– సలీం

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి  కథల పోటీకి ఎంపికైన రచన

కాలింగ్‌బెల్‌ ‌మోగడంతో భావన తలెత్తి గోడ గడియారం వైపు చూసింది. సమయం సాయంత్రం ఐదు కావస్తోంది. అది కాలేజీ నుంచి సంకల్ప ఇంటికొచ్చే సమయం కావడంతో ఆమె ఉత్సాహంగా తలుపు వైపుకు నడిచింది. ఆమెకు తన ఒక్కగానొక్క కూతురు సంకల్ప అంటే ప్రాణం. సందర్భం వచ్చినప్పుడల్లా ‘ఒక్క ప్రాణమేనా.. నా పంచప్రాణాలు నువ్వే. నేను బతుకుతుందే నీ కోసం’ అంటూ ఉంటుంది.

ఎప్పటికిమల్లే నవ్వుతూ తలుపు తీసిన భావన కూతురి మొహంలోకి చూడగానే ఆందోళనకు లోనైంది. నెత్తురంతా ఇంకిపోయినట్టు సంకల్ప మొహం పాలిపోయి ఉంది. ఏడ్చిన దానికి గుర్తుగా కళ్లు ఉబ్బిపోయి ఉన్నాయి. కొద్దిగా కదిలిస్తే చాలు మళ్లా ఏడ్చేసేలా ఉంది.

‘‘ఏమైంది సంకల్పా.. ఎందుకలా ఉన్నావు.. ఎవరైనా ఏమైనా అన్నారా?’’ కూతురి వైపు పరిశీలనగా చూస్తూ అడిగింది.

ఆమె ప్రశ్నకు సమాధానమేదీ ఇవ్వకుండా సంకల్ప తన గదిలోకెళ్లి తలుపేసుకుంది. తలుపు తీయడంతోటే దుమికే జలపాతంలా యింట్లోపలికి ఉరికే సంకల్ప ప్రాణంలేని మరబొమ్మలా తన గదిలోకెళ్లి తలుపేసుకోవడంతో భావన మరింత కంగారు పడింది. వయసులో ఉన్న ఆడపిల్ల.. పేపర్లనిండా, న్యూస్‌ ‌ఛానెళ్ల నిండా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల వార్తలు. భావనకు భయమేసింది. ఏమై ఉంటుంది? ఏమైనా జరక్కూడనిది జరిగుంటుందా? రోజూ కాలేజీనుంచి రాగానే తన మెడ చుట్టూ చేతులేసి ‘హౌ ఈజ్‌ ‌యువర్‌ ‌డే మామ్‌’ అని పల్కరించాకే తన గదిలోకెళ్లే సంకల్ప.. గదిలోకెళ్లి, బ్యాగ్‌ ‌పడేసి, ఫ్రెషప్‌ ‌కాగానే మళ్లా తన దగ్గరకొచ్చి కూచుని ‘ఈ రోజు కాలేజీలో ఏమైందో తెలుసా మామ్‌’ అం‌టూ కబుర్లు చెప్పే సంకల్ప.. మాటల పుట్టలాంటి సంకల్ప మౌనం కాటేసిన రాయిలా మారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది?

భావన తీవ్రంగా ఆలోచిస్తూనే తలుపు తట్టి చూసింది. లోపల్నుంచి బోల్ట్ ‌వేసి ఉండకపోవడంతో తలుపు మెల్లగా తెర్చుకుంది. మంచం మీద బోర్లా పడుకుని మెల్లగా వెక్కిళ్లు పెడ్తూ ఏడుస్తోంది. భావన ఆమె పక్కన కూచుని తల మీద చేయివేసి నిమురుతూ ‘‘ఏం జరిగింది తల్లీ.. నీ బెస్ట్ ‌ఫ్రెండ్‌ని నేనేనని చెప్తుంటావుగా. మరి ఈ ఫ్రెండ్‌తో, నీ మామ్‌తో షేర్‌ ‌చేసుకోవా?’’ అంది.

సంకల్ప బదులేమి ఇవ్వకుండా ఏడుస్తూ ఉండటంతో ‘‘తొందరగా చెప్పవే. ఏం జరిగిందోనన్న భయంతో చచ్చిపోతున్నానే. మనసులోకి రాకూడని ఆలోచనలన్నీ వస్తున్నాయే. ఇప్పటికైనా చెప్పవే’’ అంది.

అప్పటికీ సంకల్ప నోరు విప్పకపోవడంతో ‘‘ఎవర్నయినా ప్రేమించి మోసపోయావా?’’ అని అడిగింది.

ఆ ప్రశ్న వినగానే సంకల్ప చివ్వున తలెత్తి అమ్మ వైపు చూసింది. ‘‘నేనెవర్నయినా ప్రేమిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? నా జీవితంలో నీకు తెలియని విషయమంటూ ఏమీ లేదు మమ్మీ. నీనుంచి నేనేది దాచలేదు. దాచను కూడా’’ అంది.

‘‘మరి ఏం జరిగిందో చెప్పకుండా ఇప్పుడు దాస్తున్నావుగా.’’

‘‘లేదు మమ్మీ.. ఏడుస్తూ చెప్పడం ఇష్టం లేక మొదట ఏడుపునంతా కానిచ్చేను. ఇప్పుడు చెప్పమంటావా? కొన్నేళ్ల క్రితం మన పక్క వీధిలో సరోజ అంటీ ఉండేది గుర్తుందా? వాళ్లబ్బాయి శివరాం గుర్తున్నాడా.. వాడూ..’’

భావనకు వెంటనే సరోజ గుర్తొచ్చింది. వాళ్లు పక్క వీధిలోనే అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు ‘వదినా.. బావున్నావా’ అని పల్కరించుకునేవాళ్లు. ఒకటి రెండుసార్లు భావన తన కూతురు సంకల్పను తీసుకుని వాళ్లింటికెళ్లడం, ఆమె తమ ఇంటికి రావడం జరిగింది. అంతే.. అంతకుమించి గాఢమైన పరిచయం ఏమీ లేదు. పదేళ్ల క్రితం స్వంతిల్లు కొనుక్కుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు. అప్పటినుంచి అసలు సంబంధమే లేదు.

సంకల్ప చెప్తున్న విషయం పూర్తిగా వినకుండానే భావన కంగారుగా అడిగింది. ‘‘ఏం చేశాడే వాడూ? వాడు నీకెక్కడ కన్పించాడు?’’

‘‘మొదట చెప్పేది వినమ్మా. కంగారుపడకు. వాడు మా కాలేజ్‌లోనే చదువుతున్నాడు. ఇంజనీరింగ్‌ ‌ఫైనలియర్లో ఉన్నాడు. నువ్వు ఊహిస్తున్న ఘోరాల్లాంటివేమీ జరగలేదులే. అలాంటివి నా జీవితంలో ఎప్పటికీ జరగవు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాను. ఎవర్నీ నమ్మనని నీకు తెల్సుగా.’’

‘‘మరెందుకేడ్చావే?’’

‘‘వాడీరోజు నన్ను బాగా అల్లరి చేశాడమ్మా.’’

‘‘ఆడపిల్ల రోడ్డుమీద నడుస్తుంటే జులాయి వెధవలు ఏదో ఒకటి వాగుతుంటారమ్మా. వాటిని పట్టించుకోకూడదని చెప్పాగా. దానికే అలా వెక్కి వెక్కి ఏడిస్తే ఎలానే. ఇంజనీరింగ్‌లో చేరి పూర్తిగా నెలకూడా కాలేదు. ఇంకా నాలుగేళ్లు నెగ్గుకు రావాలి కదమ్మా’’ అంది భావన.

‘‘ఏదో కామెంట్‌ ‌చేస్తే కుక్క మొరుగుతుందని వచ్చేసే దాన్నమ్మా.. కానీ వాడు చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందు నన్ను అవమానించాడు.’’

‘‘ఏం చేశాడో వివరంగా చెప్పవే’’ అసహనంగా అంది.

‘‘కాలేజీలో చేరిన రోజు ఎదురుపడి పల్కరిస్తే తెల్సినవాడు కదా అని నవ్వుతూ మాట్లాడామ్మా. అదే నేను చేసిన తప్పు. అప్పటినుండి వాడు నా వెంట పడ్తున్నాడమ్మా. నా వెనకనే నడుస్తూ ఏదో వాగుతుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. మొన్నొకరోజు నన్నాపి తన స్కూటర్‌ ‌మీద కూచోమని బలవంతం చేశాడు. వాడితో షికారుకో సినిమాకో వెళ్లాలట. తిట్టి, మరోసారి ఇలా చేస్తే ప్రిన్సిపాల్‌కి రిపోర్ట్ ‌చేస్తానని బెదిరించాను. తను చెప్పినట్టు వినకపోతే నా అంతు చూస్తానని వాడూ బెదిరించాడు. ఈ రోజు కాలేజీ వదిలాక…’’ సంకల్ప గొంతు దుఃఖంతో వణికింది. కళ్లలోంచి రెండు కన్నీటిబొట్లు రాలిపడ్డాయి.

‘‘ఏం చేశాడే? ఏమైనా అసహ్యంగా కామెంట్‌ ‌చేశాడా?’’

‘‘లేదమ్మా. నేను మరో నలుగురు అమ్మాయిల్తో కలిసి బస్టాప్‌ ‌వైపుకు నడుస్తున్నా. నా వెనకే స్కూటర్‌ ‌మీద వచ్చి, ముందు చక్రం అడ్డంపెట్టి నన్ను ఆపాడు. స్కూటర్‌ ‌వెనక కూచోమన్నాడు. నేను కోపంగా ఏదో అనే లోపల నా చున్నీ పట్టుకుని లాగాడు. ‘నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. నా మాట విన్నావా సరే.. లేదంటే ఈసారి చున్నీతో పాటు నీ డ్రెస్‌ ‌కూడా లాగేస్తాను’ అన్నాడమ్మా’’ సంకల్ప మళ్లా వెక్కి వెక్కి ఏడ్చింది.

భావనకు విపరీతమైన కోపం వచ్చింది. ‘‘అంత పని చేశాడా? రాస్కెల్‌. ‌వాడి అంతు చూస్తాను. రేపు నీతోపాటు నేను కాలేజీకి వస్తాను. మీ ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్‌ ‌చేస్తాను. స్టూడెంట్స్ అం‌దరిముందు వాడి పరువు తీస్తాను’’ అంది.

‘‘వద్దమ్మా. దానివల్ల ప్రయోజనం ఉండదని సెకండియర్‌ అమ్మాయిలు చెప్పారమ్మా. వాడికో గ్యాంగ్‌ ఉం‌ది. ఆడపిల్లల వెంటపడి వేధించడమే వాళ్లపని. ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్‌ ‌చేస్తే మరింత రెచ్చిపోయి ఏడ్పించిన సంఘటనలు ఇంతకుపూర్వం జరిగాయట. వాళ్లు దేనికైనా తెగిస్తారమ్మా. వాళ్లకు చదువక్కరలేదు. రెస్టికేట్‌ ‌చేసినా కేర్‌నాట్‌గా తిరిగే రౌడీవెధవలు.’’

భావనలో ఎగసిపడిన క్రోధాగ్ని జ్వాలల మీద ఆ మాటలు చల్లని నీళ్లను కుమ్మరించాయి. ఆమె ఆలోచనలో పడింది. సంకల్ప చెప్పింది నిజమే. అన్నిటికీ తెగించి ఉన్న వాళ్లని కంప్లెయింట్లూ, సస్పెన్షన్లూ ఆపగలవా? ఇంటినుంచి అడుగు బైటకి పెట్టిన క్షణం నుండి తిరిగొచ్చే వరకు సంకల్పను కాపాడుకోవాలంటే ఏది దారి? పోలీసుల్ని ఆశ్రయిస్తేనో? లాభం లేదు. వాడ్ని పిలిచి ఓ వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తారు. వాళ్లయినా ఇరవై నాలుగు గంటలూ తన కూతురికి రక్షణ కల్పించలేరుగా. అలాగని భయపడిపోయి తన కూతుర్ని కాలేజి మాన్పించి ఇంట్లో కూచోబెట్టలేదుగా.

ఆ రాత్రంతా భావన ఆలోచిస్తోనే ఉంది. ఆమెకు తను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠం గుర్తొచ్చింది. దాన్నే శివరాంపైన ప్రయోగించి చూడాలని నిర్ణయించుకుంది.

మరునాడు ఉదయం ఎనిమిదింటికి భావన శివరాం వాళ్లింటికెళ్ళింది. ఆ సమయమైతేనే శివరాం కూడా యింట్లోనే ఉంటాడని ఆమెకు తెలుసు. సాయంత్రం కాలేజి వదిలాక మగపిల్లలు ఏ సమయంలో ఇల్లు చేరుకుంటారో ఏవరూ చెప్పలేరు. అది రాత్రి ఎనిమిది కావొచ్చు, పది కూడా కావొచ్చు.

తలుపు తట్టిన •రెండు నిమిషాలకు శివరాం వాళ్లమ్మ సరోజ వచ్చి తలుపు తీసింది. భావనను చూడగానే విశాలంగా నవ్వుతూ ‘‘రా వదినా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? మేము ఇల్లు మారాక నువ్వు రావడమే మానేశావు. సంకల్ప బావుందా? దానికి ఎనిమిదేళ్లున్నప్పుడు చూసిందే. అమ్మాయిని కూడా తీసుకుని రావల్సింది’’ అంది.

డైనింగ్‌ ‌టేబుల్‌ ‌మీద కూచుని టిఫిన్‌ ‌తింటోన్న శివరాం తన అమ్మ నోట్లోంచి సంకల్ప అనే పేరు వినగానే భయంతో తలెత్తి ఎవరా వచ్చిందని చూశాడు. భావనని చూడగానే గుర్తుపట్టాడు. నిన్న తను చేసిన అల్లరి గురించి సంకల్ప ఇంట్లో చెప్పి ఉంటుంది, అందుకే వాళ్లమ్మ ఇంటిమీదికి గొడవకొచ్చి ఉంటుందనుకోగానే అతనికి చెమటలు పట్టాయి.

శివరాంని చూడగానే భావన నవ్వుతూ ‘‘ఎలా ఉన్నావు బాబూ’’ అని అడిగింది. శివరాం ఖంగుతిన్నాడు. తిట్టడానికొచ్చిందనుకుంటుంటే ఇలా నవ్వుతూ మాట్లాడుతుందేమిటి అని ఆశ్చర్యానికి లోనైనాడు. సంకల్ప చెప్పి ఉండదేమో అని కూడా అన్పించింది. ఒకవేళ అదే నిజమైతే ఇన్నేళ్లుగా రాని భావన ఆంటీ యింటికెందుకొచ్చినట్టు? అతని బుర్రంతా ఆలోచనల్తో వేడెక్క సాగింది.

అమ్మ, భావన ఆంటీ సోఫాలో కూచుని మాట్లాడుకోసాగారు. టిఫిన్‌ ‌మెల్లగా తింటూనే వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి శివరాం ఓ చెవిని అటువేసి ఉంచాడు.

‘‘ఇంతకూ అమ్మాయి ఏం చదువుతోందొదినా’’ అని అడిగింది శివరాం వాళ్లమ్మ.

‘‘ఇంజనీరింగ్‌ ‌ఫస్టియర్‌ ‌వదినా.. మన శివరాం బాబు చదివే కాలేజీలోనే చదువుతోంది’’ అని భావన చెప్పగానే శివరాం అప్రమత్తమైనాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది. వొళ్లంతా చెవులు చేసుకుని తర్వాతేం చెప్పబోతుందోనని వినసాగాడు.

‘‘మగదిక్కులేని సంసారం కదా వదినా. ఏదో ఆ గవర్నమెంట్‌ ‌స్కూల్లో టీచర్‌ ఉద్యోగం ఉండబట్టి సంసారాన్ని లాక్కొస్తున్నా. నా ఆశలన్నీ నా కూతురు మీద పెట్టుకునే బతుకుతున్నా వదినా. అది తప్ప నాకింకెవరున్నారు చెప్పు? అసలే రోజులు బాగోలేవు కదా వదినా. వయసులో ఉన్న ఆడపిల్లాయె. కాలేజీకెళ్లి తిరిగొచ్చేవరకు ఎంత టెన్షన్‌గా ఉంటుందో తెలుసా?’’ అంది భావన.

‘‘నిజమే వదినా.. నేనూ టీవీ న్యూస్‌లో చూస్తుంటానుగా. మగపిల్లలు ఎలా బరితెగించి పశువుల్లా ప్రవర్తిస్తున్నారో. దిగులేస్తో ఉంటుంది.’’ అంది సరోజ.

‘‘నీకేంలే వదినా.. ఒక్కడే కొడుకు. కూతుర్లుంటేనేగా భయాలూ దిగుళ్లూ విచారాలూ అన్నీను. అన్నయ్యేమో సౌదీలో పనిచేస్తూ యింటికి కావల్సినన్ని డబ్బులు పంపిస్తుంటాడాయె. దేనికీ కొదవలేని జీవితం.’’

‘‘కొడుకైనా దిగులెందుకుండదొదినా. వాడు బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడేవరకు మాకూ టెన్షన్‌ ఉం‌టుందిగా.’’

‘‘మీ బాబు శివరాం గురించి మా అమ్మాయి చెప్తో ఉంటుందొదినా’’ అని భావన అనగానే మళ్లా శివరాం గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

‘‘శివరాం అన్నయ్య చాలా మంచివాడమ్మా అని నాతో ఎన్నిసార్లు చెప్పిందో. చాలా ఆత్మీయంగా మాట్లాడతాడట. మిగతా అబ్బాయిల్లా కాదమ్మా చాలా బుద్దిమంతుడని కూడా చెప్పింది. అదే కాలేజీలో శివరాం అన్నయ్య ఉండటం నాకు కొండంత అండగా అన్పిస్తుందమ్మా. చాలా ధైర్యంగా ఉంటుంది అని కూడా చెప్పింది. నువ్వు మీ బాబు గురించి దిగులుపడాల్సిన అవసరమే లేదొదినా. వజ్రం లాంటి కుర్రాడు’’ అంది భావన.

ఆ మాటలు వినగానే శివరాం తల గిర్రున తిరిగింది. ఇదేమిటీ ఈవిడ ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. తిడ్తుందనుకుంటే పొగుడుతుందేమిటి అని కూడా అనుకున్నాడు. మరో అనుమానం కూడా వచ్చింది. ఇదేమైనా తనని ట్రాప్‌ ‌చేసి బద్నాం చేసే ప్లానా అని. కానీ బాగా ఆలోచిస్తే అటువంటిదానికి అవకాశమే లేదనిపించింది. అలా ట్రాప్‌ ‌చేయాలంటే సంకల్ప చాలు. ఆమె అమ్మ తమ యింటికొచ్చి అమ్మతో ఇలా మాట్లాడవలసిన అవసరం లేదు.

వెళ్లేముందు భావన శివరాం దగ్గరకొచ్చి ‘‘మా అమ్మాయిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకో బాబూ. దానికి అన్నలెవ్వరూ లేరుగా. నిన్నే అన్న అనుకుంటుంది. మీ కాలేజీలో రౌడీ వెధవలు కూడా ఉన్నారటగా. వాళ్లనుంచి దాన్ని కాపాడాల్సింది నువ్వే బాబూ’’అంది.

ఆ రోజు కాలేజీకెళ్లాక సంకల్ప ఎక్కడుందో వెతికి పట్టుకుని నిలదీశాడు శివరాం. ‘‘నిన్న జరిగిన విషయం ఏమైనా నువ్వు ఆంటీకి చెప్పావా?’’ అన్నాడు కళ్లెర్రచేస్తూ.

అమ్మ ఉదయం శివరాం వాళ్ల ఇంటికెళ్లిన విషయం తెలుసు గానీ అక్కడేం జరిగిందో సంకల్పకు తెలియదు. భావన కావాలనే తన కూతురికి చెప్పలేదు. సంకల్ప మాత్రం తన అమ్మ శివరాంని చెడామడా తిట్టొచ్చి ఉంటుందనే అనుకుంది.

అందుకే బెదిరిపోతూ సమాధానం చెప్పకుండా నిలబడింది.

‘‘చెప్పినట్టు తెల్సిందో వారంవరకు ఆగను. రేపే నడిరోడ్లో నీ బట్టలు విప్పదీస్తాను. జాగ్రత్త’’అని తర్జని చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయాడు.

అంటే అమ్మ శివరాంని తిట్టలేదని సంకల్పకు అర్థమైంది. అసలు తనకు జరిగిన అవమానాన్ని అమ్మ ప్రస్తావించి ఉండదని కూడా అర్థమైంది. కోపంతో రగిలిపోతూ ‘వాడి అంతు చూస్తాను’ అన్న అమ్మ అలా ఎందుకు చేసిందో ఎంతాలోచించినా ఆమెకు అంతుబట్టలేదు.

నాలుగు రోజులాగి భావన మళ్లా సరోజ వాళ్ళింటికెళ్ళింది. ఆరోజు ఆదివారం.. మధ్యాహ్నం భోజనాల సమయం చూసుకుని వెళ్ళింది. ‘‘సంకల్ప కోసం సగ్గుబియ్యం పాయసం చేస్తుంటే శివరాం బాబు గుర్తొచ్చాడొదినా. వేడివేడిగా తింటాడని హాట్‌బాక్స్‌లో పెట్టుకుని తెచ్చాను’’ అంది.

యంటీవీ ఛానెల్లో హిందీ పాటలు చూస్తున్న శివరాం ఆమె లోపలికొచ్చిన క్షణం నుంచి కళ్లు స్క్రీన్‌ ‌మీదున్నా చెవుల్ని మాత్రం అటువైపు వేసి ఉంచాడు.

‘‘ఎందుకింత శ్రమ పడ్డావొదినా? దగ్గరా దాపా? అంత దూరం నుంచి రావాలంటే ఎంత కష్టం?’’ అంది సరోజ.

‘‘మనకిష్టమైన వాళ్ల కోసం ఏం చేసినా కష్టమనిపించదుగా వదినా. శివరాం బాబుని చూసినపుడల్లా నాకిలాంటి సద్గుణ సంపన్నుడైన కొడుకుంటే ఎంత బావుండేదో కదా అనుకుంటాను తెలుసా.. సంకల్పకు బాడీగార్డ్‌లా బాబున్నాడనేకదా నేను నిశ్చింతగా ఉండగలుగుతున్నాను’’ అంది భావన.

‘‘మా అబ్బాయని చెప్పడం కాదుగానీ వదినా మావాడు చాలా బుద్ధిమంతుడనుకో. అమ్మాయిలు కన్పిస్తే కళ్లెత్తి కూడా చూడడు. ఈ రోజుల్లో మా శివరాం లాంటి మగపిల్లలు చాలా అరుదుగా ఉంటారు తెలుసా’’ మురిసిపోతూ అంది సరోజ.

‘‘నిజమే వదినా. మా సంకల్ప కూడా చెప్తో ఉంటుందిగా. శివరాం అన్నయ్య అమ్మాయిల్ని అల్లరి చేసే జులాయిరకం కాదమ్మా. అటువంటి చెత్త వెధవల్తో కలవను కూడా కలవడు. చాలా మంచివాడమ్మా అని ఎన్నిసార్లు చెప్పిందో’’ అంది భావన.

మరికొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి, కడిగిచ్చిన హాట్‌ ‌ప్యాక్‌ ‌తీసుకుని ఇంటికెళ్లిపోయింది.

సోమవారం ఉదయం కాలేజీ క్యాంపస్‌లోని చెట్లకింద తన గ్యాంగ్‌తో కాపుకాసిన శివరాం ఫస్టియర్‌ అమ్మాయిలిద్దరు రావడం చూసి, అల్లరి చేద్దామని రెండడుగులు వాళ్లవైపుకు వేశాడు. వాళ్ల వెనకే నడచి వస్తున్న సంకల్పను చూడగానే మంత్రించినట్టు ఆగిపోయి, మెల్లగా రెండడుగులు వెనక్కి వెశాడు.

ఓవారం తర్వాత రాత్రి ఎనిమిదింటికి భావన మరోసారి సరోజ వాళ్లింటికెళ్లింది. హాల్లో కూచుని ల్యాప్‌టాప్‌ ‌మీద ప్రాజెక్ట్ ‌వర్క్ ‌చేసుకుంటున్న శివరాంని చూసి ‘‘బావున్నావా బాబూ’’ అంటూ నవ్వుతూ పల్కరించింది. సరోజతో ‘‘మీ పక్కవీధిలోనే నాతో పాటు టీచర్‌గా పనిచేసే వసంత వాళ్లుంటారు వదినా. వాళ్లింట్లో శుభకార్యముంటే వచ్చాను. ఎలాగూ ఇంతదాకా వచ్చాను కదా నిన్నూ, బాబుని చూసిపోదామని మనసు పీకింది వదినా. ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తెలిసినా ఉండబట్టలేక వచ్చేశాను’’ అంది.

‘‘అయ్యో ఇబ్బందేముంది వదినా. నువ్వెప్పుడైనా మా యింటికి రావొచ్చు’’ అంది సరోజ.

‘‘నాది పిచ్చిమనసులే వదినా. శివరాం బాబు మీద ఎంతిష్టం పెంచుకున్నానో. మొన్న కాలేజీ క్యాంపస్‌లో బాబు ఫ్రెండ్‌ ఎవడో అమ్మాయిల్ని అల్లరి చేయబోతే మన శివరాం బాబే వాడ్ని వెనక్కి లాగి మందలించాడట. ఆ ఆమ్మాయిల వెనకే నడుస్తున్న సంకల్ప కళ్లారా చూసిందట. నాకీ విషయం చెప్తూ ‘శివరాం లాంటి కొడుకుండటం ఆంటీ చేసుకున్న అదృష్టమమ్మా’ అని కూడా అందొదినా’’ అంది భావన.

రెండ్రోజుల తర్వాత కాలేజీ క్యాంపస్‌లో చెట్లకింద శివరాం తన గ్యాంగ్‌తో కలిసి నిలబడి ఉన్నాడు. సంకల్ప రావడం చూసిన అతని ఫ్రెండొకడు ‘‘ఈ రోజు దీన్నో ఆటపట్టిస్తాను చూడు’’ అంటూ ముందుకు కదలబోతుంటే శివరాం అతని కాలర్‌ ‌దగ్గర పట్టుకుని వెనక్కి లాగాడు.

‘‘ఎందుకు వెనక్కి లాగావురా? ఇంతకు ముందు నువ్వు కూడా ఆ అమ్మాయిని అల్లరి చేశావుగా’’ అతను కోపంగా అడిగాడు.

‘‘తను నాకు సిస్టర్‌ ‌వరసవుతుందని ఈ మధ్యే తెలిసిందిరా. దూరపు చుట్టరికం కావడం వల్ల మొదట్లో తనెవరో నాకు తెలియక తప్పు చేశాను. మీరెవరూ తన జోలికి వెళ్లకండి. వెళ్తే మర్యాదగా ఉండదు’’అన్నాడు శివరాం.

ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక సంకల్ప వాళ్లమ్మతో జరిగిందంతా చెప్పి ‘‘తిట్టకుండా కొట్టకుండా శివరాంలో అంతటి మార్పు ఎలా వచ్చిందమ్మా? ఏం మంత్రం వేశావు?’’ అని అడిగింది.

భావన నవ్వి ‘‘నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు నేర్చుకున్న మంత్రం వేశానే’’ అంది.

‘‘ఏంటో అది వివరంగా చెప్పమ్మా. నేను కూడా నేర్చుకుంటాను’’ అంది సంకల్ప.

‘‘నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు జరిగిందీ సంఘటన.. మగపిల్లల బ్యాగుల్లోంచి పెన్నులూ, పెన్సిళ్లు, ఆడపిల్లల బ్యాగుల్లోంచి డబ్బులు ఎవరో దొంగిలించసాగారు. అందరూ సౌరబ్‌ అనే అబ్బాయి మీదే అనుమానంగా ఉందని క్లాస్‌ ‌టీచర్‌కి కంప్లెయింట్‌ ‌చేశారు. కారణం ఏంటంటే రీసెస్‌ ‌సమయంలో అందరూ బైటికొచ్చి చెట్లకింద నిలబడి కబుర్లు చెప్పుకుంటుంటే సౌరభ్‌ ఒక్కడే క్లాస్‌రూంలో ఉండిపోయేవాడు.

సాక్ష్యాధారాలతో పట్టుకుంటే తప్ప ఆ అబ్బాయి మీద అనుమానంతో యాక్షన్‌ ‌తీసుకోవడం కుదరదని క్లాస్‌ ‌టీచర్‌ ‌చెప్పాడు.

ఓ రోజు నేను వాడ్ని పట్టుకునే ప్లాన్‌ ‌వేశాను. రీసెస్‌ ‌సమయంలో బైటికెళ్లినట్టు వెళ్లి వెంటనే క్లాస్‌రూంలోకొచ్చి చూశాను. అదే సమయంలో

ఓ అమ్మాయి బ్యాగ్‌లో డబ్బులకోసం వెతుకుతున్న సౌరబ్‌ ‌పట్టుబడిపోయాడు. ఆరోజు క్లాస్‌ ‌టీచర్‌ ‌సౌరబ్‌ని ఎలా కొట్టాడో.. బెత్తం విరిగేలా కొట్టాడు. ఎంత కొట్టినా తను ఏదో పుస్తకం కోసం బ్యాగ్‌ని వెతికాడు తప్ప దొంగతనం చేసే ఉద్దేశంతో కాదని సౌరబ్‌ ‌మొండిగా వాదించాడు.

ఆ తర్వాత కూడా దొంగతనాలు ఆగిపోలేదు. సంవత్సరం మధ్యలో క్లాస్‌ ‌టీచర్‌ ‌మూడు నెలలు సెలవుపెట్టి వెళ్లడంతో సత్యవతి క్లాస్‌టీచర్‌గా వచ్చింది. క్లాస్‌రూంలో జరుగుతున్న దొంగతనాల గురించి, సౌరబ్‌ ‌మీదున్న అనుమానం గురించి ఆమె దృష్టికి కూడా వచ్చింది. మొదట ఆమె సౌరబ్‌ని ఒంటరిగా పిలిచి అతని కుటుంబం గురించి వాకబు చేసింది. సౌరబ్‌కి రెండేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. నాన్నరెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు.. సౌరబ్‌ అవసరాల గురించి ఆమె ఎప్పుడూ పట్టించుకోదు. తండ్రి కూడా ఆ ఇద్దరు పిల్లల్ని ప్రేమించినంతగా సౌరబ్‌ని ప్రేమించడు.

సత్యవతి అతన్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంది. తిట్టడం వల్లనో, కొట్టడం వల్లనో వాడు మరింత మొండిగా మారిపోయే ప్రమాదముందని గ్రహించింది. క్లాస్‌లో అందరిముందు సౌరబ్‌ ‌చాలా బుద్ధిమంతుడని పొగడసాగింది. ‘కాదు టీచర్‌.. ‌వీడు దొంగతనాలు చేస్తాడు’ అని ఓ స్టూడెంట్‌ అనగానే అతన్ని మందలిస్తూ ‘నేను నమ్మను. సౌరబ్‌ అలాంటి పనులు చేయడు. ఎవరో చేసిన దొంగతనాల్ని మీరు సౌరబ్‌ ‌మీద వేస్తున్నారు. సౌరబ్‌ ‌చాలా మంచి వాడు’ అంది.

సౌరబ్‌ ‌మంచివాడన్న పొగడ్తల్తోపాటు వాడి మీద తను చూపిస్తున్న నమ్మకం వాడు మరోసారి తప్పు చేయకుండా ఆపుతాయన్న టీచర్‌ ‌నమ్మకం వమ్ము కాలేదు. ఆ తర్వాత క్లాస్‌లో ఎప్పుడూ దొంగతనాలు జరగలేదు.

దానివల్ల నా మనసులో రెండు విషయాలు నాటుకుని పోయాయి. పిల్లలు తప్పు చేస్తున్నారంటే అందులో వ్లా త•ల్లిదండ్రుల పెంపకలోపం, ప్రేమరాహిత్యం తప్పకుండా ఉండి ఉంటాయనేది ఒకటైతే, రెండోది తప్పు చేస్తున్న వ్యక్తిని అసహ్యించుకుని దండిచడం కన్నా ప్రేమతో, మంచి మాటల్తో, అతని మంచితనం మీద నమ్మకం ఉన్నట్టు ప్రవర్తించడం ద్వారా మార్పు తీసుకురావొచ్చని..

చెడ్డవాడన్న ముద్ర పడిన వ్యక్తి ఎలాగూ తనని అందరూ చెడ్డ వాడనుకుంటున్నారు కాబట్టి చెడుగా ప్రవర్తించడానికి సంశయించడు. చెడ్డపనులు చేయడానికి భయపడడు. అదే మంచి వాడన్న ముద్ర పడిన వ్యక్తి చెడ్డపని చేయడానికి భయపడ్తాడు. ఆ చట్రం నుంచి బైటకు రావడానికి సంశయిస్తాడు.

శివరాం విషయంలో ఈ మంత్రాన్నే ప్రయోగించాను. మనిషి మీద మంచివాడన్న ముద్ర వేసే మంత్రం…’’అంటూ భావన హాయిగా నవ్వింది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram