– డా।। గోపరాజు నారాయణరావు

‘కానీ వాళ్లు ఇళ్ల దగ్గర ఉండగా మీరు వెళ్లి చూస్తే మంచిది. పనిలో ఉండగా వైద్య పరీక్షలంటే ఎలా?’ అన్నాడు బాస్టియన్‌. ‘ఎక్కడైనా వాళ్లందరినీ ఒకచోటకి చేర్చే మేం పరీక్షలు చేస్తాం బాస్టియన్‌ ‌గారూ!’ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు డాక్టర్‌ ‌మూర్తి. ‘ఎంత అమాయకులు డాక్టర్‌ ‌గారూ! వీళ్లు పీకల దాకా కల్లు తాగి తాటితోపులలోనో, ఈత చెట్ల కిందో పడిపోయి ఉంటారు. అక్కడికి వెళ్లి చేస్తారా పరీక్షలు? లేకపోతే, ఎక్కడో కీకారణ్యంలో వేటాడుతూ ఉంటాడు. వాడి వెనకాలే మీరూ వెళతారా దూదీ, సిరెంజ్‌, ‌మందులూ పుచ్చుకుని ? ఇదీ అంతే. ఇది ముఖ్యమైన పని. ప్రభుత్వం పని. వీళ్లంతా మరో నాలుగు రోజులలోనే ఇళ్లకి పోతారు. అప్పుడు చేయండి! ఇక ఇంటి దగ్గరే పడి ఉంటారు. ఈ సోమరిపోతుల గురించి నాకెందుకు చెబుతారు.’ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘నేను అడుగుతున్నది రెండు గంటలు, వదిలిపెట్టడానికి కూడా సాధ్యం కాదంటారా?’ అవమాన భారంతో అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘సాధ్యం కాదనే చెబుతున్నాను డాక్టర్‌.’ ‌కొంచెం గట్టిగానే అన్నాడు బాస్టియన్‌.

‘‌బాస్టియన్‌ ‌గారూ! వీళ్లు ఈ పని ఇలాగే చేస్తే చాలా ప్రమాదం!’ అన్నాడు డాక్టర్‌ ‌మూర్తి. ‘ఏమవు తుంది? చస్తారా ? చావనీయండి. ప్రభుత్వ పని కంటేనా? వీళ్ల ప్రాణాలు మీరు అనుకుంటున్నంత విలువైనవేమీ కాదు.’ అన్నాడు బాస్టియన్‌, ‌గొంతు తగ్గించి. ఆ ఇంగ్లిష్‌ ‌సంభాషణ ఏమీ అర్థం కాక కొందరు వింతగా చూస్తున్నారు ఆ వాదులాట కేసి. ‘మీకొక విషయం చెబుతున్నాను. వీళ్లు మైదాన ప్రాంతంలో ఉండే దొమ్మర్ల మాదిరిగానో, వడ్డెర్ల మాదిరిగానో శరీర శ్రమ చేయకూడదు. అంత కష్టానికి వీళ్ల శరీరం తట్టుకోలేదు. వీళ్లకి కాల్షియం తక్కువ. పైగా ఈ దారుణమైన చలిలో, ఎండలో, ఆ దుమ్ములో పని చేస్తే ఆరోగ్యం చెడిపోవడానికి ఎంతోకాలం పట్టదు. దయచేసి అర్థం చేసుకోండి.’ అన్నారు మూర్తి. ‘అంటే రోడ్డు పనే ఆపేయ మంటారా? మీరు మాట్లాడేది ప్రభుత్వం వ్యతిరేకం. గుర్తుంచుకోండి !’ హెచ్చరిస్తున్నట్టు అన్నాడు బాస్టియన్‌. ‘‌డాక్టర్‌ ‌గారూ! రోడ్ల పని ఆపేయమని ఎలా చెబుతారు? కొండల్లో రోడ్లు వేయడం మొదలు పెట్టాక సంతలు మొదలయ్యాయి. వీళ్ల సరుకు బయటి ప్రపంచానికి పోతోంది. అమ్ముడుపోతోంది. చోడవరం, కోట, లంబసింగి, అడ్డతీగల సంతలు అలా వచ్చినవే. మన్యంలో దొరికే పళ్లూ, కాయలు, తుమ్మ, కలప ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ వెళుతున్నాయి. కొన్ని సరుకులు మద్రాసు, కలకత్తా పోతున్నాయి. ఇంకొన్ని బొంబాయ్‌, ‌లండన్‌, ‌హ్యాంబర్గ్ ‌వరకు వెళుతున్నాయి. ఈ రోడ్డు వాళ్లకి తిండి పెడుతోంది. ఇంకా పెడుతుంది. వీళ్లని ప్రధాన స్రవంతి జన జీవనంలో కలపడానికి ఈ రోడ్లే ఉపయోగపడతాయి. ఆ మాత్రం తెలియదా మీకు? మీకు తెలుసా డాక్టర్‌? ‌నిరుడే మన్యం కొండల ఉత్పత్తులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భాగ స్వామ్యమయ్యాయి. నిన్నగాక మొన్న ఏజెన్సీ కమిషనర్‌ ఏమన్నాడు? ఈ సారవంతమైన భూమిని, ఈ ఖనిజ సంపదని, సుసంపన్న ప్రకృతి సంపదని తెరిచి పెట్టండి. వెనుకబడిన కొండవాళ్లకి అభివృద్ధిని పరిచయం చేయాలి. వాళ్లు కాలంతో పాటు పురోగ మించాలి. ఆదిమ వ్యవసాయ పద్ధతులకి వాళ్లు స్వస్తి చెప్పాలి. వలస ఆర్థిక వ్యవస్థలో వీళ్లని భాగస్వాము లని చేయాలి అన్నాడు. వాళ్ల ఆలోచన అలా ఉంది. మీరేమో వీళ్లని రాచి రంపాన పెడుతున్నామని రగడ చేస్తున్నారు? ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాదా?’ ఇంకా తీవ్రంగా అన్నాడు బాస్టియన్‌. ‘‌నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని మీరు అంటున్నారు. కానీ నేను చదువుకున్న వైద్యవిద్య ప్రకారం ఆ మాట అంటున్నాను. ఈ చాకిరీతో వీళ్లు ప్రధాన జన జీవన స్రవంతికి చేరరు సరికదా! పరలోకాలకి మాత్రం చేరగలరు. అది తథ్యం. వీళ్లకి సుదూర తీరాలతో పరిచయం కలిగించే పేరుతో, దాంతో వాళ్లకి ఏం ఒరుగుతుందో తెలియకుండా వాళ్ల ఆయుషుని హరించడం ఏమి న్యాయం? ఇదే నా ప్రశ్న.’ ఈ వాదం ఇష్టం లేనట్టు అరుస్తూ వెళ్లిపోయాడు బాస్టియన్‌. ‘ఎవడ్రా అది? ఒళ్లోంచి పని చేయడం రాదు. చోద్యం చూస్తారు. లేదంటే దిక్కులు చూస్తారు. సోమరిపోతులు..’ అక్కడి నుంచి వెళ్లిపోయారు డాక్టర్‌ ‌మూర్తి. బాస్టియన్‌ ‌విలియం కేసి చూసి చిన్నగా నవ్వాడు. తప్పదన్నట్టు నవ్వాడు విలియం.

**********

ఆ రోజు లంబసింగి తిరిగి రావాలి.

కానీ రావడానికి మనస్కరించక బౌడలోనే ఉండిపోయారాయన. అక్కడే రాశారు డైరీ.

బౌడ, 7-3-1921

డియర్‌ ‌మన్యం డైరీ!

ఈ మనుషులని చూస్తుంటే ఆకుపచ్చ లావాలో కాగిపోతున్నారనిపిస్తోంది. బానిసలను చూసినట్టే చూస్తున్నారు. పశువులని సంతలకి తోలుకు వెళ్లినట్టు గ్రామాల మీద పడి మనుషులని రోడ్డు పనికి లాక్కుపోతున్నారు. ఈ వాక్యాలలో ఒకటి రెండు విశేషణాలు కనిపించవచ్చు.

కానీ అవి వాస్తవాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగించినవే. ఇదే ఒక సృజనాత్మక రచయిత రాస్తే వాళ్ల మెడలకు తాళ్లు కూడా వేసేవాడు. గొలుసులతో ఈ బక్క ప్రాణులను బంధించేవాడు.

కానీ నాకు మనసొప్పడం లేదు. అలాంటి అభిప్రాయానికి వచ్చి స్వేచ్ఛా భావనకూ, వీరికీ ఉన్న మధ్య దూరాన్ని ఊహలలో కూడా పెంచలేను. ఆ దూరం ఎంత తొందరగా తగ్గితే అంత మంచిదని అనిపిస్తోంది. అందుకే వీరి పోరాట వారసత్వాన్ని చిన్నబుచ్చలేను. నిజానికి దానిని గుర్తుకు తెచ్చుకోక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోంది. ఏమైనా, నాకు కలిగిన అభిప్రాయం సత్యదూరం కాదు. నేనొక ప్రభుత్వోద్యోగిని. అయినా వాస్తవాలను చూస్తే ఈ మాటలు సరైనవేనని అనిపిస్తుంది. అయినా ఇదంతా కొన్ని నిమిషాల సేపు మరచిపోయే టట్టు చేసింది బూసిచెట్టు. దోసిట్లో ఇంద్రధనుస్సులాగే అని పించింది. ఎర్రని కొత్త చిగుళ్లు- చిటారుకొమ్మన విచ్చుకుంటూ.

దాని కింది వరసలో ఆకుపచ్చ చిగుళ్లు. ఆ కింద రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పసుపుపచ్చ ఆకులు.

**********

బాస్టియన్‌ ‌మాటలు ఎంత మరచిపోదామన్నా సాధ్యం కావడం లేదు డాక్టర్‌ ‌మూర్తికి. ఒళ్లంతా శ్రమతో పులిసిపోయినట్టు ఉంది. గెస్ట్ ‌హౌస్‌ ‌కే వెళ్లిపోయారు. ఆ ఉదయం చదువుతూ బోర్లించి పెట్టిన డైరీ తీసుకున్నారాయన చేతుల్లోకి. చదవ వలసిన పేజీలో పాకాబు మునసబు విషాదాంతం ఉంది. నిరుడు రాసుకున్న పేజీ. అది మరింత బాధ కలిగించింది. పాకాబు, 8-3-1921, డియర్‌ ‌మన్యం డైరీ! ఈ ఊరు వచ్చాం. మా పని మామూలే. అంతంత మాత్రమే.

కానీ మనసు వికలం చేసే విషయం ఈ ఊళ్లో తెలిసింది. తాజంగి వెళ్లినప్పుడు లువ్వాబు పండు దొర ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాకబు చేస్తే ఆ సమాచారం తెలిసింది. బాస్టియన్‌ అనేవాడిని ఈ ప్రభుత్వం ఎందుకు భరిస్తోంది? ఆ గప్పీ దొర బంగ్లా ఒక అరాచకాల పుట్టలా తయారైంది. ఇవేమీ బయట ప్రపంచానికి తెలియవు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నానికే ఏమీ తెలియడం లేదు. లువ్వాబు లచ్చన్న దొర ఉదంతం దేశంలో మరెక్కడైనా జరిగితే ఈ పాటికి బాస్టియన్‌ ‌వంటి వాళ్లు జైళ్లకు వెళ్లేవాళ్లు. లచ్చన్న దొర ఈ ఊరి మునసబు. కూలీలతో పాటు తానూ రోడ్డు పనికి వెళ్లేవాడట. ఏం జరిగిందో ఇంతవరకు తెలియదట. గప్పీ దొర బంగ్లా దగ్గర స్తంభానికి కట్టేసి కొరడాతో కొట్టించాడట బాస్టియన్‌. ఇది అబద్దం కావడానికి వీలులేదు. ఎవరిని కదిపినా ఇలాంటి గాథలే వినిపిస్తున్నాయి. కొరడా దెబ్బలతో ఒళ్లంతా చీరుకుపోయి ఉంటే, దాని మీద మిరప కాయలు నూరి ఆ ముద్ద రాయడం ఏమిటి? ఇదెక్కడి రాక్షసత్వం? అది చాలక మర్మాంగాల మీద కారం ముద్ద రాయడం ఏం పశుత్వం? ఆ సమయంలో మన్యం నడిబొడ్డు నుంచి లచ్చన్నదొర చేసిన ఆర్త నాదాలు మద్రాసుకు వినిపించి ఉండాలి. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి అగరం సుబ్బరాయులురెడ్డి యార్‌ ‌కీ, గవర్నర్‌, ‌హిజ్‌ ఎక్సిలెన్సీ ఫ్రీమన్‌ ‌ఫస్ట్ ‌మార్క్వెస్‌ ‌విల్లింగ్టన్‌ ‌దొరవారి చెవినీ సోకి ఉండాలి. బాస్టియన్‌ ‌బంట్రోతు కిష్టయ్య కొట్టి పడేస్తే, ఎవరో తీసుకువచ్చి ఇంటి దగ్గర అప్పగించారు. కొద్ది వారాలకే అతడు చనిపోయాడు. నిశ్చయం- ఆ దెబ్బలకే అతడు చనిపోయాడు.

గ్రేట్‌ ‌వార్‌ అదే ప్రపంచ యుద్ధం రోజుల్లోనే చెన్నపట్నంలో రాయపేట వైద్య కళాశాలలో మేం చదువుకున్నాం. కాలేజీ లైబ్రరీలో ది మెయిల్‌, ‌ది స్పెక్టేటర్‌, ‌మద్రాస్‌ ‌టైమ్స్, ‌ది హిందూ పత్రికలని పడిపడి చదివేవాళ్లం. అప్పుడే ఎందులోనో పడిందా వార్త. యుద్ధఖైదీల పట్ల శత్రుదేశాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాయో రాశారు. కళ్లంట నీళ్లు వచ్చాయి మాకు.

కానీ విశాఖ మన్యంలో అల్ఫ్ ‌బాస్టియన్‌, ‌పోలీ సులు, అటవీ ఉద్యోగులు కొండవాళ్లని యుద్ధఖైదీల్లాగే చూస్తున్నారంటే అక్షరం కూడా అతిశయోక్తి కాదు. బాస్టియన్‌ ‌వంటి వాడి మీద ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. అయినా దానిని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం నేను రాయడం లేదు. ఒక వాస్తవాన్ని రాస్తున్నాను. ఆ వాస్తవాన్ని సుబ్బరాయలురెడ్డియార్‌, ‌విల్లింగ్టన్‌ ‌కూడా ఆమోదించక తప్పదు. ఈ పది రోజులలో చూసినదానిని బట్టి గూడెం కొండలలోని ప్రతి గ్రామం రోడ్డు పని పేరుతో గాయపడింది. చివరిగా పాకాబు గ్రామస్థులు చెప్పిన మాట మరీ కలచివేసింది. ఇలా దెబ్బలు తగిలి ఇంకా ఎందరో మంచం పట్టి చావు కోసం ఎదురు చూస్తున్నారట.

**********

బాగా ఆలస్యంగా లేచారు డాక్టర్‌ ‌మూర్తి. చాలా నిశ్శబ్దంగా ఉంది గెస్ట్ ‌హౌస్‌. ‌సహాయకులు ఇద్దరూ ఎక్కడికో వెళ్లినట్టున్నారు. తలుపు తీసుకుని బయటకు వచ్చిన డాక్టర్‌ ‌మూర్తికి మళ్లీ అదే దృశ్యం కనిపిం చింది. చేతిలో ఇండియా పేల్‌ ఏల్‌ ‌బీరు సీసా. కొద్ది కొద్దిగా తాగుతున్నాడు విలియం. సరిగ్గా వందేళ్ల క్రితం దీనిని మన సైన్యానికి అలవాటు చేశారు బ్రిటిష్‌వాళ్లు. వాళ్లకి ఎంతో ప్రీతిపాత్రమైన పానీయం. క్లుప్తంగా ఐపీఏ అంటారు. పక్కన పలచగా కారం అద్దిన చేపల ఫ్రై ముక్కలు తెల్లటి పింగాణీ ప్లేట్లో. తెల్లటి తుండు చుట్టుకుని ఒక మోడ్‌ ‌మీద కూర్చుని ఉన్నాడు విలియం. కింద కూర్చుని అతడి కాళ్లు చాలా శ్రద్ధగా పడుతున్నాడు ఒక సహాయకుడు. మరొక సహాయకుడు వెనుక నిలబడి ఒళ్లు పడుతు న్నాడు. ప్రకృతి కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు విలియం.

**********

ఇంకా అడుగులు వేస్తుండగానే ఒక్క ఉరుకుతో గుర్రం దిగి, గప్పీ దొర బంగ్లా మెట్ల వైపు పరుగు లాంటి నడకతో వెళ్లాడు బాస్టియన్‌. ‌బాట పక్క నుంచి దాదాపు పాతిక మెట్లు పైకి. పది మెట్లు ఎక్కితే ముందు ప్యూన్ల క్వార్టర్సు కనిపిస్తాయి. కుడి పక్క దాంట్లోనే ద్వారం కిష్టయ్య ఉంటున్నాడు. ఎడం పక్క క్వార్టర్సులో ఓవర్సీర్‌ ‌సంతానం పిళ్లై ఉన్నాడు. రోడ్డు పనిని ఇక్కడ ఉండే చేయిస్తున్నారు, అంతా. సాయంత్రం ఐదు గంటలవుతోంది. చల్లగా ఉంది వాతావరణం. అటూ ఇటూ బాగా పరికించి, ఎవరూ లేరని గమనించి చటుక్కున కిష్టయ్య ఉన్న క్వార్టర్సు లోకి దూరాడు బాస్టియన్‌. ‌తీరా లోపల ఎవరూ లేరు. కొద్దిగా చీకటిగా ఉంది. ‘ఈ కిష్టిగాడు అది వచ్చేసిందని చెప్పాడు! ఏమైంది?’ అనుకున్నాడు బాస్టియన్‌, ‌తనలో. రెండు గదుల చిన్న పోర్షన్‌. ‌ముందు గదిలో ఒక నులక మంచం, ఒక మూలగా ఒక నీళ్ల కుండ ఉన్నాయి. ఆ మంచం మీద కూర్చు న్నాడు బాస్టియన్‌. ‌చిన్నగా దుర్గంధం. ఎలుకలు కాబోలు. కిష్టయ్య ఎదురుగా ఉంటే ఈ పాటికి పీక పిసికి చంపేవాడే. ఎంత ఉత్సాహంతో వచ్చాడు! ఎంత ఆబగా వచ్చాడు! అసలు ఎంతో కుట్ర పన్ని, పెద్ద ప్రయత్నం చేస్తే తప్ప దానితో పొందు సాధ్యం కాలేదు. ఆ పేరు తలుచుకోగానే ఒళ్లంతా తిమ్మిరెక్కి పోతుంది బాస్టియన్‌కి. కొండవాళ్ల ఆడది కాదు. కొండవాళ్లు విస్తరి కూడా వేయడానికి ఇష్టపడని కులంలో పుట్టింది. చూడ్డానికి కట్టూబొట్టూ అన్నీ కొండవాళ్లలాగే ఉంటాయి. అదో నల్లకలువల గుట్ట. సన్నటి నడుం, బలమైన జఘన సీమతో పిటపిట లాడిపోతూ ఉంటుంది. దాని ఎత్తు గుండెలు చూస్తే బాస్టియన్‌ ‌దాసాను దాసుడైపోయాడు. మొదటిసారి చూసినప్పుడే ఇది అడవిలో పుట్టాల్సికాదని తేల్చే శాడు. కొండసంత గ్రామంలోనే ఆమెను చూశాడు బాస్టియన్‌. ‌పేరు డోలా లక్ష్మమ్మ. ఆమె స్వగ్రామం కూడా అదేనని తెలిసి ఆనందపడ్డాడు. మొగుడిని వదిలేసి ఒంటరిగా ఉంటోందన్న విషయం బాస్టియన్‌ను మరీ తొందర చేసింది.

మొదట ఒక ఘాట్‌ ‌రోడ్డు పనికి ఆమె వచ్చేటట్టు చేశాడు బాస్టియన్‌. అక్కడ మేస్త్రీ రామమూర్తికి, సంగతి చెప్పి ఉచ్చులోకి దించే బాధ్యత అప్పగిం చాడు. ఇవేమీ తెలియని లక్ష్మమ్మ ఓ రోజున వచ్చి, ‘మేస్త్రి రెండు రూపాయలు కావాలి. ఇంకోసారి రోడ్డు పనికి వచ్చి తీర్చుకుంటాను’ అని మొరపెట్టుకుంది. రామమూర్తి చాలా బెట్టు చేశాడు. బాస్టియన్‌ అను మతి కావాలన్నాడు. రెండు రూపాయలంటే కష్టం అన్నాడు. ఇదనీ, అదనీ హంగామా చేశాడు. చివరికి బాస్టియన్‌ ‌దగ్గరకు పంపాడు. పది పైసలు కూడా వదలని బాస్టియన్‌ ‌రెండు రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ చాలా మంది లాగే లక్ష్మమ్మ కూడా డబ్బులు తీసుకున్నా, ఆ గొడ్డు చాకిరీ చేయలేక పనిలోకి రాలేదు. ఇంకెవరు ఆ పని చేసినా బాస్టియన్‌ ‌సహించడు. నిజానికి డబ్బులు తీసుకుని పని ఎగొట్ట నక్కరలేదు. అసలు పనికి రాకపోతేనే బాస్టియన్‌ ‌సహించడు. మొలతాడు కట్టిన మగాడు, చీర కట్టిన ఆడది పనిలో ఉండాల్సిందే.

కానీ లక్ష్మమ్మ విషయం వేరు. ఆమె పనిలోకి రాకుండా ఉండిపోవాలి. అతడికి కావలసింది అదే. అంతా నిర్ణయించుకుని కొండసంతలో సంత రోజునే బాస్టియన్‌, ‌రామమూర్తి, కిష్టయ్య వెళ్లారు.

ఊరి బారికను కూడా వెంట పెట్టుకున్నారు. ఒకచోట మాటేశారు. కానీ లక్ష్మమ్మ కోసమే వచ్చారన్న మాట రాకూడదు. అందుకే ముందు చిన్న గలభా సృష్టించాలని పథకం వేశారు. దాంతో రోడ్ల పని మీద బాస్టియన్‌ ఎం‌త దీక్షతో పనిచేస్తున్నాడో నలుగు రికీ తెలియాలి. సరిగ్గా వీళ్ల పథకానికి తగ్గట్టు కిముడు గెద్దయ్య, పరిగా పెంటేసు, కొండోజు చెల్లయ్య సంతకు వచ్చారు. ఆ ముగ్గురూ కూడా డబ్బు, బియ్యం తీసుకుని, కొత్తగా పనిలోకి రాకుండా దాక్కు న్నవాళ్లే. రామమూర్తి, కిష్టయ్య, బారిక వెళ్లి ఆ ముగ్గు రినీ బెదిరించి బాస్టియన్‌ ‌ముందు హాజరు పరిచారు.

ముగ్గురి చేతులూ కట్టేయ్యమని బారికను ఆదేశిం చాడు బాస్టియన్‌. ‌తరువాత రామమూర్తి, కిష్టయ్య ఆ తాళ్లు పట్టుకుని కొడుతూ నడిపిస్తూ ఉంటే, ముందు డప్పు వాయిస్తూ బారిక నడిచాడు. అలా ఆ ముగ్గురినీ సంతంతా తిప్పారు. సంతకొచ్చిన జనం కకావికలైపోయారు. సాయంత్రం నాలుగింటి దాకా సాగవలసిన సంత మధ్యాహ్నం ఒంటిగంటకే ఖాళీ. అప్పుడే ఘనత వహించిన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం వారికి డోలా లక్ష్మమ్మ అనే పేదరాలు ఇవ్వలసిన రెండు రూపాయల బకాయినీ వసూలు చేయడానికి బాస్టి యన్‌ ‌స్వయంగా బయలుదేరి వెళ్లాడు. ఆ ముగ్గురినీ సంతంతా తిప్పిన సంగతి తెలిసి గడగడలాడి పోయింది లక్ష్మమ్మ. తలుపులు వేసుకుని గుడిసెలో ఉండిపోయింది. ఏది జరగకూడదని అనుకుందో అదే జరిగింది. ఇంటి తలుపు దడదడ మోగితే హడలి పోతూ తీసింది. ఎదురుగా బాస్టియన్‌. ‌మాట పడిపో యిందామెకు. ‘రెండ్రూపాయలు ఇవ్వాలి. తీసుకురా. లేకపోతే చాలా గొడవైపోతది. పోలీసులు కూడా వస్తారు.’ చాలా శాంతంగా చెప్పాడు బాస్టియన్‌. ‘‌దండాలు దొరా! దొరా! ఇప్పుడు నాకాడ లేవు. రోడ్డు పనికొస్తా. తప్పు కాయి దొరా!’ అంది వణికిపోతూ. ‘పనికి వస్తే రావొచ్చు. మానేస్తే మానేయవచ్చు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram