– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీలో నేతలు రెండు వర్గాలుగా నిలువునా చీలిపోయారు. టీఆర్‌ఎస్‌లో ఏకంగా ఎమ్మెల్యేలే అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్‌ అం‌టే భయం, భక్తితో ఎవరూ బాహాటంగా విమర్శలు చేయలేదు. కానీ, ఇప్పుడు కొందరు నేతలు బహిరంగంగానే అసమ్మతి తెలియజేస్తున్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబం కొంతమందికే అండగా ఉంటున్నారని, పార్టీ కోసం, తెలంగాణ సాధన కోసం పాటుపడిన వాళ్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌లో కుంపటి మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

శాసనసభ ఎన్నికలకు యేడాది కూడా సమయం లేదు. 2019 డిసెంబర్‌ 7‌న ఎన్నికలు జరిగాయి. ఈ లెక్కన (ఐదేళ్లు) ఇంకా 11 నెలల సమయం మాత్రమే ఉంది. అంటే, ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దూకాలి. కానీ, భారతీయ జనతా పార్టీ మినహా మిగిలిన రెండు పార్టీలు ఆధిపత్య పోరుతో సతమతమవుతున్నాయి. ఆ పార్టీల నేతలు వర్గాలుగా చీలిపోతున్నారు. ఓ పార్టీలో అయితే రాజీనామాల అస్త్రాలు ప్రయోగిస్తుండగా.. మరో పార్టీ నేతలు మాత్రం అధినేతపైనా, ఇతర నేతలపైనా ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయమిది. సగటు ఓటరు కుతూహలంగా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న తరుణం కూడా ఇదే. కానీ ఉన్నట్లుండి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇలాంటి కుదుపులు సహజమే అనుకుంటూ సరిపెట్టుకుంటున్న క్షణంలో.. భారత రాష్ట్ర సమితిలో సంభవించిన పరిణామం ఆసక్తి రేపుతోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తిన అయిదుగురు ఎమ్మెల్యేల విషయంలో అధిష్టానం ధోరణి ఏంటనే విషయం ఇంకా తేలనప్పటికీ.. గులాబీ బాస్‌ ‌కనుసన్నల్లోనే రాజకీయం చేసే నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న ఆ పార్టీలో ఏకంగా అయిదుగురు ఎమ్మెల్యేలు ఓ మంత్రిపై నిప్పులు చెరిగారు. మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్‌ని పట్టించుకోవడం లేదంటూ అయిదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, వివేకానంద, అరికెపూడి గాంధీ, సుభాష్‌ ‌రెడ్డి, మాధవరం కృష్ణారావు గళమెత్తారు. నిజానికి బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో మొదట్నించి ఇలాంటి విషయాలను అంతర్గతంగా అధినేత కేసీఆర్‌ ‌దగ్గరో, అది వీలు కాకుంటే పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దగ్గర విన్నవించుకోవడం, నిర్ణయం వాళ్లకే వదిలేయడం జరిగేది. కానీ, తొలిసారి ఏకంగా మీడియా ముందుకొచ్చారు ఈ జీ-5 ఎమ్మెల్యేలు. అప్పటికే అధినేతకు చెప్పేందుకు ప్రయత్నించి, అది వీలు కాకపోవడంతో రహస్యంగా భేటీ అయ్యారా?

ఆ భేటీ గురించి కొందరు మీడియాకు లీక్‌ ‌చేయడంతో అనివార్యంగా మీడియా ముందుకొచ్చారా? అన్నది తేలాల్సి ఉంది.

డిసెంబర్‌ 19‌న మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో అయిదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన వార్త మీడియాలో వచ్చినా అటు అధినేత కేసీఆర్‌ ‌గానీ, ఇటు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌గానీ వెంటనే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించలేదు. అయిదుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడిన తరువాత కూడా ఎవరూ స్పందించలేదు. ఒక దశలో కేటీఆర్‌తో ఈ ఎమ్మెల్యేలు భేటీ అవుతారని ప్రచారం జరిగినా.. ఆయన్నుంచి కూడా ఎలాంటి పిలుపూ రాలేదు. కాబట్టి అధినేతలు దీనిని సీరియస్‌గా తీసుకోలేదని అర్థమవుతోంది. ఒకవేళ కేసీఆర్‌ ‌గనక వీరిని సీరియస్‌గా తీసుకుంటే తానే స్వయంగా పిలిపించుకోవడమో లేక కేటీఆర్‌ను వారితో మాట్లాడమని ఆదేశించడమో జరిగేది. కానీ అలాంటిదేమీ జరగలేదు.

అటు కాంగ్రెస్‌ ‌పార్టీలో అయితే గత పది రోజులుగా అంతర్గత కుమ్ములాటల రచ్చ కొనసాగుతోంది. టీపీసీసీ కమిటీతో పాటు పొలిటికల్‌ అఫైర్స్ ‌కమిటీలను ప్రకటించిన నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రచ్చ మొదలైంది. అది రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తగ్గే సంకేతాలు కూడా కనపడటం లేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌కూడా రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజా పరిణామాలపై ఇంఛార్జి కార్యదర్శులు హైకమాండ్‌కు నివేదికలిచ్చారు. వివాదం మరింత ముదరకుండా చూడాలని ఏఐసీసీ పెద్దలు సీనియర్‌ ‌నేతలకు ఫోన్లు చేశారు. పార్టీలో సమస్యలు ఉంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సూచించారు. అయినా పరిస్థితి సర్దుబాటు కాలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి లక్ష్యంగా సీనియర్లు ఏకతాటిపైకి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన ఆ పార్టీ నేతలు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ.. రేవంత్‌పై గళమెత్తారు. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలతో అసలైన కాంగ్రెస్‌ ‌వాదులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. డిసెంబర్‌ 20‌న నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ పెద్దలు హాజరైనా స్థానిక నేతలు మాత్రం ఖాతరు చేయలేదు. వివాదాన్ని పెద్దది చేస్తున్నారు. 12 మంది నేతలు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

బీజేపీ దూకుడు

తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ దూకుడు మరింత పెంచింది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మలచుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీలోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు మంతనాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి సీనియర్లు రంగంలోకి దిగారు. బీజేపీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐదుగురు కాంగ్రెస్‌ ‌సీనియర్లతో ఆ పార్టీ మంతనాలు జరిపింది. వీరిలో ముగ్గురితో హైదరాబాదు శివారులో బండి సంజయ్‌ ‌భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు వీరి భేటీ కొనసాగిందంటున్నారు. పార్టీలోకి రావాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ ‌కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని సంజయ్‌ ‌వారికి వివరించారని చెబుతున్నారు. అయితే, ఆ ముగ్గురు నేతలు తమకు ఆలోచించుకునే సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ‌నేతలతో డీకే అరుణతో ఫోన్‌ ‌మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. వీరిలో ఒకరు దక్షిణ తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఉత్తర తెలంగాణకు చెందిన నేత అని అంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే మార్చిలోపు పెద్ద సంఖ్యలో చేరికలకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచే 20 నుంచి 30 మంది నేతలు, ఇక, బీఆర్‌ఎస్‌ ‌నుంచి మరో 10 నుంచి 20 మంది నేతలు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందంటున్నారు.

ఎన్నికలు ముందస్తుగా వచ్చినా.. షెడ్యూలు ప్రకారం వచ్చినా గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో కమలనాథులు ఉన్నారు. మార్చి నాటికి బలమైన నేతలు పార్టీలో చేరితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులను గుర్తించడం సులభంగా ఉంటుందని, ఆ మేరకు కసరత్తును వేగవంతం చేయాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, కొత్త ఏడాదిలో మార్చిలోపు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నుంచి కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సదరు నేతలను గుర్తించి రాష్ట్ర నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ మేరకు బండి సంజయ్‌, ‌చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, ‌మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి నుంచి వారు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడమే కాకుండా చేరికలకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను గుర్తించే విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలని రాష్ట్ర నేతలకు అమిత్‌ ‌షా స్పష్టం చేసినట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిపై ధ్వజమెత్తిన సీనియర్లలో కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అంతేకాదు, వారిలో నలుగురు నేతలు బీఆర్‌ఎస్‌తో కూడా మంతనాలు జరుపుతున్నారని స్థానిక నాయకులు ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

About Author

By editor

Twitter
Instagram