సంపాదకీయంల

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి – 07 నవంబర్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఉమ్మడి పౌరస్మృతి పేరెత్తగానే చాలా వర్గాలలో ఒక ఉలికిపాటు కనిపిస్తుంది. హక్కుల రక్షణకు రాజ్యాంగం కావాలి. ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాల పరిరక్షణకీ రాజ్యాంగమే అడ్డదారిలో ఉపయోగపడాలి. హక్కులకు వక్రభాష్యం చెప్పి మెజారిటీ ప్రజల మనోభావాలు గాయపరిచే పనిలో కొన్ని మైనారిటీలు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటున్న మాట వాస్తవం. అంటే, మెజారిటీ ప్రజల మీద స్వారీ చేయడానికి సౌకర్యంగా ఉండేందుకు రాజ్యాంగం కావాలి. కానీ అదే రాజ్యాంగం ప్రవచిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తేవాలని ప్రయత్నిస్తే మాత్రం గంగవెర్రులెత్తిపోతున్నారు. భిన్న సంస్కృతుల దేశం మాదీ అంటూ వీలైనప్పుడల్లా పరవశంతో పలికేవారంతా, ఆ భిన్నత్వ రక్షణకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావననే సహించరు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టే ఆర్టికల్‌ 370 ‌మీద వృద్ధ రాజకీయ పక్షం కాంగ్రెస్‌ ‌మొదలు కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులు, ఉదారవాదులు ఎలా రెండు నాల్కల ధోరణి అవలంబించారో, ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ అదే అవలంబిస్తున్నారు. భారతీయతనే కాదు, దానిని సమర్థించే బీజేపీని నిలువరించడానికి ఎంత నైచ్యానికైనా దిగజారే శక్తులు ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనను కూడా బీజేపీ మీద బురద చల్లడానికి ఉపయోగించు కుంటున్నాయి.

ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ సమర్ధిస్తున్నది. ఉత్తరాఖండ్‌ ఎన్నికల సమయంలో ఆ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని చేర్చింది. తాజాగా త్వరలో జరిగే గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికలలోను బీజేపీ ఆ నినాదం ఇవ్వబోతున్నది. అందుకే దేశమంతటా ఒక్కసారిగా పాతపాట మళ్లీ వినపడడం మొదలైంది. దేశమంతా ఒకేసారి ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తే ముస్లింల నుంచే కాదు, కొందరు హిందువుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ ప్రవేశపెడుతోందని అదేదో సరికొత్త సత్యావిష్కరణ అన్నట్టు మాట్లాడుతున్నాయి విపక్షాలు. ఇలాంటి వాళ్లంతా చాలా సౌకర్యంగా విస్మరిస్తున్న ఒక వాస్తవం-రాజ్యాంగంలోని 44వ అధికరణం దేశమంతా ఒకే చట్టం అమలు చేయాలనే చెబుతోంది. మరి అదే రాజ్యాంగం 25వ అధికరణం ద్వారా ఇచ్చిన మతస్వేచ్ఛ, మైనారిటీ హక్కుల మాటేమిటి? అంటారు ఉదారవాదులు.

వీళ్లు చెబుతున్న మత స్వేచ్ఛ దేశంలో ఎంత సొగసుగా మనుగడ సాగిస్తున్నదో మొన్న దీపావళి రోజున హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక క్రైస్తవ కుటుంబం హిందువుల మీద ప్రదర్శించిన దాష్టీకమే రుజువు చేస్తోంది. తమ ఫ్టాట్‌కు ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లోని హిందువులు వేసుకున్న ముగ్గు, అందులోని దీపాలు వాళ్లకి చిర్రెత్తించాయట. ఆ సంగతి చెప్పడానికి ఆ క్రైస్తవ కుటుంబం చేసిన పని- కాళ్లతో ముగ్గును చెరిపేయడం, దీపాలను తోసెయ్యడం. ఇదేమిటని అడిగితే చెప్పు తీయడం. ఆ తరువాత హిందూ సంఘాలు కన్నెర్ర చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ కుటుంబాన్ని కటకటాల వెనక్కి నెట్టారు. మన దేశంలో మతస్వేచ్ఛకు ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే. ఈ సంవత్సరం శ్రీరామనవమికి హిందువుల ఉత్సవాలు, ఊరేగింపుల మీద జరిగిన దాష్టీకాలు జాతి ఇంకా మరచిపోలేదు. ఇలాంటి ఒంటెత్తు మతస్వేచ్ఛను మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. నెహ్రూ, ఆయన ఆనుయాయులు, బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌వంటి వారంతా కూడా ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని అంగీకరించినవారే. బీజేపీ మీద నిందలు మోపడానికి నెహ్రూ మార్కు సెక్యులరిజం కావాలి. కానీ ఆయనే సమర్ధించిన ఉమ్మడి పౌరస్మృతి మాత్రం అక్కరలేదు. పైగా దానిని బీజేపీ ఖాతాలో పడేసి ఆ నెహ్రూ చింతనకి తాము ద్రోహం చేస్తున్నామన్న స్పృహే వీళ్లలో లోపిస్తున్నది. బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకత వీళ్లందరిని ఆ స్థితికి తెచ్చింది. అసలు ఈస్టిండియా కంపెనీయే ఇలాంటి ఒక చట్టం ఈ సమాజానికి అవసరమని భావించింది. తరువాత బ్రిటిష్‌ ఇం‌డియా కూడా ఆలోచించింది. స్వతంత్ర భారత రాజ్యాంగ సభ చర్చించింది. అంటే దాదాపు మూడు వందల ఏళ్ల ఆలోచన. మరి దీనిని బీజేపీ కుట్ర అంటూ ఒక్క మాటలో తేల్చేసే అథములని, అజ్ఞానులని ఏమనాలి?

ప్రస్తుతం ఇస్లాం వంటి మతాలు అనుసరిస్తున్న ప్రత్యేక స్మృతులు కాలానుగుణంగా ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? పైగా వాటిలో చాలా వరకు కన్ని దశాబ్దాల క్రితం నుంచి మాత్రమే అమలవుతున్నవన్న సంగతి గుర్తించాలి కదా! ప్రధానంగా స్త్రీల హక్కుల గురించి ఎన్ని చిక్కులు, ప్రశ్నలక• అవి ఏ విధంగా, ఏ మేరకు పూచీ పడుతున్నాయి? దేశ జనాభాలో సగభాగం ఉండే మహిళకు న్యాయం చేయడానికి నిరాకరించే చట్టాల స్థానంలో, ముమ్మాటికీ అంతకంటే మెరుగైన, అందరికీ సమన్యాయం అందించాలన్న సదాశయంతో ఉమ్మడి పౌరస్మృతి తేవాలంటే, ఆ సంకల్పానికి దురుద్దేశాలు ఆపాదించడం ఏమిటి? ఇలాంటి అసమానతలు కొన్ని కొన్ని చోట్ల హిందూ సమాజాలలోను లేకపోలేదు. అయినా విస్తృత దృక్పథంతో బీజేపీ ఇలాంటి విధానం ఎంచుకున్నది. అయినా హిందూ సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి ఎందరో సంస్కర్తలు శ్రమించారు. విజయం సాధించారు. ఇలాంటి ప్రయత్నం ఇతర మతాలలో, ముఖ్యంగా ఇస్లాంలో కానరాదు. అందుకే ఉమ్మడి పౌరస్మృతి తక్షణావసరం.

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాయి. పౌరులందరి హితాన్ని సమంగా ఆకాంక్షించే ఒక చట్టాన్ని తేవడానికి రాజకీయాలు ఆటంకం కావడం పెద్ద సామాజిక రుగ్మతగానే భావించాలి. కఠినమే అయినా ఆ రుగ్మతకు చికిత్స జరగాలి.

About Author

By editor

Twitter
YOUTUBE