సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌మాఘ శుద్ధ విదియ – 23 జనవరి 2023, సోమవారం -అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఇది ప్రసూతి వైరాగ్యమా? శ్మశాన వైరాగ్యమా? వైరాగ్యమే కానీ, అది ఈ రెండింటిలో ఏ రకానిదో చెప్పడం కష్టం. పాకిస్తాన్‌ ‌ప్రధాని ప్రకటించారు కాబట్టి ఉగ్రవాద వైరాగ్యం అని దీనికో పేరు నిర్ణయించవచ్చునేమో! అందులో హిందూ ద్వేషం, భారత ద్వేషం ఎలాగూ అంతర్భాగాలే. కొద్దిక్షణాలు, ఇంకా చెప్పాలంటే కాసిన్ని రోజులు ఒక నిర్వేదంలోకి జారిపోవడం, మళ్లీ యథాతథ స్థితికి రావడమే వైరాగ్యమనే స్థితిలోని వైచిత్రి. దాలిగుంటలో అప్పటిదాకా వెచ్చదనాన్ని అనుభవించి, చివరికి దులపరించుకుని వెళ్లిపోయే కుక్క మనస్తత్త్వం ఈ ధోరణికి కాస్త దగ్గరగా ఉంటుంది. భారత్‌తో మూడు యుద్ధాలు చేసిన తరువాత పాకిస్తాన్‌ ‌గుణపాఠాలు నేర్చుకుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‘అల్‌ అరబియా టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఇంకా, ‘నరేంద్ర మోదీగారూ! మేం శాంతిని కోరుతున్నాం!’ అని కూడా ముక్తాయించారు. కానీ ఇక్కడే మెలికపెట్టారు. దానిని పరిశీలిస్తే కుక్క తోక అమాంతం గుర్తుకు వస్తుంది.

సిరిల్‌ ‌రాడ్‌క్లిఫ్‌ ‌పథకం ప్రకారం 1947లో భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. ఎర్రకోట మీద నుంచి ప్రథమ ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగం ఇంకా దేశ ప్రజల చెవులలో ప్రతిధ్వనిస్తుండగానే పాకిస్తాన్‌ ‌భారత్‌ ‌మీద దాడికి దిగింది. కాళ్లు తొక్కిన రోజే కాపురం ముచ్చట తెలిసిపోతుందని సామెత. భవిష్యత్‌లో భారత్‌తో ఎలాంటి సంబంధాలు ఉంటాయో ఆ విఫల దాడితోనే పాక్‌ ‌ప్రకటించింది. మళ్లీ 1965, 1971 యుద్ధాలు జరిగాయి. మూడో యుద్ధంతో పాక్‌ ‌తూర్పు బెంగాల్‌ను కోల్పోయింది. అయినా దాని బుద్ధి మారలేదు. భారత్‌ ‌మీద వేయేళ్ల జిహాద్‌ ‌ప్రకటించింది. ఎందుకో మరి షెహబాజ్‌ ‌కార్గిల్‌ ‌ఘర్షణ గురించి చెప్పలేదు. అది తన అన్నగారిని ఎడారులు పట్టించేసింది కాబట్టి తలుచుకోవడం ఇష్టం లేదేమో! సరే, ఇప్పుడే ఎందుకీ వైరాగ్యం? దేశంలో పది కిలోల గోధుమ పిండి రూ. 1500 పలుకుతుంటే, పిడికెడు పిండి కోసం జనం ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే కాస్త వైరాగ్యం కమ్మింది కళ్లని. పాక్‌ ‌నాయకులు ఎవరినీ బతకనివ్వం అంటూ అఫ్ఘానిస్తాన్‌ ‌తాలిబన్‌ ‌ప్రకటించిన తరువాత కళ్లు బైర్లు కమ్మిన ఫలితంగానే పాకిస్తాన్‌ ‌ప్రధాని ఆ మాటలు అన్నారని అనుకున్నా అనుకోవచ్చు.

యుద్ధాలతో బుద్ధొచ్చింది కాబట్టి, మేం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు షెహబాజ్‌. అయితే కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఏం చేస్తున్నదో అది ఆపేస్తేనే సదరు శాంతి సాధ్యమట. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను మరచిపోవడం వారికి సాధ్యం కావడం లేదట. ‘మాకు వైద్యులు ఉన్నారు. వృత్తి నైపుణ్యం కలిగిన శ్రామికులు ఉన్నారు. వారిని ఒక సంపదగా భావిస్తూ దేశ సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకుని ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని అనుకుంటున్నాం. అప్పుడు రెండు దేశాలు అభివృద్ధి చెందుతాయి. శాంతియుత జీవనమా, లేదా ఘర్షణ పడుతూ వనరులను వృథా చేయడమా అనేది మా రెండు దేశాల మీద ఆధారపడి ఉంది. మేం భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. అవి మాకు ఇచ్చినది ఏదైనా ఉన్నదీ అంటే మరింత పేదరికం, మరిన్ని కష్టాలు, ఇంకాస్త నిరుద్యోగం పెరగడమే’నని కూడా అంగీకరించారు. ‘మేం నేర్చుకోవలసిన గుణపాఠాలేవో ఆ యుద్ధాలతో నేర్చుకున్నాం. న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా వచ్చిన శాంతియుత వాతావరణంలో అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం’ అంటూ ప్రపంచం డంగైపోయేటంత మాట చెప్పారు. కానీ ఇలా తప్పంతా పాక్‌ ‌మీద వేసేస్తే, అక్కడి సైన్యానికీ, ఐఎస్‌ఐకీ రక్తపోటు వస్తుందన్న పచ్చి నిజం తెలుసు కాబట్టి షెహబాజ్‌ ఇలా ముక్తాయించారు విషయాన్ని. ఇది కూడా మోదీకి పంపిన సందేశంలోనిది. అందులో, ‘పాకిస్తాన్‌ ‌తన వనరులను బాంబుల మీద, ఆయుధ సామగ్రి మీద వృథా చేయదలుచుకోలేదు. మనం అణ్వస్త్రాలు కలిగినవాళ్లం. ఒకవేళ భగవంతుడు అనుగ్రహం లేక యుద్ధం జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు ఉంటారు’ అని వాక్రుచ్చారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించడం అంటే ఇదే! యుద్ధాలతో అంతో ఇంతో బుద్ధొచ్చింది అంటూనే మళ్లీ అణ్వస్త్రాల గురించి ప్రస్తావించడమంటే అది నోరేనా! నా మొదటి ప్రాధాన్యం దేశంలో సామరస్యం నెలకొల్పడం, భారత్‌తో శాంతిని కోరడమే కానీ, ఇదంతా కశ్మీర్‌ ‌సమస్య తేలనంత వరకు సాధ్యం కాదు అన్నారు షెహబాజ్‌, ఏ‌ప్రిల్‌ 10, 2022‌న. ఆయన ప్రధానిగా పదవి చేపట్టడానికి ముందు జియో న్యూస్‌ ‌సంస్థతో అన్న మాటలివి. మరి ఆయనలో వచ్చిన మార్పు ఏమిటి? బుద్ధిరావడం మాటేమిటి? అయినా పాక్‌కు బుద్ధి వచ్చిందంటే భారత్‌లో, ప్రపంచంలో ఏ ఒక్కరూ నమ్మరు. ఆ అవకాశం లేదు. షెహబాజ్‌ ‌పాక్‌కు బుద్ధొచ్చిన సంగతి ఆ న్యూస్‌ ‌చానల్‌తో చెబుతున్న సమయంలోనే ‘జీ న్యూస్‌’ ఇం‌కొక వార్త చెప్పింది. పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే జైష్‌ ఏ ‌మహమ్మద్‌ ఉ‌గ్రసంస్థ నిర్మాణంలో ఉన్న అయోధ్య రామమందిరం మీద రాబోయే కాలంలో పెద్దఎత్తున ఆత్మాహుతి దళాలతో దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న సంగతి నిఘా వర్గాలకు తెలిసింది. దీనితో భద్రతను పెంచవలసి వచ్చింది. అదీ వార్త.

పాకిస్తాన్‌ ఒక విఫల దేశంగానే కొనసాగాలని కోరుకుంటున్నది. లేకపోతే యుద్ధాలతో బుద్ధి తెచ్చుకున్నామని అంటూనే, ఉగ్రవాదం విషయంలో మాత్రం తమ బుద్ధి మారదనీ, దానిని పెంచి పోషించుకుంటూనే ఉంటామనీ పరోక్షంగా చెబుతున్న దేశానికి మిగిలేదేమిటి? దేశంలో కరవు దాడులు జరుగుతుంటే పొరుగు దేశం మీద అణుదాడుల హెచ్చరికలు చేసే తెంపరితనాన్ని ఏమనాలి? మూడు యుద్ధాలతో బుద్ధి వచ్చిందని చెబుతూ మరొక యుద్ధం గురించి మాట్లాడే దేశాన్ని ఎవరు బాగు చేస్తారు?

About Author

By editor

Twitter
Instagram