– డా।। గోపరాజు నారాయణరావు

‘కానీ నువ్వు తీసుకున్న రెండు రూపాయలు ఇప్పుడు ఇచ్చేయాల్సిందే.’ అన్నాడు అంతే శాంతంగా, ‘ఇప్పుడే అంటే ఎలా దొరా!’ అంది దాదాపు ఏడుస్తూ. ‘ఎలా అంటే నేనేం చేయను. నువ్వు రెండు రూపాయలు తీసుకున్న మాట నిజమే కదా!’ ‘ఔను దొరా!’’ ‘నేను గవర్నమెంటు వారికి లెక్క చెప్పాలి!’ అన్నాడు విసుగ్గా. ‘దేవుడి సాచ్చిగా…. నాకాడ లేవు దొరా!’ మళ్లీ ఏడుస్తూ అందామె.

‘‘పోనీ, నా జేబులో డబ్బులు ఇచ్చి, లెక్క సరి పెడతాను. నాకు మాత్రం నువ్వు కావాలి! ఒప్పేస్కో!’ అన్నాడు కర్కశంగా. అప్పుడర్థమైంది లక్ష్మమ్మకి. ఒక ఉదుటన గుడిసె బయటకు వచ్చి పరుగు తీసింది. పట్టుకోవడానికి ముందుకు ఉరుకుతూ అరిచాడు బాస్టియన్‌. ‘‌దొంగలంజా! ఎక్కడికి పోతావే?’ తన స్థాయిని, సంత అన్న మాట కూడా మరచి వెంటపడ్డాడు. జనం దూరం దూరంగా ఉండి చూస్తున్నారు. దగ్గరకొచ్చి మాట్లాడే సాహసం ఎవరూ చేయడం లేదు. ‘చూడండ్రా! రోజులెలా ఉన్నాయో! రెండ్రూపాయలు కావాలని కాళ్లావేళ్లా పడి తీసు కుంది. ఇప్పుడు ఎగొట్టడానికి నాటకాలాడతాంది ముండ. దీని బాబిస్తాడా? వదిలేసిన దీని మొగుడు ఇస్తాడా, ఆ రెండు రూపాయలు?’ గట్టిగా అరుస్తూ ఆమెనే వెంబడిస్తున్నాడు బాస్టియన్‌. ‌లక్ష్మమ్మ పది గుడిసెల అవతల తెరిచి ఉన్న ఒక గుడిసెలో దూరింది. అది చేపల బొర్రేసుగాడి గుడిసె. బాస్టియన్‌ ఏది కోరుకున్నాడో అదే జరిగింది. లక్ష్మమ్మ తన గుడిసె నుంచి బయటకే రావాలి. తను వెంట పడాలి. అది తన కింద నలిగిన సంగతి తిరుగు లేకుండా జనానికి తెలియాలి. బొర్రేసు గుడిసెలోకి బాస్టియన్‌ ‌కూడా దూరాడు. ఆమెను చెరిచాడు. తరువాత ఊరు ఆమెను వెలేసింది. బాస్టియనే దయదలచి గూడెంలో చోటు చూపించాడు. గత కొంతకాలంగా ఆమె బాస్టియన్‌ ఇలాకాగా ప్రసిద్ధి. గుమ్మంలో వెండి కడియాల చప్పుడైంది. లోపలికి వచ్చి తలుపులు వేస్తోంది లక్ష్మమ్మ. అమాంతం లేచివెళ్లి కౌగలించు కోబోయాడు బాస్టియన్‌. ‘ఏం‌టి! ఎలుగొడ్లా పడిపోతన్నారు? ఓ పాలాగండి!’ అంది చనువుగా చిరాకు పడుతూ. ‘ఆగలేనే లచ్చి. నన్నాపకే… నీ కాళ్లు పట్టుకుంటాను!’ అన్నాడు పాదాల మీదకు వంగుతూ. ‘ఒక్క నిమసం ఆగండి!’ ‘దానిక్కూడానా? ఎందుకు?’ అన్నాడు బాస్టియన్‌. ‘‌కిష్టయ్య వస్తాడు. ఆడూ చూస్తాడని!’ అంది నవ్వుతూ. ‘ఇప్పుడు ఆడెందుకు?’ అన్నాడు చురచుర చూస్తూ. ‘కౌజు పిట్ట మాంసంకూర, చేపల పులుసు అట్టుకుని రమ్మన్నాను కిష్టయ్యని’ అంది, మంచం మీద దభీమని కూర్చుంటూ. ఆ శబ్దానికి ఓ పందికొక్కు గబుక్కున ముందుకు వచ్చి, మళ్లీ వెనక్కి పోయింది. ‘ఈ పందికొక్కులూ, ఎలకలూ ఉన్న గదిలో ఏంటో!’ బాస్టియన్‌ అన్నాడు ఇంకాస్త చిరాగ్గా. ‘మరి నేనేమనుకోవాలి దొరా!’ అంది లక్ష్మమ్మ. ‘నీకేంటి?’ అన్నాడు బాస్టియన్‌. ‘ఎలుగొడ్డుతో ఉంటన్నాను కదా… నేనేమనుకోవాలీ అని!’ అందామె, దీర్ఘం తీస్తూ. ‘అన్నిసార్లెందుకంటావ్‌!’ అన్నాడు దీనంగా బాస్టియన్‌.

‘‌నిన్నుకాక ఇంకెవర్నంటాను దొరా!’అంది గోముగా. కరిగిపోయిన బాస్టియన్‌, ‘ఒక్క ముద్దు!’ అంటూ మోటుగా దగ్గరగా తీసుకుని చుంబించా డామెని. అప్పుడే కింద ఎవరి మీదనో అరుస్తున్నట్టు కిష్టయ్య గొంతు వినపడింది. సర్దుకుని కూర్చుంది లక్ష్మమ్మ. ఓ నాలుగైదు నిమిషాల తరువాత తలుపు తోసుకుని వచ్చాడు కిష్టయ్య. అన్నం క్యారియర్‌, ఆకులతో మూతులు కట్టిన కూర, పులుసు గిన్నెలు అక్కడ పెట్టి వేగంగా వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడ య్యాడు. ఏదో గుర్తుకొచ్చినట్టు అన్నాడు. ‘ఇదిగో లచ్చి! ఆ మూల ఉంది చూడు, గొంగడి. అది మంచం మీదేసుకుని వొసైం తినండి. కింద ఎలగొద్దుల కంపు. మంచం మీదే అలాగే కంచాలు పెట్టకు. నేను కడుక్కోలేక చావాలి.’ అంటూ సలాం కొట్టి వెళ్లిపోయాడు.

మొదట కుండలో నుంచి పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చిందామె. తరువాత కుండ దగ్గరే ఉన్న ఓ చీనా రేకుపెట్టె మీద మడత పెట్టి ఉంది గొంగడి. అది తీసుకు వచ్చి మంచం మీద పరిచింది. ఆ గొంగడి అలా ఉపయోగపడుతున్న సంగతి ఇప్పుడే కిష్టయ్యతో తిట్లు తిని వెళ్లిపోయిన మనిషికి తెలియదు. తెలిస్తే తల్లడిల్లిపోతాడు. అతడు మూగయ్య.

మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతం. గెస్ట్‌హౌస్‌ ‌వెనక గోడ మీద మోచేతులు ఆనించి ఎదురుగా చూస్తున్నారు డాక్టర్‌ ‌మూర్తి. రెండు రోజులే ఇక ఇక్కడ. చాలా అసహనంగా ఉంది డాక్టర్‌ ‌మూర్తికి. ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను ఎలానూ ఆపలేడు. వాళ్లేమో తన చేతిలో ఉన్న విద్యను ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు కావ డానికి సిద్ధంగా లేరు. ‘హలో డాక్టర్‌!’ ‌తన వాటా తలుపు తెరుచుకుని బయటకు వస్తూ పలకరించాడు విలియం. ‘హలో!’ అంటూ అంటూ కరచాలనం చేశారు డాక్టర్‌ ‌మూర్తి. పక్కకే వచ్చి, గోడమీద చేతులు ఆన్చి ఎటో చూస్తూ అన్నాడు విలియం. ‘మీ నిజాయతీ నాకు నచ్చింది డాక్టర్‌. ‌యుద్ధభూమిలో మిలటరీ డాక్టర్లు గుర్తుకు వస్తున్నారు.’ మనస్ఫూర్తిగానే అన్నాడా మాట. ‘ఇప్పుడు ఈ మన్యం కూడా యుద్ధభూమే విలియం! కొందరి ఆరోగ్యం కోసమైనా మిలటరీ డాక్టర్ల మాదిరిగానే నా ప్రయత్నం చేశాను. క్షతగాత్రుల అదృష్టం ఎలా ఉందో ఆ భగవంతుడికే తెలియాలి.’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, కొంచెం బాధగా. రోడ్డు పని, అందులో గిరిజనులను పెడుతున్న హింస, బ్రిటిష్‌ అధికారుల అమానుషత్వం గురించే డాక్టర్‌ ‌మూర్తి మాట్లాడుతున్నారని అర్థమైపోయింది విలియంకి. ఆ విషయమే అతడికి ఇష్టం లేదు. ‘ఇంత అద్భుతమైన సౌందర్యం, రుచికరమైన పళ్లు, ఆహారం… అయినా ఇక్కడ ఈ ఎనిమిది రోజులు గడపడం గగనమైపోయింది డాక్టర్‌!’ అన్నాడు విలియం.

‘వందల ఏళ్ల నుంచి ఈ అడవిలోనే బతుకుతున్న వాళ్ల మాటేమిటి?’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘వీళ్లంతా కూడా బయట ప్రపంచంలోకి వచ్చి ఉండొచ్చు!’ అన్నాడు విలియం. ‘చూడు విలియం! నువ్వు ఎనిమిది రోజులు ఉండడం గగనమైపోయిందని అన్నావ్‌. ‌మరి వీళ్లంతా వచ్చి మైదానాలలో బతకడం కూడా అలాంటిదే కదా! వాళ్లకెందుకా శాపం? అన్నారు మూర్తి కాస్త ఆవేశంగానే. ‘మీరీ ట్రైబల్స్ ‌ని సమర్ధిస్తూ ఉంటారు. కానీ, డాక్టర్‌! అడవుల మీద మీ భక్తి మీ ప్రజల పురోగతిని నిరోధిస్తోంది. సహజ వనరులు మనం ఉపయోగించుకోవడానికే ఉన్నాయి. మనం ఉన్నది మాత్రం వాటిని కాపాడడానికి, చూసి ఆనందిస్తూ కాలం గడపడానికి కాదు. కానీ మీ దేశంలో జరుగుతున్నది ఇదే. అవి మీ కోసం ఉన్నాయని మీరు భావించడం లేదు. ఎంత దరిద్రంలో ఉన్నా మనుషుల విధి వాటిని రక్షించడమే తప్ప మరొకటి కాదన్న భావనే మీదంతా. అదిగో, ఆ అరటి చెట్టు చూడండి. ఆ గెల కొట్టాలంటే చెట్టును కొట్టాలి. గెల తీసుకోవాలి. కొత్త మొక్క మొలవడానికి చోటు చూపించాలి.’ అన్నాడు విలియం. సంభాషణ అంతా ఇంగ్లిష్‌లో సాగుతోంది. ‘అరటి చెట్టుని కాదు, ఆ పక్కనే ఉన్న మామిడిచెట్టు చూడండి! ఆ పైన ఉన్న ఉసిరి చెట్టు చూడండి! అదిగో ఆ ఈత చెట్టునేనా చూడండి! మా దృష్టిలో అడవంటే అది. ఫలం మనం అనుభవించాలి. చెట్టు అలాగే ఉండాలి.

కాయల కోసం చెట్టు కొట్టేస్తారు సరే, అన్ని కాయలు కాసే మరో చెట్టుని అక్కడే చూడాలంటే ఎన్ని తరాలు వెళ్లాలి? అరటి చెట్టే మీ దృష్టికి రావడానికి కారణాలు వేరు.’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘ఇది వినడానికి బావుంది! కానీ ఈ ప్రజల పేదరికం మాటేమిటి?’ అన్నాడు విలియం. ‘ఈ పేదరికం మన చట్టాల పుణ్యమే. అటవీ సంపదని ఇలా దాచి పెట్టుకోవడమే దరిద్రానికి కారణం అనుకుంటే పొరపాటు. అటవీచట్టం రావడానికి ముందు వీళ్లంతా బాగా బతికిన వాళ్లే. మా పురాణాల్లో, చరిత్రలో అడవిబిడ్డల ఆక్రందనలు వినిపించవు. కనిపించవు. ఎంత పెద్ద చక్రవర్తి అయినా వీళ్ల మీద ఆధిపత్యం చెలాయించలేదు. ఈ అద్భుత ప్రకృతికి, ఈ సంపదకి వారే సర్వం సహాధికారులు. ఒక్క విషయం విను! కొన్ని వేల ఏళ్ల నుంచి అడవులు ఉన్నాయి. అందులో వేలాది ప్రాణులు ఉన్నాయి. అందులో మనిషి ఒకడు. తెలివైన వాడే అయినా, ఈ మొత్తం అడవిని కొట్టుకుని తానే ధనవంతుడినవు దామన్న దుర్బుద్ధి కలగలేదు. ఆ దృష్టి కూడా అడవి లాంటి అద్భుతమే. అదే జరిగి ఉంటే, వీళ్లకు మించిన ధనికులు ఈ ప్రపంచంలోనే ఉండరు. ఈ టేకు చెట్లు, రావి చెట్లు, మర్రిమానులు ఎన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నాయి? ఒక్క చెట్టు విలువ ఎంతో నీకు చెప్పక్కరలేదు. ఇలాంటివి ఈ మన్యం నిండా ఎన్ని? ఇక ఎన్నివేల వనమూలికలు? ఎన్ని పళ్లు? ఎన్ని పూలు? ఎన్ని రకాల పక్షులు? ఎన్ని రకాల వనచరాలు ఉంటాయి? జీవితం సరిపోతుందా లెక్క పెట్టడానికి? ఇంత అద్భుతాన్ని పెకలించుకుపోయి, ధనంగా మార్చుకుని ఒక్క రాత్రిలో ఖజానా నింపి వేయాలన్న ఆలోచన ఓడ దొంగల వ్యవహారం కాదా?’ అన్నారు మూర్తి. ‘మీరు సమర్థిస్తున్న అడవిబిడ్డలంతా అడవిని రక్షించేవారేనా? పోడు వ్యవసాయం అడవిని తగలబెట్టేది కాదా? అందుకే ప్రభుత్వం పోడు వ్యవసాయాన్ని నిషేధించింది!’ అన్నాడు హేళనగా విలియం. ‘నేను అడవి బిడ్డలను సమర్థిస్తాను అంటే, ప్రభుత్వం సమర్థించడం లేదన్న అర్థం రావచ్చు విలియం! అది నిజమేనా! అది సరే, పోడు అడవిని నాశనం చేసేదీ లేనిదీ ముందు ముందు తెలుస్తుంది. పోడుతో పోయేది చాలా తక్కువ. కానీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి ఇచ్చిన మన్యం పరిధి ఎంత? అది కూడా చెప్పండి!’ అన్నారు.

మూర్తి ఒక గవర్నమెంట్‌ ఉద్యోగిగా ఈ రీతిగా మాట్లాడడం విలియంకి వింతగా ఉంది. ఎందుకంటే అది ఇప్పటి ప్రభుత్వ విధానం. ఆ తరువాత డాక్టర్‌ ‌నోటి నుంచి వినే మాటలతో తాను నిశ్చేష్టుడినికాక తప్పదని విలియంకి అప్పటికి తెలియదు. ‘మహా యుద్ధంలో నవనాడులు కుంగిపోయి ఉన్న బ్రిటన్‌ ‌కి నిమిషాల మీద నిధులు పోగుపడాలి. అందుకే ఈ అడవి మీద కన్ను పడింది. మా కంటే నీకే బాగా అర్థమయ్యే మరొకటి చెబుతా విను. పోడును నిషేధించడానికి కారణం – సముద్రపు అలలో వస్తున్న మార్పు. దానితో తగ్గిన ఓడల నడక వేగం. వాణిజ్యం తగ్గు ముఖం పట్టడం- ఇది విన్నావా?’ అన్నారాయన. ఆ డాక్టర్తో వాదించి గెలవలేమని డ్రైవర్‌ ‌విలియంకు అర్థమైంది.

కానీ బ్రిటన్‌ ‌వంటి ఒక మహా సామ్రాజ్య నిర్మా ణంలో ఇలాంటి ప్రాణాలు రాలిపోవడం సర్వ సాధారణం అని సరిపెట్టుకుంది అతడిలోని రక్తం. ‘డాక్టర్‌! ‌మీ ఆవేదననీ, అందులోని మానవతా దృక్పథాన్ని నేను త్రోసిపుచ్చలేను. ఎందుకంటే బాస్టియన్‌ ‌చేస్తున్న పని ప్రభువు చెప్పిన దయ అనే సూత్రానికి సుదూరంగా ఉంది. అది నేను అంగీకరించవలసిందే!’ అన్నాడు చివరికి.

*********

ఇంకో రెండు రోజులే పని. కానీ ఈ చలి సంగతేమిటి? ఈ రెండు రోజులే కాదు, శీతకాలం ఇంకో ఇరవై రోజులైనా ఉంటుంది. ఆ కాలంతో పాటే చలి. వచ్చే సంవత్సరం మళ్లీ చలికాలం వస్తుంది. ఇక్కడ ఉన్నా, వీరముష్టి పాలెం వెళ్లినా చలికాలం తప్పదు. మరి గొంగడి లేకుండా ఎలా? ముక్కు కారిపోతోంది. తలంతా భారం. గెడ్డం పెరిగిపోయి, కొద్దిగా జ్వరంతో ఉన్నాడు మూగయ్య. అప్పుడే వచ్చాడు పనిలోకి. చలిలో ఉండడం దుర్భ రంగా ఉంది అతడికి. అడుగులో అడుగు వేసు కుంటూ వచ్చి చుట్టూ చూశాడతడు. ఓ చెట్టు కింద రోడ్డు రోలర్‌ ‌ఫైర్‌ ‌మ్యాన్‌తో మాట్లాడుతున్నాడు కిష్టయ్య. ‘కిష్టయ్య!’ భయం భయంగా పిలిచాడు మూగయ్య, దగ్గరగా వెళ్లి. ‘ఏంట్రా?’ పరమ విసుగుతో గట్టిగా అరిచాడు కిష్టయ్య. రెండు చేతులూ జోడించి, దాదాపు కళ్లల్లో నీళ్లతో సైగ చేశాడు మూగయ్య, తన గొంగడి ఇమ్మంటూ. ‘గొంగడి.. అదే కదా గోల? అదేవన్నా పట్టు కండువానా? ఛీ… మాపటేల రా. పట్టుకుపో! శనొదిలిపోతది. నీ..’ పెద్ద బూతు మాటతో అన్నాడు కిష్టయ్య. వేయేనుగుల బలం వచ్చింది మూగయ్యకి.

*********

సొంతూళ్లకి వెళ్లిపోతున్నాం. మళ్లీ నెల రోజుల పాటు ఈ బండపాటు ఉండదు. ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం.. అన్నట్టు వడివడిగా పని చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. అంతే. ఎవరి ఆలోచనలు వాళ్లవి. సొంతూరు నుంచి కాదు అసలు మన్యం నుంచే వెళ్లిపోవాలి. రోడ్డు వద్దు. బాస్టియన్‌ ‌కాడ పనీ వద్దు.

మధ్యాహ్నయింది. ఇంత వరకు బాస్టియన్‌ ఒక్కమాట అనలేదు.

నోరే విప్పలేదు. ఇది మరీ విచిత్రంగా అని పిస్తోంది వాళ్లకి. చిట్టిరాళ్లగొప్పు నుంచి కొత్త రోడ్డు దాదాపు గప్పీ దొర బంగ్లా దగ్గరికి వచ్చేసింది. గప్పి దొర బంగ్లాకు అవతల ఇంతకు ముందు వేసిన రోడ్డుతో కలిపితే డౌనూరు దాకా రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే. గప్పీదొర బంగ్లాకి కొంచెం ఇవతలే ఉంటుందా రాయి. చాలా వరకు బద్దలు కొట్టినా కొంత అడ్డం వస్తుందనిపించింది పిళ్లైకి•. అందుకే దానిని ఇంకొంచెం బద్దలు కొట్టమన్నాడు. పైగా ‘ఇద్దరు మగ మనుషులకి సమానం, నువ్వే చేసెయ్‌’ అని సన్యాసమ్మకి పురమాయించాడు. శానం, సుత్తీ తెచ్చుకోమన్నాడు. దానితోనే రెండు గంటల నుంచి పోరాడుతోందామె. కొంత బద్దలు కొట్టింది రాయిని. అతడు చూపించిన గుర్తు దగ్గరకు రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఒకసారి వచ్చి బాస్టియన్‌ ‌చూసి వెళ్లాడు. ఆమె సుత్తితో బలంగా మోదు తున్నప్పుడు కదిలే ఆ గుండెల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. ఏదో రకంగా ఆమెను తాకాలి. అదే అతడి దుర్బుద్ధి. ఏమైందో తెలియదు, ఆ దెబ్బ చాలా గట్టిగా వేసింది సన్యాసమ్మ. అరచేయంత రాతి పెచ్చు ఊడి పండింది.

దానితో పాటు శానం కొస కూడా అంగుళం మేర విరిగి పడింది. ‘ఒళ్లు తెలియడం లేదే లంజా!’ ఒక్క అరుపు అరిచాడు బాస్టియన్‌. ఆమె ఇటు తిరిగే లోపునే వీపు మీద బలంగా గుద్దాడామెని, ఒళ్లు తెలియని కోపంతో. అప్పటిదాకా కొట్టిన రాళ్లు, కొనదేలినవి, బండవీ అన్నీ అక్కడే పడి ఉన్నాయి. మీద బొక్క బోర్లా పడిపోయి, ‘కెవ్వు’ మంది సన్యా సమ్మ. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు ‘ఆ క్రొబార్లని బాగు చేయించాం. మళ్లీ ఇదా? బుద్ధిలేదా?’ అప్పటికి ఆమె గెడ్డం, రెండు పెదవులు పగిలి, పళ్లు కూడా కదిలి నోటి నుంచి ధారగా స్రవిస్తోంది రక్తం. పాకుతున్న బిడ్డలాగా మోకాళ్ల మీద, అరచేతుల ఆన్చి నేల మీద ఉందామె. కుడి చేతిలో సుత్తి అలాగే ఉంది. నోట్లో నిండుతున్న ఉప్పటి, వెచ్చటి రక్తాన్ని కాండ్రించి, కాండ్రించి ఉమ్మేస్తోంది- ఏడుస్తూ, దగ్గుతూ, పొలమారుతున్న గొంతుతో.

‘చంపెయ్యాలి ముండల్ని!’ అంటూ ముందుకు రాబోయాడు. కానీ అతడి అడుగుపడలేదు. సుత్తి పిడి మీద సన్యాసమ్మ వేళ్లు బిగుసుకోవడం గమ నించాడు బాస్టియన్‌.

అప్పుడే పక్కనే నీళ్లు చల్లుతున్న కొండమ్మ చటుక్కున వచ్చి, ‘ఏంటి బాబూ ఇది! సచ్చిపోతాది. ఏంటిది? చాల్లెండి!’ అంది గట్టిగా. బాస్టియన్‌ ‌భయపడినట్టే కనిపించాడు. తన శరీరం పెడుతున్న బాధతోనా? లేకపోతే, తన శరీరాన్ని ఇంతగా గాయపరిచిన అవతల మనిషి మీద కసితోనా- అర్థం కాలేదు బాస్టియన్‌కి. సుత్తి పిడి మీద సన్యాసమ్మ వేళ్లు బిగుస్తుంటే రెండడుగులు తనకు తెలియ కుండానే వెనక్కి వేశాడు. కొండమ్మ తడిసి ఉన్న తన కొంగుతో ఆమె నోటి దగ్గర రక్తాన్ని తుడిచింది. సన్యాసమ్మ అక్కడే గొంతుక్కూర్చుని నోట్లో రక్తాన్ని కాండ్రించి ఉమ్ముతూనే ఉంది.

దూరంగా ఆమె భర్త లచ్చన్న నిస్సహాయంగా చూస్తూన్నాడు. విలియంకి సయితం ఒళ్లు మండి పోయింది. ఏం చెప్పకుండా రోలర్‌ ఇం‌జన్‌ ఆపేసి దిగిపోయాడు. అప్పటికే చీకట్లు ముసురుకుంటు న్నాయి కూడా. పని ఆపి వెళ్లమన్నాడు కిష్టయ్య.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram