– బంకించంద్ర చటర్జీ

సత్యానందుడు కొంతలో కొంత దుఃఖి తుడైనాడు. ‘‘ఏది ఏమైనా కానీండి. ఈ ప్రదేశమంతా ఇప్పుడు మన అధీనంలోనికి వచ్చింది. మనతో యుద్ధం చేయగలవారు ఇక్కడ ఎవరూ లేరు. ఈ వీరేంద్ర భూమిపై మనం సంతాన రాజ్యాన్ని ప్రతిష్టించాలి. ప్రజల నుండి పన్నులు వసూలు చేయండి. రాజధానిని ఆక్రమించుకుందుకు సేనను పోగు చేయండి. మనం గెలిచిన సంగతి తెలిస్తే చాలామంది సంతానులు వచ్చి మన జండా కిందకు చేరుతారు’’ అన్నాడు.

ఈ మాటలకు జీవానందుడు, మిగిలినవారు సత్యానందునకు ప్రణామం చేశారు. ‘‘తమ ఆజ్ఞ ఎట్లో, అట్లే మహారాజాధిరాజా! అయితే మేం ఈ అరణ్యంలోనే తమకు సింహాసనం నెలకొల్పుతాం’’ అన్నాడు.

సత్యానందుడు తన జీవితంలో ప్రథమ పర్యాయం కోపగించుకున్నాడు. ‘‘ఏమన్నారు? నాకు సింహాసనమా? నన్ను మట్టిబొమ్మతో సమానం చేస్తారా? మనం ఎవరం? సంతానులం! మనమె వరమూ మహారాజులం కాము. కేవలం సన్యాసులం. ఈ ప్రదేశానికి రాజు సాక్షాత్తు వైకుంఠనాథుడే.

ఇక్కడ ప్రజాతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాం. నేనైతే, ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం తప్ప ఇంకే ఆశ్రమాన్నీ, దీక్షను స్వీకరించను. ఈ విషయం మాత్రం చక్కగా గమనించండి. ఇక మీరు మీ మీ పనులలో నిమగ్నులు కావచ్చును.’’

నలుగురు లేచి సత్యానందునకు ప్రణామం చేశారు. సత్యానందుడు మహేంద్రుని అట్టే ఉంచాడు. మిగిలిన ముగ్గురూ వెళ్లిపోయారు. మహేంద్రునితో సత్యానందుడు ఇలా అన్నాడు : ‘‘మీరందరూ విష్ణు మంటపంలో సంతాన దీక్ష స్వీకరించారు. భవానంద, జీవానందులు తమ దీక్షను అతిక్రమించి ప్రవర్తిం చారు. భవానందుడు ప్రతిజ్ఞా భంగానికి ప్రాయశ్చి త్తాన్ని నేటి యుద్ధంలో జరుపుకున్నాడు. ఏదో ఒక రోజున జీవానందుడు కూడా ప్రాయశ్చిత్తం నిమిత్తం దేహత్యాగం చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది.

నీవొక్కడవే ఈ దీక్షను, వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నావు. సంతానుల కార్యం నెరవేరింది. నీవిక మామూలు గృహస్థు జీవితం మొదలు పెట్టవచ్చు.’’

మహేంద్రుని కన్నులలో అశ్రువులు జలజల రాలినాయి. అతి కష్టం మీద ఇలా అన్నాడు : ‘‘మహారాజా! నేను ఎవరిని చూచుకుని సంసారిని అవగలను? భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె ఎక్కడుందో తెలియదు. ఏమీ జాడ తెలియని దాన్ని గురించి ఎక్కడ వెదుకుతూ తిరగను? తిరిగితే మటుకు ప్రయోజనం ఏమిటి?’’

సత్యానందుడు నవీనానందుని పిలిపించాడు. అతడిని మహేంద్రునకు ఎరుకపరుస్తూ ‘‘వీరు నవీనానంద గోస్వామి అనే మహాత్ములు. అతి పవిత్రులు.

నాకు పరమ ప్రియశిష్యులు. నీకు నీ కుమార్తెను వెదికి ఇవ్వగలరు’’ అన్నాడు. శాంతికి కనుసైగలతో ఏమో చెప్పాడు. శాంతి గ్రహించి సరేనని జవాబు చెప్పింది.

మహేంద్రుడు నవీనానందుని ‘‘మిమ్ము కలుసు కోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది?’’ అని అడిగాడు.

‘‘నా ఆశ్రమానికి రండి’’ అంటూ శాంతి ముందుగా నడిచింది.

మహేంద్రుడు సత్యానందునికి పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు. శాంతి వెంట వెళ్లి ఆమె ఆశ్రమంలో కూర్చున్నాడు.

అప్పటికి చాలా రాత్రి అయింది. అయినా, శాంతి విశ్రాంతి కోసం వేచి ఉండక నగరం వైపు నడిచింది.

అందరూ వెళ్లిపోయిన తరువాత సత్యానందుడు భగవంతుడిని తలుచుకుంటూ నేలమీదనే పక్క పరుచుకున్నాడు.

ఎవరో వచ్చి అతని తలను తాకి ‘‘నేను వచ్చాను’’ అన్నారు.

బ్రహ్మచారి లేచి నిర్ఘాంతపోయి, వ్యఘ్రభావంతో ‘‘వచ్చారా? దేనికి?’’ అన్నాడు. ‘‘రోజులు ముగిశాయి!’’ ‘‘హే ప్రభూ! ఈరోజుకు క్షమించండి. రానున్న మాఘ పౌర్ణమికి మీ ఆజ్ఞ నెరవేర్చి అనుసరిస్తాను’’ అన్నాడు సత్యానందుడు.

చతుర్థభాగము

1

ఆ రాత్రి హరిధ్వనితో దిగంతం అంతా నిండి పోయింది. సంతానులు ‘వందేమాతరమ్‌’, ‘‌జయ జగదీశ హరే’ గీతాలు పాడుకుంటూ అక్కడక్కడ గుంపులుగా గుమిగూడి సంచరిస్తున్నారు. శత్రుసేనల శస్త్రాలు, వస్త్రాలు లాక్కుంటున్నారు. గ్రామాల మీద, నగరాల మీద పడి అడ్డం వచ్చినవారితో ‘‘వందే మాతరం అను, లేకపోతే చంపివేస్తాం’’ అని బెదిరి స్తున్నారు. ఇళ్లలో దూరుతున్నారు. ఆస్తిపాస్తులను వశం చేసుకుంటున్నారు. సంపదలు కైవసం చేసు కుంటున్నారు. ఆ ఒక్కరాత్రి మాత్రం అన్ని నగరాల లోను, గ్రామాలలోను కోలాహలంగా ఉంది. సంతా నుల చర్యలను ఎవరూ అడ్డగించలేకపోతున్నారు. నగరాధ్యక్షులు, పాలకులు ఏమీ చేయలేకపోతున్నారు. నగరంలోనివారు ఇదంతా వేడుకగా చూస్తున్నారు. ‘‘ఏమయింది, ఏమయింది?’’ అనుకుంటూనే రాత్రంతా గడిపివేస్తున్నారు.

హిందువులు ‘‘ఇక మహమ్మదీయ రాజ్యం అంతరించింది. హిందూరాజ్యం స్థాపితమయింది. మంచిపని జరిగింది’’ అని ఆనందిస్తున్నారు. మహమ్మదీయులు ఏడుపు దిగమింగుకుంటున్నారు.

ఈ సంగతులన్నీ కల్యాణి వరకు వెళ్లినాయి. బాలురు, వృద్ధులు, స్త్రీలు అందరికీ ఈ సంగతులు తెలిసినాయి. ఆమె తన మనసులో ‘‘ఓ జగదీశ్వరుడా! ఈనాటికి నీ కార్యం సఫలంగా నెరవేరిందా? నేడే నేను స్వామి దర్శనానికి బయలుదేరుతాను. నాకు సహాయం చేయి. అండదండలుగా ఉండు’’ అని భగవంతుని ప్రార్ధించుకుంది.

కల్యాణి పక్కమీద నుండి లేచి కిటికీ తలుపు తెరిచి రహదారి వైపు చూచింది. రహదారి శూన్యంగా ఉంది. ఎవరూ కానరావడం లేదు. నెమ్మదిగా తలుపు తెరుచుకుని గౌరీదేవి గృహం విడిచింది. పూర్తిగా రోడ్డుమీదకు రాకుండానే మనసులో భగవంతుని స్మరించుకుంది, పదచిహ్న గ్రామానికి ఎలాగయినా తనను నిరపాయంగా చేరవేయమని.

కల్యాణి నగరద్వారం చేరుకుంది. కాపలామనిషి ‘‘ఎవరు వారు?’’ అని అడిగాడు. కల్యాణి భయపడి పోయి ‘‘నేను స్త్రీని!’’ అంది.

‘‘వెళ్లటానికి అనుమతి లేదు’’ అన్నాడు కాపలా దారు. కాని ఈ మాటలు జమేదారు చెవిన పడ్డాయి. అతడు ‘‘వెళ్లటానికి అనుమతి అక్కర్లేదు. లోనికి రావటానికి మాత్రం అనుమతి కావాలి’’ అని హుకుం ఇచ్చాడు.

కాపలాదారు ‘‘అమ్మా! మీరు వెళ్లదలుచుకుంటే వెళ్లవచ్చును. నాకు అభ్యంతరం లేదు. కాని ఈ రాత్రి ఇలా ఒంటరిగా బయటకు వెళ్లడం అంత క్షేమకరం కాదు. ఎవరికి తెలుసునమ్మా, ఏ క్షణంలో ఏం విపత్తు జరుగుతుందో! దొంగల బారిన పడ్డా వంటే చాల చిక్కులలో, ఇబ్బందిలో పడతావు. అందుకని ఇంతగా చెబుతున్నాను’’ అన్నాడు.

కల్యాణి, ‘‘బాబూ! నా దగ్గర ఏమున్నది దోచు కోవటానికి? దొంగలు నన్నేం చేయగలరు?’’ అంది.

‘‘వయసు ఉందిగదమ్మా! పాపిష్టిది వయసు. దొంగలు నీ యవ్వనాన్నే దోచుకుంటారు’’ అన్నాడు.

కల్యాణి విపత్తును శంకించింది. కాని వడివడిగా ముందుకే నడిచింది.

ఆమె కొంతదూరం నడిచిన మీదట ఒక దుర్మార్గుడు కొంగుపట్టుకు లాగి ‘‘ఎవరు చంద్రముఖీ నీవు?’’ అని దారికి అడ్డుతగిలాడు. కాని అతడు అత్యాచారం చేయగలగడానికి ముందే వెనకనుంచి ఒక యువక సన్యాసి వచ్చి అతనిని దండించి పంపివేశాడు.

యువసన్యాసి కల్యాణితో ‘‘ఎక్కడకు వెడుతున్నా వమ్మా?’’ అని అడిగాడు.

‘‘పదచిహ్న గ్రామానికి.’’

సన్యాసి విస్మితుడైనాడు. ‘‘ఏమన్నావు? పదచిహ్నా నికా?’’ ఇలా అంటూనే కల్యాణిని రెండు బాహువుల లోను బంధించి ముఖకవళికలు పరిశీలించసాగి నాడు. అకస్మాత్తుగా పురుషస్పర్శ కలగడంతో భయ భీతితో రోమాంచిత అయి ఏడవసాగింది. పారిపోవ టానికి శక్తి లేదు. అగంతకుడు ఆమె ముఖంలోనికి తీక్షణంగా చూచి ‘‘ఓహో! తెలిసింది. నీవు కల్యాణి అనే భూతానివి. కదూ?’’ అన్నాడు.

కల్యాణి భయవిహ్వల అయి ‘‘మీరెవరు?’’ అంది.

‘‘నేను నీకు దాసానుదాసుడను. ఓ సుందరీ! నాపట్ల ప్రసన్నురాలవు అవు.’’

కల్యాణి గర్హిస్తూ ‘‘ఇలా అవమానించటానికేనా నన్ను మీరు ఆ దుర్మార్గుని నుండి రక్షించారు? బ్రహ్మ చారులు, సన్యాసులు అవలంబించవలసిన ధర్మం ఇదేనా? ఇప్పుడు నేను నిస్సహాయను. లేకపోయి నట్లయితే జోడుతో నిన్ను దండించేదానను’’ అంది.

‘‘నీవంటి కుసుమకోమల శరీరాన్ని స్పర్శించాలని చాలాకాలంగా కోరికగా ఉంది!’’ అంటూ బ్రహ్మచారి ఆమెను కౌగలించుకున్నాడు. ఆ కౌగలింతకు కల్యాణి నవ్వింది. ‘‘అలా చెప్పవేం మరి! నీవూ స్త్రీవేనంటే నేనంత ఉద్రేకపడకపోదునుగా’’ అంది. ‘‘అయితే మహేంద్రునికోసం వెదుక్కుంటూ వెడుతున్నావా?’’

‘‘నీవెవరు? నీకు అన్నీ తెలుసునా?’’

‘‘నేను సంతాన నాయకుడిని. మహేంద్రుడు కావాలంటే నీవిప్పుడు పదచిహ్నం వెళ్లనవసరం లేదు.’’ కల్యాణి ఏడవసాగింది.

‘‘ఎందుకు ఏడుస్తావు? నాతోరా. తీసుకు వెడతాను’’ అంది శాంతి. శాంతి కల్యాణిని తీసుకుని అరణ్యంలో ప్రవేశించింది.

2

శాంతి ఆ సాయంకాలం నగరంవైపు వెళ్లే ముందు జీవానందునితో ఇలా చెప్పింది. ‘‘నేను నగరానికి వెడుతున్నాను. మహేంద్రుని భార్యను తోడ్కొని వస్తాను. నీవు ఈలోపుగా మహేంద్రునకు అతడి భార్య జీవించే ఉన్నదని చెప్పు.’’

జీవానందుడు భవానందుని ద్వారా కల్యాణి వృత్తాంతం అంతా ఎరిగి ఉన్నాడు. ఈ కథనమంతా మహేంద్రునకు వినిపించాడు, క్రమక్రమంగా ముందు మహేంద్రుడు ఇదంతా యదార్ధమని, తన భార్య జీవించే ఉన్నదని నమ్మటానికి నిరాకరించాడు. కాని చివరకు ఆనందాతిశయంతో అవాక్కయి ఉండిపోయాడు. ఆ రాత్రి నవీనానందుని సాయం వల్ల మహేంద్రుడు తన భార్యను కలుసుకోగలిగాడు.

మరునాడు ఉదయం నవీనానందునితో కల్యాణి ‘‘మీకు చాలా రుణపడి ఉన్నాం. మా అమ్మాయి సుకుమారి ఎక్కడున్నదో తెలియచేసి మీ ఉపకారానికి పరిపూర్ణతను తెచ్చుకోండి!’’ అంది.

శాంతి జీవానందుని వంక చూచి ‘‘నేనిప్పుడు నిద్రపోవాలి. రెండు రోజులుగా నాకు నిద్రేలేదు. నేను కూడా మనిషినే కదా!’’ అంది.

కల్యాణి చిరునవ్వు నవ్వింది. మహేంద్రుని వంక చూచి జీవానందుడు ‘‘ఆ భారం నేను వహిస్తాను. మీరు పదచిహ్న గ్రామానికి చేరుకోండి. మీ బిడ్డను మీకు అక్కడే అప్పగిస్తాను’’ అన్నాడు.

జీవానందుడు భర్కయీపుర నివాసి దగ్గరకి బిడ్డను తీసుకురావటానికి వెళ్లాడు.

నిమాయి పిల్లను ఇవ్వటానికి ముందు నిరాకరించింది. కాని జీవానందుడు ఊరడించి నచ్చ చెప్పిన మీదట సరేనంది.

3

పదచిహ్న గ్రామంలో కొత్తదుర్గంలో నేడు మహేం ద్రుడు, కల్యాణి, జీవానందుడు, శాంతి, నిమాయి, ఆమె భర్త, సుకుమారి అందరూ సమావేశం అయి నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. శాంతి ఇంకా నవీనానందుని వేషంలోనే వుంది. కల్యాణితో ఆమె ముందే చెప్పింది. తన ఉనికిగాని, తను జీవానందుని భార్యననిగాని మహేంద్రునితో చెప్పవద్దని!

ఒకరోజు కల్యాణి తన అంతఃపురంలోనికి నవీనా నందుని పిలిపించింది.

నవీనానందుడు కాపలావారి అడ్డంకిని గమ నించకుండానే అంతఃపురంలోనికి వెళ్లి ‘‘ఎందుకు నన్ను పిలిపించావు?’’ అంది.

‘‘పురుషవేషంతో ఎన్నాళ్లుంటావు ఇంకా? నా పతి ముందు నీ వేషం విప్పివేద్దామని పిలిపించాను.’’

‘‘దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కల్యాణీ!’’ అన్నాడు నవీనానందుడు, చాలాసేపు ఆలోచించి.

ఇద్దరూ ఈ విషయం తీవ్రంగా ఆలోచించసా గారు. నవీనానందుడు అంతః పురంలో ప్రవేశించా డని విని మహేంద్రుడు కూడా ఏమి జరుగుతుందో చూద్దామని వెనుకనే నడిచాడు. మహేంద్రుడు నేరుగా కల్యాణి గదిలోనికి వెళ్లాడు. నవీనానందుడు నిలువ బడి ఉన్నాడు. కల్యాణి అతని వంటి మీది పులి చర్మాన్ని విప్పుతోంది. ఈ దృశ్యం చూచి మహేం ద్రుడు అశ్చర్యపడ్డాడు. ఎంతో కోపంకూడా వచ్చింది.

నవీనానందుడు నవ్వుతూ మహేంద్రునివంక చూచి ‘‘ఏమి గోస్వామిజీ! సంతానులపై అవిశ్వాసం కలుగుతోందా?’’ అన్నాడు.

‘‘భవానందుడు విశ్వసనీయుడేనా?’’ ,

‘‘ఏమి, అతడి పులిచర్మాన్ని కల్యాణి విప్పినదా?’’ అంటూ నవీనానందుడు కల్యాణి చేతిని దొరక బుచ్చుకుని ఆమె పనికి అంతరాయం కలిగించాడు.

‘‘అయితే ఏమి?’’ ‘‘నా పైన విశ్వాసము, కల్యాణి పట్ల అవిశ్వాసం ఎలా సాధ్యం అవుతాయి?’’

మహేంద్రుడు అప్రతిభుడు అయినాడు. ‘‘అదేం? నేను అవిశ్వాసం ఎందుకు ప్రకటిస్తాను?’’

‘‘ఏమీ అనుమానం లేకపోతే నా వెనుకనే అంతఃపురంలోనికి చొరబడడం దేనికి?’’

‘‘కల్యాణితో కొద్దిగా మాట్లాడాలి. అందుకే వచ్చాను. అంతకంటే ఇంకేమీలేదు.’’

‘‘అయితే ఇప్పుడు కాదు సమయం. నేను కూడా ఈమెతో ఏకాంతంలో కొంత మాట్లాడాలి. మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు గనుక తరువాత తీరు బడిగా మాట్లాడుకోవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి’’ అన్నాడు నవీనానందుడు.

మహేంద్రుడు ఏమీ అనలేకపోయినాడు. అతడికి ఏమీ అర్ధం కావడంలేదు. అపరాధం ఎక్కడ ఉన్నదో అసలు అర్థం కావడంలేదు. కల్యాణి వైఖరి కూడా విచిత్రంగా ఉంది. ఆమె కూడా తప్పు చేసినదాని మాదిరిగా పారిపోవడం లేదు. భయపడడంలేదు. సిగ్గు అభినయించడంలేదు. ఇటువంటి కల్యాణి అపరాధి ఎలా అవుతుంది? మహేంద్రుడు మనసు తర్కవితర్కాలతో నిండిపోయింది. శాంతి మహేం ద్రుని మనసులో రగులుతున్న ఈ తర్జనభర్జనల దురవస్థ గమనించి కల్యాణికి ఏదో సైగచేసింది. కల్యాణి నవీనానందుని గడ్డం లాగివేసింది. నవీనా నందుడు స్త్రీ అనే విషయం తేటతెల్లం అయింది. పులిచర్మం కూడా తీసి అవతల పెట్టింది. శాంతి దొరికిపోయినట్లుగా తలవాల్చుకుని నిలబడింది.

మహేంద్రుడు శాంతిని ‘‘నీవెవరు?’’ అని అడిగాడు.

‘‘శ్రీమాన్‌ ‌నవీనానంద గోస్వామి!’’

‘‘అది సరే! నీవు స్త్రీవి కదా?’’

‘‘చూస్తూనే వున్నారుగా!’’

‘‘సరే ఒకమాట చెప్పు, నీవు స్త్రీవయి ఉండి, జీవానందునితో పాటు ఎందుకు తిరుగుతున్నావు?’’

‘‘దీనికి జవాబు చెప్పకపోతేనేం?’’

‘‘నీవు స్త్రీవని జీవానందుడికి తెలుసా?’’ ‘‘తెలుసు’’

విశుద్ధాత్ముడైన మహేంద్రుడు ఇప్పుడు చాలా దుఃఖితుడైనాడు. ఈ దృశ్యం చూచి కల్యాణి మాట్లాడ కుండా ఉండలేకపోయింది. ‘‘ఈమె జీవానంద స్వామివారి ధర్మపత్ని శాంతిమణీదేవి!’’ అంది.

మహేంద్రుని ముఖంలో ప్రసన్నత గోచరిం చింది. తరువాతి క్షణంలో అతని ముఖం తిరిగి గంభీరమైంది. కల్యాణి తెలుసుకుని ఇలా అంది. ‘‘ఈమె పూర్ణ బ్రహ్మచారిణి!’’

(వచ్చేవారం ముగింపు)

About Author

By editor

Twitter
Instagram