‘గేట్‌ ‌వే టు ది వ్యాలీ ఆఫ్‌ ‌ఫ్లవర్స్’‌గా పరిగణించే జోషిమఠ్‌ ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సముద్రమట్టానికి 6150 అడుగుల ఎత్తున ఉన్న పట్టణం. హిమాలయ పర్వతా రోహణలకు, ట్రెక్కింగ్‌కు, బద్రీనాథ్‌ ‌యాత్రకు దీన్ని ముఖద్వారంగా పరిగణిస్తారు. ఒక పర్వత ఏటవాలుతలంలో ఉన్న ఈ చిన్న పట్టణ ప్రాంతంలో భౌగోళికంగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. వందేళ్ల క్రితం భూకంపం కారణంగా కూలిపోయిన కొండచరియ శిథిలాలపై ఈ పట్టణం నిర్మితమైంది. ప్రస్తుతం కుంగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఈ పట్టణానికి ఈ సమస్య కొత్తదేం కాదు.

1976 తొలినాళ్లలోనే జోషిమఠ్‌ ‌వద్ద అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పట్టణం కుంగిపోయే ప్రమాదమున్నదని హెచ్చరించారు. ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టకూడదని కూడా స్పష్టం చేశారు. తర్వాతి కాలంలో బద్రీనాధ్‌ (45 ‌కి.మీ.దూరం), కేదార్‌నాథ్‌ ‌వెళ్లే యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పట్టణంలో పెద్ద ఎత్తున హోటళ్లు, రిసార్టులు వెలిసాయి. రవాణాకు విపరీతంగా వాహనాల వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. ఇదే సమయంలో యాత్రికులు వదలివెళ్లే ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు కూడా కాలుష్యాన్ని పెంచేస్తున్నాయి. అంతేకాకుండా పట్టణం చుట్టూ పెద్దఎత్తున జల విద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణం జరిగింది. వీటన్నింటి ఫలితం ఇప్పుడు అనుభ వించాల్సి వస్తున్నది. చమోలీ జిల్లాలోని వాతావరణ పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతుంటాయి. ఇక్కడ భూకంపాలు, అధిక వర్షాలు, కొండచరియలు విరిగి పడటంతో పాటు, అడవులు దగ్ధం కావడం కూడా జరుగుతుంటుంది. జోషిమఠ్‌ ‌పట్టణానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉర్‌గామ్‌ ‌ప్రాంతాల్లోని అడవుల్లో గడచిన నవంబర్‌ 1 ‌నుంచి ఇప్పటివరకు 16 దావానల సంఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు ఉదాహరణ.

కొంపముంచుతున్న ప్రాజెక్టులు

ప్రభుత్వం చేపడుతున్న వివిధ హైడ్రో పవర్‌ ‌ప్రాజెక్టులు ప్రస్తుత విపత్తులకు కారణమని చమోలీ జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. జోషిమఠ్‌లో ప్రస్తుత దుస్థితికి, ఇక్కడి మార్వారీ జలాశయం తెగిపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. వాడియా సంస్థకు చెందిన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ జలాశయం నుంచి ప్రస్తుతం నిమిషానికి 800 లీటర్ల నీరు బయటకు వస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇతర ప్రాంతాల వాసుల ఇళ్లలో దీపాలు వెలుగుతున్నా, తమ ఇళ్లు కుప్పకూలి పోతున్నాయని జోషిమఠ్‌ ‌వాసులు వాపోతున్నారు. నిజానికి ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రం దేశంలోని భూకంప మ్యాప్‌లో సిస్మిక్‌ ‌జోన్‌-4, ‌సిస్మిక్‌ ‌జోన్‌-5 ‌పరిధిలో ఉంది. ఇప్పటి వరకు జోషిమఠ్‌లో 678 ఇళ్లు దెబ్బతినగా 81 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జోషిమఠ్‌లో 213, పిపల్‌కోటిలో 491 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జోషిమఠ్‌తో పాటు కర్ణప్రయాగలో ఇళ్లు పగుళ్లు చూపుతుండటంతో ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం వెంటనే రంగం లోకి దిగి ఇందుకు కారణాలను అధ్యయనం చేసే బాధ్యతను రూర్కీ యూనివర్సి టీకి చెందిన ఐఐటీ విభాగానికి అప్పగిం చింది. అలకనందా నదిపై ఉన్న పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి (మిగిలినవి విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ).

ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌, ‌కర్ణప్రయాగ, ముస్సోరీ ప్రాంతాల తర్వాత ఇప్పుడు తెహ్రీ ఘర్వాల్‌ ‌జిల్లా కూడా కుంగిపోయే జాబితాలో చేరడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని చంబా పట్టణంలో ఎక్కువగా భూమి కుంగుబాట్లు చోటుచేసుకుంటు న్నాయి. చహర్‌ ‌డ్యామ్‌ ‌రోడ్డు ప్రాజెక్టు కోసం భూమిలో 440 మీటర్ల పొడవున నిర్మిస్తున్న టన్నెల్‌ ‌చంబ మార్కెట్‌ ‌ప్రాంతం గుండా వెళుతుంది. ఈ టన్నెల్‌ ‌నిర్మాణం జరుగు తున్నప్పుడే ఇళ్లలో పగుళ్లు కనబడటం మొదలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిజానికి ఉత్తరాఖండ్‌లో పర్వతాలు, నదులు, ఇరుకు దారులు కలిగిన ప్రాంతం మధ్యలో జోషిమఠ్‌ ఉం‌ది. రాష్ట్రంలో 2000-2009 మధ్యకాలంలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 433 మంది అసువులు బాసారు. 2020-21 మధ్యకాలంలో విపరీతమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల మరణించిన వారి సంఖ్య 1312. రాష్ట్రంలో 400 గ్రామాలు సురక్షిత నివాసయోగ్యాలు కావని నిపుణులు ఎప్పుడో తేల్చారు. 2021లోనే వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా 300 మంది మరణించారు. ఇదంతా అధికారిక సమాచారమే. జోషిమఠ్‌ ‌కుంగిపోవడం ఇలాగే కొనసాగితే పట్టణంలోని 40% మందిని ఖాళీచేయించక తప్పదని అధికారులు చెబుతున్నారు.

తపోవన్‌ ‌విష్ణుగడ్‌ ‌హైడ్రో ఎలక్ట్రిక్‌ ‌ప్రాజెక్టు

ప్రస్తుతం జోషిమఠ్‌ ‌దుస్థితికి మానవ కార్యకలా పాలే ప్రధాన కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటికంటే సమస్యాత్మకంగా మారింది తపోవన్‌ ‌విష్ణుగడ్‌ ‌హైడ్రో ఎలక్ట్రిక్‌ ‌ప్రాజెక్టు. దీని విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 520 మెగావాట్లు. 2006లో ప్రారంభిం చిన దీన్ని ఎన్‌టీపీసీ నిర్వహిస్తుంది. నిజానికి 2009, 2012, 2014, 2021ల్లో ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు చోటుచేసుకున్నాయి. 2009లో టన్నెల్‌ ‌బోరింగ్‌ ‌మెషిన్‌ (‌టీబీఎం) 900 మీటర్ల లోతున తవ్వకం జరుపుతుండగా ఆగిపోయింది. అప్పట్లో ఇక్కడినుంచి సెకనుకు 700 లీటర్ల చొప్పున నీరు బయటకు వచ్చింది. దీనివల్ల దాదాపు పదినెలలు పని నిలిపివేశారు. స్థానికులు ఆందోళన చేయడంతో తర్వాత ఎన్‌టీపీసీ జోషిమఠ్‌ ‌వాసులకు నీటిసదు పాయం కల్పించింది. 2012లో టీబీఎం యంత్రం ఇట్లాగే ఇరుక్కుపోయింది. దాంతో 2013లో తపోవన్‌-‌విష్ణుగడ్‌ ‌ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పనితీరుపై సుప్రీంకోర్టు దృష్టి సారించి, 2013లో  కేదార్‌నాథ్‌ ‌వరదలపై ఇక్కడి ప్రాజెక్టుల ప్రభావం ఎంతమేర ఉన్నది తెలుసుకు నేందుకు విచారణకు ఆదేశించే దాకా పరిస్థితి చేరుకుంది. తపోవన్‌ ‌విష్ణుగడ్‌ ‌హైడ్రో ఎలక్ట్రిక్‌ ‌ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్స్ ‌జోషిమఠ్‌ ‌కింది భాగంలో ఉన్న దుర్బల ప్రాంతం గుండా వెళుతున్నాయి. 2021లో సంభవించిన పెనువరదల్లో ఈ రెండు టన్నెల్స్‌లో ఒకటి బురదతో నిండిపోయి మూసుకుపోయింది. చమోలీ జిల్లా నందాదేవి నేషనల్‌ ‌పార్క్‌లోని నందాదేవి గ్లేసియర్‌ ‌విరుచుకు పడటంతో ఫిబ్రవరి 7, 2021న సంభవించిన విపత్తు కారణంగా రిషిగంగ, ధౌలిగంగ నదులకు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఈ ప్రమా దాన్నే చమోలీ విధ్వంసం అని కూడా పేర్కొంటారు. ఈ ప్రమాదంలో 200 మంది మరణించడమో లేక ఆచూకీ లేకుండా పోవడమో జరిగింది. రిషిగంగ, ధౌలిగంగ నదుల కలయిక వల్ల అలకనందా నది ఏర్పడుతుంది.

విపరీతంగా భూగర్భ జలాలను తోడేసి వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు వాడటం వల్ల ఆయా పొరల్లో ఇసుక, రాళ్లు బలహీన పడటం కూడా ఇందుకు మరొక కారణమన్నది భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. 2009లో ఇక్కడ ఒక పెద్ద బోర్‌ ‌తవ్వకం జరిపి రోజుకు 70 మిలియన్‌ ‌లీటర్ల భూగర్భజలాన్ని తోడేసి మూడు మిలియన్ల మందికి నీటిసదుపాయం కల్పిస్తుండటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదీకాకుండా జోషిమఠ్‌లో సరైన మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవడం మరో సమస్య. భూమి క్రస్ట్‌లో కదలికలు చోటుచేసు కోవడం లేదా భూకంపం కారణంగా మట్టి దిబ్బల స్థితి మారిపోవడం, భూగర్భజలాల నిరంతర ప్రవాహం కారణంగా కింది భాగంలోని రాతిపొరలు అరిగిపోవడం, జలాలను విపరీతంగా వినియో గించడం, జలాశయాలు కూడా భూమి కుంగడానికి కారణాలుగా చెబుతున్న శాస్త్రవేత్తలు సరిగ్గా ఇటువంటి కారణాల వల్లనే ప్రపంచంలో అత్యంత వేగంగా జకార్తా నగరం కుంగిపోతున్న సంగతిని గుర్తుచేస్తున్నారు.

జనాభా పెరుగుదల కూడా ఈ పరిస్థితులకు మరో కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని మైగ్రేషన్‌ ‌ప్రివెంటివ్‌ ‌కమిషన్‌, ఉత్తరాఖండ్‌ ‌గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల్లో 1/3వ వంతు మంది తమ సమీప పట్టణాలకు వలస వెళ్లారు. మరో 15శాతం మంది తమకు సమీపంలోని జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. ఈ కారణంగా గత రెండు దశాబ్దాల కాలంలో పర్వతాలపై ఉన్న పట్టణాల్లో జనాభా బాగా పెరిగిపోయింది.

సామర్థ్యానికి మించిన యాత్రికుల సంఖ్య

చైనా ఆక్రమణలోని టిబెట్‌తో ఉత్తరాఖండ్‌కు 300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మానాపాస్‌కు, జోషిమఠ్‌కు మధ్య దూరం 50 కిలోమీటర్లు మాత్రమే. గత పదేళ్లకాలంలో కేవలం బర్హౌటీ ప్రాంతంలోనే చైనా దాదాపు 63 చొరబాట్లకు పాల్పడింది. అటువంటి ఈ సరిహద్దు ప్రాంతానికి సైన్యం అన్ని కాలాల్లో తక్షణం చేరుకోవడానికి వీలుగా రోడ్ల నిర్మాణం చేపట్టడంలోని ప్రభుత్వ ఆంతర్యం ప్రశంసనీయమే. కాకపోతే నిర్మిస్తున్న రోడ్లు, సైనికావ సరాల కంటే, పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పర్యాటకం వృద్ధి చెందడం మంచి పరిణామమే కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య, ఈ ప్రాంత సామర్థ్యానికి మించి ఉంటోందన్నది ఒక వాదన. ముఖ్యంగా 2022 మేలో ప్రారంభమైన చార్‌ధామ్‌ ‌యాత్రకు 9.5 లక్షల మంది యాత్రికులు రాగా వీరిలో 3.5 లక్షల మంది కేదార్‌నాథ్‌ ‌దర్శనానికి తమ పేర్లను రిజిస్టర్‌ ‌చేసుకున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ సంఖ్య ఇక్కడి ప్రదేశాల సామర్థ్యానికి మూడు రెట్లు అధికం! తీర్థయాత్రికులు పెరుగుతున్న కొద్దీ పర్వత ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడి ప్రదేశాల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

—————

గొప్ప పుణ్యక్షేత్రం

జోషిమఠ్‌ ‌యాత్రనే బద్రీనాథ్‌ ‌యాత్ర అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బద్రీనాథ్‌ ‌వెళ్లే యాత్రికులు జోషిమఠ్‌ ‌నుంచే వెళ్లాలి. జోషిమఠ్‌లో కల్పవృక్ష దేవాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, నరసింహ ఆలయం ప్రముఖమైనవి. వీటిని హిందు వులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఉన్న గురుద్వారా పత్తర్‌ ‌సాహెబ్‌ ‌సిక్కులకు ఎంతో పవిత్రమైంది. జోషిమఠ్‌ ‌పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, సాహస క్రీడలకు కూడా ఎంతో ప్రసిద్ధి. ట్రెక్కింగ్‌, ‌రాఫ్టింగ్‌, ‌స్కైయింగ్‌ ‌వంటి సాహ క్రీడలు ఇక్కడ జరుగుతుంటాయి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఇది కూడా ఒకటి (మిగిలిన నాలుగు శృంగేరి, పూరి, ద్వారక, కంచి). జోషిమఠ్‌ అథర్వ వేదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. జోషిమఠ్‌లో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించింది ఆది శంకరాచార్యులే. పన్నెండు మంది తమిళ అళ్వార్లు పేర్కొన్న 108 దివ్యమైన విష్ణు ఆలయాల్లో ఇది కూడా ఒకటి. స్థానికవాసుల విశ్వాసం ప్రకారం ఇక్కడి నారసింహుడి కుడిచేయి క్రమంగా సన్నబడుతూ వెంట్రుక మాదిరిగా రూపొంది చివరకు తెగిపో తుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు బద్రీనాథ్‌కు వెళ్లే దోవలో ఉన్న జయ-విజయ పర్వతాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. వెనువెంటనే బద్రీనాథ్‌ ‌దేవాలయంలో ఉన్న బద్రీనాథుడు మాయమై, భవిష్యత్తు బద్రీనాథ్‌లో సాలిగ్రామంగా వెలుస్తాడు. ఈ భవిష్య భద్రీనాథ్‌ ‌జోషిమఠ్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం శీతాకాలంలో బద్రీనాథుడి విగ్రహాన్ని జోషిమఠ్‌లోని నారసింహ దేవాలయానికి తీసుకువచ్చి ఆరు నెలలపాటు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే కాలంలో ఇప్పటి కేదార్‌నాథుడు కూడా అక్కడ మాయమై భవిష్యత్తులో జోషిమఠ్‌లోని భవిష్య కేదార్‌ ‌దేవాలయంలో వెలుస్తాడని కూడా స్థానికుల నమ్మకం. ప్రస్తుతం ఈ దేవాలయంలో చిన్న శివలింగం మాత్రం ఉంది. హిందువులకు ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న జోషిమఠ్‌ ‌ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు రాబోయే కాలంలో చార్‌ధామ్‌ ‌యాత్రపై ప్రతికూల ప్రభావం కలిగించ కూడదనే ఆశిద్దాం.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram