‌వైకాపా ప్రభుత్వ నూతన మంత్రివర్గ విస్తరణ పలు అంశాలపై చర్చకు తెరలేపింది. 2019లో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెండున్నరేళ్లు మాత్రమే ఈ మంత్రివర్గం ఉంటుందని, తర్వాత మరలా కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రకటించారు. దాదాపు మూడేళ్ల కాలం పూర్తయింది. ఇప్పుడు 25 మందితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. అందులో 11 మంది పాత మంత్రులే ఉన్నారు. కొత్తగా 14 మందిని మాత్రమే తీసుకున్నారు. మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తానని బీరాలు పలికినా 11 మందిని తొలగించే సాహసం చేయలేకపోయారు. తాను ఎంతో ధైర్యవంతుడినని, ఎవరికీ భయపడనని చెప్పే జగన్‌మోహనరెడ్డి ఈ 11 మందికి భయపడే వారిని మంత్రి వర్గం నుంచి తొలగించలేదని విపక్షాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు విమర్శిస్తున్నారు.


ముఖ్యమంత్రి జగన్‌కు కావాల్సింది స్వతం త్రంగా తమ విధులు నిర్వహించే మంత్రులు కాదు, తాను చెప్పినట్లు తలవూపి చేతులు కట్టుకు నిలుచునే వారే ఆయనకు అవసరం. మూడేళ్ల పాలనలో ఒక్క మంత్రి కూడా తన శాఖలో కొత్త నిర్ణయాలపై తన ముద్ర వేయలేకపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు తప్ప తమ శాఖల నుంచి వచ్చే నోటిఫికేషన్లు, జీవోల గురించి కూడా పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. పేరుకే పదవులు. అధికారం మొత్తం సీఎందే అని పదవులు పోగొట్టుకున్నవారు విలపిస్తుంటే, ఈ తతంగం మొత్తం తెలిసిన ప్రజలు పెదవి విరుస్తున్నారు.

కొత్త మంత్రుల అవగాహనా రాహిత్యం

మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులను ఎంపిక చేసుకోవడంలో సభ్యుల అవగాహన, తెలివితేటలు, కార్యదక్షత, నిజాయితీ, నిబద్ధత వంటివి ఏ పార్టీ అధ్యక్షులైనా పరిగణనలోకి తీసుకుంటారు. తన పట్ల స్తోత్రాలు వల్లించి, చిడతలతో భజనచేసి అపారమైన వీరవిధేయత చూపించడం, విపక్ష నాయకులను బూతులు తిట్టడం, అవసరమైనప్పుడల్లా భౌతిక దాడులు చేయించడం వంటివి మంత్రి కాగల వారి అర్హతగా ముఖ్యమంత్రి నిర్ణయించినట్లున్నారు. అందుకే ఇలాంటి వారినే ఆయన మంత్రులుగా ఎన్నుకున్నారు. ఇక వారు పదవీ స్వీకారం చేయడంతోటే భజన ప్రారంభించారు. పాయ కాపురంలో ఒక మానసిక వికలాంగురాలి అత్యాచారం ఘటన సంచలనమై పోలీసుల నిర్ల్యక్షంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హోంశాఖ మంత్రి తనేటి వనితకు నాలుగు రోజులైనా విషయం తెలియదు. బాధితు రాలిని పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చి మీడియా అడిగిన ప్రశ్నలకు పోలీసులను అడిగి సమాధానం చెప్పడాన్ని బట్టి ఆమె అవగాహన రాహిత్యం, బాధ్యతా రాహిత్యంపై ప్రజలు మండి పడుతున్నారు. గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్‌ ‌రౌడీయిజం చూపి పదవిని పొందారు. ముఖ్యమంత్రిని ఎల్లవేళలా ఆయన వీరుడు, శూరుడని పొగడుతూనే ఉంటారు. సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయితే తనను కలిసిన మీడియాతో జగనన్నను ఆరా తీయరాదని, ఎవరైనా ఆరాధించాలని, తను ఆరాధించినందునే తనకు పదవి లభించిందని నిస్సిగ్గుగా చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పదవిని స్వీకరించిన విడదల రజని మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైద్య సదుపాయం అందుబాటులో ఉందని, ఉన్నతమైన వైద్యవిధానం అమలుచేస్తున్నట్లు, ఇందుకు ముఖ్యమంత్రే కారణమని స్తుతించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో జనరేటర్‌లో డీజిల్‌ ‌లేక టార్చిలైట్ల వెలుగులో ఓ నిండు గర్భిణికి ఆసుపత్రి సిబ్బంది పురుడుపోసిన ఘటనపై విమర్శలు వచ్చాయి. కనీసం ఆసుపత్రుల పనితీరుపై అధ్యయనం చేయకుండా వచ్చీ రావడంతోనే పొగడ్తల వర్షం కురిపించి తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని బాధ్యత లేకుండా మాట్లాడి తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. మూడేళ్లుగా పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం చేసి, అప్పుడే డయాఫ్రంవాల్‌ ‌దెబ్బతిందని తెలిసినా ఇంతవరకు ఏం చేశారనే దానికి ఆయన వద్ద సమాధానం లేకపోగా కేందప్రభుత్వంపై తప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోడానికే అనేది అందరికీ తెలిసిన విషయమే.

బలహీన మంత్రివర్గం

జగన్‌ ‌తొలి కేబినెట్‌ ‌తరహా బలహీనమైన మంత్రివర్గం బహుశా రాష్ట్ర చరిత్రలోనే లేదనే విమర్శలు వచ్చాయి. పాత మంత్రి వర్గంలో నలుగురైదుగురు మంత్రులు తప్ప ఎవరి పేర్లూ ప్రజలకు పెద్దగా గుర్తులేదంటే అతిశయోక్తి కాదు. మంత్రులుగా వీరు చేసిందేమీ లేదు. ముఖ్య నిర్ణయాలన్నీ సీఎం గుప్పిట్లోనే ఉండేవి. దాదాపు 34 నెలలపాటు మంత్రులుగా ఉన్న వీరు 34 సార్లు కూడా సచివాలయానికి రాలేందంటున్నారు. చాలామందికి తమ శాఖాధికారి ఎవరో కూడా సరిగా తెలియదని విమర్శలు వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆది మూలపు సురేశ్‌, ‌బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పు డప్పుడు మీడియాలో కనిపించేవారు. ముఖ్యమంత్రి చేసే కొన్ని వివాదాస్పద నిర్ణయాలు సమర్థించేందుకు, విపక్షాలను తిట్టేందుకు కొడాలి నాని, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌, అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌వంటివారు మాట్లాడేవారు. హోంమంత్రిగా మేకపాటి సుచరిత పాత్ర పరిమితమైపోయింది. ఒక కానిస్టేబుల్‌ను సైతం బదిలీ చేసే అధికారం లేకపోయింది. హిందూ దేవాలయాలపై లెక్కలేనన్ని దాడులు జరిగి, ఇంకా కొనసాగుతూ ఉన్నా ఆమె నిందితులను పట్టుకోలేదు. ఈ దురాగతాలను ఆపలేకపోయారు. పోలీసు యంత్రాంగం మొత్తం వైకాపా కనుసన్నల్లో నడుస్తున్నా ఆమె చేష్టలుడిగి చేశారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఏ ‌మాత్రం పనిచేశారో అందరికీ తెలుసు. కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ మంత్రి కనుసన్నల్లో పనిచేయాల్సి ఉన్నా ఆయన సీఎంఓకు కట్టుబడిపోయారు. తప్పుల తడకగా జరిగిన భూముల రీసర్వే సమస్యను సరిదిద్దకపోవడం ఆయన పనితనానికి నిదర్శనం. కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన పాత్రే లేదని విమర్శలొచ్చాయి. కొత్తగా ఏ జిల్లా వస్తుందో, అందులో ఉండే డివిజన్లు ఏమిటో.. నోటిఫికేషన్లు వచ్చేవరకు ఆయనకే తెలియదట. తన పరిధిలో ఉన్న ఆర్‌డీవోలు, డీఆర్‌వోలే కాదు చివరకు తహసీల్దార్ల బదిలీ కూడా తన చేతుల్లో లేదని బాధపడేవారట.

రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన మలగుండ్ల శంకర నారాయణ పనితీరు రాష్ట్రంలో దెబ్బతిన్న జిల్లా, పట్టణ రోడ్లను చూస్తే తెలుస్తుంది. వైద్య ఆరోగ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని పనితనం కరోనా సమయంలో తెలిసింది. కరోనాను ముందస్తుగా అంచనా వేయలేక, వచ్చాక అదుపు చేయలేక తీవ్ర వైఫల్యం చెందారు. ఆరోగ్యశ్రీ మాట దేవుడెరుగు ఆస్తులు అమ్ముకొని లక్షల్లో బిల్లులు చెల్లించినా సకాలంలో వైద్యం అందక వందలాది పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆక్సిజన్‌ అం‌దక తిరుపతి, అనంతపురం, విజయనగరం తదితర ప్రాంతాల్లో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మద్యం ధరలు పెంచి పేదల జేబులు ఖాళీ అవుతున్నా నిమిత్తమాత్రుడిగా ఉండటం ఎక్సైజ్‌ ‌మంత్రి నారాయణస్వామికే చెల్లింది. లక్షలాది మంది పేదల శాపనార్థాలు ఆయనే భరించాలి. ఇసుక ఆపడం, బ్లాక్‌మార్కెటింగ్‌, ‌నదీతీరాల్లో అక్రమ తవ్వకాలు.. ఇవన్నీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైఫల్యాలు, అవినీతి చిట్టాలుగా విమర్శలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంచా యితీలకు పంపిన సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటున్నా చోద్యం చూడటం పెద్దిరెడ్డికే చెల్లింది.

కొడాలి నాని అయితే సీఎంను ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి, వీరాధివీరుడుగా భజనచేస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించిన విపక్షాలను బూతులు తిట్టి బూతుల మంత్రిగా పేరుగడించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన శాఖ గురించి తప్ప ఇతర విషయాలు మాట్లాడేవారు. అధినేతను సంతృప్తి పరచడానికి అమరావతిని స్మశానంతో పోల్చారు. ఆయన మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి గురించి చేసింది శూన్యం. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆలయాల పరిరక్షణ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఆయనకు హిందూ ఆలయాల కంటే ముస్లింల షాదీఖానాలు, మసీదుల నిర్మాణమే ప్రాధాన్యంగా ఉండేది. వందల కొద్దీ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకోకపోవడం అటుంచి ఒక హిందువులా ఆయన ప్రవర్తించలేదని హిందువులు మండిపడుతున్నారు.

ఇక మంత్రివర్గంలో మిగతావారు వారి శాఖల్లో పట్టుసాధించిది లేదు. ఆ శాఖ తరఫున ప్రజలకు మేలు చేసిందీ లేదు. కొందరు మంత్రులైతే వారి శాఖకు సంబంధించి ఒక్క ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించలేదు. సీనియర్‌ ‌మంత్రులు సైతం తమ శాఖల కార్యదర్శులను చూడలేదు. చాలామంది మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమైపోయారు. జగన్‌ ‌కేబినెట్‌లోని మూడొంతుల మంది మంత్రులు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. ముఖ్యమంత్రే రానప్పుడు మేమొచ్చి ఏం చేయా లంటూ కొందరు మంత్రులు చమత్కరించేవారు.

అసమ్మతి

తమ మంత్రి పదవులు పీకేసారని మొదటి కేబినేట్‌ ‌మంత్రులు కొందరు, పదవులు రాని ఆశావహులైన ఎమ్మెల్యేలు కొందరు బాహాటంంగా అసమ్మతి తెలిపారు. తమ ప్రాంతాల్లో అనుచరులతో కలిసి సభలు నిర్వహించి నిరసన గళం వినిపించారు. ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేశ్‌ను కేబినెట్‌లో కొనసాగించి.. తనను తొలగించడంపై సీఎం కుటుంబానికే చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనారు. మాట మాత్రమైనా చెప్పకుండా హోం మంత్రి పదవి నుంచి తనను తీసివేశారని మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా కూడా రాజీనామా ప్రకటించారు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆత్మీయ సభల పేరిట బలప్రదర్శనలకు దిగారు. మలివిడత విస్తరణలో తప్పక అవకాశమిస్తానని చెప్పిన సీఎం మాట తప్పారని ప్రభుత్వ విప్‌ ‌సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), మాజీ మంత్రి కొలుసు పార్థసారథి (పెనమలూరు), కరణం ధర్మశ్రీ (చోడవరం), గొల్ల బాబూరావు (పాయకరావుపేట) బహిరంగంగానే ఆగ్రహం వెలిబుచ్చారు. తన మాటకు ఎదురులేదని, తన మాటే శాసనమని భావిస్తూ వచ్చిన జగన్‌కు ఇది ధిక్కారమే. పదవులు రానపుడు ఎందుకింత ఖర్చుచేసి ఎమ్మెల్యేలు కావాలని వారు బహిరంగంగా ఆరోపిస్తుంటే.. ఇసుక తరలింపు, ఇళ్ల స్థలాల విషయంలో రెట్టింపు ధరలు చెప్పి పొలాలు కొనడం వంటివి చూసీచూడనట్లు వదిలేసింది నేను చెప్పినట్లు పడి ఉండేందుకే అన్నట్లుంది అధినేత వరుస.

– తురగా నాగభూషణం,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram