పాపం, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు రాహుల్‌ ‌గాంధీ నోటి నుంచి ఊడిపడినవి మూడంటే మూడే ప్రశ్నలు. ఆ మూడు ప్రశ్నల మాటేమోగానీ, ముందు ఈ 11 ప్రశ్నలకు జవాబులు విప్పండి అన్నారు బీజేపీ ఎంపీ నిశికాంత్‌ ‌దూబె. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాల ధోరణికి ఈ బాటే సరైనది. కీలెరిగి వాత పెట్టాలి. నీవు ఇతరుల వైపు ఒక వేలు చూపిస్తే, నీ వైపు మూడు వేళ్లు చూస్తూ ఉంటాయి అంటారు పెద్దలు. ఇది అక్షరాల భారత విపక్షాలకు సరిపోతుంది. వారు తమలపాకుతో అలా విసిరితే, బీజేపీ వారు తలుపుచెక్కతో ఫెడీఫెడీమనిపించాలి. తప్పదు. ఈ ప్రశ్నోపనిషత్‌ ‌గౌతమ్‌ అదానీ వివాదం నేపథ్యంలోదే. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వినిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచుకు పడడానికి ఏ చిన్న అవకాశం దొరికినా ముందూ వెనకా చూడకుండా దూకుతోంది కాంగ్రెస్‌. అసలే శతాధిక వర్షాల పార్టీ. ఈ మధ్య ఒక్కొక్క విమర్శకి ఒక్కొక్క భాగం పుటుక్కున విరిగిపోతోంది. ఇప్పుడూ అదే జరిగింది. ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి జవాబు ఇచ్చే పనికి పరిమితమయ్యారు. అంటే తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఒక క్రమ పద్ధతిలో సమీక్షించారు. ఆ క్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ లీలలని మచ్చుకి కొన్ని పరిచయం చేయక తప్పింది కాదు మరి!

నిజంగానే చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని కాంగ్రెస్‌ ఎదుర్కొన్నది. ఆ పార్టీకే సొంతమనిపించే శతాధిక అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం, అంటే ఆర్టికల్‌ 356‌ను చేతికి ఎముక లేకుండా వడ్డించిన సంగతి, నెహ్రూ పేరును బీజేపీ చెరిపి వేయడం వగైరా వగైరా అన్నీ పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మంత్రులు, నాయకులు ఎలుగెత్తి చాటారు. వీటికి సమాధానం ఇవ్వడంలో మోదీ, ఇతర నాయకులు చూపించిన ప్రతిభ ముచ్చటగొలిపింది జాతిని. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌సందర్భంగా సమీప గతంలోని తప్పుల కుప్పలని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ ‌వేదికగా జాతి జనుల ఎదుట ఉంచింది. ఆ అవకాశం ఇచ్చినదే కాంగ్రెస్‌, ‌దాని తైనాతీలే.

ఇంతకీ రాహుల్‌ ‌సంధించిన ప్రశ్నలేమిటి?

అదానీ గ్రూప్‌ ‌దొంగ కంపెనీలను స్థాపించిందని హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్ ‌సంస్థ చెప్పింది. మారిషస్‌లో ఉన్న అలాంటి దొంగ కంపెనీలు ఎవరివి? ఆ కంపెనీలే కోట్లాది రూపాయలు భారతదేశానికి తెచ్చాయి. ఇదంతా అదానీ దేశం కోసం ఉచితంగా చేసిపెట్టారా?

8 బిలియన్‌ ‌డాలర్లు ఉన్న అదానీ వ్యాపారం 2014 తరువాత 140 బిలియన్‌ ‌డాలర్లకి ఎలా చేరింది. అంటే మోదీ అధికారం చేపట్టాకనే కదా ఈ పెరుగుదల అని కవి హృదయం.

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి రెండో స్థానం దక్కినవిధంబెట్టిది? 2014 సంవత్సరంలో అదానీ సదరు జాబితాలో 609 స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నంబర్‌ 2 ‌స్థానానికి ఎలా ఎగబాకారు? అంత పెద్ద నిచ్చెన ఎవరు సరఫరా చేశారు? ఇందులోని మర్మమేమి? గడచిన రెండు దశాబ్దాలలో బీజేపీకి అదానీ ఇచ్చిన సొమ్మెంత? ఎన్నికల బాండ్ల పేరు పెట్టి అదానీ నుంచి బీజేపీ తీసుకున్నది ఎంత?

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ‌సభ్యులు, మిగిలిన చిన్నాచితకా విపక్షాలు ఒకటే నినాదం అందుకున్నాయి. ‘‘అదానీ…అదానీ.’’ అసలు రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర చేస్తుంటే తమిళనాడు నుంచి కశ్మీరం దాకా ఒక్క పేరే వినిపించిందట పాపం. అదే ‘అదానీ’ అట. అదానీ మైకం వల్లనేనేమో, హైదరాబాద్‌ ‌వస్తే పీవీ నరసింహారావు విగ్రహం ఆయనకు కనపడలేదు. తమిళనాడులో తన కోసం వేచి ఉన్న వృద్ధ స్వాతంత్య్ర సమరయోధులకి శాలువా కప్పి దండవేయాలనీ అనిపించలేదు. యాత్ర అంతా ఇలాగే ఉందని మాత్రం అనుకోవద్దు. కొన్ని ప్రత్యేక సమయాలలో అదానీ పేరు ఆయన దరికి చేరలేదు. అనగా వినిపించలేదు. చర్చి ఫాదర్లతో, టుక్డే టుక్డే గ్యాంగ్‌ ‌స్వరభాస్కర్‌తో, పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ అన్న యువతితో భుజం భుజం కలిపి, చేయి చేయి జోడించి నడిచినప్పుడు మాత్రం అదానీ పేరు చెవులకు సోకడానికి భయపడింది. బీజేపీని ద్వేషించే ప్రతి చానల్‌, ‌పత్రిక ఈ ప్రశ్నలని అప్పటికే పాఠకుల చేత దాదాపు భట్టీయం వేయించినంత పనిచేశాయి. అంటే అన్నిసార్లు రాసి, అరిగిపోయిన గ్రామఫోన్‌ ‌రికార్డు కూడా సిగ్గుపడేటట్టు చేశాయి. తిరగేసి మరగేసి ఎలా వీలుంటే అలా రాశాయి. చివరికి తీరికగా పార్లమెంటులో హావభావాలతో అవే ప్రశ్నలు సంధించడం రాహుల్‌ ‌వంతయింది. ఆ ప్రశ్నలు తన స్వకపోల కల్పితమే అన్నట్టు ఆ క్షణంలో రాహుల్‌ ‌ప్రదర్శించిన భంగిమలను చూసిన జాతి జనులు ఎంతో పరవశించారు కూడా. భారత్‌ ‌జోడో యాత్ర ఫేం రాహుల్‌ ‌ప్రశ్నలు ఎంత కాకరేపాయో తెలియదు కానీ, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ ‌వేసిన ప్రశ్నలు మాత్రం వృద్ధ పక్షానికి చుక్కలు చూపించాయి. ప్రజాస్వామ్య ప్రేమికులం కాబట్టి ఆ ప్రశ్నలేమిటో కూడా ఆలకిద్దాం.

పరీక్షా కేంద్రంలో ఇచ్చే ప్రశ్నపత్రంలో ప్రశ్నలకీ, పార్లమెంటులో వేసే ప్రశ్నలకీ తేడా లేకపోతే ఎలా అనుకున్నారు కాబోలు దూబే! అందుకే మొదటి ప్రశ్నతోనే రాహుల్‌ ‌గాంధీకి చెమటలు పట్టేశాయి. ఏమీ చదవకుండా దర్జాగా పరీక్ష హాలులో దూరిన విద్యార్థిలా తయారైంది రాహుల్‌ ‌పరిస్థితి.

రాహుల్‌ ‌గాంధీ జీవించే ఉన్నారా? లేక రాహుల్‌ ‌దెయ్యం వచ్చి పార్లమెంటులో కూర్చుందా? ఇదీ దూబే ఘాటు ప్రశ్న.

ఈ ప్రశ్న పాఠ్య ప్రణాళికలో లేనిదేమీ కాదు. అన్‌ ‌పార్లమెంటరీ అసలే కాదు. ఘనత వహించిన భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంలోనే ఒకచోట కాంగ్రెస్‌ ‌నేత నిక్కచ్చిగా చెప్పారు, ‘పాత రాహుల్‌ ‌చనిపోయాడు’ అని. ఈ చావుపుట్టుకల తతంగం ఇంత సులభం కాదుకదా అన్న ధర్మ సందేహమే దూబే చేత ఇలాంటి ప్రశ్న వేసేందుకు సాహసింపచేసి ఉండాలి. లేదా ఆవేశపరిచి ఉండాలి. దూబే మాటెలా ఉన్నా రాహుల్‌ ‌గుక్క తిప్పుకోలేని పరిస్థితికి వచ్చేశారు. ఇక మిగిలిన ప్రశ్నలు….

భోపాల్‌ ‌మిక్‌ ‌గ్యాస్‌ ‌లీకేజీ విషాద ఘటనలో నిందితుడు ఆండర్సన్‌ అనే వాడిని దేశం దాటించింది ఎవరు? అప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్‌ ‌సర్కార్లే. వీరిలో ఆ పాపం ఎవరిది? ఎవరి ‘వాటా’ ఎంత?

మీ పార్టీ నుంచి ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు నాగపూర్‌లో ఒకసారి బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మూడో సర్‌ ‌సంఘచాలక్‌) ‌నివాసానికి వెళ్లారా, లేదా?

మాజీ రాష్ట్రపతి, మీ పార్టీ ప్రముఖుడు ప్రణబ్‌ ‌ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కేంద్ర కార్యాలయానికి వచ్చారా, లేదా?

2010లో ఆస్ట్రేలియా గనుల కాంట్రాక్టు గౌతమ్‌ అదానీకి ఇప్పించింది మీ ప్రభుత్వమా కాదా?

ఖత్రోకి దేశం దాటడంలో నాటి మీ నేత మాధవరావ్‌ ‌సింధియా, ఇతర నాయకులు తోడ్పడలేదా?

సంజయ్‌ ‌భండారీకీ, రాబర్ట్ ‌వాధ్రాకీ మధ్య లంకేమిటి?

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కోట్లు చేతులు మారాయన్న కారణంగా గాంధీ కుటుంబం మీద ఈడీ, సీబీఐ ఒక కన్నేసి ఉంచిన మాట నిజమా కాదా?

ఒస్‌, ‌బీజేపీ ఎంపీ పస ఇంతేనా అనుకోవద్దు. నిజమే, కాంగ్రెస్‌ ‌పాపాల చిట్టా విప్పితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాంగ్రెస్‌ ‌కంపు గురించీ, అక్రమ లావాదేవీల గురించి చర్చ పెడితే ఒక్కొక్క బీజేపీ సభ్యుడికి గంట వంతున సమయం ఇచ్చినా, వాటన్నిటిని సభ దృష్టికి తేవడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే మరికొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం తమ నాయకుడు, ప్రధాని మోదీకి దూబే మిగిల్చారు.

కాంగ్రెస్‌ ‌పార్టీని మోదీ తనదైన శైలిలో రేవు పెట్టి చాలా కాలమైందని జనం అనుకుంటున్న తరుణంలోనే ఆ శుభ ఘడియ వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రసంగాన్ని మోదీ సరిగానే ఉపయోగించుకున్నారు. విపక్షాలన్నీ ఏకమై అదానీ అంశం మీద చర్చ జరగాలనీ, కమిటీ వేయాలనీ బృందగానం లంఘించుకున్నాయి. అసలు ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు మొదలైనా ప్రపంచంలో ఏదో మూల ఒక పత్రిక, లేదా చానల్‌, ఈ ‌భూగోళం మీద చీమ తలకాయంత పరిమాణం లోని వెబ్‌సైట్‌ ‌కావచ్చు..ఏమైతేనేం! ఇలాంటి మోదీ వ్యతిరేక టుమ్రీ ఒకటి వినిపిస్తుంది. దానిని పట్టుకుంటాయి విపక్షాలు. ఇప్పుడూ అంతే. ఇంతకీ విపక్షాలన్నీ బుద్ధిగా, కోరస్‌గా అదానీ అంశాన్నే ఎందుకు పట్టుకున్నాయి? ఇది భారత విపక్ష శిబిరంలో రివాజు కాబట్టి. ఈ ఐకమత్యం మోదీ వ్యతిరేకతతో వచ్చింది కాదు. మరేమిటి? ఈడీ వచ్చి పలకరిస్తుందేమోనన్న భయమే వారిని అలా అతుక్కు పోయేటట్టు చేసిందని గుట్టు విప్పారు మోదీ.

మోదీ పెట్‌ ‌బాటిళ్ల రీసైక్లింగ్‌ ‌పదార్థంతో తయారు చేసిన జాకెట్‌ ‌ధరించి వస్తే, ప్రతిపక్ష నాయకుడు, స్వయం ప్రకటిత పేదవాడు మల్లికార్జున ఖర్గే మాత్రం అరలక్ష విలువ చేసే స్కార్ఫ్ ‌వేసుకోవడం సభ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి. మోదీ మరోసారి విజృంభించారు. కకావికలైపోయారు విపక్ష నేతలు. మీరు ఏడుపదుల పాలనలో కాంగ్రెస్‌ ‌ముక్కీ మూలిగీ 70 విమానాశ్రయాలు కడితే మేము తొమ్మిదేళ్లలో 70 కట్టించామని గట్టి చురకే వేశారు ప్రధాని. టూజీ, ఏషియన్‌ ‌గేమ్స్ ‌నిధుల నొక్కుడు, అగస్టా అవకతవకల గురించి కూడా మోదీ లీలగా మాత్రమే గుర్తు చేశారు. అసలు 2004 నుంచి, 2014 మధ్య ఒక దశాబ్దాన్నే భారతదేశం కోల్పోయిం దని తీవ్రమైన వ్యాఖ్య చేశారు మోదీ. ఆ కాలంలో దేశాభివృద్ధికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా కాంగ్రెస్‌ ‌దిగ్విజయంగా చేజార్చిందని ఎద్దేవా చేశారాయన. టీవీ చానెళ్లలో తనను ఎంత మంది దుమ్మెత్తి పోసినా, వార్తాపత్రికలలో తన గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా 140 కోట్ల భారతీయులు తన మీద ఉంచిన నమ్మకం రక్షణకవచంలా పనిచేస్తుందని మోదీ కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. మీది కుటుంబ పాలన అయితే, మాది వసుధైక కుటుంబ పాలన అన్నారన్నమాట. కమలం బురదలో వికసిస్తుంది. మీరు ఎంత బురద చల్లితే అంతగా అది వికసిస్తుందని కూడా అన్నారు.

నెహ్రూ పేరును స్వతంత్ర భారత చరిత్ర నుంచి చెరిపివేయాలని కాంగ్రెస్‌ ‌పదే పదే ఆరోపించడం గురించి మోదీ ఏమన్నారు? ఆయన మీద అంత గౌరవమే ఉంటే, మీరంతా పేర్ల చివర గాంధీ అంటూ ఎందుకు తగిలించుకున్నారు? నెహ్రూ అని కూడా పెట్టుకోవచ్చుకదా అని ప్రశ్నించారు. ఈ మధ్య కేరళ కమ్యూనిస్టులు, పశ్చిమ బెంగాల్‌ ‌టీఎంసీ వాళ్లు, తెలంగాణ బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా ప్రజాప్రభుత్వాలను కూల్చేయడానికి చూస్తున్నారని గంగవెర్రులెత్తినట్టు ప్రకటనలు ఇస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆర్టికల్‌ 356‌ను 90 సార్లు ప్రయోగించిన పార్టీ ఏదైనా ఉన్నదీ అంటే అది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని మోదీ జాతి దృష్టికి తీసుకుపోయారు. ఇందిరాగాంధీ చేతికి ఎముక లేని చందంగా 50 పర్యాయాలు ఆర్టికల్‌ 356‌ని రాష్ట్రాల మీద వడ్డించారు. ఇదంతా విన్న తరువాత పాపం కాంగ్రెస్‌ ‌సభ్యులకే మతి పోయినట్టు ఉంది. అదానీ నినాదం గోల మిగిలిన పార్టీలకి వదిలేసి ఖిన్నులై కూర్చున్నారు. ముసలితనంలో చాదస్తం వస్తుంది. చాదస్తం వస్తే శాస్త్రీయత మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది అదే కదా! కరోనాకు భారత్‌ ‌తయారు చేసిన టీకాను ప్రతిపక్షాలు అపహాస్యం చేసిన సంగతిని కూడా ప్రధాని విడిచి పెట్టలేదు. కానీ 150 దేశాల ప్రజలకు మన టీకాయే ప్రాణం పోసిన సంగతినైనా గుర్తించండి అంటూ ప్రధాని కర్రు కాల్చి వాత పెట్టారు.

అదానీ గురించి సభలో ఎత్తితే చాలు, మోదీ కకావికలై పారిపోతారనీ, ఏవో పాత ఫొటోలు చూపిస్తే బెదిరిపోతారనీ లెక్కేసిన రాహుల్‌, ‌కాంగ్రెస్‌, ‌విపక్షాల కథ ఘోరాతిఘోరంగా అడ్డం తిరిగింది. దీనితో కాంగ్రెస్‌ ‌బుర్రతక్కువ తనమే కాదు, గురవింద గింజ పంథా కూడా యావత్‌ ‌భారతజాతి దృష్టికి వచ్చింది. రాహుల్‌ ‌గాంధీ అంతకు ముందురోజు లోక్‌సభలో వీరావేశంతో ప్రసంగించిన సందర్భంలో నరేంద్ర మోదీ, అదానీ కలసి విమానంలో ప్రయాణి స్తున్న పెద్ద పెద్ద ఫొటోలు సభలో ప్రవేశ పెట్టేందుకు ఉబలాటపడ్డారు. కానీ సదా శాంతంగా ఉండే స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆ పని చేయబోయిన రాహుల్‌కి భారీ వాత పెట్టారు. మోదీతో అదానీ ఉన్న చాటంత ఫొటోలు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు. వాటిని సభలో ప్రదర్శించాలని మీర సరదా పడితే పడొచ్చు. కానీ మీ పార్టీ రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రితో అదానీ కలసి ఉన్న పోస్టర్లనే బీజేపీ సభ్యులు సభకు తెచ్చే ప్రమాదం ఉంది, చూసుకోండి మరి! అని స్పీకర్‌ ‌గారు హెచ్చ రించే సరికి బిక్కచచ్చిపోయారు రాహుల్‌. అన్నట్టు అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షపదవిలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌ ‌విశ్వప్రయత్నం చేసినా, నా కదేమీ వద్దనీ, సీఎం పదవే ముద్దనీ చెప్పిన ఘనుడు ఇతడే కదా! నాకు ముఖ్య మంత్రి పదవే ముచ్చట అంటూ అధినాయకులను పూచిక పుల్లలతో సమం చేశారు కూడా.

 అయితే రాహుల్‌ ‌వరకు ఇది ప్రసూతి, లేదా శ్మశాన వైరాగ్యం వంటిది మాత్రమే. షాహీన్‌బాగ్‌, ‌పంజాబ్‌ ‌దొంగరైతులు, భారతదేశంలో మైనారిటీలపై దాడులు, రఫేల్‌ ‌కొనుగోళ్ల అవకతవకలు వంటి ఎన్ని దొంగ ఆరోపణలను పట్టుకుని రాహుల్‌ ‌మోదీ మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నించలేదు? ఒక్కొక్కటి కోర్టులలో వీగిపోయినా పదును లేని బాణాలు ప్రయోగించడం రాహుల్‌ ‌మానలేదు కదా! అయినా భారతదేశంలో ఏ అక్రమం జరిగినా అది కాంగ్రెస్‌ ‌పాలనలోనే జరగాలి గాని, ఇలా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిపోతే మేం దాన్ని గుర్తించనే గుర్తించం, మా పార్టీ చరిత్రకే సొంతమైన ఆ ఘనతను వేరొకరికి ఇవ్వలేం అన్నట్టే ఉంటుంది రాహుల్‌ ‌ధోరణి. రైతుల సమస్య వంటి వాటితో గతంలో పార్లమెంట్‌ ‌సమావేశాలను అడ్డం కొట్టినట్టే, ఈ పార్లమెంటు సమావేశాలను అదానీ మీద విమర్శతో సాగనివ్వరాదన్న ఏక వాక్య తీర్మానంతో వచ్చిన కాంగ్రెస్‌, ‌విపక్ష ముఠాకి బీజేపీ సభ్యులు మూర్ఛ వచ్చినంత పనిచేశారు. ‘మీరంతా రాహుల్‌ని పప్పును చేశామని అనుకున్నారు. మీ పప్పులేమీ ఉడకలేదు. రాహుల్‌ ‌గాంధీయే మిమ్మల్నందరినీ టోకున పప్పులను చేశారు’ అంటూ ఆ చర్చకి ఏ మాత్రం పొసగని, సంబంధం లేని పోలిక తెచ్చి, పప్పు బిరుదు వాళ్ల నాయకుడికే సరైనదని నిరూపించారు, విపక్ష నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి. ఇంత వాడివేడిగా సాగుతున్న చర్చకు కాస్త వెసులుబాటు కోసం అన్నట్టు తోలుబొమ్మలాట వినోదాన్ని తలపిస్తూ శ్రీమాన్‌ ‌కేతిగాడి పాత్రను ఇలా అధీర్‌ ‌రంజన్‌ ‌కాసేపే అయినా బాగా రక్తి కట్టించారు. కేతిగాడి సరిజోడి బంగారక్క పాత్రలో మహువా మైత్రాను చూడవచ్చు గానీ, ఆ ఇద్దరి పార్టీలు వేర్వేరు. కాబట్టి కెమిస్ట్రీ పండదు. మైత్రా సభలో నికార్సయిన బూతులు ప్రయోగించారు.

కాంగ్రెస్‌ ‌వాళ్లకి ఉన్న మహా సౌలభ్యం ఏమిటంటే, మరుపు. రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అంటూ వాగి, ఆనక చెంపలు వాయించుకున్న అధీర్‌ ‌రంజన్‌ ‌మరొక ‘పప్పు’ ఆరోపణ కూడా చేశారు. ఇంతకాలం భారత రాష్ట్రపతి పదవిలోకి వచ్చిన వారి కుల గోత్రాలు చీమకి కూడా తెలిసేవి కాదట. మతం అంతకంటే తెలియలేదట. ఇప్పుడు మాత్రం రాష్ట్రపతి ఏ వర్గమో అందరికీ తెలిసిందట. జాతీయ అంతర్జా తీయ వేదికల మీద బీజేపీ నేతలు ఆమె ఎవరో, ఏ వర్గమో పదే పదే చెబుతున్నారట. అలా చెప్పేటట్టు చేసింది ఎవరు? భారత్‌లో అణచివేతకు గురి అవుతున్నారంటూ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వాళ్లు ఇచ్చే జాబితాలో గిరిజనులు కూడా ఉన్నారు. కానీ అది అబద్ధం, మేం ఒక గిరిజన మహిళను ప్రథమ పౌరురాలిగా గౌరవించుకుంటున్నామని బీజేపీ వివరణ ఇస్తే అందులో తప్పు కనిపిస్తున్నది, ఈ పప్పు అనుచరుడికి. భారతదేశంలో మైనారిటీలకు మనుగడ లేదని అంతర్జాతీయ వేదికల మీద వదరిన నోళ్లు ఇప్పుడు ఈ మాట అనడం అత్యంత వికారంగా అనిపించడం లేదా? అసలు రాహుల్‌, ఆయన కన్నతల్లి, కాంగ్రెస్‌ ‌మూలస్తంభం సోనియా ప్రస్తుతం బెయిల్‌ ‌మీద ఉన్న సంగతి గుర్తుందా లేదా అని నిలదీశారు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌.

‌మోదీ ప్రతి వ్యంగ్యాస్త్రం సభను నవ్వులతో ముంచెత్తింది. ప్రతి విమర్శ రాహుల్‌ను నీరు గార్చేసింది. కాంగ్రెస్‌ ‌తల కొట్టేసింది. ఆ క్షణంలో ఆయన్ని చూస్తే నిశాంత్‌ ‌దూబె ప్రశ్న వాస్తవరూపం దాల్చిందేమోనని అనుమానం వస్తుంది కూడా. కళ్లు తేలేసినంత పనైంది రాహుల్‌కి. దేశంలో కాంగ్రెస్‌ అం‌తిమ క్షణాలు లెక్కిస్తున్న వాస్తవాన్ని హార్వార్డ్ ‌విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ఖరారు చేసిన సంగతిని కూడా సభ దృష్టికి తెచ్చారు మోదీ.

ఆరోపణ నిజం కావచ్చు. అసత్యం కావచ్చు. కానీ అదానీ వ్యవహారం కొన్ని వేల కోట్లతో ముడిపడి ఉంది. పార్లమెంటులో, మీడియాలో ఇంత రచ్చ జరిగింది. అయినా మోదీ మీద అవినీతి ఆరోపణ చేయడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. ఇది చాలు మోదీ ఏమిటో తెలియడానికి! ఇదొక్కటి చాలు ఆయన ఎంతటి నిష్కళంక చరితుడో అర్ధం చేసుకోవడానికి!

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram