భారతీయ జనతా పార్టీని ప్రజాస్వామ్య పంథాలో ఓడించే సత్తా తమకు లేదని ఆ పార్టీ వ్యతిరేకులు ఏనాడో నిర్ధారణకు వచ్చేశారు.  కాబట్టి భారతదేశ స్వరూపాన్నీ, సామరస్యాన్నీ వక్రీకరించి, ఆ నెపం బీజేపీదేనని నమ్మిస్తే చాలునన్న దురాలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది. దేశంలో మిగిలిన మరొక జాతీయ రాజకీయ పక్షం కాంగ్రెస్‌ ‌వైఖరి, పశ్చిమ బెంగాల్‌ ‌తన సొంత జాగీరేనన్నట్టు వ్యవహరిస్తున్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వైఖరి అంతటి నైచ్యానికి దిగజారిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొలదీ కొన్ని పార్టీలలో ఇలాంటి పైత్యాలు తారస్థాయికి చేరిపోతూ ఉంటాయి. దశాబ్దాల పాటు తపించి సాధించుకున్న దేశ ఐక్యత ఏమైపోయినా ఫరవాలేదు, స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన త్యాగాలూ, రక్తతర్పణలూ బూడిదలో పోసిన పన్నీరైనా లెక్కలేదు. కానీ ఎన్నికలలో గట్టెక్కితే చాలునన్న అధమాధమ రాజకీయాలకే వాళ్లంతా అంకితమవుతున్నారు.

‘బెంగాలీలు తమ ఆడుపడుచే (అధికారంలోకి) రావాలని కోరుకుంటున్నారు’ అంటూ ఒక నినాదం అందుకున్నారు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఫిబ్రవరి 20న  అధినేత్రి చేసిన ఈ సూత్రీకరణకు మరింత మెరుగులు పెడుతూ ఆ పార్టీ నాయకుడు పార్థా ఛటర్జీ, ‘బయటివాళ్లు’ వద్దు అని వాక్రుచ్చారు. అంటే అధినేత్రే తన అంతరంగంలోని మాటను ఇలా ఓ తైనాతీ చేత పలికించిందని వేరే చెప్పక్కరలేదు. కొన్ని సందర్భాలలో అయితే కొన్ని లక్షణాలు చెప్పి, అక్కడి నుంచి బెంగాల్‌ను పాలిస్తామంటే సహించం అంటూ రంకెలు వేశారామె. గుజరాత్‌ ‌వారు పాలిస్తే బెంగాలీలు సహించరని ఆ రంకెలలోని ధ్వని. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి జనం ఓట్లు వేస్తారు. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కలసి రాష్ట్ర, లేదా దేశ నేతను ఎన్నుకుంటారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెంది ఉంటారు. అంతమాత్రాన ఆయన రాష్ట్రం దేశం మీద స్వారీ చేస్తుందని చెప్పడం విద్వేషాలనూ, విభేదాలనూ ఎగదోయడం కాదా?

ఆమె కంటె ఘనుడు కాంగ్రెస్‌ ‌రాహులుడు. ఫిబ్రవరి 23న కేరళలో జరిగిన ఒక సభలో ఈ యువరాజు ఏం మాట్లాడారో విని జాతి ముక్కున వేలేసుకుంది. పదిహేనేళ్లు ఉత్తర భారతంలో రాజకీయాలు నడిపి కేరళ వస్తే, రాహుల్‌కి గొప్ప సాంత్వన దొరికిందట. ఇక్కడివారు (కేరళీయులు) ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారట, విషయాల పట్ల పై పై పరిజ్ఞానం లేదా, మిడిమిడి జ్ఞానంతో ఉండరట. రాహుల్‌ ‌సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యనే అమెరికాలో విద్యార్థులతో మాట్లాడినప్పుడూ చేశారు. తనకు కేరళ వెళ్లడమంటే మక్కువట. ఇది ముమ్మాటికీ ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య విభేదాలు సృష్టించడమేనని బీజేపీ విమర్శిస్తే  తప్పు పట్టవలసినదేముంది? రాహుల్‌ ‌వాగుడు గురించి సొంత పార్టీ పెద్దలే నీళ్లు నమలవలసి రావడం వాస్తవం కాదా? ఆ వ్యాఖ్యలోని ప్రమాదాన్ని గులాం నబీ అజాద్‌ ‌గమనించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ లే, లద్దాఖ్‌ ‌దగ్గర నుంచి ఏ ప్రాంతాన్నయినా, ఏ మతాన్నయినా, ఏ సంస్కృతినయినా సమానంగా చూస్తుందని జమ్ములో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌చీలికను మరింత స్పష్టం చేసిందని దేశమంతా భావిస్తున్న ఇరవైముగ్గురు అసమ్మతినేతల సమావేశంలోనే గులాం నబీ, తమ నేత కాని నేత రాహుల్‌ అజ్ఞానం గురించి ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పారు. ఇంగిత జ్ఞానం లేనివారు చేసే ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకే కాదు, ఈ దేశానికీ, ఈ దేశ సమైక్యతకు ఎంత చేటు చేస్తాయో గుర్తించేవారు కాంగ్రెస్‌లో ఉన్నందుకు సంతోషించవలసిందే. అయితే వారు అక్కడ ఎంతకాలం ఉండగలరో మాత్రం ఇప్పుడు ఎవరూ చెప్పలేరు.

నిజానికి దేశ ఐక్యతకూ, సామరస్యానికీ ముప్పు తెచ్చే ఇలాంటి ప్రమాదకర వ్యాఖ్యలు చేసే అలవాటు కాంగ్రెస్‌ ‌పార్టీలో కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ నాటి ముఖ్యమంత్రి, ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిద్ధరామయ్య చేసిన నిర్వాకాలు అలాంటివే. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ‌పార్టీ ప్రచారం కోసం కర్ణాటక వెళితే ‘ఉత్తర భారత దిగుమతి’ అంటూ ఆయన నోరు పారేసుకున్నారు. అసలు ఆ ఎన్నికలకు కాస్త ముందు ఆయన చేసిన ఇంకొక చేష్ట ఎలాంటిది? కర్ణాటకకు ప్రత్యేక పతాకమంటూ వేరే పతాకావిష్కరణ గావించారు. ఓట్లు గెలుచుకునే పద్ధతి ఇదేనా? గుజరాత్‌లో ఒక స్టేడియంకు పటేల్‌ ‌పేరు తొలగించి మోదీ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్‌. ‌సంస్థానాలను విలీనం చేసి భారతావనిని ఒకే దేశంగా, సర్వసత్తాక రాజ్యంగా నిర్మించడానికి ఆ మహనీయుడు చేసిన కృషి ఇలాంటి వికృత చేష్టలు చేస్తునప్పుడు వాళ్లకి గుర్తుకు రావడం లేదు. తమిళనాడును పట్టి పీడిస్తున్న డీఎంకేతో, ద్రవిడనాడు మీద భ్రమలు కోల్పోని స్టాలిన్‌తో  ఇప్పుడు కాంగ్రెస్‌ ‌జత కట్టింది. ప్రత్యేక ద్రవిడనాడు డిమాండ్‌ను సమర్ధించేందుకు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని ఆ ప్రబుద్ధుడు ప్రగల్భించాడు. ఇవన్నీ చూస్తుంటే జిన్నా వాదాన్ని పునఃప్రతిష్టించాలన్న తపనే కనిపిస్తుంది.

ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే విమర్శించే హక్కు రాజ్యాంగమే ఇస్తోంది. అధికారం నుంచి దించడానికి బ్యాలెట్‌ ఉం‌ది. కానీ బీజేపీని అధికారం నుంచి దించడమన్న పేరుతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తినీ, రాజ్యాంగ పంథానీ ధ్వంసం చేయడం సరికాదు. ఎన్నికలలో నెగ్గడానికీ, ప్రభుత్వ వ్యతిరేకోద్యమాలలో పైచేయి సాధించడానికీ• ఖలిస్తాన్‌వాదులకూ, చైనా మద్దతుదారులకూ, భారత వ్యతిరేకులకూ వంత పాడడం విజ్ఞత కాదు. ఇదైనా గుర్తించాలని ఆశిద్దాం.

About Author

By editor

Twitter
Instagram