వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– మద్దిలి కేశవరావు

ఇయ్యాల పోలాల అమాస. నాను ఎక్కడ వున్నా, ఎలా వున్నప్పటికీ దసరాకి మావూరు ఎల్లాల్సిందే. దసరాకి తొమ్మిది దినాలు ముందే పోలాల ఆమాసకి మావూరు పొలిమేరలో వుండి కాపుకాసే గేమ దేవత అసిరిపపోలమ్మను బారికి మేలం, అగ్గి దిమిటీలతో వూర్లోకి తెచ్చి దసరా వరకు మావూరు నడిబొడ్డున వున్న నాయుడు గారింట్లో పెట్టి పూజిత్తాం. ఇది మా తాతలు, ముత్తాతలు దగ్గర్నుంచి వత్తున్న ఆచారం. ఉపుడు నా వయసు రమారమి ఎనిమిది పదులు దాటుతున్నాయి. ఒకప్పుడు ఉద్దానం ఏరూ… ఉపుడు ఉద్దానం ఏరు. వరుసపెట్టి గాలోనలు, సీడ పీడలతో ఉద్దానం అద్దానమైపాయింది. మాబోటి రైతులు అప్పులపాలై దేశాలు పట్టేసినారు. అందులో మాయదారి పులక జబ్బుసేసి మాసానికో సేవం సొసానంలో కాలి బుగ్గావ్వాల్సిందే. మా ఇంటి ఆడది సచ్చిపాయినాక నాను ఎంత ఒద్దని బతిమలాడినా నా కొడుకు, కోడలు మాత్రం బలవంతాన ఇసాకపట్నం తీసుకెల్లిపోయారు. ఇరవై సమ్మస్సరాలు నుంచి ఇక్కడే వుంతున్నాను. అందుకే పండక్కో, పబ్బానికో వూరు సూసినట్టు, బందువులు, ఇరుగు,పొరుగు వార్ని కలిసివున్నట్టూ వుంతాదని పాతికేళ్ల మనమడ్ని తోడెట్టుకొని వత్తుంటాను. వచ్చే ఏడాది ఈ దినానికి నాను ఉంతానో, పోతానో తెల్దు గానీ… ఈ దసరా వారం దినాలు మాత్రం నాను పుట్టి, పెరిగిన ఉద్దానంలో గడిపెయాలని వత్తున్నా.

ఆపసోపాలు పడి నా మనుమడితో లింకు బసులో మా వూరు పెద్ద సావుకారి దుకాణం వద్ద దిగాను. అప్పటికే సిన్నపాటి సినుకులు పడుతున్నాయి. వూరు నాయుడోలు ఇంటికాడ బారికి మేలం దరువు నా సేవిలో పడగానే ఒక్కసారి ఒళ్లు జలదరించింది. ఉన్నపలంగా కాల్లు అటే లాగేసాయి. అమ్మోరు జంగిడిని తలమీద పెట్టుకొని జన్ని పూజారి వూరు పొలిమేర దాటుతున్నాడు. పూజారి ఎనకే సిన్నా, పెద్దా తేడా లేకుండా నడుత్తున్నారు. నాను కూడా నా మనమడ్ని తోడెట్టుకొని మూడు గోర్జీల సంది వరకు ఎల్లినాను. అక్కడకు ఎళ్లగానే నా కాలుకు బందాలు పడిపోయినట్లు నిలబడిపోయాను. పదడుగుల దూరంలో రెల్లసెట్టు, దానికింద తాటికమ్మల గుడిసెలో బారికి కామయ్య తాత, బారికమ్మల రాయి బొమ్మలు. ఉప్పుడే జన్నిపూజరి ఆముదం దీపం ఎలిగించినట్లు వున్నాడు. ఆ దీపం ఎలుతురులో ఆ జత ఇగ్రహాలు దగదగా మెరిసిపోతు న్నాయి. బారికమ్మ ఇగ్రహానికి నింపుగా పసుపురాసి, నుదుటన పది పైసాల బిల్లంతా ఎర్రటి కుంకుమ బొట్టు. బారికి తాత ఇగ్రహం సూస్తే ఒళ్ళు పులుము కుంది. సేతిలో ఎదురు దుడ్డుగర్ర, పెద్ద మీసాలు, తలకు తలపాగాతో బయంకరంగ వున్నాడు. రెండు సేతులు జోడించినాను.

‘బారికి తాత…మా వూరును, మమ్మల్ని సల్లగా సూడు’ ఆని మొక్కినాను. మావోడికి దండం పెట్టమన్నాను. కానీ ఆడు పర్వలేదన్నాడు. రాతి బొమ్మలకి దండం పెట్టడం ఏంటి తాతా అని నాతో ఎలాకోలం ఆడినాడు.

‘ఒరేయ్‌…అవి రాతి బొమ్మలు కావురా… మనందరినీ కాపుకాసే పేణం లేని, దేవుడు సేసిన రాతి మనుసులు’ అని సెప్పినాను. మా వోడు ఓ సిన్నపాటి సిరినవ్వు నవ్వి

‘ఇంతకీ ఇవి ఎవరి రాతి బొమ్మలు తాతా..?!’ అంటూ ఆ రాతి బొమ్మలు గురించి తెల్సుకోవాలని నన్ను పెశ్నించాడు.

‘మనూరు బారికి కామడు, అతని బార్య బారికమ్మ ఇగ్రహాలు’

‘ఇంతకీ బారికి అంటే ఎవరు తాతయ్య…?’ అని అడిగాడు.

‘బారికి అంతే…. వూరిని కాపలా కాసేవాడు అని అర్థ్ధం’ అని సెప్పినాను మనవడికి.

‘ఓహో…అలాగా తాతయ్య, ఇంతకీ వూరును కాపలా కాసేది ఎవరు తాతయ్య…?’

‘అదేరా..అమ్మోరు దగ్గర డప్పు కొడుతుంటారు కదా… అల్లే’ ఇంకా ఇడమరుసి సెప్పాలని ఇట్టం లేక.

‘ఓహో.. మాలోలా…?!’

‘నోర్ముయ్యార ఎదవా… అలా కులం పేరెట్టకూడదు తెలీసా..? కూటికి నేకపోయినా.. కులానికి తక్కువైనా ఆలు సత్తిమైన మనుషులు. అందరూ అల్లని ముద్దుగా ‘బారికి’ అని పిలుత్తూ ఉంతారు’. అని ఆల్లకు, మాకు వున్న సంబందాన్ని గొప్పగా సెప్పినాను.

‘వూరికి దూరంగా ఉన్నోళ్లకి రాతి బొమ్మలు చేసి పూజిస్తున్నారు అంటే వాళ్ల గొప్పతనం తెలుసు కోవాల్సిందే తాతయ్య’ అంటూ మా వాడు నన్ను కోరడం సంతోసంగా వుంది. ఎక్కడో పట్టనాల్లో సదివే ఇయ్యాల్టి కుర్రోళ్లు పల్లె మట్టి వాసన పసిగట్టలేక పోతున్నారు.

‘నాకు అపుడు పన్నెండేళ్ల  వయసు. కర్ణమొలు కొమరయ్య అంతే మనూరుతో పాటు సుట్టు పక్కల పెజానీకానికి మోతుబారి రైతు.

కర్ణం బాబు సెప్పిందే యాదం. ఆడదాని మీన మనసుపడితే… కొమరయ్య ముందు కొంగు సాపాల్సిందే. ఆయన మాటకు ఎదిరెల్లినోడు తెల్లారేసరికి కాముటోడు సెరువులోన సెవమై తెలాల్సిందే. ఆ రోజుల్లో అలా వుండేది ఆయన పలుకుబడి. దసరాకు తొమ్మిది దినాలు ముందు వచ్చే పోలాల ఆమాసనాడు వూరు వూరంతా పిండి ముగ్గులు, ఏప కొమ్మలు, మామిడి తోరణాలతో  గేమ దేవత అసిరి పొలమ్మ తల్లి రాకకోసం సందడి సేత్తున్నారు. పొలిమేర నుంచి వచ్చే అమ్మోరమ్మకు వూరికి దూరంగా.. తూరుపు కొసాన వున్న మాలీదిలోనే తొలిపూజ. వూరికి కాపలా కాసే బారికి కామడు ఇంటోల్లే జన్ని పూజారికి పసుపు నీటితో కాలు కడగాలి. ఆ తర్వాతే వూరందరూ అమ్మోరు తల్లికి కాళ్లుకడగడం, పూజలు సెయ్యడం పూర్వం నుంచి వత్తున్న ఆచారం.

ఆ దినం రానే వచ్చింది. బారికి గురవడు సొన్నాయి పది కోసుల దూరం వరకు ఇనిపిత్తూవుంటే… బారికి కామడు పెద్ద తుడుమూ, బారికి ఎర్రిగాడు, మేకుడు వూజి కుండలను దమాయించి కొడుతున్నారు. అమ్మోరు ఇగ్రహం తలపై తులిసి కొమ్మల మద్య వున్న పొకచెక్క ఎవరి సేతుల మీన పడితే ఆళ్లకు అదృష్టమం కలిసొస్తుందని మా వూరోల్ల నమ్మకం. అందుకే కర్ణం కొమరయ్య తో పాటు సేనా మంది గేమస్తులు అమ్మోరు ముందు సెయ్యి సాపినారు. ఏమీ సిత్రమో గానీ.. అమ్మోరు పోక దలాయి సొట్ట మిత్తయ్య సేతిలో పడింది. అప్పుడే కర్ణమోలి కొమరయ్య మొకము వాలిపోయింది. వూరంతా అమ్మోరు మీన అక్షింతలు సల్లి దండమొక్కినారు. జన్ని పూజారి అమ్మోరు జంగిడిని నెత్తిమీద పెట్టుకొని ఒక్క ఉదుటున మాలీది పొలిమేర సేరుకున్నాడు. అప్పటికే రౌలీది ఒంపులో ఆముదం కర్రలకు మట్టి సమురు, కొబ్బరి నూనెతో తయారు సేసిన అగ్గి దిమిటీలతో అమ్మోరుకు సోగతం పలికారు.

అప్పటికే బారికి కామడు పెళ్లం అవు పేడతో సక్కగా అలికి ముగ్గులువేసి, ఆరతి పల్లెంతో అమ్మొరుకు ఎదురుగా నిలబడింది. తెల్లటి సీర, నుదుటన ఇరవై పైసాల బిల్లంత ఎర్రటి సిందూరం బొట్టు… ముఖానికి రాసుకున్న పసుపుతో బారికమ్మ అచ్చం అమ్మోరమ్మ తల్లిగానే మాకందరికీ అగుపిత్తుంది. నలబై ఏళ్లు కూడా దాటని బారికమ్మకు పిల్లలు లేరు. ఎప్పుడూ వూరమ్మోరునే కొలుత్తా వుంటాది. అందుకే వూరందరు బారికమ్మను సెల్లిగా పిలుస్తుంతారు. అమ్మోరుకు ఆరతి ఇచ్చిన బారికమ్మ కొబ్బరి బురికిలో నిండా ఎర్రటి అగ్గి నిప్పులు వేసి, అందులో గుగ్గిలంతో జన్నిపూజారికి దూపం వేసింది. అమ్మోరికి నైవేద్యంగా పాయసం పెసాదం పెట్టిందో లేదో….బారికి మేళం సప్పుడికి పూనకం వచ్చేసినాది. ఒంటిమీన బట్ట కానకుండా వూగిపోయినాది. మాలీదికి సెందిన ఆడోల్లు బారికమ్మను ఆపడానికి ఎంత పయత్నించినా వారి వల్ల సేతనవ్వలేదు. జన్ని పూజారి బారికమ్మ తలపై సేయ్యేసి,పసుపు బొట్టు పెట్టగానే తెలివి తప్పిపోయి కొమరయ్యపై వాలిపోయింది. అప్పటికే బారికమ్మ అంద సందాలు సూసి సొంగలు కారేసుకుంతున్న కొమరయ్య మీద పడటంతో ఇంకా కామంతో రగిలిపోయాడు. అమ్మోరు జంగిడి ముందుకు కదిలింది. కానీ కొమరయ్య మాత్రం మాలీది మూలనే మంగడితో వుండిపోయాడు. పాడుబుద్ది ఆలోసనలతో కొమరయ్య  ఉక్కిరబిక్కిరైపోతున్నాడు. ఇతగాడు వాలకం సూసిన మంగడికి అర్థమైపోయింది.

‘అయ్యా… అమ్మోరు వూర్లోకీ ఎల్లిపోతుంది.. పదండి ఎల్దా’ మంగడు మెల్లగా అన్నాడు.

‘ఒరేయ్‌ ‌మంగా….’

‘ఎంటి అయ్య గారూ…?!’

‘ఆ బారికి కామడు పెళ్లాం ఏంట్రా అంత బాగుంది. ఎప్పుడూ దూరం నుంచే సూసినొడ్ని… ఇయ్యాలేన్రా దగ్గరగా.. అబ్బో దానెమ్మ బారికిదాయి అయిStone menతేనేం సిలక సక్కగానే వుందిరోయ్‌’ ‌నవ్వుతూ కొమరయ్య మీసంపై సెయ్యేసి అన్నాడు.

‘అయ్యా..మీబోటి వారికి తగదయ్యా… ఆలు బారికోలు…తక్కువ జాతికి సెందిన వారు… మీరు మహారాజులు ‘ అన్నాడు మంగడు.

‘నూర్మియ్యోసే తొత్తి కొడకా…నానొదిలేసిన ఎంగిలి మెతుకులు తిన్నొడివి నాకే నీతి కబుర్లు సెప్తావా…?!’ అంటూ కొమరయ్య కల్లేర్ర జేసినాడు.

మంగడికి అర్థమైపోయింది. వెంటనే సుట్ట ఎలిగించి కొమరయ్య నోట్లు పెట్టాడు. సిన్న వెకిలి నవ్వు నవ్వుతూ కొమరయ్య గుప్పు గుప్పుమంటూ సుట్ట పొగను బయటకు ఇడిసిపెడుతూ బారికి కామడు ఇంటిదుక్కు దారితీసినాడు.

మాలీది మూల తాటి కమ్మల గుడిసె బారికి కామడు ఇల్లు. మట్టి గోడలు… అరుగు వరకు కిందకు ఏలబడిన తాటికమ్మల పంచ. ఇంటి లోపల ఓ మూల గూటిలో మిసుకు మిసుకుమంటూ ఎలుగు తున్న మట్టి సమురు దీపం. మంగడ్ని పంచలోపే వుండమన్నట్టు సైగసేసి కొమరయ్య బారికమ్మ వున్న ఇంట్లో దూరాడు.

పుట్టెడు వుపాసంతో వున్న బారికమ్మ ఈత సాపమీన ఎల్లకిలా పడుకొనివుంది. పైట సెంగు వున్న జాగాలో లేకపోగా…సీర మోకాలి పిక్కలు వరకు ఎగిరిపోయి వుంది. మట్టి సమురు దీపం ఎలుతురులో బారికమ్మ అందాలు పిండారబోసిన ఎన్నిల్లా కొమరయ్యకు కనిపిచ్చింది. ఆగనేక పోయాడు… అమాంతంగా బారికమ్మ మీన పడి తన సేతులతో బలంగా తన ఒళ్లోకి  లాగుకున్నడు.

‘వుపాసంతో వున్నాను బావ…. ఎల్లి కాలు, సేతులు కడుక్కొని రా.. పాసిం తింతువు గానీ..’ బారికమ్మ నిద్రమత్తులోనే వచ్చింది మొగుడే అనుకొని సేపుతోంది.

తన ఒళ్లు అంతా హూనం కావడంతో పాటు సుట్ట పొగ వాసన ఎక్కువగా వత్తుండటంతో నిద్రమత్తులోనే కళ్లు తెరిసి సూసింది బారికమ్మ.

తనపై ఎవరో బారీ మనిషి వున్నాడు. గట్టిగా అరవాలని సూసినా సాద్యం కాలేదు.

కల్లతో ‘వద్దు బాబు..’ అని బతిమాలడినా కనికరించని కొమరయ్య కామపిశాసం ముందు తప్పించుకోవాలని సూసిన బారికమ్మకు సాద్య పడనేదు.

ఇంతలో తుడుం కుండ పట్టుకొని బారికి కామడు ఇంటికి రావడం గమనించిన మంగడు మద్దిలోనే ఆపేసాడు.

‘అదేటిరా మిత్తయ్యా….మా ఇంటి ముందు తచ్చాడుతున్నావు..?!’ అనుమానంగా అడిగినాడు మంగడని కామడు.

‘నీకోసం కలడానికి కర్ణం బాబు వచ్చడ్రా….’ మంగడు కటువుగా సెప్పాడు.

‘నాకోసం ఎపుడూ లేనిదీ ఇయ్యాల కర్నం బాబు రవడమా…నాకేదో అనుమాన ఐతందిరా మిత్తయ్య….’ ఆందోలన సెందినాడు కామయ్య.

 ఒక్క ఉదిట్న గడపలోకి ఎల్లిన కామయ్యకు ఇంట్లో జరుగుతున్న తంతు సూసి ముచ్చెమటలు పట్టేసినాయి. ఏమీ సేయ్యాలో పాలుపోక తుడం కుండతో కర్ణం కొమరయ్య బుర్రమీద బలంగా బాదాడు. మట్టి కుండ కావడంతో పది బక్కలై పాయింది. కొమరయ్య బుర్ర నుంచి రక్తం జరజరా కారింది.

మంగడు ఎనకనుంచి వచ్చి కామడు పీకకు తువ్వాలు తగిలించాడు. అటు కర్ణం… ఇటు మంగడు పట్టుకు బారికి కామడు పేనం గాల్లో కలిసిపోయింది.

‘అయ్యా…. కామడు పేనం పోయినట్టుంది…’ అనుమానంగా అన్నాడు.

‘ఈ ముండ పేనం కూడా ఎప్పుడో పోయిందిరా మంగా.. మోజు తీరకపోయి, శవంతో సరసమాడినాను…’ అంటూ కొమరయ్య మూలన ఎలుగుతున్న మట్టి సమురు దీపానికి సుట్ట ముట్టిత్తూ ఎటకారంగ నవ్వాడు.

‘ఈ సేవాల్ని ఏటి సేత్తం బాబు…?’ మంగడి అనుమానంగా అడిగాడు కొమరయ్యను.

‘ఏటి సెయ్యడము ఏంట్రా….తెల్లారేసరికి కాముటోడి సెరువులో సెవాలే కదా…. ముందు పదా…నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి, తర్వాత నీ పని సూడు’ అంటూ బయటకు వచ్చారో లేదో బయట మేగం దట్టంగా మారిపోయింది. ఎంటనే గాలోనతో వర్సం పేరంబమైంది. కరణం కొమరయ్య, మంగడు వాళ్ల ఇంటికి సేరుకునారు.

సెవాల్ని సెరువులో ఏసెందుకు కూడా సమయమియ్యకుండా ఎడతెరిపి లేకుండా వర్సం కురుత్తుంది. తెల్లారే సరికి ఏ కొంప మునుగు తుందొనని మంగడు ఆందోళన సెందుతున్నడు. కొమరయ్య మాత్రం తన ఇంట్లో కునుకుతిత్తున్నాడు.

తెల్లారింది… రాత్రి కురిసిన వర్సానికి బారికి కామడు మట్టిల్లు కూలిపోయిందని, వాటికిందే ఇద్దరు మొగుడూ, పెళ్లాలు వుండిపోయినారని వూరు వూరంతా గుప్పుమంది. మంగడికి ఏదో అనుమానం వొచ్చి కొమరయ్యతో ఆ మాటే కదిపాడు. కొమరయ్య సిన్నగా నవ్వుతూ….

‘నిన్ను నమ్ముకుంతే నా పేనాలికే పెమాదమని ముందే గేహించి నా పని నాను సేసినాన్రా మంగా….’ కొమరయ్య మాటలకు మంగడులో వున్న బయం తొలిగిపోయింది.

‘సెవాలు తియ్యండ్రా… వూరోల్లు వంటలు సేసుకోవద్దా అని కరణం బాబు మీకు సెప్పమన్నాడు’ అంటూ మంగడు తాటి కమ్మల గొడుగేసుకొని మాలీది బారికి గురవడికి, ఎర్రిగాడికి సెప్పుతున్నడు.

‘సూత్తున్నవు కదా మంగ మిత్తయ్య…. సెవాలు ఎలాగ తీత్తాము..? వర్సం తగ్గదు… తగ్గినాక తీత్తాం. ఆ మాటే సెప్పు ఎల్లు..’ అంటూ గురవడు బాధతో సెప్పాడు.

‘సరి సరే..మీ ఇట్టం..’ అంటూ మంగడు అక్కడ నుంచి ఎల్లిపాయినాడు.

వర్సం ఏ మాత్రం తగ్గలేదు సరికదా… కాముటోడి సెరువుకు గండి పడింది. వరద నీరు వూర్లోకి వచ్చేసింది. అప్పుడే వునిసిన వరి తుబ్బులు మీదకు లేసిపోయినాయి. వరదకు మట్టిల్లు కూలిపోతుంటే… బయంతో సేనామంది పెజలు కార్జిగారింటి అరుగుమీనకు సేరుకున్నారు.

 ‘తినడానికి తిండి గింజలు లేకుండా సేసింది పాడుముండ వర్సం’ అంటూ సేనా మంది సేపనార్దలు పెడుతున్నారు. దయగల కార్జిగారు కాదనకుండా గడపలోకి వచ్చిన వారికి రెండు పూటలా తిండి పెడుతున్నారు. వూర్లోకి వచ్చిన అమ్మోరుకు ఐదు దినాలు అవుతోంది.. దూప,దీప,నైవేద్యాలు పెట్టే నాదుడే లేడు.

‘మాకే తినడానికే తిండి లేదు…అమ్మోరుకు నైవేద్యం అంటే ఎట్టా…?!’ అంతున్నారు కొంతమంది గేమ రైతులు. జన్ని పూజారి మాత్రం అమ్మోరును ఒదల్లేక కార్జిగారింటి నుంచే…ఏదో బెల్లమో, సీనో, మిఠాయో తెచ్చి పెసాదం పెడుతున్నాడు పాపం.

‘అయ్యా… అయిదు దినాలైతుంది. బారికీదిలో సెవాలు మట్టి గోడలు కింద అలానే వున్నాయి. అమ్మోరుకు బోగమూ…రాగమూ లేకుండా పోయినాయి రెండు రోజులు ఇలానే వుంటే కొబ్బరి సెట్లు కూడా పడిపోయే అవకాసం వుందయ్యా… వూరు పెద్దలు అలోసించండి.’ జన్నిపూజారి గేమ పెద్దలు ముందు తన ఆవేదన సెప్పాడు

‘దీనికి మనం ఎవ్వరం ఏమీ సేత్తం జన్నీ… మన సేతిలో ఏముంది…?!’ ఓ పెద్దమనిసి మాట ఇది.

‘ఎక్కడో తప్పు జరిగిందయ్యా…లేకపోతే అమ్మోరుకు కోపం రాదు. అటు తాను తినక..ఇటు మనకి తిండి పెట్టక అమ్మోరు పరీక్షిస్తుంది’ అన్నాడు జంకుతూ జన్ని పూజారి.

‘నీ అలోసన ఏటో ముందు సెప్పూ…తర్వాత అలోసిద్దాం..’ అన్నాడు మరో గేమ పెద్ద.

‘బాబూ ..నాను అమ్మోరుకు దండకం పొత్తా… సత్తిమైన అమ్మోరు అయితే సెబుతుంది..’

‘ఏడిసినట్టు వుందోయ్య జన్నీ నీ యవ్వారం. పదండి… పదండి… ఈ జన్ని పూజారికి పనీ పాట లేనట్టుంది, అందర్నీ పోగేసి పుక్కిట పురాణం సెప్తున్నాడు.’ అంటూ కర్ణం కొమరయ్య రుసరుసలాడుతూ అక్కడ నుంచి కదిలాడు.

కొంతమంది మాత్రం జన్నిపూజారి మాటకే మోగ్గు సూపినారు.

బయట ఉరుములు, మెరుపులతో వర్సం దంచి కొడుతుంది. నాయుడు ఇంట్లో జన్నిపూజారి అమ్మోరుకు దండకం పోత్తున్నాడు. అరుగుల మీన పెద్దలు కుర్సోని వుంటే…బయట తాటి కమ్మల గొడుగుల్లో పెజలు అమ్మోరు దండకాన్ని ఇంటున్నారు. ఉన్నట్టుండి నాయుడు గారి సిన్న కూతురు నాయురాలు పూనకంతో వూగిపోయింది.

‘ఈ ఆపద నుంచి మా వూరును గట్టెక్కించా లమ్మా..’ అంటూ పెజలంతా ఏడుకుంతున్నారు. మరికొంత మంది నాయరాలు  మీద కుండలతో పసుపు నీరు పోత్తున్నారు.

జన్నిపూజారి నాయురాలు తలపై ఏప కొమ్మలు వుంచి సెప్పాలంటూ ఏడుకున్నాడు… పెజల్ని కాపాడాలంటూ పేర్ధించాడు.

నాయురాలమ్మ గట్టిగా ఏడుత్తూ ‘నన్ను నమ్ముకున్న పేనం పోయింది… నాకు తొలిపూజ సేసే బారికమ్మ, నన్ను ఆడించే బారికి కాముడు లేకుండా పోయారు…’

అంటూ అమ్మోరమ్మ పలుకులు వినిపిస్తుంది.

 ‘అమ్మా….ఆ పేనాలు నువ్వే తీసేసినావు. మట్టిల్లు కూలిపోయి ఆల్లు సచ్చిపాయినారు. అయిదు దినాలైనా సెవాలు అలానే వున్నయమ్మా..’ అంటూ జన్నిపూజారి ఇంకేదో అడుగుతుండగా నాయురాలు వారించింది.

‘ఆ దంపతులు సచ్చిపోలేదురా… సంపేసారు…

బలవంతంగా సంపేసారు…’ అంటూ నాయురాలు సెప్పడంతో వూరంతా విస్తు పోయినారు… ‘ఎంత గోరం జరిగిపోయింది…. ఎవరా పాపిస్తులు..’ అంటూ గుసగుసలాడుకున్నారు అక్కడున్నవారు.

వారి పేర్లు సెప్పాలంటూ అమ్మోరమ్మను వేడుకున్నారు మరీ కొందరు.

జరిగిన విసయాన్ని అమ్మోరు నాయురాలు మాటలతో పూసగుచ్చినట్లు సెప్పడంతో… వూరు వూరంతా మండిపడ్డారు.

అక్కడే నక్కి అంతా వింటున్న మంగడు పరుగు పరుగున కొమరయ్య ఇంటికి చేరాడు.

ఇక్కడ మాత్రం సిన్న, పెద్ద అన్న తేడా నేకుండా పెజలంతా పరుగు అందుకొని కొమరయ్య ఇంటికి సేరుకున్నారు. కొమరయ్య ఇల్లు గుల్ల సేసినారు.

దొరికినకాడికి బియ్యం, డబ్బు, దనం దోసుకున్నారు.

కొమరయ్య, మంగడు గురించి వెతికారు. ఎవరో సెప్పారు కోమటి సెరువులో రెండు సెవాలు తేలిపోయి వున్నాయని.

వూరంతా జోరు వానలో అక్కడకు సేరుకున్నారు. నిజం తెలవడంతో సెరువులో పడి సచ్చిపోయినారని అనుకున్నారు. పీడ విరగడైందని పొంగిపోయినారు వూరందరూ.

నాయురాలమ్మ పూనకంలో ఇంకేదో సెపుతుందీ…

‘మట్టి గోడలు కింద వున్న బారికమ్మ, బారికి కామడు సెవాలు తీసి వూరు పొలిమేరలో పాన్పు సేయ్యాలని, పాన్పుమీద బారికమ్మ , బారికి కామడు రాతి ఇగ్రహాలు పతిష్టించి పూజలు సెయ్యాలని, నాకు పూజించే ముందు తొలి పూజ బారికి కామడికి, బారికమ్మలకు దక్కితే మీ వూరు, వాడని కాపాడుతాను…’ అంటూ నాయురాలమ్మా పడిపోయింది.

వూరందరూ వరసంలోనే మాలీదికి ఎల్లి కూలిపోయిన మట్టి గోడలు తొలగించినారు. అయిదు దినాలైనా సజీవంగానే సెవాలు వుండటంతో వూరంతా బోరున విలపించారు. ఎడ్లు బండిపై సెవాలు వుంచి వూరేగింపుగా గ్రేమ పొలిమేరలో పాన్పుసేసి, బారికి మేళంతో పాన్పుపై రాతి బొమ్మలు పతిష్టించారు. అంతే… అమాంతంగా వర్సం తగ్గిపోయింది. పెజలంతా సంబరాలు సేసుకున్నారు.

‘ఇక అపుడు నుంచీ వూరందరూ వూరమ్మోరు గుడికి ఏళ్లే ముందు బారికమ్మ, బారికి కామడు రాతి ఇగ్రహాలకు పూజించే ఎళ్తారు. అంతే కాదురా మనవడా… పొలాలకు గానీ, కొబ్బరి తోటలకు అటువైపుగా ఎల్తే… బారికి తాత విగ్రహాలకు దండం పెట్టుకొని వెల్లే అలవాటు వూరందరికీ ఉంది. ఇక పదరా… అమ్మోరు వూరికి రావడానికి సమయం ఆసన్నమైంది…’ అన్నాడు తాతయ్య. వూరు, విగ్రహాల సెరిత్రను తెలుసుకున్న మనవడు బారికి తాత రాతి విగ్రహాలకు దండం పెట్టడు.

 గ్రామ దేవత ఆలయానికి తాతయ్యను తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాడు మనుమడు.

About Author

By editor

Twitter
YOUTUBE