– బంకించంద్ర చటర్జీ

‘‘కోతీ! ఎవరైతే నీకేం?’’

‘‘పిల్లను నాకు ఇచ్చివేయి.’’

‘‘ఏం చేస్తావు?’’

‘‘పాలుపడతాను. ఆడిస్తాను. అన్నీ చేస్తాను’’ ఇలా చెప్పుతూ చెప్పుతూ నిమీ (ఆ యువతి పేరు) కన్నీళ్లు ఒత్తుకుంది. ముఖంమీదికి నవ్వు తెచ్చుకుంది.

‘‘నీవు పిల్లను తీసుకు ఏం చేస్తావు? నీకే ముందు ముందు పిల్లలు కలుగుతారుకదా!’’

‘‘పుడితే పుడతారు. నాకుమాత్రం ఈ పిల్లను ఇచ్చివేయి. కావాలంటే, తరువాత తీసుకు పోదువు గానిలే!’’

‘‘సరే, నీ దగ్గరే వుంచుకో పిల్లను. ఈ పిల్లతో సతమతమయిపో! నేను అప్పుడప్పుడు వచ్చి చూచి పోతూ వుంటాను. ఈ పిల్ల కాయస్తుల అమ్మాయి. నేనిక వెడుతున్నాను.’’

‘‘అన్నా! ఏమన్నా తినవూ? సమయం అయింది గదా! భోజనం చేసి వెడుదువుగాని.’’

‘‘అయితే త్వరగా వడ్డించు’’ అన్నాడు జీవానందుడు.

నిమీ చక చక విస్తరివేసి భోజనం వడ్డించింది. విస్తట్లో పదార్థాలన్నీ చూచి జీవానందుడు ‘‘దేశ మంతటా కరువుందిగాని, మీ గ్రామంలో లేదు’’ అన్నాడు.

‘‘ఇక్కడా ఉంది. కాని మేం ఇద్దరమే కనుక జాగ్రత్తగా పొదుపుగా ఉండగలుగుతున్నాం.’’

‘‘మీ ఆయన ఎక్కడ?’’

‘‘రెండు మూడు సేర్ల బియ్యం సంచిలో పోసుకుని వెళ్లారు ఎవరికో ఇవ్వాలని.’’

జీవానందుడు తృప్తిగా భోజనం చేశాడు. ముందు నిమాయీమణి తన వంతు భోజనం అన్నకు వడ్డించింది. తరువాత భర్త వంతు కూడా వడ్డించింది. ఇంక అన్నం అయిపోయింది. పనసపండు ముందు ఉంచింది. దానిని గూడా పుచ్చుకున్నాడు జీవా నందుడు. తరువాత ఇంకేం కావాలని అడిగింది నిమాయి. ఇప్పటికి చాలు, అంటూ జీవానందుడు మంచినీళ్లు త్రాగాడు.

‘‘అన్నా! ఒకమాట చెబుతాను, వింటావా?’’ అంది నిమాయిమణి, అనునయంగా.

‘‘ఏమిటది?’’

‘‘నీవు వింటానంటే చెపుతాను.’’

‘‘వింటానన్నానుగా. చెప్పు, వేధించక.’’

‘‘ఒకమారు వదినను పిలుచుకువస్తాను. సముదాయించి వెళ్లు.’’

జీవానందుడు నిమాయిని కొట్టటానికా అన్నట్టు చేయి పైకి ఎత్తాడు. ‘‘ఇదిగో ఆ పాపాయిని ఇట్లా ఇవ్వు. ఛీ! పాపిష్టిదానా!’’ చాలా కోపం తెచ్చుకున్నాడు జీవానందుడు. ‘‘ఇంకోసారి ఇలాంటి కూత కూశావా, నీ ఇంట్లో ఎంగిలి కూడా పడను. నీ వరస చూస్తు న్నాను కదా! ఎప్పుడు నీవు నాతో ఏది మాట్లాడ కూడదో అదే మాట్లాడతావు. తేగూడని ప్రస్తావనే తెస్తావు. నీవు కోతివి. నీతో ఏమీ మాట్లాడగూడదు. అటువంటి మాటలు నాముందు తీసుకు రావద్దని ఇదివరకే చెప్పానా లేదా?’’

‘‘మంచిది. నేను పాపిష్టిదానినే అనుకో అన్నా! నేను వదినను పిలుచుకు వస్తాను.’’

‘‘పిలుచుకురా, నేను వెళ్లిపోతున్నాను’’ ఈ మాట అని ద్వారం చెంతకు పరుగుతీశాడు జీవానందుడు.

నిమాయీ కూడా పరుగునవచ్చి అతడికి అడ్డంగా నిలువబడింది. ‘‘నను చంపి బయటకు వెళ్లు. అన్నా! నేడు వదినను పలుకరించకుండా నీవు ఇక్కడి నుండి వెళ్లిపోవటానికి వీలు లేదు’’ అంది కోపకంఠంతో. మళ్లీ ఆమే అన్నది.‘‘నేను దుష్టురాలినే కావచ్చు. ఆ సంగతులన్నీ అలా ఉంచు. మీ ఆవిడను పిలుచుకువస్తాను. ఇక్కడ నిన్నొకసారి చూసు కుంటుంది. మళ్లీ నువ్వు ఆశ్రమానికి వెళ్లే ముందు ఆమెను ఒక్కసారి చూడాలని నా కోరిక.’’

‘‘లేదు, నేను వెళ్లాలి. నేను వెళ్లిపోవాలి.’’ అని మరొక ముందడుగు వేశాడు జీవానందుడు. నిమి ఇక ఆలస్యం చేయకుండా తలుపు దగ్గరకు వెళ్లి తలుపు గడియపెట్టి దానికి అనుకుని జీవానందునికి అభిముఖంగా నిలిచింది. నిష్టూరంగా ఇలా అన్నది.‘‘ నీవు బయటకు వెళ్లాలంటే నన్ను చంపి కదలాలి. నీ భార్యను నువ్వు ఒక్కసారి చూసిన తరువాతే బయటకు అడుగు పెట్టగలవు!’’

‘‘మనుష్యులను చంపివేయడం నాకేం పెద్ద విషయం కాదు. దేశ విరోధులను చాలామందిని నేను చంపేశాను తెలుసా?’’

నిమాయి కోపం మరింత అయింది. ‘‘అంటే నేను భయపడి పోతాననుకున్నావా? నేనూ నీ తండ్రికి కుమార్తెనే, నేనేం తక్కువ తిన్నాననుకుంటున్నావా? మనుష్యులను చంపివేయడం నీవో ఘనకార్యంలా భావిస్తునావు కాబోలు. నన్నూ చంపి నీ కీర్తిని పెంచుకో. ఓహో, ఓహో ఏమి పరాక్రమం! ప్రతాప మంటే నీదేనయ్యా!’’ కసురుతూ అంది.

జీవానందుడు నవ్వు ముఖంతో ‘‘సరే, ఆ అమ్మాయిని పిలువు. కాని ఇటువంటి మాట ఇకముందు ఎప్పుడైనా అన్నావో!…జాగ్రత్త!’’ అన్నాడు.

నిమీ దగ్గరలోనే వున్న మరొక పాకలోనికి వెళ్లింది. ‘‘వదినా! తొందరగా రావాలి!’’ అని అరిచింది.

‘‘ఏమిటా తొందర? అన్నగారు నిన్ను కొట్టారా? దెబ్బలకు నూనె రాయమంటావా?’’ అంది ఆ పాకలోని యువతి. ఆమె చిరిగి పేలికలైపోయిన చీర కట్టుకుంది. జుట్టు విరియబోసుకుని ఉంది. ‘‘అవును. ఇంట్లో నూనె ఉందా?’’ .

నిమీ నూనెసీసా తీసుకొని, చేతులలో నూనె వేసుకొని వదినగారి కేశాలకు రాసింది. ఆమె నివ్వెరపోయి ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి?’’ అంది.

‘‘త్వరగా బయలుదేరు.’’ ఏమిటో చూద్దామని ఆ యువతి కూడా బయటకు వచ్చింది. ‘‘అన్న వచ్చాడు. నిన్ను పిలిచాడు’’ అని చెప్పింది నిమీ నింపాదిగా.

‘‘వారు పిలిస్తే ఈ అలంకారాలన్నీ ఎందుకు? ఇలాగే వస్తాను’’. ఆమె ఆఖరుకు చిరుగుల చీర కూడా మార్చుకోలేదు. ఇద్దరూ కుటీరం నుండి వెలికి వచ్చారు. నిమాయి ఆమెను తీసుకొని ఇంటి గుమ్మం వద్దకు వచ్చింది. వదినను లోనికి నెట్టి తలుపులు బిగించి తాను బయటనే ఉండిపోయింది.

ఆ యువతి వయసు సుమారు పాతిక సంవత్స రాలు ఉంటుంది. కాని చూడటానికి నిమాయికంటే ఎక్కువ వయసున్నట్లుగా అనిపించదు. ఆమె నడవలో నుంచి గడప దాటి చినిగి వెలసిపోయి మాసిపోయి ఉన్న ఆ చీరతో ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడంతా కాంతిమంతమైంది. ఆమె ఇంటిలోనికి వెళ్లి భర్త కోసం చూచింది. అక్కడ నుంచి పెరట్లోకి వెళ్లింది. అతడు అక్కడొక గున్నమామిడి చెట్టును ఆనుకుని ఉన్నాడు. గుండె పగిలిపోతుందేమో నన్నంతగా దుఃఖిస్తున్నాడు. ఆమె స్థిమితంగా, నిరుద్వేగంగా అతడి దగ్గరకు వెళ్లింది. భర్త చేతులను తన చేతులలోనికి తీసుకుంది. జీవానందుడు ఏడుస్తున్నాడు. సుందరి కళ్లనీళ్లు పెట్టుకోవడం లేదు. జీవానందుని చేతులు పట్టుకొని ‘‘చీ, ఎందుకలా ఏడుస్తారు? నాకోసం ఇలా దుఃఖపడుతున్నారా? నాకోసం మీరేం విచారపడకండి. మీరు నన్ను ఇక్కడ వుంచి వెళ్లారు. నేనిక్కడ చాల సుఖంగా ఉన్నాను’’ అంది.

‘‘శాంతీ! ఏమిటీ వాలకం? ఏమిటి ఈ కట్టుబట్టలు? ఈ మలిన వస్త్రాలలో నిన్ను నేను చూడగలనా?’’

‘‘ఇవన్నీ నేను పట్టించుకోను. మీ ధనమంతా ఎంతో భద్రంగా దాచి ఉంచాను.’’

‘‘ఇప్పుడు ధనం నేనేం చేసుకుంటాను?’’

కానీ మీరు ఎప్పుడు తిరిగి వస్తారా, ఎప్పుడు నన్ను పరిగ్రహిస్తారా అని తపస్సు చేస్తున్నాను. నాకు అంతకంటె ఇంకేం తెలియదు. ఉద్యమం ముగిసిన తరువాత మళ్లీ వచ్చి నన్ను స్వీకరిస్తారా?’’

‘‘అలాగే చేస్తాను శాంతీ! ఇలాంటి సందేహం ఎందుకు వచ్చింది? నా ప్రాణానికి ప్రాణం నీవే! నేనేం నిన్ను వదలి వేశాననుకుంటున్నావా?’’

‘‘అలా అనుకోవడం లేదు. మీ వ్రతం పూర్తి అవడంతోనే నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు అనవసరంగా మీకు వ్రతభంగం అయింది.’’

‘‘వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం కూడా ఉంది. దానికి నేనేం విచారించను. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ ప్రపంచము, వ్రతము, హోమము, యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఒక ఎత్తు. నీవు ఒక్కదానివీ ఒక ఎత్తు. ఈ రెంటిలో ఏది ఎక్కువ బరువో నేను తేల్చుకోలేకుండా ఉన్నాను. దేశాన్ని చూద్దామా! అది అశాంతితో నిండి ఉంది. నేను దేశానికి ఏం చేయగలను? ఒక ఎకరం నేల దున్నుకుంటూ నీతోపాటు హాయిగా ఉండగలను. నీతోనే స్వర్గసుఖాలు అనుభవించగలను. నీవంటి గృహలక్ష్మి దొరికి కూడా నేను సుఖం అనుభవించ లేకపోతున్నాను. నాకోసం దేశంలో ఏడ్చేవారు ఎవరున్నారు? నీ వంటిమీది గుడ్డను చూస్తూ ఉంటే, దేశంలోని దరిద్రం అంతా ఇక్కడే తాండవిస్తున్న ట్లుంది. కాని నాకు దేశం కంటే నీవే గొప్పదానివి. నేనిక తిరిగి వెళ్లను. పద, ఇంటికి వెడదాం.’’

శాంతి కొంతసేపటివరకు ఏమీ మాట్లాడలేక పోయింది. తరువాత ఇలా అంది: ‘‘ఛీ! మీరు వీరులు. వీరపత్ని అనిపించుకోవడం కంటే నాకు ఈ ప్రపంచంలో కావలసింది ఏమీ లేదు. అధమమైన స్త్రీ కోసం మీరు ధర్మపరిత్యాగం చేస్తారా? మీరు మీ వీరధర్మాన్ని పరిత్యజించకండి. నాకు ఒక్కమాట చెప్పండి. ఈ వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం ఏమిటి?’’

జీవానందుడు ‘‘ప్రాయశ్చిత్తమా? దానము, ఉపవాసము, పన్నెండు పైసలు’’ అన్నాడు.

‘‘ప్రాయశ్చిత్తం ఏమిటో నాకు తెలుసు. ఒక అపరాధానికి ఏమి ప్రాయశ్చిత్తమో, పదింటికీ అదే. వంద అపరాధాలకూ అదే!’’ జీవానందుడు విస్మితుడై, వివశుడై ‘‘ఇదంతా ఏమిటి?’’ అన్నాడు. ‘‘నాకు ఒక భిక్ష పెట్టండి. తిరిగి నన్ను కలుసుకోకుండా మటుకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవద్దు.’’

‘‘ఈ విషయంలో నీవు నిశ్చింతగా ఉండు. నిన్ను చూడకుండా నేను మరణించను. నాకిప్పుడు చనిపోవలసిన అవసరం కూడా లేదు. ఇక నేనిక్కడ ఉండడం భావ్యం కాదు. ఇంకొకరోజు వచ్చి నిన్ను కలుసుకుంటాను. నీవు ఈ వేష భాషలు తొలగించు. నా పూర్వీకుల ఇంటికి వెళ్లి ఉండు. అక్కడే నీకు సుఖంగా ఉంటుంది’’ అన్నాడు.

‘‘ఇప్పుడు మీరు ఎక్కడికి వెడతారు?’’

‘‘మఠంలో బ్రహ్మచారి కోసం వెదుకుతూ వెళ్లాలి. ఆయన నగరానికి వెళ్లారు. వారు ఎందుకోసం వెళ్లారో తెలియదు. ఎక్కడికైనాసరే వెళ్లి వారిని వెదికి కలుసుకోవాలి!’’

17

భవానందుడు మఠంలో కూర్చుండి హరి సంకీర్తనంలో మునిగిపోయాడు. జ్ఞానానందుడనే ఒక తపస్వి సంతానుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ‘‘గోస్వామీ! ఏమైనా సమాచారం దొరికిందా?’’ అన్నాడు భవానందుడు.

జ్ఞానానందుడు ‘‘కొద్దిగా గందరగోళం అయినట్లు కనిపిస్తోంది. ఏదో విపత్తు ఎదుర్కొనవలసిన పరిస్థితి కనిపిస్తున్నది. నిన్న జరిగిన సంఘటనతో బ్రిటిషు సైనికులు, సర్కారు వారు ఉన్మాద స్థితికి చేరుకున్నారు. కావిగుడ్డలు ధరించి సన్యాసిలా ఉన్నవాడినల్లా సిపా యిలు బంధించి తీసుకువెళ్లారు. సంతానులందరూ కాషాయ వస్త్ర ధారణకు స్వస్తి చెప్పారు. ఒక్క సత్యానందులవారు మాత్రం కాషాయ వస్త్రాలు ధరించి నగరంవైపు వెళ్లారు’’ అన్నాడు.

ఆయనను బంధించగల ఇంగ్లిషు వాడెవడూ పుట్టలేదు. ధర్మేంద్రుడు ఆయన జాడను బట్టి వెళ్లాడని నాకు తెలుసు. నేనూ బయలుదేరుతున్నాను. నీవు ఆశ్రమాన్ని కనిపెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’’

ఈ మాటలు విని భవానందుడు లోపలి గదిలోనికి వెళ్లి వేషధారణ మార్చుకుని వచ్చాడు. మొగలుజాతి యువకునిలా తయారయి వచ్చాడు. చివరల వదులు పైజామా, మిర్జాయ్‌ ‌ధరించాడు. తలపాగ చుట్టుకున్నాడు. గుర్రాన్ని ఎన్నుకుని దానిమీద పట్టణంవైపు వెళ్లాడు.

అతడికి దారిలో అనేక అవరోధాలు కలిగాయి. నది ఒడ్డున అతడికి ఒక దృశ్యం అగుపించింది. కాదంబినీచ్యుతమైన విద్యుల్లతలాగా వెలిగిపోతూ ఒక స్త్రీ పడి ఉంది. ఆమెలో జీవకళ ఏ మాత్రం మిగిలి నట్లు లేదు. ఆమె సరసన విషపు మాత్రల డబ్బా పడి ఉంది. భవానందుడు విస్మిత్తుడై చూచాడు. జీవానందునివలెనే భవానందుడు కూడా మహేం ద్రుని భార్యాసుతలను చూచి ఉండలేదు. జీవానందు నకు వలె ఇతడికి వీరు ఫలానావారు అయి ఉంటారనే అనుమానం కూడా కలుగలేదు. బ్రహ్మచారి బందీ అయి ముసల్మానుల వెనుక వెళ్లడం అతడు చూచి ఉండలేదుగదా! భవానందుడు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె పక్కన కూర్చుని అనేకరకాలుగా పరీక్ష చేశాడు. ‘ఇంకా చనిపోలేదు. బతికించడానికి ఇంకా అవకాశముంది అనుకుని అరణ్యంలోనికి వెళ్లాడు. ఒక చెట్టు ఆకులు కోసుకువచ్చాడు. ఆకుల పసరు తీశాడు. ఈ పసరు ఆమె నోటిలో పోశాడు. ముందు ఏమీ ఫలించినట్లు కనిపించలేదు. అలాగే ప్రయత్నం చేస్తూ నిదానంగా వేచి ఉన్నాడు. భవానందుడు. క్రమక్రమంగా ఆమెకు శ్వాస ఆడసాగింది. భవానందుడు సంతోషించి ఆమెను గుర్రం మీద వేసుకుని నగరంవైపు ప్రయాణమై వెళ్లాడు.

18

సంధ్యా సమయానికి ముందుగానే సంతాన సంప్రదాయం ప్రకారం అందరికీ తెలిసిపోయింది మహేంద్రునితో సహా సత్యానందస్వామిని కూడా కారాగారంలో ఉంచారన్న సంగతి. ఈ కబురు తెలిసిన తర్వాత సంతాన సంప్రదాయానికి చెందిన వారందరూ ఒకరొకరు, ఇద్దరిద్దరు, పదుగురు, వందలుగా అరణ్యంలోని మఠం దగ్గరకు వచ్చి చేరుకున్నారు. వారందరూ ఆయుధాలు ధరించి ఉన్నారు. వారి నేత్రాలలో అగ్ని రగులుతూంది. వారు చాలావరకు సమావేశం అయిన మీదట స్వామి జ్ఞానానందుడు ఇలా ప్రసంగించాడు: ‘‘అనేక దినాల నుండి మనం నవాబుల ఇళ్లు దోచి సముద్రంలో కలిపి వేయాలనే సంకల్పంలో ఉన్నాం. ఇప్పుడా తరుణం ఆసన్నమైంది. మన గురువుగారు, పరమ గురువు, అనంతజ్ఞానమయుడు, సదా శుద్ధాచారి, మన ముక్తి మార్గదర్శకుడు ఇప్పుడు నవాబుల వలలో చిక్కుకుని చెరలో బందీ అయి ఉన్నారు. మన ఖడ్గాలు ఏం చేస్తున్నాయి? వాటి వాడి అంతా ఏమైంది?’’ చేతులు జాపుతూ ఆయన ఇలా అన్నాడు. ‘‘మన భుజాలలో బలం ఏమైంది? మన గుండె ధైర్యం ఏమైంది? సోదరులారా! అందరూ కలిసి ఒకమారు సంకీర్తనం చేయండి.’’

‘‘మురారే మధుకైటబారే!’’

మరుక్షణమే అరణ్యమంతా ఈ సంకీర్తనంతో నిండిపోయింది.

‘‘హరే మురారే మదుకైటభారే!’’

‘సహస్ర కంఠాల నాదానికి ఆకాశం కంపి స్తున్నట్లుగా ఉంది. వసుంధర గజగజలాడుతూంది. సంతాన బలగం బయలుదేరింది. హరినామ సంకీర్తనం చేస్తూనే వారు నగరం వైపు నడిచారు. అకస్మాత్తుగా ఇంతమంది కదిలి రావడం చూచి నగరవాసులందరూ దిగ్భ్రమ చెందసాగారు. నగర రక్షకులు నిశ్చేష్టులైనారు.

సంతానులు ముందుగా రాజ కారాగారానికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టారు. కాపలావారిని చంపి వేశారు. సత్యానంద, మహేంద్రులను విముక్తులను చేసి భుజాలమీద ఎక్కించుకుని నాట్యం చేస్తూ తమ ఆనందాన్ని ప్రకటించసాగారు. హరికీర్తనం దృశ్య రూపంలో అద్భుతంగా రూపుకట్టింది. నగర అధికా రులు సంతానుల ఉపద్రవం గురించి విని ఒక దళం సిపాయిలను పంపారు. సిపాయిల వద్ద తుపాకులు మాత్రమే కాదు, ఒక మర ఫిరంగి కూడా ఉంది. ఈ సంగతి తెలుసుకున్న సంతానగణం యుద్ధానికి తలపడింది. కాని లాఠీలు, కత్తులవల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది? తుపాకుల ముందు వారు పరాజితులై పరుగుతీయవలసి వచ్చింది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram