– పాలంకి సత్య

ఎండీవై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


సాయం సమయంలో మిహిరుడు నదీతీరంలో కూర్చుని ఉన్నాడు. విక్రమాదిత్య మహారాజు పట్టాభి షేక మహోత్సవం జరిగి నాలు గేళ్లు గడచిన సంద ర్భంగా నగరమంతా వేడుకలు జరుగుతున్నాయి. మహారాజు రాజ్యమంతటా ఉన్న శకులను పారద్రోలి దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పాడు. పట్టాభి షేకమయిన తరువాత తాను మిత్రుని దర్శించనే లేదు. బహు వ్యాపకాలలో నిమగ్నుడైన మహారాజు తనను పిలిపించలేదు.

‘‘మిహిరా!’’ అన్న పిలుపుతో తల తిప్పి చూసిన మిహిరునికి తండ్రి శిష్య సమేతుడై కన్పించాడు. ఉజ్జయినీ నగరంలో తన తండ్రి గురుకులం ప్రసిద్ధి చెందినది. భరతఖండమంతటా ఆయన విద్యా బోధన పేరు పొందినది. ఎందరో విద్యార్థులు ఆదిత్య దాసు వద్ద చదువుకుంటున్నారు.

మిహిరుడు లేచి నిలబడి ‘‘జనకుల రాకను గమనించ లేదు. క్షంతవ్యుడను’’ అని అన్నాడు. ఆదిత్య దాసు ‘‘వీరికి ఈనాడు భూభ్రమణం గురించి తెలియ చెప్పాను. నీవు మరింతగా వివరించి చెప్పు!’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

మిహిరుడు మనసులోనే సూర్యదేవునికి నమస్క రించి, తండ్రి పాదపద్మములకు ప్రణమిల్లి, విద్యార్థు లతో వివరణాత్మకంగా చెప్పసాగాడు.

‘‘మనకు కన్పించినవే నిజమని విశ్వసించడం మానవ నైజం. సూర్యుడు తూర్పున ఉదయించడం, పశ్చిమాన అస్తమించడం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.  వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరుగు తున్నది. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అన్పించడం భ్రమ మాత్రమే.’’

‘‘కానీ అలా విశ్వసించాలంటే కష్టంగా ఉంది’’ అని ఒక శిష్యుడన్నాడు.

‘‘ప్రత్యక్ష విషయాన్ని కాదనడం ఎలా?’’ అని మరో శిష్యుడన్నాడు.

‘‘సత్యానికీ, భ్రమకూ ఉన్న తేడాను గమనించవచ్చును. మనమొక పర్యాయం నౌకా విహారం చేద్దాం, రండి!’’ అని చెప్పి మిహిరుడు నదీ తీరానికి దారితీసి, చిన్న నావలో శిష్యులను ఎక్కించి, తానూ ఎక్కి, నావను నడవసాగాడు.

‘‘ప్రవాహ వేగంతోనే నావ కదులుతోంది కదా! మీరు

కూడా నడపడం ఎందుకు?’’ ఎవరో అన్నారు.

మిహిరుడు మరింత వేగంగా తెడ్డు వేస్తూ, ‘‘ఒకసారి మీరందరూ ఒడ్డు వైపు దృష్టి సారించండి!’’ అన్నాడు.

‘‘నావ ఎంత వేగంగా కదులుతోంది!’’ అన్న ఒక శిష్యుడితో మిహిరుడు అన్నాడు. ‘‘ఒడ్డున ఉన్న చెట్లు కదలడం లేదా?’’ అని.

‘‘అవును, చెట్లు రెండవ దిక్కుగా కదులుతున్నాయి.’’

‘‘చెట్లు కదలడం లేదు. కదులుతున్నట్లుగా మీకు అన్పిస్తోంది. అలాగే భూమి కదులడం కూడా వాస్తవం. సూర్యుడే కదులుతున్నట్లనిపించడం భ్రమ.’’

‘‘గురుపుత్రా! ఈ విషయాన్ని మీరెట్లు కని పెట్టినారు?’’

‘‘నేను కనుగొనలేదు. ఈ విషయం తెలిసిన వారు ఎప్పటి నుంచో భరతఖండంలో  ఉన్నారు. ఆర్యభట్టు ఈ సంగతి ఎప్పుడో గ్రంథస్థం చేశాడు.

అనులోమ గతిర్నౌస్థః

పశ్యత్య చలం విలోమగః యద్వతే

అచలాని భాని తద్వతే

సమపశ్చిమగాని లంకాయాం’’

‘‘ఆర్యభట్టు జైన ధర్మావలంబి కదా!’’ అన్న శిష్యునితో మిహిరుడు ‘‘అయిననేమి?’’ అని ప్రశ్నించాడు.

శిష్యుడు మౌనం వహించాడు.

‘‘ముక్తి పొందడానికి అనేక మార్గాలున్నాయి. ఏ మార్గమైనా అవలంబించవచ్చు. ఖగోళ శాస్త్రానికి జైనులూ, వైద్యశాస్త్రానికి బౌద్ధులూ చేసిన సేవ మరచి పోకూడదు. పారసీక దేశంలో అగ్నిని ఆరాధించే సంప్రదాయమున్నదట. ఎవరినీ కించ పరచకూడదు. ఏ మార్గం గొప్పదో చెప్పడం ఎవరికి సాధ్యం?’’ అంటూ మిహిరుడు నావను ఆపి, నెమ్మదిగా శిష్యులు దిగిన తరువాత తాను దిగాడు.

‘‘తిరుగుతున్నది భూమేనని గ్రహించారు కదా! మనకు కనిపించేదంతా వాస్తవం కాదు. మహర్షు లందుకే ‘సర్వమూ మాయ’ అని ప్రవచించారు.’’

******

విక్రమాదిత్యుడు రథం మీద తండ్రి నివసిస్తున్న వనానికి చేరుకున్నాడు. ఆశ్రమానికి యోజన దూరంలోనే రథాన్ని నిలిపి, కాలి నడకన తండ్రి కుటీరానికి చేరుకుని, జననీ జనకులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వారి అనుమతిపై దర్భాసనం మీద కూర్చున్నాడు.

‘‘కుమారా! అవంతీ రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పావనీ, శకులను పారద్రోలావనీ తెలిసింది. పరమశివుని ప్రసాదంగా లభించిన పుత్రుడవు నీవు. పుత్రపౌత్రాభివృద్ధిగా చిరకాలం వర్ధిల్లాలని ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యంలోని ప్రజల వలెనే భరతఖండ వాసులందరూ సుఖంగా ఉండేటట్లు చేయడం నీ కర్తవ్యం.’’

‘‘జనకుల ఆజ్ఞను శిరసావహించగలను.’’

‘‘గుప్తవంశీయులు మగధ చక్రవర్తులుగా పాలించిన కాలంలో భరతభూమి వైపు అన్యదేశాధి నేతలెవరూ కన్నెత్తి చూడడానికి సాహసించలేదు. పారశీరాజు, అస్సీరియా రాణి ప్రయత్నించి విఫలు లైనారు. ఆపైన గ్రీకు రాజు అలెగ్జాండరు, అతని వారసుడు సెల్యూకస్‌ ‌సింధునదిని దాటారు. కానీ వితస్తా (నేటి జీలం)నది నుండి వారికి తిరుగోమనం తప్పలేదు. గ్రీకులనే స్కంధగుప్త చక్రవర్తి శ్వేత హూణులని అన్నాడు.’’

విక్రమాదిత్యుడు తండ్రి మాటలను భక్తిశ్రద్ధ లతో వింటున్నాడు.

‘‘ఇవి నీకు తెలియనివి కావు. భరతవర్షమంత టినీ ఏకచ్ఛత్రం క్రిందకి తీసుకొనిరావడం నీ ప్రస్తుత కర్తవ్యం. ఏనాడైతే భరతభూమిలో అంతఃకలహాలు ఆగిపోతాయో ఆనాడే దురాక్రమణలు ఆగిపోగలవు. రాబోవు శరదృతువులో నీ దిగ్విజయయాత్ర ఆరంభ మగును గాక.’’

‘‘పితృదేవుల ఆజ్ఞ’’

ప్రొద్దుట జపమూ, పూజా కార్యక్రమమూ పూర్త యిన తరువాత ఆదిత్యదాసు మిహిరునితో ‘‘కుమారా, నీ విద్యాభ్యాసం ముగిసిన సందర్భంగా నీకు స్నాతకం నిర్వహించవలసి ఉన్నది. ముహూర్తం నిర్ణయిం చాను. బంధువులు సన్నిహితులైతే మంగళ ప్రదమవు తుంది. ఇవాళే అందరకూ ఆహ్వాన పత్రికలు పంపాలి!’’ అన్నాడు.

బ్రహ్మచర్య దీక్షలో ముప్పది మూడు నియ మాలకు లోబడి విద్యను అభ్యసించాలని సనాతన ధర్మం. తెలిసి కానీ, తెలియక కానీ, ఆపద్ధర్మంగా కానీ నియమాలను ఉల్లఘించవలసి రావచ్చు. అటువంటి పొరపాట్లకు చేసికొనవలసిన ప్రాయశ్చిత్త కర్మకు స్నాతకమని పేరు. స్నాతక క్రియ తరువాతే వివాహ అర్హత లభిస్తుంది. మిహిరుడు

‘‘మీ ఆజ్ఞ ప్రకారం ఆహ్వాన పత్రిక లను రాయగలను’’ అన్నాడు.

******

స్నాతక క్రియకు మిహిరుని మేనమామ తన భార్యతో, కుమార్తెతో వచ్చినాడు. మేనకోడలే కోడలుగా రావలెనన్నది మిహిరుని తల్లి ఛాయాదేవి కోరిక. ప్రాయశ్చిత్త కర్మకాండ పూర్తయ్యాక మేనమామ ‘‘నీ భవిష్యత్కార్య క్రమమేమిటి?’’ అని మిహిరుడిని అడిగాడు. ఖగోళశాస్త్రంలోని విశేషాం శాలు నేర్చుకోవడానికి పాటలీపుత్రం లేదా వారణాసి వెళ్లాలనుందని మేనల్లుడు సమాధానమిచ్చినాడు.

‘‘శిల్పశాస్త్రం కానీ, చిత్రలేఖనం కానీ పఠించవా?’’

‘‘ఖగోళ, జ్యోతిషశాస్త్రాలే నాకు ఆనందదాయ కములు. వాటికి అనుబంధంగా శిల్ప, వాస్తు, వైద్యశాస్త్రాలను నేర్చుకోవాలని కూడా ఉంది. ఏ విద్యలోనైననూ ప్రాథమికాంశాలు నేర్చుకొవడం మంచిది కదా!’’

మేనమామ సంభాషణను పొడిగించలేదు.

******

స్నాతకమైన వారానికి ఆదిత్యదాసు ‘‘కుమారా, ఖగోళశాస్త్రంలో విశేషజ్ఞాన సముపార్జనమనకు సూర్యదేవుని దయ ముఖ్యం. ఉజ్జయినికి కొంచెం దూరంలోనే కాపిత్థక క్షేత్రంలో భానుని మందిర మున్నది. అక్కడే ఉండి సూర్యుని ఆరాధించడం నీకు శ్రేయస్కరం. అను నిత్యమూ సూర్యదేవుని పూజిస్తూ, త్రిసంధ్యలలోనూ గాయత్రీ మంత్ర జపం కావిస్తూ ఆరుమాసాలైనా గడపడం మంచిది. ఏకభక్తం, అధశ్శయనం వంటి నియమాల గురించి మీకు చెప్పనవసరము లేదు’’ అన్నాడు.

‘‘జనకుల ఆజ్ఞను శిరసావహించగలను.’’ ‘‘రాబోవు రవివారం భానుసప్తమి. హస్త నీకు

సాధన తార, ఆనాడే నీ సూర్యారాధన ప్రారంభ మగునుగాక.’’

‘‘చిత్తం.’’

‘‘విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయమైంది. ఇవాళ నీవే వారికి అగస్త్య నక్షత్ర చలనాన్ని వివరించు!’’

‘‘పితృదేవుల ఆజ్ఞ’’ అని చెప్పి, తండ్రికి నమస్క రించి, మిహిరుడు శిష్యులు కూర్చున్న కుటీరంలోనికి ప్రవేశించినాడు. గురుప్రార్థన, సూర్యస్తుతి పూర్తి అయిన తరువాత పాఠం ప్రారంభమైంది.

‘‘అగస్త్యుని గురించి పురాణగాథలలో విస్తారంగా ఉంది. వింధ్య పర్వతానికి గర్వభంగం చేశాడనీ, వాతాపి, ఇల్వలులనే రాక్షసులను సంహరించినాడనీ మీరు చదువుకొని ఉంటారు. అట్లే అగస్త్యమహర్షి సముద్ర జలమంతటినీ తాగి వేసినాడనీ, సముద్రంలో ఉన్న రత్నాలూ, ప్రకాశ వంతంగా కనినిపించాయనీ  గ్రంథాలలో ఉన్నది.’’

మరికొన్ని ఖగోళ విషయాలు వివరించి, పాఠం ముగించి, కుటీరం వెలుపలకు వచ్చిన మిహిరునకు తండ్రి కన్పించాడు.

‘‘కుమారా! నీవు బోధించిన తీరు బాగున్నది. త్వరలోనే నీవు ఈ గురుకులంలో బోధనాబాధ్యతను సంపూర్ణంగా స్వీకరించెదవుగాక. నాకు వానప్రస్థం స్వీకరించే అవకాశం శీఘ్రముగా లభించుగాక.’’

‘‘పుత్రా! నీ వివాహం కూడా తొందరలోనే జరిగి గృహ నిర్వహణను కోడలు చేపట్టుగాక’’ అని అతని తల్లి అన్నది.

‘‘మీ ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష’’ మిహిరుడు అన్నాడు.

******

మిహిరుడు కాపిత్థక క్షేత్రంలోనే ఉంటూ, సూర్యదేవుని ఆరాధించ సాగాడు. ఉదయమే నదిలో స్నానం, ఆపైన సంధ్యావందనం, జాముసేపు గాయత్రీ మంత్ర జపం పూర్తి చేసికొని ఆలయ పూజా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, మధ్యాహ్న సంధ్యావందనం, గాయత్రీ మంత్ర జపం, స్వామికి నివేదించిన పదార్థాలతో భోజనం, సాయం సమ యంలో నదిలో స్నానం, గాయత్రీ  జపం, సంధ్యా వందనం, రాత్రి దేవాలయ ప్రాంగణంలో నేల మీద నిద్ర. భగవదారాధన తప్ప వేరే ఆలోచన లేదు.

శరదృతువు ప్రారంభమైనది. వానలు వెనుక పట్టాయి. ఒకనాటి సాయంకాలం భగవత్సన్నిధిలో మహారాజు విక్రమాదిత్యుడు పూజా సమయంలో కన్పించినాడు. సేవ పూర్తయిన తరువాత వెలుప లకు వచ్చిన మిత్రునివైపు మిహిరుడు ప్రశ్నార్థకంగా చూపులు పరపాడు.

‘‘యుద్ధ యాత్రకై రాబోవు అష్టమీ మంగళ వారం ప్రయాణమవుతున్నాను. నా యాత్ర దిగ్విజయంగా సాగాలని స్వామిని ప్రార్థించడానికై వచ్చాను’’.

ఆలయ ప్రాంగణంలో ఇద్దరూ ఆసీనులైనారు.

‘‘జనకుల వద్ద నా విద్యాభ్యాసం పూర్తయింది. పాటలీపుత్రంలో, కాశీనగరంలో ఆచార్యుల వద్ద విశేషాంశాలను నేర్చుకోవలసి ఉన్నది. ముందుగా గ్రహరాజు రవిని ప్రార్థించి, ప్రసన్నుని కావించుకునే ప్రయత్నంలో ఉన్నాను’’.

విక్రముడు నాలుగు సంవత్సరాలుగా రాజ్య నిర్వహణ ఎలా నిర్వహిస్తూ ఉన్నవాడో చెప్పి ‘‘మిహిరా, కర్తవ్య దీక్షలో కాలం గడచిపోతోంది. పురుషార్థాలలో ధర్మమే ప్రథమ స్థానంలో నిలబడు తుంది. సుఖమనే మాట పాలకుల విషయంలో ఉండనే ఉండదు కాబోలు. మనసులోని భావాలు ముఖం మీద కనిపించనివ్వరాదు. శత్రువులపై విజయం సాధించడం మీదనే దృష్టి నిలపాలి. ఏది కర్తవ్యం, ఏది నిషిద్ధం అని అనుక్షణం ఆలోచిస్తూ రాజతంత్రంలో నిమగ్నమవుతూ, మంత్రుల సలహా లతో కార్య నిర్వహణ చేస్తూ, అన్ని దిక్కులా అపాయ ముందని గుర్తుంచుకుంటూ, ఎవరినీ నమ్మలేని పరిస్థి తిలో ఉండే రాజులకు…’’ అన్న స్నేహితుని వ్యాక్యా లను మిహిరుడు ‘‘ఆనందం ఇవ్వగలిగినది ఒక్కటే, అది ప్రియమైన కాంతతో సమాగమం’’ అని పూర్తి చేశాడు. వాక్యపూరణ చేసిన తర్వాత అతడు ఆశువుగా శ్లోకరూపంలోనూ తన భావాన్ని వర్ణించాడు.

‘ఆకారం వినిగూహతాం రిపు బలం జేతుం సముత్తిష్ఠతాం

తంత్రం చింతయితాం కృతాకృత శత వ్యాపార శాఖాకులం

మంత్రి ప్రోక్త నిషేవితాం క్షితి భుజామా శంకినాం సర్వతో

దుఃఖాంభోనిధి వర్తినాం సుఖలవః కాంతా సమాలింగనం’ అంటూ.

విక్రమాదిత్యుడు ఆశ్చర్యంగా ‘‘మిహిరా!’’ అన్నాడు

‘‘ఆశ్చర్యమెందుకు? నేను శ్లోకం రచించి నందుకా?

‘‘నీవు కవిత్వం చెప్పలేవని నేనేనాడూ అనుకొన లేదు. అను నిత్యం దుఃఖసాగరంలో మునిగి తేలుతూ ఉండే వారికి సుఖ లేశమైనా లభించేది మిత్రుల సన్నిధిలోనని నేను చెప్పవలెననుకున్నాను. నీవు ప్రేయసీ ప్రసక్తి తేవడం ఆశ్చర్య కారకమైనది. నా కంటే వయసులో చిన్నవాడివి కదా!’’

‘‘నేను నిన్ను ఉద్దేశించి మాత్రమే అన్నాను’’

‘‘సఖుడా! కౌటిల్యుని అర్ధశాస్త్రం చదవలేదా; భార్యా సన్నిధిలో సైతం జాగ్రత్త వహించవలెనని ఆయన చెప్పలేదా?

‘‘అది సామాన్య మానవులకు వర్తింప చేయ తగిన నియమం. నీ వంటి సుందరుని, మహావీరుని, విద్యావంతుని, కళాకోవిదుని పొందిన యువతి ఏనాడూ ద్రోహచింతనను చేయదు.

విక్రమాదిత్యుడు సన్నగా నవ్వి ‘‘మిత్రధర్మంలో నిన్ను మించినవారు లేరు’’ అన్నాడు.

స్నేహితులిద్దరూ శయనించిన తర్వాత మిహిరుని మనసులో సందేహం తలెత్తింది. ‘‘ప్రియా సమాగం ప్రసక్తిని తాను విక్రముని పరంగానే చేసినాడా? తన మనస్సులో వివాహ వాంఛ కలుగుతున్నదా? సూర్యా రాధనలో నిమగ్నుడై ఉండాలే తప్ప వేరే ఊహలు రానివ్వరాదు. తన మనస్సు చంచలం కాకుండా ఆదిత్యుడే అనుగ్రహించుగాక’’.

About Author

By editor

Twitter
Instagram