– బంకించంద్ర చటర్జీ

ద్వితీయ భాగము

1

శాంతికి చాల చిన్నతనంలోనే మాతృ వియోగం కలిగింది. ఆమె జీవితంలో ఈ ఘట్టం ప్రధానమైనది. ఆమె తండ్రి పూర్వకాలపు సంస్కృత అధ్యాపకుడు. ఆయన ఇంట మరో ఆడ దిక్కులేదు. శాంతి ఎదుగుదలలో, శిక్షణలో, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో చిన్ననాడే తల్లినీ పోగొట్టుకున్న పరిణామం ప్రభావం బాగా కనిపిస్తుంది.

స్వభావసిద్ధంగా శాంతి తండ్రి పిల్లలకు చదువు చెబుతున్నప్పుడు శాంతి కూడా అక్కడికి వచ్చి ఆయన చెంతనే కూర్చుంటూ ఉండేది. పైగా ఇంటి దగ్గరే ఆయన పాఠశాల నడిపేవారు. గురుకుల పాఠశాల బోధనలా ఉండేది అది. శాంతి పాఠశాల సమయం అయిన తరువాత ఆ శిష్యులతోనే కలిసి ఆడుకుంటూ ఉండేది. పిల్లలతో కలసి మెలిసి మెలగుతూ ఉండేది. మిగిలిన పిల్లలు కూడా ఆమెను ఆదరంగా, ఆప్యాయంగా చూచుకుంటూ ఉండేవాళ్లు.

ఇలా శాంతి చిన్నతనం నుండి మగ సహవాసం తోనే గడిపివేసింది. దాని ఫలితం- ఆమె మగపిల్లల వలెనే చొక్కాలు, లాగులు ధరిస్తూ ఉండేది. కాస్త పెద్దదైన తరువాత మగవారి వలెనే ధోవతులు కట్టుకుంటూ ఉండేది కూడా. తెలిసిన వాళ్లు ఎవరైనా బలవంతంగా చీరకడితే, దానిని విడిచి పెట్టి మళ్లీ పంచ ధరించేది. కుర్రవాళ్ల వలెనే జుట్టు ముడివేసు కోకుండా కూర్చుండిపోయేది. ఆమెకు కేశ సంస్కారం చేసి జడలు వేయటానికి ఎవరూ ఆడవాళ్లు లేరుగదా! మిగిలిన విద్యార్థులందరివలెనే శాంతి లలాటంలో చందనం ధరించడం, విభూతి పూసుకోవడం కూడా చేస్తూ ఉండేది. మెడలో యజ్ఞోపవీతం వేసుకునేం దుకు కూడా తండ్రితో యుద్ధం చేసింది. శాంతి విద్యార్థుల లాగా సంధ్యావందనం చేసేది. అధ్యా పకుడు పరధ్యానంగా ఉన్నప్పుడు విద్యార్థులు కొన్ని శృంగార గాథలు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. శాంతి ఈ కథలనూ ఉత్సుకతతో వినేది. అందరిలాగే ఈ కథలను తనూ చెప్పేది.

ఇంకాస్త పెద్దదైన తరువాత ఆమె బాలురవలెనే విద్యాభ్యాసం చేయడానికి కూడా పూనుకుంది. ఆమెకు వ్యాకరణం ఏమీ రాకపోయినప్పటికీ భట్టి కావ్యం, రఘువంశం, కుమార సంభవం, నైషధం లోని శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఉండేది. ఇది గమనించి శాంతి తండ్రి ఆమెకు ప్రాథమిక వ్యాకరణం కొంత బోధించాడు. వ్యాకరణంతో పాటు ఆమె సాహిత్యపఠనం కూడా చేసింది. ఇలా ఉండగా ఆమె తండ్రి కన్నుమూశారు. ఆమె పరిస్థితి అయోమయంలో పడిపోయింది.

ఇప్పుడు ఆమె నిరాశ్రయ అయింది. పాఠశాల దానంతట అదే విచ్ఛిన్నం అయిపోయింది. విద్యార్థు లంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయినారు. కాని వారందరూ శాంతి అంటే ఎంతో ఆప్యాయత, ప్రీతి కలవారు. వారిలో ఒకడు శాంతిని తమ ఇంటికి తీసుకుపోయినాడు. అతడు కొన్నాళ్ల తరువాత సంతాన ధర్మాన్ని స్వీకరించాడు. జీవానందుడు అనే పేరు పెట్టుకున్నాడు.

ఆ సమయానికి జీవానందుని తల్లీ, తండ్రీ జీవించే వున్నారు. జీవానందుడు శాంతిని తల్లి దండ్రులకు విశేషంగా పరిచయం చేశాడు. అయితే వారు ‘‘ఈ పరాయి పిల్ల పోషణ భారాన్ని, బాధ్యతను ముందు ముందు ఎవరు స్వీకరిస్తారు?’’ అని ప్రశ్నిం చారు. జీవానందుడు ‘‘ఆ బరువు బాధ్యత నేనే స్వీకరిస్తాను’’ అన్నాడు. తల్లిదండ్రులు కూడా బాగానే ఉన్నదన్నారు. జీవానందుడు తరువాత కొన్నాళ్లకు శాంతికి యుక్తవయసు రాగానే ఆమెను వివాహం చేసుకున్నాడు.

వివాహం జరిగిన తరువాత ఈ విషయమై వారందరూ పశ్చాత్తాప పడసాగారు. ‘‘మనం చేసిన పని మంచిది కాదు’’ అనుకోసాగారు. శాంతి అందరి ఆడపిల్లలవలె నింపాదిగా, ఇంటి నాలుగు గోడల మధ్య కూర్చుని ఉండదు. గ్రామానికి సమీపంలో ఉన్న అడవులలో చెట్లు చేమలు ఎక్కి తిరుగుతూ ఉంటుంది. జింకలు, లేళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఈమె అల్లరిని భరించలేక ఆ ఇంటిలోని వారు శాంతిని గదిలో కట్టేసి ఉంచారు. అయితే అదను చూచుకుని శాంతి ఈ బంధనాలు తప్పించుకుని పారిపోయింది. ఆమె ఎక్కడకు వెళ్లి పోయిందో ఎవరూ గమనించలేకపోయారు.

శాంతి తన దుస్తులు సన్యాసినికి సరిపడేట్లుగా తయారు చేసుకుంది. ఆ రోజులలో వంగదేశంలో సన్యాసులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. శాంతి కూడా వారిలాగే భిక్షాటనం చేసుకుంటూ జగన్నాథ క్షేత్రం వైపు ప్రయాణం చేసింది. ఒక సన్యాసుల గుంపును కలుసుకోగలిగింది. వారు ఆమెను తమలో ఒకరుగా స్వీకరించారు. ఆ రోజులలో సన్యాసులు ఇప్పటివలె బక్కవారు కారు. వారు దళబద్ధులు, సుశిక్షితులు, బలిష్టులు, యుద్ధ విశారదులు. ఇంకా ఎన్నో ఉత్తమగుణాలు కలవారు. వారు ఒక రకంగా రాజ్య వ్యతిరేకులు కూడాను. రాజుగారి ఖజానాలు దోచుకు తినేవాళ్లు. వయసులో ఉన్న పిల్లలను తస్కరించి తమ సంప్రదాయంలో చేర్చుకునేవారు.

శాంతి యువకుని వలె వేషం ధరించి సన్యాసు లలో కలిసిపోయింది. ఆమె బుద్ధి కుశలత, చతురత, కార్యదక్షత చూచి అందరూ ఆదరంగా మెలిగేవారు. శాంతి ఆ దళంలో వ్యాయామం చేస్తూ ఉండేది. అస్త్రశస్త్రాలు ప్రయోగించడం నేర్చుకునేది. ఆ సన్యాసుల దళంతో ఎన్నో దేశాలు తిరిగింది. అనేక యుద్ధాలు చేసింది. అస్త్రవిద్యలో నేర్పరురాలయింది.

క్రమంగా ఆమెలో యవ్వన లక్షణాలు అంకు రించాయి. అనేకమంది సన్యాసులకు ఆమె మారు వేషంలో వున్న స్త్రీ అని తెలిసిపోయింది. కాని సన్యాసు లందరూ అప్పుడు జితేంద్రియులు. అందుచేత ఎవరూ ఈ విషయం పట్టించుకోలేదు.

సన్యాసులలో విద్వాంసులు కూడా వున్నారు. శాంతికి సంస్కృతంలో కొంత పరిచయం ఉంది. అది గమనించి ఒక సన్యాసి ఆమెకు చదువు చెప్ప నారంభించాడు. జితేంద్రియులైన సన్యాసులలో కూడా అప్పుడప్పుడు, ఇంకా శరీర వాంఛలు ఉడిగి పోనివారు కొందరు కలిసిపోతూ ఉంటారు. ఈ సన్యాసి కూడా ఇదే కోవకు చెందినవాడు. అప్పుడ ప్పుడే వికసిస్తున్న శాంతి యవ్వన సౌందర్యం ఆయ నను ఉత్తేజ పరచసాగింది. ఆయన శాంతికి శృంగార రస కావ్యాలు బోధించసాగాడు. ఇది శాంతికి అపకారం చేయకపోగా, ఉపకారమే చేసింది. ఆమెకు స్త్రీ సహజమైన సిగ్గు, లజ్జ అప్పుడప్పుడే అభ్యాసం అవసాగాయి. స్త్రీ స్వభావం ఆమెకు ఈ కావ్య పఠనం వల్ల తెలియవచ్చింది. ఇంతవరకు ఆమె గడిపిన పురుష చరితపై నిర్మల స్త్రీ స్వభావం ప్రభావం పడింది. శాంతిలోని నారీగుణాలు ప్రకాశించ సాగినాయి. శాంతి చదువు మానివేసింది.

పులి ఎలా హరిణం వెనుక పరుగెడుతుందో అలాగే ఆ సన్యాసి శాంతి వెనుక పరుగు ప్రారంభిం చాడు. అయితే శాంతి వ్యాయామాది శారీరక శిక్షణ పొందినందువల్ల పురుషులకు సైతం దుర్లభమైన బం కలిగి ఉంది. గురువుగారు దగ్గరకు రావడం తోటే శాంతి చెంపదెబ్బలతోను, గుద్దులతోను ఆయన్ను పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఏకాంతం చూచుకుని సన్యాసి అమె చేయి పట్టుకున్నాడు. శాంతి ఆ చేతిని విడిపించుకోలేకపోయింది. అయితే ఆయన పట్టుకున్నది ఎడమ చేయి. అందుచేత కుడిచేతితో ఆయన చెంప చెళ్లుమనిపించింది. నెత్తిమీద బలంగా కొట్టింది. సన్యాసి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ దెబ్బతో తన సన్యాసాన్ని విసర్జించి, ఇంటికి పరుగు తీశాడు. ధైర్యంగా, బాహుబలంతో, శాంతి తన ప్రయాణాన్ని మాత్రం సాగిస్తూనే ఉంది. భిక్షమెత్తు కుంటూ, అడవిలోని కందమూలాలు భుజిస్తూ, ఆమె తిరిగి తన అత్తవారి ఇంటికి చేరుకుంది. మామగారు చనిపోయారు. కాని కులం భ్రష్టమవుతుందనే భయంతో అత్తగారు శాంతిని ఇంటిలో చేర్చుకోలేక పోయింది. శాంతి ఇంటి బయటనే ఉండిపోయింది.

జీవానందుడు అప్పుడు ఇంటి దగ్గరే వున్నాడు. శాంతిని రోడ్డు మీద కలుసుకొని ఇలా అడిగాడు. ‘‘నీవు నా ఇల్లు విడిచిపెట్టి ఎందుకు వెళ్లి పోయావు? ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు?’’ శాంతి ఇన్నాళ్లు తను చేసిన పనులన్నీ ఏకరువు పెట్టింది. జీవానందునకు ఆమె నిజమే చెబుతూ వున్నదని విశ్వాసం ఏర్పడింది. ఆమె మాటలను అతడు విశ్వసించాడు.

మన్మథుడు రెండు పూబాణాలు వేశాడు. ఒకటి నేరుగా జీవానందుని హృదయా నికి తగిలింది. రెండవది శాంతి హృదయంలో గుచ్చుకుంది.

జీవానందుడు ‘‘నేను నిన్ను పరిత్యాగం చేయలేను. నేను తిరిగి వచ్చేంత వరకు నీవు ఇక్కడే ఉండు’’ అన్నాడు.

‘‘మీరు తిరిగి వస్తారా?’’ జీవానం దుడు తన తల్లితో మాట్లాడి ఆమె అనుజ్ఞ తీసుకుని తిరిగి వచ్చాడు. జీవానందుని చెల్లెలు నిమాయీమణికి కొద్దిరోజుల క్రిందటనే భైరవీపురంలో వివాహం అయింది. బావగారంటే జీవానందునకు ఆదరం ఎక్కువ. ఆయన జీవానందు నకు తన ఇంటి పక్కనే కొద్దిపాటి స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో జీవానందుడు ఒక కుటీరం నిర్మించాడు. శాంతితో అక్కడ కాపురం పెట్టి రోజులు సుఖ మయంగా దొర్లించసాగినాడు. భర్తతో మెలగ నారం భించినప్పటి నుండి శాంతి పురుష ప్రకృతి కొద్ది కొద్దిగా సడలిపోసాగింది. వారి జీవనం సుఖ స్వప్నంలా నడిచిపోతూ వచ్చింది. జీవానందుడు సత్యానందుని హస్తగతుడై సంతాన ధర్మాన్ని స్వీకరిం చాడు. శాంతిని పరిత్యాగం చేసి వెళ్లిపోయాడు. పరిత్యాగానంతరం మొదటి భాగంలో చెప్పినట్లుగా నిమాయీమణి చాకచక్యం వల్లనే వారు తిరిగి మొదటిసారిగా కలుసుకున్నారు.

2

జీవానందుడు వెళ్లిపోయిన తరువాత శాంతి కొంత తడవు గుమ్మం మీదనే కూర్చుండిపోయింది. నిమాయి పిల్లను చంకను వేసుకుని అక్కడికి వచ్చింది. శాంతి కన్నులలో నీరులేదు. ఆమె ముఖం తుడుచుకుని ప్రఫుల్లంగా కూర్చుంది. ఆమె ముఖంలో చిరునగవు, మందహాసం అగుపిస్తున్నాయి. గంభీరము, చింతాయుక్తము, కొంత పరధ్యాస కూడా అగుపిస్తున్నాయి. ఆమె ముఖం వంక చూచి నిమాయి మణి ‘‘తిరిగి సమావేశం అయింది కదూ?’’ అంది.

శాంతి ఏమీ బదులు పలుకలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిమాయి ఆమె మనసులోని మాట అంత త్వరగా బయటకు రాదని ఎరుగును. అదీగాక మనసులోని మాట అంత త్వరగా బయలుపడడం కూడా మంచిదికాదు. అందుచేత ఆమె ఈ ప్రస్తావన మార్చి ఇలా అంది. ‘‘చూడు వదినా! ఈ అమ్మాయి ఎలా ఉంది?’’

‘‘ఈ అమ్మాయి ఎవరు నిమాయీ? నీకు అప్పుడే పిల్లలు పుట్టేశారా?’’ అంది పరిహాసంగా, శాంతి.

ఈ పరిహాసానికి బదులుగా శాంతిని ఉడికించా లని నిమాయి ఇలా అంది : ‘‘ఇది నా బిడ్డకాదు. నా అన్నగారి బిడ్డ.’’

‘‘నేను బిడ్డ తండ్రిని గురించి మాట్లాడడం లేదు. తల్లిని గురించి అడుగుతున్నాను’’ అంది శాంతి.

నిమాయికి శాస్తి అయినట్లయింది. ‘‘ఎవర మ్మాయో ఎవరికి తెలుసు? అన్న ఎక్కడనుంచి ఎత్తుకు వచ్చాడో ఏమో! అది అడిగి తెలుసుకుందుక్కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ రోజులలో ఎందరో తమ సంతానాన్ని కూడా అమ్ముకుంటు న్నారు. అయినా ఇతరుల పిల్లలను ఎవరు కొంటారు? ఏమైనా ఈ అమ్మాయి చాలా సుంద రంగా ఉంది. బంగారపు బొమ్మలాగ ఉంది. అందు కని మనసు పడి అన్నను అడిగి తీసుకున్నాను.’’

తన గదిలోనికి వెళ్లి శాంతి తలుపులు బిగించు కుంది. ఇన్నాళ్ల నుండి ఏమి ఆలోచిస్తూ ఉన్నానో ఆ పని ఇవాళే చేస్తాను. ఏ ఆశతో ఇన్నాళ్లూ మిన్న కుండిపోయానో, అది ఈ రోజు తీరిపోయింది. తీరి పోవడమేం, బాగా నిష్ఫలమని రుజువయింది. ఈ జీవితం అంతా వృథా అయిపోయింది. ఏదైతే ఇన్నాళ్లు స్థిరం చేసుకున్నానో దానిని ఈ రోజు అమలుచేసి తీరుతాను. ఒక తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంటే వెయ్యి తప్పులకు కూడా ప్రాయశ్చిత్తం వుంటుంది.’

అరణ్యంలో నుంచి కందమూల ఫలాలు తీసుకు వచ్చింది. అన్నానికి బదులు వాటిని తిని కడుపు నింపుకుంది. డక్కా చీర తీసి అంచు చింపివేసింది.

చీరకు కాషాయరంగు వేసింది. చీరకు రంగు వేసుకుని, ఆరబెట్టుకునేసరికి – సాయంకాలమైంది. శిరోజాల పొడవు తగ్గించింది. వేరు చేసిన వెంట్రు కలను ఒక పక్కగా పెట్టింది. రంగు చీరను రెండుగా చింపింది. ఒక ముక్క పంచ మోస్తరుగా కట్టుకుంది. రెండవ భాగం ఉత్తరీయంలా మీద వేసుకుంది. తరువాత వేరుగా తీసి ఉంచిన వెంట్రుకలను తీసి గడ్డాలు, మీసాలు చేసి తగిలించుకుంది. అద్దంలో చూచుకుని తన రూపం పూర్తిగా మారిపోవడంతో కొంతసేపు విచారపడింది. కాని గడ్డం, మీసం ధరించడం ఒకంతట చేత కాకుండా వచ్చింది. వాటిని తీసి పక్కన ఉంచింది.

ఇంటిలో నుండి జింక చర్మం ఒకటి తీసుకుంది. దానితో శరీరమంతా కప్పుకుంది. ఇప్పుడు ఆమె రూపం సన్యాసి సదృశంగా ఉంది. ఈ రూపంతో ఆమె ఒకమారు ఇల్లు నాలుగు మూలలా కలయ చూచింది. అర్ధరాత్రి సమయం అవడంతోటే శాంతి తన ఇంటి తలుపులు తెరుచుకుని ఇంటి ముందుకు వచ్చింది. ఇప్పుడామె సన్యాసినిలా తయారైంది. అంధకార బంధురమైన గంభీర వనంలో ప్రవేశిం చింది. వనదేవతలు ఈ ఏకాంత రాత్రిలో ఆమె అపూర్వగానాన్ని విన్నారు.

3

రెండవరోజు ఆనందమఠంలో ఒక గదిలో కూర్చుని నిరుత్సాహులైన ముగ్గురు సంతాన నాయ కులు సంభాషణ జరుపుతున్నారు. జీవానందుడు సత్యానందునితో ఇలా అన్నాడు : ‘‘మహారాజా! దేవతలు మనపట్ల ఇంత అప్రసన్నలు ఎందుకు అయినారంటారు? మనదోషం ఏముందని మనం యవనుల చేతిలో అవమానాల పాలయ్యాం?’’ అన్నాడు.

సత్యానందుడు ‘‘భగవంతుడు మనపట్ల ఎన్నడూ అప్రసన్నుడుకాడు. యుద్ధంలో జయాపజయాలు రెండూ మిళితమై ఉంటాయి. ఇదివరకు ఒకసారి మనకు జయం లభించింది. ఇప్పుడు అపజయం లభించింది. చివరకు మనకు జయమే సంప్రాప్త మవుతుంది. ఇప్పుడంటే మనం నిరాయుధులం కనుక ఓడిపోయాం. పాతకాలపు యుద్ధంలో ఉప యోగించిన ఆయుధాలు ఇప్పుడు పనికిరావు. ఇదే మన వైపున ఉన్న లోపం! మనం కూడా మర ఫిరంగులు, తుపాకులు సంపాదించాలి. ఇదే మన తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది’’ అన్నాడు. జీవానం దుడు ‘‘ఇది చాల కష్టమైన పని’’ అన్నాడు. ‘‘కష్టమా? సంతానధర్మం స్వీకరించిన నీ నోటి నుండి ఇటు వంటి మాట ఎలా వచ్చింది? సంతానులు తలుచు కుంటే సాధ్యకానిదేముంది? అనుజ్ఞ ఇవ్వండి. ఆయుధ సేకరణ ఎలా చేయాలంటారు?’’

సత్యానందుడు ‘‘ఈ ఉద్యమం కోసమే నేనీ రాత్రి దూరప్రాంతానికి వెడుతున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఎటువంటి గడబిడ చేయకండి. సంతా నులందరినీ రక్షించే భారం మీదే! వారి అన్నవస్త్రాల విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూసే బాధ్యత కూడా మీకే అప్పగిస్తున్నాను’’ అన్నాడు.

‘‘దూరప్రాంతానికి వెళ్లి ఆయుధాలు ఎలా సంపా దించుకు వస్తారు? తుపాకులు, మరఫిరంగులు, రవ్వలు, మందుగుండు… ఇవన్నీ మీరు బజారులో కొంటే అందరికీ తెలిసిపోతుంది. అల్లరి అవుతుంది. ఇవన్నీ ఎలా కొంటారు? ఎలా తీసుకొస్తారు? ఎవరిని తోడు తీసుకువెడుతున్నారు? వివరంగా చెప్పండి!’’

‘‘ఇవన్నీ కొని తీసుకురావడం మనవల్ల అయ్యే పని కాదు. మనం కర్మాగారం తెరుద్దాం. అక్కడ అన్నీ తయారు చేసుకుందాం.’’

‘‘ఏమిటి? ఈ ఆనందమఠంలోనే?’’

‘‘ఆనందమఠంలో ఎలా కుదురుతుంది? అందుకనే నేను చాలకాలం నుండి ఆలోచిస్తున్నాను. మీరందరూ దేవుడు ప్రతికూలంగా ఉన్నాడంటు న్నారు. కాని నేను దేవుడు అనుకూలంగా ఉన్నాడనే భావిస్తున్నాను.’’

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram