తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోసారి హస్తిన వెళ్లి వచ్చారు. వారం రోజుల పాటు దేశ రాజధానిలో ఉన్నారు. ముందుగా మూడు రోజులు అనుకున్న  ‘పర్యటన’ ఏడు రోజులపాటు సాగింది. అయితే, ఆయన ఎందుకు వెళ్లారు? ఏం చేశారు? ఎవరితో, ఏ అంశం గురించి చర్చించారు? ఈ పర్యటనతో ఏం సాధించుకొచ్చారు? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడం లేదు.

సాధారణంగా అయితే, ఇన్ని ప్రశ్నలు ఉదయించేవి కాదు. వ్యక్తిగత పర్యటన అయి ఉండొచ్చని, సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత అంశాలు ఉండవా? అన్న ఆలోచన రావడం కూడా సహజమే. కానీ, ఆయన వ్యక్తిగత పర్యటన అని కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక విమానంలో ఆయనతో పాటు ప్రభుత్వ ముఖ్య అధికారుల బృందం కూడా ఢిల్లీ వెళ్లింది. అంటే, అధికారిక పర్యటన కిందే భావించాల్సి ఉంటుంది. మరి.. అధికారిక పర్యటన అయినప్పుడు ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఏ లక్ష్యం పెట్టుకొని వెళ్లారు? ఎంతమేరకు ఫలితం సాధించారన్న విషయాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లేముందు గానీ, అక్కడ ఉన్న సమయంలో గానీ, తిరిగి వచ్చాక గానీ వివరాలేమీ బయటకు రాలేదు. మీడియాకు కూడా దూరంగానే ఉన్నారు. అంటే, ఏదో నిగూఢ రహస్యం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జూలై 25వ తేదీన సీఎం కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లారు. 31వ తేదీన తిరిగి వచ్చారు. కానీ, ఆయన ఢిల్లీ వెళ్లే విషయం కానీ, అక్కడినుంచి హైదరాబాద్‌ ‌తిరిగివచ్చే విషయం కానీ చివరి నిమిషం దాకా బయటకు రాలేదు. కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్తున్నారన్న విషయం కొన్ని గంటల ముందే లీకయ్యింది. అది కూడా నిజమో, కాదో తెలియని సందిగ్ధం చాలాసేపు నెలకొంది. ఇక, ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో మాత్రమే ఆ విషయం మీడియాకు తెలిసింది. అంటే, దాదాపుగా కేసీఆర్‌ ఈ ‌దశలో చేసిన పర్యటన పూర్తిగా రహస్యంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రి హోదాలోనే ఢిల్లీకి వెళ్లిన ఆయన అంత గోప్యంగా ఎందుకుండిపోయారనే సందేహం ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ మిగిలిపోయింది.

కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటనకు ముందు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు పోటెత్తాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆ సమయంలో భద్రాచలంలో పర్యటించిన ఆయన జూలై 17వ తేదీన ఏరియల్‌ ‌సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్షలు చేశారు. క్లౌడ్‌ ‌బరస్ట్ అనే సందేహాన్ని లేవనెత్తారు. విదేశాల కుట్ర ఉండొచ్చని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురిశాయి. కేసీఆర్‌ ‌వెలిబుచ్చిన క్లౌడ్‌ ‌బరస్ట్ ‌సందేహం అందరినీ వెంటాడుతున్న సమయంలోనే ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.

పార్లమెంటు సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ అం‌తకు ముందే, హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఆయన ఇదే అంశంపై ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ ఎంపీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారనుకునే పరిస్థితి కూడా లేదు. ఈ కోణంలోనూ సరైన కారణం గోచరించలేదు. మరి.. రాష్ట్రానికి అవసరమైన అప్పులకోసం ఢిల్లీ వెళ్లారా? అక్కడ కేంద్ర పెద్దలను ఎవరినైనా సంప్రదించారా? అధికార వర్గాలతో చర్చించారా? అంటే ఆ ఆనవాళ్లకు కూడా ఆధారాలు లేవు. ఓ ముఖ్యమంత్రిగా అధికారిక పర్యటన సాగిస్తే ఆ వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లిన రోజు ఉదయమే కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో, ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకే కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్తున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన రాష్ట్రపతిని కలవలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. అసలు అపాయింట్‌మెంట్‌ అడిగారో లేదో కూడా తెలియదు. పోనీ, ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఢిల్లీ వెళ్లారా, అంటే అదీ లేదు. అధికార బృందాన్ని వెంట పెట్టుకుని  ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రత్యేక విమానంలోనే తిరిగి వచ్చారు.

కేసీఆర్‌ ‌వారం రోజులు ఢిల్లీలోనే ఉన్నా ప్రధాన మంత్రిని కానీ, కేంద్ర మంత్రులను గానీ ఎవరినీ కలవలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి, ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్‌ అడిగారా? అడగలేదా? అడిగినా ఇవ్వలేదా? అనేది బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది. అయితే, ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అక్కడి నుంచే సీఎం వర్షాలు, వరదలపై సమీక్ష చేశారని, వివిధ అంశాలపై స్పందించారని చెబుతూ తెలుగు మీడియాకు లీకులు ఇచ్చారు. చిత్రంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి ఢిల్లీలో సమీక్షలు నిర్వహించారని ‘లీక్‌’‌లు వచ్చాయి. కానీ అలా వచ్చిన వార్తల్లో నిజం ఉండక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు అప్పుడే కొట్టిపారేశారు. ఎందుకంటే, కేంద్ర-రాష్ట్ర  సంబంధాల విషయంలో రాజకీయ నాయకత్వ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి, ఇప్పుడు అధికారుల మధ్య సంబంధాల విషయంలోనూ అదే పరిస్థితి కనిపి స్తోందని, రాష్ట్ర అధికారులను కేంద్ర అధికారులు దగ్గరకు కూడా రానీయడం లేదని అంటున్నారు. అంటే, ఈ కోణంలోనూ కేసీఆర్‌ ‌పర్యటన  సాగలేదని తెలుస్తోంది.

ఒకవేళ ఆ పార్టీ నాయకులే లీకులు ఇచ్చినట్లు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రజా జీవితం అస్తవ్యస్థంగా ఉన్న సమయంలో ముఖ్య మంత్రి ఢిల్లీ నుంచి పరిస్థితిని సమీక్షించడం ఏమిటని విపక్షాలు ప్రశ్నించాయి. వరద బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి అందుబాటులో లేకుండా ఢిల్లీలో కాలక్షేపం చేయడం, రోమ్‌ ‌చక్రవర్తిని గుర్తుకు తెస్తోందని, విపక్షాలే కాదు, స్వపక్షం నుంచి కూడా విమర్శలు వినిపించాయి.

మరోవైపు.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రాజకీయంగానూ ముందడుగు పడలేదని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. అంతేకాదు, జాతీయ రాజకీయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అచ్చిరాలేదని కూడా అంటున్నారు. దేశ రాజకీయ పరిస్థితిని అంచనా వేసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి చెందిన అధికారులు, టీఆర్‌ఎస్‌ ఎం‌పీలతో సమావేశాలకే కేసీఆర్‌ ‌పరిమితమయ్యారు. ఢిల్లీ వెళ్లి అన్ని రోజులున్నా, సమాజ్‌ ‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తప్ప ఇంకెవరూ అయన్ని కలవలేదు. ఆయన కూడా ఇంకెవరినీ కలవలేదు. చివరకు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు మార్గరెట్‌ అల్వా కాకున్నా కనీసం, కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున మరో నాయకుడు ఎవరూ కేసేఆర్‌ను కలవ లేదు. మద్దతు కోరలేదు.  దీంతో ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపించ లేదనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగింది. అయితే, కొంతమంది నాయకులు ఆయనను రహస్యంగా కలిసారని వదంతులు టీఆర్‌ఎస్‌ ‌నేతలే ప్రచారం చేసినా ఎవరూ నమ్మలేదు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా కాంగ్రెస్‌, ఆర్జేడీ సహా మరికొందరు నాయకులకు ఫోన్‌ ‌చేసినా ఫలితం లేకపోయిందని, ఎవరికి వారు ఏదో ఒక సాకు చెప్పి, ఇంకోసారి కలుద్దామని తప్పించు కున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు కేసీఆర్‌ ‌చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టి నట్టుగానే కనబడుతోంది. మరోవైపు.. కేసీఆర్‌ ‌ఢిల్లీ ఎందుకు వచ్చారో, ఎందుకు వెళుతున్నారో తమకే అర్థం కాలేదని సొంతపార్టీ ఎంపీలే వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది.

ఒక విధంగా సీఎం ఢిల్లీ పర్యటన కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా సాగిందని సొంత పార్టీ నాయకులే చెప్పుకోవడం కనిపిస్తోంది. ఈ పర్యటన వల్ల జాతీయ రాజకీయాల్లో ఆశించిన ప్రయోజనాలు దక్కకపోగా, రాష్ట్రంలోనూ వ్యతిరేక ప్రచారమే జరిగిందని అంటున్నారు. అందుకే, డ్యామేజీ కంట్రోల్‌లో భాగంగా కేసీఆర్‌ ‌మరో వ్యూహం పన్నారు. తన ఢిల్లీ పర్యటనపై వ్యతిరేకంగా చర్చ జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి తిరిగి రాగానే.. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారిక ప్రకటన వెలువరించారు. కానీ, ఆ వ్యూహం కూడా పనిచేయలేదన్న వాదనలు వినిపించాయి. కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటే గౌరవంగా ఉంటుందని, అలా కాకుండా.. తాను మాత్రమే రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం  మరింత ప్రతికూల స్పందన తెస్తుందని అంటున్నారు.

భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలం అవుతున్న సమయంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లిరావడం సంచలనానికి కారణం అయింది. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే సీఎం ఢిల్లీలో మకాం వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యారు. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చినా ప్రతిపక్షాల నుండి విమర్శలు మాత్రం ఆగడం లేదు. అసలు కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన గుట్టు విప్పాలని అన్ని పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram