అమెరికా ఎన్నికలు అంటే సహజంగానే అంతర్జాతీయంగా ఆసక్తి ఎక్కువ. ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరగడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఎన్నికల దగ్గర నుంచి కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ ప్రతి దశలోనూ ఉత్కంఠే. అగ్రరాజ్యం 46వ అధినేతగా 78 సంవత్సరాల జో బైడెన్‌ ‌పీఠాన్నిఅధిష్టించడంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షుల్లోకల్లా బైడెన్‌ అత్యధిక వయసు గల నాయకుడు. అనుభవశీలి. సెనెటర్‌గా, ఎనిమిదేళ్లపాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విశేషానుభవం ఆయన సొంతం. అంతర్గతంగా, అంతర్జాతీయంగా అగ్రరాజ్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బైడెన్‌ ‌బండిని ఎలా ముందుకు నడిపిస్తారన్నది ఆసక్తికరం. ‘అమెరికాలో ప్రతి ఆరు కుటుంబాల్లో ఒకటి ఆకలితో ఉన్నాయి. ప్రతి అయిదు కుటుంబాల్లో ఒకటి అద్దెలు చెల్లించలేకపోతున్నాయి. బిల్లులు కట్టలేని స్థితిలో మూడోవంతు మంది ఉన్నారు’ అన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ‌మాటలు అంతర్గతంగా దేశ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం బైడెన్‌కు నల్లేరు మీద నడకకాదన్న ఆమె వ్యాఖ్యలు వాస్తవాన్ని చాటుతున్నాయి. మేము చేయాల్సిన పని చాలా ఉందని, మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌స్ఫూర్తితో సేవలు అందిస్తామని, మాముందున్నవి భారీ లక్ష్యాలే అయినప్పటికీ, కష్టపడి పని చేసి అందరి సహకారంతో మళ్లీ అమెరికాకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమన్న బైడెన్‌ ఆశావాదం అమెరికన్లలో భరోసాను, ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తోంది.

ఇక అంతర్జాతీయంగా చూస్తే చైనాను నిలువరించడం, భారత్‌కు బాసటగా నిలబడటం బైడెన్‌ ‌లక్ష్యాలుగా కనపడుతున్నాయి. భారత్‌కు చిరకాల మిత్రుడైన బైడెన్‌ ‌మన దేశానికి సంబంధిం చిన అనేక విషయాల్లో కీలకపాత్ర పోషించారు. ఉభయ దేశాల మధ్య పౌర అణు ఒప్పందాన్ని కుదర్చడంలో ఆయనదే ప్రముఖ పాత్ర. రెండు దేశాల మధ్య 500 బిలియన్‌ ‌డాలర్ల (దాదాపు 35 లక్షల కోట్లు) మేరకు ద్వైపాక్షిక ఒప్పందం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ఆ లక్ష్యాన్ని అందుకోవలసి ఉంది. అందుకే తన బృందంలో 20 మంది భారతీయులకు కీలక పదవులు కట్టబెట్టగా వారిలో 13 మంది మహిళలు కావడం విశేషం. వీరిలో 17 మందికి పూర్తిగా శ్వేతసౌధంలోనే స్థానం కల్పించడం మరో ప్రత్యేకత. అంతేకాక విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌ ‌పరంగా చూస్తే ఇవన్నీ స్వాగతించదగ్గవి. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానకి తైవాన్‌ అనధికార రాయబారి బై కెమ్‌ ‌షియావ్‌ను ఆహ్వానించడం ద్వారా బైడెన్‌ ‌చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు. 1979 తర్వాత తైవాన్‌ ‌ప్రతినిధి ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం ఇదే ప్రథమం కావడం గమనించదగ్గ అంశం.

తన లక్ష్య సాధనకు అనుగుణంగానే సరైన బృందాన్ని ఎంచుకున్నారు బైడెన్‌. ‌శ్వేత జాతీయులా, నల్ల జాతీయులా అన్న విషయాన్ని పక్కనపెట్టి, పూర్తిగా ప్రతిభ, పనితీరు, నిబద్ధత ప్రాతిపదికగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు నూతన అధ్యక్షుడు. బైడెన్‌ ‌బృందంలోని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఏకంగా భారతీయ మూలాలున్న మహిళ కావడం విశేషం. నీరా టాండన్‌కు కీలకమైన మేనేజ్‌మెంట్‌, ‌బడ్జెట్‌ ‌విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆమె వైట్‌ ‌హౌస్‌లోనే పనిచేస్తారు. బైడెన్‌తో ప్రత్యక్ష సంబంధాలు నెరపే అవకాశం ఆమెకు ఉండనప్పటికీ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన వ్యక్తిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వివేక్‌ ‌మూర్తి ప్రతిష్టాత్మకమైన అమెరికా సర్జన్‌ ‌జనరల్‌గా నియమితులయ్యారు. తెలంగాణలోని కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌ ‌మండలం పోతిరెడ్డిపేటకు చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డికి తన ప్రసంగ బాధ్యతలు అప్పచెప్పారు. వినయ్‌రెడ్డి చాలాకాలంగా బైడెన్‌కు సన్నిహితుడు. వినయ్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి చాలాకాలం క్రితమే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కశ్మీరీ మూలాలు గల సమీరా ఫైజల్‌ ‌వైట్‌ ‌హౌస్‌లోని జాతీయ ఆర్థిక మండలిలో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మరో కశ్మీరి మహిళ ఆయేషా షా వైట్‌ ‌హౌస్‌లోని డిజిటల్‌ ‌స్ట్రటజీ కార్యాలయంలో పార్టనర్‌షిప్‌ ‌మేనేజర్‌. ఈమె లూసియానాలో పుట్టి పెరిగారు. ఈమె ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సన్నిహితురాలన్న పేరుంది.

వినీతా గుప్తా న్యాయశాఖలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా, గరిమావర్మ ప్రథమ మహిళకు డిజిటల్‌ ‌డైరెక్టర్‌గా, నబ్రీనా సింగ్‌ ‌వైట్‌ ‌హౌస్‌ ‌డిప్యూటీ ప్రెస్‌ ‌సెక్రటరీగా, భరత్‌ ‌రామమూర్తి జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా, వేదాంత పటేల్‌ ‌వైట్‌ ‌హౌస్‌లో అసిస్టెంట్‌ ‌ప్రెస్‌ ‌సెక్రటరీగా, సుమన్‌ ‌గుహ దక్షిణాసియా వ్యవహారాల సీనియర్‌ ‌డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత్‌కు సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా సుమన్‌ ‌గుహనే బైడెన్‌ ‌ముందుగా సంప్రదిస్తారు. నేహా గుప్తా వైట్‌ ‌హౌస్‌ అసోసియేట్‌ ‌కౌన్సెల్‌గా, రీమా షా డిప్యూటీ అసోసియేట్‌ ‌కౌన్సెల్‌గా, విదుర్‌ ‌శర్మ కరోనా స్పందన టీమ్‌ ‌సలహాదారుగా నియమితులయ్యారు. మాలా అడిగా ప్రథమ మహిళ డాక్టర్‌ ‌జిల్‌ ‌బైడెన్‌కు విధానపరమైన సలహాదారుగా వ్యవహరిస్తారు. విదేశాంగశాఖలో అండర్‌ ‌సెక్రటరీగా పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాలను ఉజ్రా జెయా పర్యవేక్షిస్తారు. జాతీయ భద్రతా మండలిలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయ కర్తగా శాంతి కళాథిల్‌ను బైడెన్‌ ‌నియమించారు. ఈ నియామకాల ద్వారా భారతీయులకు, ప్రతిభకు, నిబద్ధతగల వ్యక్తులకు బైడెన్‌ ‌పెద్దపీట వేశారు. వ్యక్తులు కాకుండా వారి పనితీరు, నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెల్ల జాతీయులా, నల్ల జాతీయులా అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు.

జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అసోమ్‌కు సంబంధించిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ- నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్) ‌వంటి విషయాల్లో బైడెన్‌, ‌కమలా హారిస్‌ ‌గతంలోనే తమ అసమ్మతిని తెలియజేసిన సంగతి గమనార్హం. అయితే కేవలం ఒకటి, రెండు అంశాల ఆధారంగా ఉభయ దేశాల సంబంధాలను అంచనా వేయలేం. ఉగ్రవాదం, చైనాను ఎదుర్కోవడం, ఇండో -పసిఫిక్‌ ‌ప్రాంతం, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం తదితర అంశాలు అమెరికాకు కీలకమైనవి. అందువల్ల బైడెన్‌ ‌భారత్‌తో సత్సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తారన్నది నిర్వివాదం. ట్రంప్‌ ‌జమానాలోనూ నిక్కీ హేలీ, రాజ్‌ ‌షా, అజిత్‌ ‌పాయ్‌, ‌నియోమీ రావ్‌, ‌సీతా వర్మ, విశాల్‌ అమీన్‌, ‌నీల్‌ ‌ఛటర్జీ, మనీషా సింగ్‌ ‌వంటి భారతీయ అమెరికన్లు కీలకపాత్ర పోషించారు.

బైడెన్‌ ‌సహచరులు సైతం చైనాకు వ్యతిరేకంగా, భారత్‌కు అనుకూలంగానే మాట్లాడటం గమనార్హం. చైనా ఏమాత్రం నమ్మదగ్గ దేశం కాదని, భారత్‌ అత్యంత విశ్వసనీయ దేశమని విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. బిల్‌ ‌క్లింటన్‌ ‌హయాంలో ఉభయ దేశాల బంధం బలపడింది, ఒబామా పాలనలో మెరుగుపడింది, ట్రంప్‌ ‌హయాంలో కొనసాగింది, బైడెన్‌ ‌పాలనలో దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలి…అని ఆయన అన్నారు. భారత్‌ను కలుపుకొని వెళితే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా సహా ఏ దేశమూ అగ్రరాజ్యానికి సవాళ్లు విసరలేదన్నది బ్లింకెన్‌ ‌విశ్లేషణ.
రక్షణకు సంబంధించి భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నూతన రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అభిప్రాయం. ఆయన నల్ల జాతీయుడు. ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన అమెరికా, భారత్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా భాగస్వామ్యం గల చతుర్భుజ కూటమిని మరింత విస్తరించాలని ఆయన ప్రతిపాదించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి తీసుకురావడం, తైవాన్‌ను చైనా ఆక్రమించకండా అడ్డుకోవడం అమెరికా ప్రాధాన్యం కావాలని ఆస్టిన్‌ అభిప్రాయ పడ్డారు. ఇవన్నీ కచ్చితంగా భారత్‌కు సానుకూలాంశాలే.

విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా వెళ్లే భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయాలు బైడెన్‌ ‌తీసుకోవడం స్వాగతించదగ్గ అంశం. గతంలో ‘అమెరికా ఫస్ట్’ అన్న నినాదంతో వలసదారుల అవకాశాలకు ట్రంప్‌ ‌గండి కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతీయ వృత్తి నిపుణులకు మేలు చేసే చర్యలను అమెరికా చేపట్టనుంది. అమెరికా సంస్థల్లో పనిచేసే విదేశీయులకు గ్రీన్‌ ‌కార్డులను జారీ చేసే విషయంలో ప్రస్తుతం దేశాలవారీగా ఉన్న పరిమితులను ఎత్తి వేయనుంది. దీనికి సంబంధించిన వలస బిల్లును కాంగ్రెస్‌ ఆమోదం కోసం పంపనుంది. ఇది అమల్లోకి వస్తే వేలాదిమంది భారతీయ వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం సులభతరమవుతుంది. వృత్తి నిపుణులకు, ప్రత్యేక ఉద్యోగులకు తాత్కాలిక వీసాలను జారీచేసే వ్యవస్థను సంస్కరించేందుకు, వారి ఉపాధి, వేతనాలకు భద్రత కల్పించేందుకు, గ్రీన్‌ ‌కార్డుల జారీలో గల పరిమితులను ఎత్తివేసేందుకు నూతన అధ్యక్షుడు సానుకూలంగా ఉన్నారు. ఈ మేరకు వలస వ్యవస్థను ఆధునీకరిస్తూ ‘యూఎస్‌ ‌సిటిజన్‌షిప్‌ ‌యాక్టు-2021’ ను తీసుకురానున్నట్లు వైట్‌ ‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. దీనివల్ల అమెరికాలో పనిచేస్తూ అక్కడే జీవనం సాగించే వారికి పౌరసత్వం మంజూరు సులభతరమవుతుంది. వీసాల కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అనధికారికంగా అమెరికాలో ఏళ్లతరబడి ఉంటున్న వారి పౌరసత్వ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తక్కువ వేతనాల ఉద్యోగులకూ గ్రీన్‌ ‌కార్డు లభించడం తేలిక అవుతుంది. అమెరికా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో సైన్స్, ‌టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ ‌తదితర కోర్సులను పూర్తిచేసిన విదేశీ విద్యార్థులు తరువాత కూడా అక్కడే ఉండే అవకాశం లభిస్తుంది.

అమెరికాకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు బైడెన్‌. ‌పారిస్‌ ‌వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామ్యం చేయడం, కాలుష్య నియంత్రణ చర్యలు, కరోనా మహమ్మారి నియంత్రణ, ముస్లిం దేశాల నుంచి వలసలపై ఆంక్షల తొలగింపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగాలన్న నిర్ణయం నిలిపివేత, జాతి వివక్ష అంతం, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిలిపివేత వంటివి కీలకమైనవి. ఫిబ్రవరి 19 నుంచి అమెరికా మళ్లీ పారిస్‌ ఒప్పందంలో భాగస్వామి కానుంది. తన నిర్ణయాల ద్వారా అమెరికా చరిత్రలో నూతన అధ్యాయానికి జో బైడెన్‌ ‌నాంది పలికారనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు కూడా మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుని తమ దేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని, అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట ఇనుమడించాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. వారి ఆశలు, అంచనాలను సాకారం చేయడానికి నాలుగేళ్ల ప్రయాణానికి ఇప్పుడే శ్రీకారం చుట్టారు నూతన అధినేత జో బైడెన్‌.

– ‌తంగెడ రామేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram