– క్రాంతి

ఏ హిందూ దేవాలయమైనా కాషాయం ప్రమేయం లేకుండా ఉండదు. ఆలయాల ముందు కనిపించే జెండాలు, స్వామీజీల వస్త్రాలు, భక్తులు ధరించే దీక్షాదుస్తులు కూడా కాషాయంలోనే ఉంటాయి. అయితే, కేరళ మార్క్సిస్ట్ ‌ప్రభుత్వం మాత్రం ఇలా ఉండటం కుదరదంటోంది. వెల్లయని దేవాలయ ఉత్సవాల్లో కాషాయ రంగు జెండాలు కనిపించరాదని పోలీసులు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై హిందువులు తిరుగుబాటు చేశారు. కేరళ హైకోర్టు సైతం జిల్లా యంత్రాంగం తీరును తప్పుపట్టింది. హిందువుల్లో వచ్చిన ఈ చైతన్యం అక్కడి ప్రభుత్వానికి దడ పుట్టిస్తోంది.

‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.’ ఒకవేళ చేతిని అడ్డుపెట్టినా వెలుతురు అంతటా ప్రసరిస్తూనే ఉంటుంది. ఇలాంటి వృథా ప్రయత్నం చేయడం తెలివి తక్కువతనమే. కానీ వాస్తవాన్ని జీర్ణించుకోలేని శక్తులు కూడా ఉంటాయి. అయినా తమ ప్రయత్నం తాము చేస్తూ పోతే దాన్ని కచ్చితంగా శాడిజమే అంటారు. ఇటీవల కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలాంటి కుట్రనే పన్నింది. అయితే అక్కడి పౌరసమాజం కర్రు కాల్చి వాత పెడితే తోక ముడుచుకుంది. కాషాయం అంటే మన సనాతన ధర్మానికి, సంస్కృతికి, త్యాగానికి ప్రతీక. కానీ కేరళ మార్క్సిస్టులకు కాషాయం అంటే ఎక్కడ లేని భయం. ఇటీవలి కాలంలో అక్కడ పెరుగుతున్న హిందూ ఐక్యత వారికి మింగుడు పడనీయడం లేదు.

కాషాయం కనిపించొద్దని ఆదేశాలు

కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 12 కి.మీ. దూరంలో వెల్లయని సరస్సు ఒడ్డున వెల్లయని దేవి ఆలయం ఉంది. వెల్లయని దేవి అంటే భద్రకాళీ మాత. కల్లియూర్‌ ‌పంచాయితీ పరిధిలో ఉన్న ఈ ఆలయం ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు పరిధిలో కొనసాగుతోంది. మరో విశేషం ఏమింటే.. ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు కాదు, విశ్వకర్మలు. తరతరాలుగా వీరే అర్చకులుగా ఉంటున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడానికి గ్రామ కమిటీ కూడా ఉంది.

వెల్లయని ఆలయంలో ప్రతి మూడేళ్లకోసారి భారీఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనినే కాళియుత్తు మహోత్సవం (కాళికోత్సవం) అంటారు. 70 రోజల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. కేరళ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఉత్సవాలు తిరిగి ఆరేళ్ల తర్వాత జరుగుతున్నాయి కాబట్టి మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసుకుంది. ఫిబ్రవరి 14 నుంచి.. 70 రోజుల పాటు ఈ మహోత్సవం జరుగుతోంది. ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా నెమోమ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌రగీష్‌ ‌కుమార్‌ ‌తన సిబ్బందితో వచ్చారు. ఉత్సవాల్లో ప్లాస్టిక్‌తో తయారు చేసిన జెండాలు వాడొద్దని చెప్పారు. ఇది పర్యావరణ హితానికి సంబంధించిన అంశం కాబట్టి ఆలయ కమిటీ అంగీకరించింది. వస్త్రంతో తయారు చేసిన జెండాలు, బ్యానర్లు, తోరణాలు కట్టేశారు. పోలీసులు మరోసారి వచ్చి నోటీసులు ఇచ్చారు. కాషాయ రంగు తోరణాలు కట్టొద్దని అందులో ఆదేశించారు. ఈ ఆదేశాలను చూసి ఆలయ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు. హిందూ సంస్కృతిలో కాషాయం కూడా ఒక భాగం, కాషాయం వాడొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు. దానికి పోలీసులు స్పందిస్తూ కాషాయ రంగు మాత్రమే కాకుండా, అన్ని రంగులతో పాటు ఆ రంగు కూడా ఉంటే అభ్యంతరం లేదన్నారు. పైగా ఇందుకు శాంతిభద్రతలను కారణంగా చూపించారు. దేవాలయ ఉత్సవాల్లో కాషాయ రంగు జెండాలు, తోరణాలు, బ్యానర్లు ఉపయోగిస్తే శాంతిభద్రతలకు వచ్చిన ముప్పేమిటి? తరతరాలుగా వస్తున్న కాషాయ రంగును ఉపయోగించొద్దని ఎందుకు వత్తిడి తెస్తున్నారని ఆలయ కమిటీ గట్టిగానే నిలదీసింది. ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా కలెక్టర్‌ ‌సహా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు.

అంతా కాషాయమే..

పోలీసుల వత్తిళ్లకు తలొగ్గకుండా యధావిధిగా ఉత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ తీరుకు వినూత్నంగా నిరసన తెలియజేయాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 14న కాళియుత్తు మహోత్సవం ప్రారంభం వినూత్నంగా సాగింది. కల్లియూర్‌ ‌పంచాయితీకి చెందిన మహిళా భక్తులంతా కేరళ సంప్రదాయం ప్రకారం తెల్లని చీరతో పాటు కాషాయ జాకెట్‌ ‌ధరించారు. పురుష భక్తులంతా తెల్లని వస్త్రాలకు తోడుగా మెడలో కాషాయ కండువా వేసుకున్నారు. అంతేకాదు, ఆలయ ఆవరణలో ఉన్న పోలీసు పోస్టు టెంటును కూడా కాషాయ వర్ణంతో అలంకరించారు.

పోలీసుల తీరు..

పోలీసులు తమకు కేటాయించిన పోస్టును ఉపయోగించుకోకుండా ఆలయం ముందు షామియానాతో భారీ గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త పోస్టు ప్రధాన వేడుకల నిర్వహణకు అవరోధంగా ఉండటంతో దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఇందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో భక్తులు అందోళనకు దిగారు. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ తిరువనంతపురం అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ (ఏసీపీ) ఎస్‌ ‌షాజీ రగిలిపోయారు. ‘ఇలా అయితే వెల్లయని ఆలయానికి పోలీసు భద్రత కల్పించడం కష్టం’ అని బెదిరించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచార ప్రాముఖ్యం ఉన్న స్థలంలో పోలీసు పోస్టు నిర్మాణానికి అనుమతివ్వబోమని ఆలయ కమిటీ స్పష్టంగా చెప్పేసింది. శతాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచారంలో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసు కోవడం మతపరమైన భావాలను కించపరిచేలా ఉందని ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి ఆ పోస్టు తొలగించక తప్పలేదు. హిందూ చైతన్యాన్ని చూసి పోలీసులకు చెమటలు పట్టాయి.

కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

ఈ ఆదేశాల వెనుక అధికార సీపీఎం నాయకుల వత్తిళ్లు ఉన్నాయని ఆలయ కమిటీకి, భక్తులకు అర్థమైపోయింది. ‘జనం’ టీవీలో ఇదే అంశంపై జరిగిన చర్చలో సీపీఎం ప్రతినిధిగా ఏఎం హఫీజ్‌ ‌పాల్గొన్నారు. పోలీసుల వైఖరిని ఆయన సమర్ధించారు. మరోవైపు కాషాయ రంగు వద్దని ఆదేశం ఇవ్వడానికి కారణం ఏమిటి? అని పోలీసులను నిలదీస్తే ఎవరో ఫోన్‌ ‌ద్వారా ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఎవరని అడిగితే భద్రతా కారణాల వల్ల చెప్పలేమని దాటవేశారు.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆలయ కమిటీ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. అధికార సీపీఎం ఆదేశాల మేరకే జిల్లా యంత్రాంగం, పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారని అందులో పేర్కొంది. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ప్రభుత్వ ఆదేశాలను తప్పుపడుతూ తీర్పు చెప్పింది. వెల్లయని భద్రకాళి దేవి ఆలయ ఆచార వ్యవహారాల ప్రకారమే ఉత్సవాలు నిర్వహించాలని, ఇందులో ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు (టీబీడీ), జిల్లా యంత్రాంగం, పోలీసులు జోక్యం చేసుకోరాదని తీర్పు చెప్పింది. ఆలయ ప్రాంగణంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని భయపడితే, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్నో అవమానాలు..

ఇదంతా కేరళ వామపక్ష ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్న కుట్ర అని కమిటీ సభ్యులతో పాటు భక్తులందరికీ అర్థమైపోయింది. ఇటువంటి సందర్భాలు అక్కడి హిందువులు గతంలోనూ ఎదుర్కొన్నారు.

2017లో వెల్లయని ఆలయం ముందు కాషాయరంగు ధ్వజం ఏర్పాటు చేస్తే పోలీసులు వచ్చి దాన్ని తొలగించమన్నారు. ‘ఆలయం లోపల పెట్టుకోండి, బయట జెండాను పెట్టొద్దని చెప్పారు. ఉత్సవాల సమయంలో ఘర్షణ పడటం ఎందుకు అనుకొని భక్తులు జెండాను తొలగించేందుకు మొగ్గు చూపారు. తర్వాత కొద్ది రోజులకు స్థానిక కమ్యూనిస్టులు ఆలయం గోడలకు ఎర్రరంగు వేశారు.

2020లో ఇంతకన్నా పెద్ద అవమానమే జరిగింది. ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు సిబ్బంది వచ్చి ఆలయ మూలవిరాట్టును కారు డిక్కీలో వేసుకున్నారు. ఇదేమిటని అడిగితే, విగ్రహానికి రిపేర్‌ ‌చేయిస్తున్నామన్నారు. మూల విరాట్టును ఇలా తొలగించి ఎక్కడికో తీసుకుపోవడం ఎందుకు? ఇక్కడే చేయవచ్చు కదా? అని గట్టిగా నిలదీయడంతో వెనక్కి తగ్గిన సిబ్బంది విగ్రహాలను యథాస్థానంలో పెట్టేశారు.

ఎందుకీ ద్వంద్వ వైఖరి?

కేరళ వ్యాప్తంగా లక్షలాది మసీదులు ఉన్నాయి. వాటిలో ఉత్సవాల సమయంలో ఆకుపచ్చ రంగు ఉపయోగించడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. అక్కడ జరిగే జంతుబలులతో ఎలాంటి సమస్యలు ఉండవు. శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పులేదు. కానీ హిందూ ఆలయాల్లో కాషాయరంగు ఉపయోగించడం అభ్యంతరకరమా? కాషాయం కారణంగా శాంతిభద్రతలు దెబ్బతింటాయా? ఆకుపచ్చ రంగు అయితే ప్రశాంతంగా ఉంటుందా? కేరళలో అమలవుతున్న విజయన్‌ ‌మార్కు సెక్యులరిజం ఇలా ఉంది. ఈ ఘటనతో రాష్ట్రంలో హిందూ వ్యతిరేకులకు పోలీసులు సహకరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కేరళలో దశాబ్దాలుగా ఇస్లామిక్‌, ‌జిహాదీ సంస్థలు వేళ్లూనుకుంటూ వస్తున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాలతో అటు కాంగ్రెస్‌, ఇటు వామపక్షాలు ఈ శక్తులను వెనకేసుకు వస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న జాతీయవాదం, హిందువుల ఐక్యత వీరికి కంటగింపుగా మారింది. ఏ మాత్రం అవకాశం వచ్చినా కఠినంగా అణచివేస్తున్నారు. వామపక్షాలు, ఇస్లాం శక్తులు ఇప్పటికే వందలాది సంఖ్యలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ కార్యకర్తలను హత్య చేశారు.

ఈ ఆలయమే ఎందుకు లక్ష్యం?

కేరళ వామపక్ష ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ ఫోబియో పట్టుకుంది. కాషాయ జెండాలను నివారించేందుకు శాంతిభద్రతల సమస్యే కారణమని పేర్కొన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెల్లయని దేవాలయం మీద దృష్టి పెట్టడానికి కారణం కూడా ఉంది. ఈ ఆలయం నేమోమ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇది ఒకరకంగా బీజేపీకి కంచుకోటగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కేరళ బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు ఓ. రాజగోపాల్‌ ‌పోటీ చేసినప్పుడు నేమోమ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మంచి మెజారిటీ వచ్చింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్‌ ఇక్కడి నుంచే రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2015, 2020 స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలుపొందిన పంచాయితీల్లో కల్లియూరు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ బలంగా ఉండటం వామపక్ష ప్రభుత్వానికి మి•ంగుడు పడటం లేదు. అందుకే వెల్లయని దేవాలయం పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram