తెలంగాణలో రాజ్‌భవన్‌ ‌వర్సెస్‌ ‌ప్రగతి భవన్‌ ఎపిసోడ్‌ ఇం‌కా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయింది. ఇదే సమయంలో హస్తినలో కేసీఆర్‌ ఉన్నప్పుడే గవర్నర్‌ ‌తమిళిసైకి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశమయింది. అక్కడ తమిళిసై గళం విప్పడం ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు, తాను తలచుకుంటే ప్రభుత్వం కూలిపోయేదని, కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కారును కూల్చడం తనకు ఇష్టం లేదన్నారు. దీంతో, ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా బహిర్గతమయంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది.


గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌గడిచిన వారం పుదుచ్చేరి పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఈ మార్గమధ్యంలోనే ఆమె షెడ్యూల్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాలంటూ హోంశాఖ నుంచి సమాచారం వచ్చింది. దీంతో, మరుసటి రోజే హైదరాబాద్‌ ‌నుంచి హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.

వాస్తవానికి గవర్నర్‌ ‌తమిళిసై ఢిల్లీ వెళ్లడానికి రెండురోజుల ముందు సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులందరితో కలిసి హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 11 వరకు ఢిల్లీలోనే ఉండి.. కేంద్రంపై నిరసన దీక్షలో పాల్గొని తిరిగొచ్చారు. ఇప్పటికే కేంద్రంపై కేసీఆర్‌ ఓ ‌రకంగా యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం తీరుపై నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

గవర్నర్‌ ‌తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన నివేదికను హోం శాఖకు సమర్పిం చారు. ఈ నివేదిక కీలకంగా మారింది. రాష్ట్రంలోని పరిణామాలపై గవర్నర్‌ ‌హోంశాఖకు నివేదిక ఇవ్వడం సాధారణంగా జరిగేదే అయినప్పటికీ.. తెలంగాణలో కొంతకాలంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గవర్నర్‌ ‌పదవిని గౌరవించడం లేదని, ప్రొటోకాల్‌ ‌పాటించడంలేదని ఆమె హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. తమిళిసై గవర్నర్‌గా వచ్చిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వంతో రాజ్‌భవన్‌కు మంచి సంబంధాలు ఉండేవి. అయితే, క్రమంగా రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య దూరం పెరిగిపోయింది. గవర్నర్‌ ‌మేడారం పర్యటనకు వెళ్లినప్పుడు ప్రభుత్వ అధికారులెవరూ హాజరు కాకపోవడం, కనీసం స్వాగతం కూడా పలకక పోవడం తీవ్ర చర్చనీయాంశమయింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో గవర్నర్‌ ‌ప్రసంగాన్ని తొలగించడంతో తెలంగాణ సర్కారు వైఖరిపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఉగాది పర్వదినం రోజు గవర్నర్‌ ‌యాదాద్రి పర్యటనకు వెళ్లినప్పుడు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, చివరకు ఆలయ ఈవో కూడా గైర్హాజరు కావడంతో ప్రొటోకాల్‌ ‌విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్‌భవన్‌ను అవమాని స్తోందన్న వాదనలకు బలం చేకూరింది. అంతేకాదు, యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు కూడా గవర్నర్‌కు ఆహ్వానం అందలేదు.

ఈ పరిణామాలు గవర్నర్‌కు ఇబ్బందికరంగా పరిణమించాయి. మహిళా గవర్నర్‌ అయినందుకే కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఇలా వివక్ష చూపిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి. రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో, ఉగాది పర్వదిన వేడుకల్లో స్వయంగా గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌తన పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బహిరంగంగా ప్రస్తావించారు. ఉగాది వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆహ్వానం పంపినా ముఖ్యమంత్రి రాలేదని, కానీ, తనకు ఆహ్వానం వస్తే మాత్రం ప్రగతి భవన్‌కు వెళ్తానని కుండబద్దలు కొట్టారు. అయినా ప్రగతిభవన్‌ ఉగాది వేడుకలకు రాజ్‌భవన్‌కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం.

తాజా పరిణామాలు గమనించినా గవర్నర్‌ ‌తమిళిసైకి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వెళ్లిన గవర్నర్‌కు ప్రభుత్వం హెలికాప్టర్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో, కొత్తగూడెం దాకా రైలులో ప్రయాణించారు. స్వాగతం పలికేందుకు కనీసం కలెక్టర్‌ ‌కూడా రాలేదు. అక్కడి నుంచి తమిళిసై.. రోడ్డుమార్గంలో భద్రాచలం వెళ్లారు. అక్కడ కూడా అధికారులు సెలవుపై వెళ్లడం గవర్నర్‌కు ప్రొటోకాల్‌ ఉల్లంఘించడమే అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రోటోకాల్‌ ‌వివాదాలు అధికారిక నివేదిక రూపంలో కేంద్ర హోంశాఖకు గవర్నర్‌ ‌సమర్పించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు.. హోంమంత్రి అమిత్‌షాతో తమిళిసై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందు తన ఆవేదనను వెల్లగక్కారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తన పట్ల వివక్షను ప్రదర్శి స్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్‌ ‌పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. మహిళా గవర్నర్‌ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు, తెలంగాణ సర్కారు లొసుగులను కూడా తమిళిసై ఎత్తిచూపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్‌ ఆస్పత్రి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

ఈ విషయాల్లో తాను దేనిపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. తన పర్యటనల్లో అధికారులు సైతం హాజరుకాకుండా, ప్రొటోకాల్‌ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా? అని నిలదీశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న తమిళిసై.. గవర్నర్‌గా ఎవరున్నా సరే, ఆ పదవిని గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram