రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్తపాలన, దోపిడీ, అవినీతి, ఆరాచకం, దాడులు, అప్రజాస్వామిక విధానాలతో ప్రజలందరిలాగే క్రైస్తవులు, ముస్లిం వర్గాలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన పాలకులు ఆయా వర్గాలను తిరిగి తమ దారిలోకి తెచ్చుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆయా మతాలకు చెందిన ప్రార్థనామందిరాలకు నిధులు ఇవ్వడం ద్వారా ఆ మతాల పెద్దలు, బోధకులను ప్రసన్నం చేసుకుని భక్తులతో ప్రభుత్వం గురించి అనుకూల ప్రచారం చేయించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఫాస్టర్లు, ముల్లాలకు గౌరవ వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు చర్చిల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. చూడ్డానికి ప్రార్థనాస్థలాల నిర్మాణానికి నిధులిస్తున్నట్లు కనిపిస్తున్నా 30 లక్షల మంది క్రైస్తవుల ఓట్లను కొనే పక్రియగా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం తన సొంత డబ్బు ఎంతిచ్చినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజల నుంచి పన్నుల ద్వారా లభించిన ధనాన్ని మతావసరాల కోసం వాడటాన్ని ప్రజలు, రాజకీయపార్టీలు, మేధావులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఫాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడంపై ఇప్పటికే న్యాయస్ధానం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా ప్రభుత్వం మాత్రం తన విధానాలు మార్చుకోవడం లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాగుపడినట్లు ఇప్పుడు ‘మతాచార్యులు’ కూడా ఈ జాబితాలో చేరారు. కాని వారిని నమ్ముకున్న పేద భక్తుల స్థితిగతులు మాత్రం మారడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకున్న మూడున్నరేళ్ల పాలనకాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత? ఎవరికి మేలు జరిగింది? ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారమయ్యాయా? ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయా? కొత్తవి ప్రారంభించారా? కొత్తగా పరిశ్రమలు ఏర్పడ్డాయా? నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయా? పేదల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడ్డాయా? ప్రజారోగ్యం ఎలా ఉంది? విద్య అందరికీ అందుతోందా? లాంటివి ప్రశ్నిస్తే దేనికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అన్నిటికీ నవరత్నాల పేరు చెబుతోంది.

ఒకటి రెండు కొత్త పథకాల తప్పించి అన్నీ పాత పథకాలకు పేర్లు మార్చి అమలుచేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అధికారంలోకి రాగానే కృత్రిమ కొరతను సృష్టించి ఇసుక సరఫరాను ఆపేశారు. దాంతో ఆరు నెలల పాటు రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలైపోయింది. ఆ తర్వాత సరఫరా చేస్తున్నట్లు ప్రకటించినా, వేలు ఖర్చుచేసి బ్లాక్‌మార్కెట్‌లో మాత్రమే కొనుగోలుచేయాల్సిన పరిస్థితి వస్తోందని యజమానులు వాపోతున్నారు. దీంతో నిర్మాణ రంగం ఖర్చు మూడు రెట్లు పెరిగింది. అప్పటికే పనులు లేక తీవ్ర దారిద్య్రం అనుభవించిన 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం మద్యం ధరలు పెంచి వారిని కోలుకోలేనంత దెబ్బ వేసింది. అసలు మద్యం నిషేధిస్తామని మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా ఎప్పుడూ అమ్మే మద్యం బ్రాండులను నిలిపివేసి, తానే దుకాణాలు తెరచి నాసిరకం మద్యం అమ్ముతోంది.

బాధితుల్లో సగం మంది వారే

ఈ ప్రభుత్వ అరాచక పాలనలో బాధితుల్లో క్రైస్తవ, ముస్లిం మైనార్టీలే ఎక్కువ మంది ఉన్నారు. నిర్మాణరంగంలో పనిచేసేవారిలో సగం మంది ఈ రెండు వర్గాలకు చెందిన వారే అనేది అందరికీ తెలి సిన విషయమే. ఇసుక సరఫరాను నిలిపి వేయడం వల్ల ఉపాధి కోల్పోవడం, నాసిరకం మద్యం సరఫరా వల్ల అనారోగ్యంతో మరణాలకు గురికావడం, మద్యం ధరల పెంపు వల్ల జేబులు ఖాళీ చేసు కుంటున్న వారిలో వీరే సగం మంది ఉన్నారు. ఇవి కాక ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే జీవనోపాధి పథకాలు, ఇతర స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. కరెంటు చార్జీల పెంపు, అదుపు తప్పిన నిత్యావసరవస్తువుల ధరలు, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు తగ్గించక పోవడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమంగా పోలీసు కేసులు పెట్టడం వంటివి పెరిగిపోవడంతో ఈ వర్గాలు కూడా ప్రభుత్వంపై ఎదురు తిరుగు తున్నాయి. కొందరు బహిరంగంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, దూషించడాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు తమది క్రిస్టియన్‌, ‌ముస్లిం అనుకూల ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గాల్లోనే కనబడుతున్న వ్యతిరేకత నుంచి తప్పించు కోవాలని నిర్ణయించింది. ఇందుకు ఆయా మతా చార్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న చిన్నా, చితకా చర్చిల నిర్మాణా నికి రూ.175 కోట్ల నిధులు మంజూరు చేసింది.

నియోజకవర్గానికి రూ.కోటి కేటాయింపు

రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహణ సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీ కరణకు ఈ నిధులు వెచ్చించాలి. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ నిధుల్ని గ్రాంటు ఇన్‌ ఎయిడ్‌ ‌విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీక రించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తు న్నారు. ఈ మేరకు ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని పలు జిల్లాల కలెక్టర్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా అధికారం చేపట్టాక ఇచ్చిన ప్రకటనతో చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు.

చర్చి కేంద్రంగా రాజకీయం

వైకాపా మత రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ పార్టీ క్రైస్తవ, ముస్లిం ప్రార్థనా మందిరాలను వేదికగా చేసుకుని రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికలలో వైకాపాకు ఓట్లు వేయాల్సిందిగా ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తులపై పాస్టర్లు తీవ్ర వత్తిడి తెస్తున్నారు. 2009 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌, ఆ ‌తర్వాత వైకాపాల నుంచి కానుకలు స్వీకరిస్తున్న మతాచార్యులు గంప గుత్తగా ఓట్లు వేయిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తు న్నాయి. ఇప్పుడు అధికారం లభించింది కాబట్టి ఫాస్టర్లు, ముల్లాలకు గౌరవ వేతనాలు ఇస్తున్నారు. ఇజ్రాయిల్‌ ‌వెళ్లేందుకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. తాజాగా చర్చిల నిర్మాణానికి నిధులు అందించనున్నారు.

20 లక్షల ఓట్ల కొనుగోలుకు యత్నం

ప్రభుత్వంపై క్రైస్తవుల్లో వచ్చిన వ్యతిరేకతను తిప్పి కొట్టే శక్తి చర్చి పాస్టర్లపైనే ఉందని ప్రభుత్వం గ్రహిం చింది. అంతే కాదు 2024 ఎన్నికల్లో తిరిగి గెలిచేలా కూడా వ్యూహం పన్నింది. రాష్ట్రంలోని చర్చిలన్నీ ప్రైవేటు ఆస్తులే. హిందూ ఆలయాల్లా వాటి జమా ఖర్చులపై ప్రభుత్వ అదుపు లేదు. చర్చిలపై వచ్చే ఆదాయం అంతా నిర్వాహకులదే. సాధారణంగా 90 శాతం చర్చిలన్నీ మురికివాడల్లో నిర్వ హించేవే. వీటిని నిర్మించి, వచ్చే ఆదాయం అనుభవించేది పాస్టర్లే. భక్తుల నుంచి డబ్బు వసూలు చేసి చర్చిలను నిర్మిస్తారు. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వమే తీసుకుంటే ఇక భక్తులిచ్చే కానుకలన్నీ హాయిగా అనుభవించ వచ్చు. అందువల్ల ఓట్లు వేయించడంలో కీలకంగా మారిన పాస్టర్లను ప్రసన్నం చేసుకుని 2024 ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు పక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు రాజకీయపార్టీలు విమర్శిస్తున్నాయి.

పెద్ద చర్చిలకు అవసరం లేకపోయినా మురికి వాడల్లో వేలాది చర్చిలున్నాయి. ఒక్కో గ్రామంలోనే మూడు నాలుగు చర్చిలున్నాయి. ఒక్కో చర్చికి రూ.లక్ష వరకు నిధులు ఇస్తే ఒక్కో నియోజకవర్గంలో వంద చర్చిలకు నిధులు ఇవ్వవచ్చు. 175 నియోజక వర్గాకు 100 చొప్పున మొత్తం 17,500 చర్చిలకు నిధులు అందుతాయి. చర్చికి వచ్చే భక్తులను ప్రేరేపిం చడం ద్వారా వారి కుటుంబసభ్యుల ఓట్లు, స్నేహితుల ఓట్లు కలిపి ఒక్కో చర్చి నుంచి 300 ఓట్లను తమ పార్టీకి ఓట్లు వేయించుకోవాలనేది వైకాపా ఉద్దేశ్యంగా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అన్ని చర్చిలు కలిపి మొత్తం 30 లక్షల ఓట్లపై ప్రభావం చూపించ నున్నాయని అంటున్నారు. చర్చిలకు నిధుల పంపిణీ అనేది 30 లక్షల ఓట్ల కొనుగోలు అంశంగా బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

పాస్టర్లు, ముల్లాల జీతాల చెల్లింపు అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టులో కేసు నడుస్తోంది. చర్చిలో మతబోధనలు చేసే పాస్టర్లకు గౌరవవేతనం చెల్లించేందుకు బడ్జెట్‌ ‌నుంచి నిధులు కేటాయించేం దుకు వీలుకల్పిస్తూ 2021 మే 14న ప్రభుత్వం జారీచేసిన జీవో 52ను సవాల్‌ ‌చేస్తూ గత ఏడాది సెప్టెంబరులో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వడం ఏంటని ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మత సంబంధ మైన వేడుకల కోసం కొంతమేర ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవచ్చని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడం వేడుక నిర్వచనం పరిధిలోకి రాదని గుర్తు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పాస్టర్లు దైవాంశ సంభూతులా?

పాస్టర్లు దైవాంశ సంభూతులుగా చెలామణి అవుతున్నారని కొందరు క్రైస్తవులు పేర్కొంటున్నారు. వారం వారం కానుకలు, నెలవారీ దశమ భాగాలు తీసుకుంటూ, చావు, పుట్టుకల పేరుతో ప్రార్థనలు చేయించి నిండా ముంచిన ఈ పాస్టర్లే 2014 నుంచి 2019లో ఓట్లు వేయించి ఈ ప్రభుత్వం చేత తమను దోపిడీ చేయిస్తున్నారని కొందరు చైతన్యవంతులైన భక్తులు విమర్శిస్తున్నారు.

ఈ దోపిడీ చాలదన్నట్లు మరల ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాలంటూ తిరిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారని, ఇది తమ ఓటు హక్కును హరించడమేనని, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధ్దమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా భక్తులు కూడా ప్రభుత్వం ఉద్దేశ్యం, పాస్టర్ల కపటాన్ని గ్రహించి మెలగాల్సిందిగా కోరుతున్నారు. ఇక క్రైస్తవాన్ని నమ్ముకుంటే తీవ్ర అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలను చక్క బడతాయని చెప్పి ఆపదలో వున్న తమకు మాయమాటలు చెప్పి క్రైస్తవంలోనికి మార్చినట్లు కొందరు హిందువులు చెబుతున్నారు.

వీరు చెప్పేవన్నీ అబద్దాలేనని, తమ నుంచి హక్కులా డబ్బులు పిండుతూనే ఉన్నారని, తమ బతుకులు మారడం లేదని పాస్టర్లను నమ్మవద్దని తిరిగి పూర్వ మతంలోకి వచ్చినవారు చెబుతున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram