తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఊరించి ఊరించి ఉసూరు మనిపించింది. ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను రేకెత్తించింది. తెలంగాణ సర్కారుపై, పే రివిజన్‌ ‌కమిషన్‌ (‌పీఆర్సీ)పై విరక్తిని కలిగించింది. ఆశలు కల్పించి.. అడియాసలు చేసిన ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టేందుకు కారణమయింది.

తెలంగాణలోని 9 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న పే రివిజన్‌ ‌కమిషన్‌ ‌నివేదిక ప్రభుత్వానికి చేరింది. వేతన సవరణ సంఘం ఆ నివేదికలో పేర్కొన్న సిఫారసులను సర్కారు ప్రకటించింది. అయితే, ఆ సిఫారసులు ఉద్యోగులను షాక్‌కి గురిచేశాయి. అరచేతిలో స్వర్గం చూపించిన కేసీఆర్‌ ‌ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఆ సిఫారసులు ఉండటం ఆగ్రహ జ్వాలలను రేకెత్తించాయి.

30 నెలలుగా ఎదురుచూస్తున్న పే రివిజన్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్ ‌వచ్చిందని ఎగిరి గంతేయాల్సిన ఉద్యోగులు ఒంటికాలిపై లేవాల్సి వచ్చింది. తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఇంతకాలం ఓపికగా ఎదురుచూసినందుకు కేసీఆర్‌ ‌సర్కారు ఇస్తున్న బహుమతి ఇదేనా? అని ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

గత యేడాది డిసెంబర్‌ 31‌న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ‌ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చి మరీ ప్రగతిభవన్‌కు రప్పించు కున్నారు. అప్పుడే పీఆర్‌సీ తేనెతుట్టెను కదిలించారు. క్యాలెండర్‌, ‌డైరీల ఆవిష్కరణ కార్యక్రమమంటూ ఉద్యోగ సంఘ నాయకులతో చెప్పించారు. వాళ్లందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. టీజీవో, టీఎన్‌జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రమే ఆ భేటీకి హాజరయ్యారు. కొద్దినెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై అసహనంతో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి భోజనం చేసి చాలాసేపు వాళ్లతో మంతనాలు జరిపారు.

ఉద్యోగ సంఘాల నేతలు ప్రగతిభవన్‌ ‌నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ ప్రతినిధుల మాదిరిగా ప్రసంగించారు. తాము కేవలం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కోసమే వచ్చామని, కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాత్రం తమ సమస్యల పరిష్కారం గురించి చర్చించారని, ముఖ్యంగా పీఆర్‌సీ గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. పీఆర్సీతో పాటు.. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగుల వయో పరిమితి పెంపు, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించినట్లుగా చెప్పారు. ఉద్యోగుల బదిలీల పక్రియ శరవేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఉద్యోగుల సమస్యలన్నీ.. పీఆర్‌సీతో సహా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌నుంచి తమకు భరోసా లభించిందని ప్రకటించారు. విచిత్రమేమి టంటే రెండున్నరేళ్ల క్రితం నియమించిన వేతన సవరణ సంఘం అదేరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)‌కి తన నివేదికను సమర్పించింది. అంతేకాదు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కేసీఆర్‌ ‌హామీలు ఇచ్చారని చెబుతున్న అంశాల గురించి ప్రస్తావించారు.

అటు సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారని ప్రగతి భవన్‌లో సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం.. చకచకా.. పలు అంశాలపై ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడటం, హడావుడి కొనసాగడంతో అందరి దృష్టీ అటువైపే మళ్లింది. ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇవాళో, రేపో శుభవార్త వింటామంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వేళ.. పే రివిజన్‌ ‌కమిషన్‌, ‌తెలంగాణ సర్కారు ఊహించని షాక్‌ ఇచ్చాయి. కలలో కూడా ఊహించని రీతిలో ఉన్న పీఆర్సీ సిఫార్సులను బాహాటం చేశాయి.

అయిదేళ్లకోసారి ప్రభుత్వం పీఆర్‌సీ వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2018 మేలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు సీఆర్‌ ‌బిస్వాల్‌, ఉమామహేశ్వర రావు, మహమ్మద్‌ అలీ రఫత్‌లతో పీఆర్‌సీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2020 డిసెంబరులో తన నివేదిక ఇచ్చింది. జనవరి 27న వేతన సవరణ సంఘం సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
అంతకుముందు 2013 నాటి పీఆర్‌సీ ప్రకారం 2014లో తెలంగాణ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. తెలంగాణ వచ్చాక ఇదే మొదటి వేతన సవరణ సంఘం. తొలి పీఆర్సీనే అత్యంత వివాదాస్పదంగా మారడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. పైగా.. పీఆర్సీ కమిటీ మొత్తంగా 345 సమావేశాలు నిర్వహించి, 501 వినతిపత్రాలు స్వీకరించి, అభిప్రాయాలు సేకరించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చామంటున్నా ఈ సిఫారసుల్లో ఏ మాత్రం శాస్త్రీయత, హేతుబద్ధత కనిపించడం లేదన్న విమర్శలే సర్వత్రా వినిపిస్తున్నాయి.

పీఆర్సీ నివేదికలోని అంశాలు

ఫిట్‌మెంట్‌ 7.5 ‌శాతం పెంచాలి. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలి. కనీసం జీతం అంటే కింది స్థాయి సిబ్బందికి ఇచ్చే కనిష్ఠ జీతం 19 వేల రూపాయలు. గరిష్ఠ జీతం ఒక లక్షా 62 వేలరూపాయలు. హెచ్‌ఆర్‌ఏ ‌స్లాబులను 30 శాతం, 20 శాతం, 14.5 శాతం, 12 శాతం నుంచి తగ్గించి 24 శాతం, 17 శాతం, 13 శాతం, 11 శాతానికి కుదించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీమ్‌ (‌సీపీఎస్‌)‌లో పెన్షన్‌ ‌నిధి వాటాను ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. ఉద్యోగులు, టీచర్లు, పెనన్షర్లకు 10 శాతం ఫిట్‌మెంట్‌కు సిఫారసు చేసింది కమిటీ. 2018 జూలై 1 నుంచి ఇప్పటివరకూ పెరిగిన డీఏ 30.392 శాతం. గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. పిల్లలు పుట్టినప్పడు ఇచ్చే సెలవులు 3 నెలల నుంచి 4 నెలలకు పెంచారు. ఇంటి అద్దె భత్యం తగ్గించారు. కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏడాదికి వెయ్యి రూపాయల జీతం పెంచాలని కమిషన్‌ ‌సూచించింది. గ్రేడ్‌ 1, 2 ఉద్యోగులు ప్రైవేటు ఏసీ బస్సుల్లో వెళ్లడానికి కూడా అనుమతి ఇచ్చింది. కారు అలవెన్స్ ‌పెట్రోలు బండికి కిలోమీటరుకు రూ.16, డీజిల్‌ ‌బండికి రూ.14, టూవీలర్‌ అలవెన్స్ ‌కిలోమీటరుకు రూ.6 చొప్పున ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది.

గత పీఆర్సీలో అంటే, 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో చేసిన పీఆర్సీ ఇప్పటివరకూ చరిత్రలో అత్యధికం. అప్పటి వేతన సంఘం 29 శాతం పెంచాలని సిఫార్సు చేస్తే, కేసీఆర్‌ ఏకంగా 43 శాతం జీతాలు పెంచారు. అది చూసి ఆంధ్రలో చంద్రబాబునాయుడు కూడా 44 శాతం జీతాలు పెంచారు. 2013లో అమలు కావాల్సిన నాటి పీఆర్‌సీని 2014లో అమలు చేశారు.

అయితే, తాజా పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇది చాలా తక్కువని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వం తమ పరువు తీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిటీ వాస్తవ పరిస్థితులను గమనించలేదని, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. అలాగే తగ్గిన రూపాయి విలువ, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం స్థితి, ప్రస్తుత జీవన ప్రమాణ స్థాయిని పరిశీలించ కుండా, అశాస్త్రీయంగా, నిరాశాజనకంగా బిస్వాల్‌ ‌కమిటీ తన నివేదిక ఇచ్చిందని విమర్శించారు. ఈ సిఫార్సు లను చూసిన తొమ్మిది లక్షలమంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరాశా నిస్పృహలకు గురయ్యారు. ఇది తమకు అవమానంగా భావించారు. తీవ్ర ఆవేదనకు గురైన ఉద్యోగులు నివేదిక కాపీలు చించి, కాల్చి నిరసనలకు దిగారు.

నలుగురు సభ్యుల (తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు) కుటుంబం యూనిట్‌గా తీసుకుని వేతన పెంపుదల 45 శాతం నుంచి 63 శాతం వరకు ఉండాలని వివిధ సంఘాలు పీఆర్సీకి వివిధ రకాల ప్రతిపాదనలు ఇచ్చాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ‌ప్రకటించింది. ఏడాది కిందట విద్యుత్‌ ‌సిబ్బందికి 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. పొరుగు రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌లో లోటు బడ్జెట్‌ ఉం‌డి కూడా ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి చెల్లిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 43 శాతం ఫిట్‌మెంట్‌ ‌పెంచాల్సి ఉంటుంది. కానీ, 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను కమిటీ సిఫారసు చేయడం అనేది నమ్మలేకుండా ఉంది.
వేతన సవరణల్లో పెంచకున్నా ఫర్వాలేదు కానీ, తగ్గించవద్దని ఉద్యోగులంతా కోరుకుంటారు. కానీ, హెచ్‌ఆర్‌ఏ ‌శ్లాబులను 30 శాతం, 20 శాతం, 14.5 శాతం, 12 శాతం నుంచి తగ్గించి 24 శాతం, 17 శాతం, 13 శాతం, 11 శాతానికి కుదించడం చాలా దారుణమైన చర్యగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అభివర్ణిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచాల్సి ఉండగా దానిని రూ.16 లక్షలకు పరిమితం చేసిన పీఆర్సీ రిపోర్ట్ ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. కనీస వేతనం రూ.24 వేలు ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ ‌చేస్తే దానిని రూ.19 వేలకు నిర్ధారించి చిన్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే గరిష్ట వేతనం రూ.1,62,070కు పెంచింది. ఇంక్రిమెంటు రేటు 5 శాతం ఉండాలని కోరితే 2.5 శాతంగా పీఆర్సీ సిఫారసు చేయడం కూడా ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. డీఏ రేటు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉండాల్సి ఉండగా 0.91గా నిర్ధారించి ఆశలను చిదిమేశారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీం(సీపీఎస్‌)‌ను పూర్తిగా రద్దు చేయాలని ఉద్యోగ, టీచర్ల సంఘాలు నిరసనలు, ఆందోళలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో ఏండ్లుగా ఇదే విషయంపై ఎన్నో వినతులు ఇచ్చాయి. సీపీఎస్‌ ‌రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుండగా, పీఆర్సీ కమిటీ మాత్రం పెన్షన్‌ ‌నిధి వాటాను ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచి ఉద్యోగులు, టీచర్లు మరింత ఆందోళనకు గురయ్యేలా చేసింది. కేజీబీవీలు, అర్బన్‌ ‌గురుకుల స్కూళ్లు, మోడల్‌, ‌రెసిడెన్షియల్‌ ‌స్కూళ్ల ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలనే అంశాన్ని పట్టించుకోలేదు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చేయాలనే డిమాండ్లను కమిటీ అసలు పట్టించుకోనే లేదు.

కరోనా సాకు

తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు ఎక్కువ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని, అలాగే కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గిందని కొందరు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అందుకే ఫిట్‌మెంట్‌ 7.5 ‌శాతానికి సిఫారసు చేయాల్సి వచ్చిందని, ఉద్యోగ సంఘాలు పరిస్థితిని అర్థం చేసుకొని, కింది స్థాయిలో క్యాడర్‌కు అర్థమయ్యేలా చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని బుజ్జగిస్తున్నారు. నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి కరోనా ఎప్పుడొచ్చింది? అలాగే పీఆర్సీ ఎప్పుడివ్వాల్సి ఉండే? ఆనాడే పీఆర్సీ అమలు చేసి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఒక సాకుగా వాడుకోవాలని చూస్తున్నదని, తానిచ్చిన హామీ నుంచి తప్పుకోవాలను కుంటున్నదని అంటున్నారు విశ్లేషకులు.
ప్రభుత్వం మీద రాజకీయంగానూ విమర్శలు వచ్చాయి. విపక్షాలు కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశాయి. ఈ ప్రతిపాదనలు ఉద్యోగులను అవమానించడమేనని ఆరోపించాయి. ఉద్యోగులను నట్టేట ముంచేలా పీఆర్‌సీ ఉందని విమర్శలు వచ్చాయి. తెలంగాణలో మొదటి పీఆర్‌సీ ఇంత ఘోరంగా ఉంటుందనుకో లేదని, ఉద్యోగులకు 43 శాతం మేర జీతాలు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram