సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌ఫాల్గుణ శుద్ధ చతుర్దశి – 06  మార్చి  2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘ఇది మహాపరాధం, జరిగింది ఘోర తప్పిదమే, వెనక్కి తీసుకోలేని పొరపాటే, క్షంతవ్యులం.. క్షంతవ్యులం’ అంటూ కాంగ్రెస్‌ 85‌వ ప్లీనరీ వేదిక మీద నుంచి క్షణాల మీద వేడుకోళ్లు వెల్లువెత్తాయి. అది తప్పిదమో, మారని కాంగ్రెస్‌ ‌పార్టీ బుజ్జగింపు ధోరణికి నికార్సయిన నిదర్శనమో తేల్చుకోవడం కష్టమేమీ కాదు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు చత్తీస్‌గఢ్‌ ‌రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల ప్లీనరీ జాతర ఆరంభమవుతున్నట్టు అక్కడి దినపత్రికలలో వ్యాపార ప్రకటనలు ఇచ్చింది పార్టీ. ఇందులో తప్పు లేదు కానీ, ఆ ప్రకటనలో చోటు కల్పించిన ఫోటోలలో ఒక వ్యక్తి బొమ్మ కనిపించకపోవడం రౌరవాది నరకాలు పట్టిపోయేటంత పాపం కాదా అంటూ నిలదీశారు మనీష్‌ ‌తివారీ. గాంధీజీ, నెహ్రూ, సర్దార్‌ ‌పటేల్‌, ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌, ‌సుభాశ్‌ ‌చంద్రబోస్‌, ‌లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌, ‌పీవీ నరసింహారావు, సరోజినీ నాయుడుల ఫోటోలు వేశారు. కానీ, దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌ఫోటో వేయనందుకు మనీష్‌కు తల కొట్టేసినట్టనిపించింది. తన ఆక్రోశాన్ని ఆయన దాచుకోలేదు. పత్రికల ప్రకటనలలోనే కాదు, వేదిక వెనకాల అలంకరించిన ఫోటోలలోనూ ఆజాద్‌ అదృశ్యమయ్యారంటూ ఇంకొందరు వాపోయారు. దానికే ఈ క్షమాపణల వరద. మొత్తానికి మనీష్‌ ‌పుణ్యమా అని ప్లీనరీకి ఆజాద్‌ ‌ఫోటో పితలాటకమైపోయింది.

ఇంతకీ మనీష్‌ ఆవేదన అబుల్‌ ‌కలాం ఫోటో కనిపించనందుకా? పటేల్‌, ‌పీవీ ఫోటోల కొత్తగా వచ్చి చేరినందుకా? స్వాతంత్య్ర పోరాట సమయంలో ముస్లింలంతా పాకిస్తాన్‌ ఆలోచన వైపు జారిపోకుండా చూస్తూ, సమైక్య భారత్‌ ‌కోసం పాటుపడిన ఆ వర్గం నాయకులు ఉన్నారు. వారిని మరచిపోతే ఎలా? ఇది ముస్లిం సమరయోధులను చరిత్ర నుంచి మినహాయిస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చి ఆ వర్గం కుమిలిపోదా అంటూ దాదాపు కన్నీటి పర్యంత మయ్యారు మనీష్‌. ‌మాకు మాత్రం బాధ లేదా ఏమిటి? ఆయన (ఆజాద్‌) ‌పార్టీకీ, దేశానికీ ఎప్పటికీ ప్రేరణే. అందుకే అత్యంత నిజాయితీతో క్షమాపణలు కోరుతున్నామని ఆ పార్టీ మేధావి జైరామ్‌ ‌రమేశ్‌ ‌చెంపలు వేసుకున్నంత పనిచేశారు. ఈ తప్పిదం చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా ముక్తాయించారు.

గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టు, రాహుల్‌ ‌మొదట తన పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారిని ఏరేసి, క్షాళన చేయడం అవసరం అంటూ బీఎస్‌పీ ఎంపీ కున్వార్‌ ‌డానిష్‌ ‌మంటను ఇంకాస్త ఎగదోశారు. దీనికి రుజువుగా ఆయన ఆజాద్‌ను విస్మరించిన తాజా ఉదంతాన్నీ, గతంలో సావార్కర్‌ ‌బొమ్మను పార్లమెంట్‌లో ప్రతిష్టించినప్పుడు కాంగ్రెస్‌ ‌నేతలు ప్రణబ్‌ముఖర్జీ, శివరాజ్‌ ‌పాటిల్‌ ‌సమర్థించిన సంగతినీ కూడా గుర్తు చేశారు. పటేల్‌, ‌శాస్త్రీజీ, బోస్‌, అం‌బేడ్కర్‌, ‌పీవీ ఫోటోలు కాంగ్రెస్‌ ‌వేదిక మీద పెట్టడం మరీ ఎబ్బెట్టుగా ఉందంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. ఈ నేతలను గాంధీ- నెహ్రూ కుటుంబం ఎలా చూసిందో జాతి మరచిపోలేదంటారాయన.

సోనియా కాంగ్రెస్‌కు సంబంధించి ప్లీనరీలంటే మళ్లీ అధికారంలోకి రావడం గురించి ఎత్తులు వేయడమే. ఈ ప్లీనరీ తొలి ప్రాధాన్యం కూడా అదే-2024లో మోదీని గద్దె దింపడానికి ఉన్న మార్గాలూ, గాంధీ నెహ్రూ కుటుంబీకుడిని ప్రతిష్టించే సూత్రాలూ వెతకడం. వారి మేధో మథనం అంటే ఇదే. మోదీని గద్దె దించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు ఉంటాయట. అయితే నిన్న త్రిపురలో కాంగ్రెస్‌, ‌సీపీఎం కలసి పోటీ చేశాయి. రేపు కేరళలో ఇదే ముచ్చట కనిపిస్తుందని కలలో కూడా అనుకోనక్కరలేదు. అది వేరే విషయం. అధికారం ఇప్పుడే ఎలాగూ దక్కదు కాబట్టి, తరువాత ఎలాగూ జనం మరచిపోతారు కాబట్టి బడుగుల క్షేమం కోసం ఒక తీర్మానం చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీలకి యాభయ్‌ ‌శాతం రిజర్వేషన్‌ ‌గురించిన తీర్మానమది. మరొక చక్కని తీర్మానమూ చేశారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, ఏఐసీసీ మాజీ అధ్యక్షులని పార్టీలో శాశ్వత ఆహ్వానితులుగా చేర్చడానికి నిబంధనావళిని మారుస్తారట. ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న వ్యూహంతో చేసిన ఆలోచన కావచ్చు. ప్రణబ్‌ ‌ముఖర్జీ మాదిరిగా కాంగ్రెస్‌ ‌నుంచి ఎన్నికైన మాజీలెవరూ మరోసారి నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కేంద్ర కార్యాలయానికి వెళ్లకుండా తీసుకున్న జాగ్రత్త కావచ్చు. ఇంకా, ఇన్నింగ్స్ ‌ముగిశాయంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సోనియాను ఆ ప్రయత్నం నుంచి విరమింప చేసి, పార్టీకి ప్రేరణనొసగే దేవతగా ప్రతిష్టింప చేయడం కూడా.

అన్నట్టు అబుల్‌ ‌కలాం ఫోటో కనపడనందుకు కన్నీటి పర్యంతమైన నేతలకీ, అందుకు క్షమాపణలు గుప్పించిన నిర్వాహకులకీ ఇది దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బయ్‌ అయిదేళ్లు పూర్తయిన సందర్భమన్న వాస్తవం ఎందుకు గుర్తు లేదు? ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌పిలుపు మోదీ ఇచ్చారు. కాబట్టి పట్టించుకోరా? గాంధీ, నెహ్రూ, అలాగే ఆజాద్‌లతో పాటు ఇంకా ఎందరో ఈ దేశం కోసం త్యాగం చేశారు. వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించడానికైనా మూడు రోజుల ప్లీనరీలో అవకాశం చిక్కలేదా? మోదీని ఆడిపోసుకోవడానికీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను విమర్శించడానికీ, గౌతమ్‌ అదానీ నామస్మరణకు కేటాయించిన సమయంలో నూరో వంతు కూడా మన స్వాతంత్య్ర సమరయోధులను తలుచుకోవడానికి ఇవ్వలేకపోయిన ప్లీనరీ ఇది. నేతల రాక కోసం అక్షరాల ఆరు వేల కిలోల గులాబీలను పరచిన స్థానిక నేతలకి ఆ ప్రాంతానికే చెందిన ఎవరో ఒక గిరిజన స్వాతంత్య్ర సమరయోధుని లేదా, మరొక త్యాగమూర్తి ప్రతిమ ముందు ఒక్క పుష్పమైనా ఉంచి నివాళి ఘటించాలన్న ఆలోచన రాలేదా? దీని గురించి భారతజాతి ఆలోచించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE