫున విజయ్‌ ‌నాయర్‌ ‌స్వీకరించారని ఈడీ తెలిపింది. ఈ గ్రూపునకు అభిషేక్‌ ‌బోయిన్‌పల్లి, అరుణ్‌ ‌రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని వివరించింది. రాజకీయ నాయకులు తమ పేర్లను బయటకు రాకుండా ఉంచడానికి బినామీలను ప్రయోగించారని స్పష్టంచేసింది. సౌత్‌ ‌గ్రూప్‌లోని అందరినీ సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. తాజాగా, చార్జిషీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను కూడా సీబీఐ అరెస్టు చేసింది. వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సాక్షిగా కవితకు 160 సీఆర్‌పీసీ కింద డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి.. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే 7 గంటలకుపైగా విచారించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ, ఇప్పటివరకు కవితను మళ్లీ ప్రశ్నించ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె ఇచ్చిన సమాచారం, అంతకుముందు, ఆ తర్వాత అరెస్టు చేసిన వారు ఇచ్చిన వివరాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. విచారణ అనంతరం సీబీఐ అధికారులు అవసరమైతే కవితను అరెస్ట్ ‌చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి, ఢిల్లీ మద్యం కేసులో జరుగుతున్న వరుస పరిణామాలు కవితకు ఇబ్బందికరంగానే మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తీగ లాగితే..

ఈ కేసు దర్యాప్తులో మొదటినుంచీ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీశ్‌ ‌సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అక్రమాలు జరిగాయని వెల్లువెత్తిన ఆరోపణలపై మనీశ్‌ ‌సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై గత ఏడాది ఆగస్ట్ 19‌న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ స్కామ్‌లో కోట్లాది రూపా యలు చేతులు మారాయని ఎన్ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌లోతుగా దర్యాప్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న లిక్కర్‌ ‌పాలసీ అక్రమ సంపాదనకు ఊతమిచ్చిందనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారాయనే ఆరోపణలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఢిల్లీ లిక్కర్‌ ‌వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వినయ్‌ ‌కుమార్‌ ‌సక్సేనా ఆదేశాలతో ఎన్ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌, ‌సీబీఐ అధికారులు రంగంలోకి దిగిన దగ్గర నుంచి సిసోడియా అరెస్టు వరకు ప్రతీది సంచల నంగా మారింది.

ఢిల్లీ లిక్కర్‌ ‌పాలసీలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరి గాయని.. నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించిందన్న ఆరోపణలున్నాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ప్రభుత్వానికి సిసోడియా 145 కోట్ల రూపాయల నష్టం కలిగించారని.. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ. 145 కోట్లను కొవిడ్‌ ‌పేరుతో ఏకపక్షంగా ఆప్‌ ‌ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇక సిసోడియా అనుచరుడు దినేష్‌ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించి నట్లు సీబీఐ ఎప్పుడో గుర్తించింది. రిటైల్‌ ‌వెండర్లకు క్రెడిట్‌ ‌నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. కవిత, మాగుంట రాఘవ్‌, ‌శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌‌గ్రూప్‌.. ఈ ‌స్కామ్‌లో కీలకంగా ఉందని దినేశ్‌ అరోరా విచారణలో సందర్భంలోనే చెప్పిన విషయాన్ని ఈడీ ప్రస్తా వించింది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram