– విహారి
శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది.


స్టాఫ్‌ ‌రూమ్‌లో-

‘శని, ఆది, సోమ- మూడు రోజులూ సెలవులు కలిసొచ్చినై, ఎల్లుండి ఆదివారం. మనం సేవాభారతి కార్యక్రమానికి వెళ్తున్నాం.. గుర్తుంది కదా!’ వర్థని అన్నది.

‘అనుకున్నాం కదా….!’ రూపాలీ మాటలకు ఏమీ అనకుండా అమూల్య వైపు చూసింది – రమాదేవి.

‘సారీ నాకు పనుంది. నేను రాలేను’ అన్నది అమూల్య.

‘‘అవును. ఇదో స్టాక్‌ ‌రిప్లై’’ వెటకారంగా అన్నది రమాదేవి.

‘చూడు అమూల్యా, పదిమందితో కలిసి చేసే పని. వెళ్లటం మంచిది.’’ వర్థని మాటల్ని బలపరుస్తూ, ‘‘అవసరం కూడా’’ అన్నది రూపాలీ.

‘‘టీచర్లుగా మనం ఇలాంటి కొన్ని సామాజిక బాధ్యతల్ని ఇష్టపూర్వకంగా చేయాలి’’ ఉపదేశిస్తున్నది రమాదేవి.

‘‘సేవాభారతి ఛాయాదేవి గారికి మన నలుగురం వస్తున్నట్టు చెప్పేశాను’’ చెప్పింది వర్థని. ఆమే గ్రూప్‌ ‌లీడర్‌.

‌సేవాభారతి సిటీలో ప్రసిద్ధి చెందిన ఎన్‌జీవో. వాళ్లు ఆరోగ్యం, ఆహారం, విద్య, విజ్ఞానం – అని నాలుగు విభాగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి కాక – స్త్రీ స్వావలంబన మీద ప్రత్యేక విభాగం ఉంది. దానికింద మహిళలకు న్యాయసలహా కేంద్రమూ వున్నది. ఆదివారం నాడు- స్త్రీల అనాథాశ్రమానికి వెళ్లి, అక్కడుండే వారికి ఉచిత దుస్తులూ, మరికొన్ని అవసరమైన వస్తువులూ అందజేసే కార్యక్రమం అది. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టరుగారూ వస్తున్నారు.

‘‘నాకు పనుంది రమా, నన్నొదిలేయండి. ప్లీజ్‌’ ‌ప్రాధేయపూర్వకంగా అన్నది అమూల్య – రమాదేవితో. ‘ఏమే’ అనుకునే సాన్నిహిత్యం అమూల్యది.

‘‘అంతేలే, ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్టెది మరోదారీ’’ వర్థని మాట నిష్టూరంలోకి దిగింది.

‘అయినా పని పని – అని ఒక మాట నేర్చు కున్నావు నువ్వు, చంద్రిక ఫస్ట్ ఇం‌టర్‌. అనిల్‌ ఏమో నైన్త్. ‌పెద్ద పిల్లలు. మీ ఆయనో ధర్మరాజని నువ్వే చెబుతావ్‌. ‌నేను మీ ఇంటికి రాలేదుగానీ, నువ్వే చెప్పావుగా- నీళ్ల పనీ, కూరలు తరిగివ్వటం వగైరా కూడా పాపం రాజేష్‌ ‌డ్యూటీయేనని’ అని ‘భార్యా బాధితుడు’ జోక్‌గా అన్నది రమాదేవి. మిగిలిన ఇద్దరూ సన్నగా నవ్వారు. ఓ క్షణంపాటు తనలో తనను వెతుక్కో ప్రయత్నించింది అమూల్య. అంతలో వర్థని అన్నది, ‘‘ఏ పనులున్నా ప్రతిసారీ నువ్విలా జారిపోతే ఎట్టా?’’ ఆమె స్వరం సౌమ్యంగా వున్నది.

‘‘సారీ… వర్థనిగారూ…. ‘ఫిజికల్‌ ‌ప్రెజెన్స్’ ‌విషయంలో మాత్రం నన్నొదిలేయండి, ఫ్లీజ్‌’’ అం‌ది అమూల్య.

‘‘సరే… చర్చ లెందుగ్గానీ….’’ అని మిగతావాళ్లని చూస్తూ, ‘‘మనం వెళ్లొద్దాంలెండి’’ అంది రమాదేవి. ‘‘బై’’ చెప్పి వెళ్లారందరూ. అమూల్య మిగిలింది.

‘సాధారణంగా మనుషులు శరీరాలతో జీవిస్తారు. విజ్ఞులు మనసుతో, జ్ఞానులు హృదయం తోనూ, దివ్యనేత్రాలతోనూ జీవిస్తారు’ అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. తాను మాత్రం? ‘వీటన్నిటి మిశ్రమమా?’ నవ్వొచ్చింది అమూల్యకి. ఏమో – రెండూ, మూడూ పద్ధతులేమోగానీ, శరీరంతో జీవించలేకపోతున్నదా తాను? చాలా రోజుల్నుంచీ ఎప్పుడూ తనను వెక్కిరిస్తున్న ప్రశ్న ఇది.

రాజేష్‌ ఒకరోజున అన్నమాట చప్పున స్ఫురించింది. ‘కార్యేషు, కరణేషు…. ఈ రెంటిలో డిస్టింక్షనేనోయ్‌. ఎటొచ్చీ ఆ మూడో పాత్రే.. ఇబ్బంది పెడుతోంది!’ నవ్వుతూ, కవ్విస్తూ అన్నా – అతనన్నది నిజమేనేమో! కానీ, పరస్పర హిత కాంక్షతో జీవిస్తున్నా – తన పరిమితులు తెలిసినవాడే అయినా – కొన్ని స్వానుభవాలు అలాంటి అభిప్రాయాల్ని ప్రోది చేస్తుంటాయి కదా!

‘‘మేడమ్‌… ‌పనున్నదా… కాస్సేపు వుంటారా?’’ అంటూ వచ్చింది నరసమ్మ. స్కూల్‌ ‌టైమ్‌ అయిపో యిందని మిగిలిన గదుల తలుపులన్నీ వేసి, చివరగా ఇక్కడికి వచ్చింది ఆమె. ‘‘లేదు… లేదు… వెళ్దాం’’ అంటూ బ్యాగూ, పుస్తకాలూ, యూనిట్‌ ‌టెస్ట్ ‌పేపర్ల దొంతర… అన్నీ సర్ది తీసుకుని బయటకు నడిచింది.

———————–

దూరం నుంచే గమనించింది అమూల్య.

ఇంటి ముందు మనుషులు. మనసు కీడు శంకించింది. పరుగు లాంటి నడకతో ఇంటికి చేరింది.

గడప దగ్గరే – ‘‘నానమ్మ చనిపోయిందమ్మా’’ అంటూ కళ్ల నీళ్లతో చంద్రిక తల్లిని చుట్టేసుకుంది. అవాక్కయి నిలబడిపోయింది అమూల్య. బిక్క మొహంతో నిలబడి వున్నాడు అనిల్‌. అమూల్య చేయిపట్టుకుని గదిలోకి తీసుకువెళ్లాడు భర్త.

మంచం మీద నిశ్చలనంగా అత్తమ్మ. దుఃఖం పొంగుకొచ్చింది అమూల్యకి. కన్నీళ్లు పొంగినై, ‘అదృష్టవంతురాలు. ఇంకా… తీసుకు…. తీసుకు పోకుండా, ఇంత మాత్రం తెలివి వుండగానే పోయింది….’’ భుజం మీద రాజేష్‌ ‌చెయ్యి – సానుభూతి మాటలు… లేకుండానే స్పర్శలోనే అందుకున్నాడు.

బయట అతని మిత్రులెవరో వచ్చారు. మర్నాటి అంతిమ సంస్కారానికి – ఏర్పాట్ల గురించి మాట్లాడు కుంటున్నారు. రావలసినవారికి ఫోన్లు వెళ్తున్నై.

‘‘అమ్మాయ్‌… అమూల్యా….’’ పక్క గదిలో నుంచి తల్లి సుభద్రమ్మ పిలుపు  విని తనను తాను సంబాళించుకుని ఆ గదిలోకి నడిచింది.

ఇరుగు పొరుగువారు వెనక్కి తగ్గారు. రాజేష్‌వాళ్లు వాకిట్లో మాట్లాడుతున్నారు.

తల్లి మంచం పక్కగా వెళ్లి నిలబడింది – అమూల్య, ‘‘కదిలి చావలేను కదా… రామ్మా… చేసినంతకాలం అన్నీ చేశావు. తల్లి లాగానే చేశావు. ఎవరమైనా పోక తప్పదు కదా! అనివార్యమైంది అదే కదా!’’ అంటూ కూతురి చేతిని తన చేతుల్లోకి సానునయంగా తీసుకుంది సుభద్రమ్మ. నాలుగేళ్ల నుంచీ సుభద్రమ్మదీ మంచం బతుకే. ‘‘పొగ్రెసివ్‌ ‌మస్క్యులర్‌ ‌డెస్ట్రొఫీ’’ పేరు పెట్టారు. ఆమెకు అమూల్య ఒక్కతే సంతానం. రాజేష్‌కు ఇద్దరక్కలూ, ఒక తమ్మూడూ, చెల్లీ వున్నారు. అక్కాచెల్లెళ్ల సంసారాలన్నీ మధ్య తరగతి చాలీచాలని బతుకులే.

‘‘రత్తమ్మని పిలిపించమ్మా! ఇవాళ రాత్రికి కాస్త వుండమను’’ అన్నది సుభద్రమ్మ. రత్తమ్మ ఆమె సహాయకురాలు. ఉదయం ఐదింటికి వచ్చి సాయంత్రం ఐదు గంటలకి వెళ్లిపోతుంది. ఇవ్వాళ అసలు రానే లేదు.

గది బయటకు వచ్చింది అమూల్య. ఇంత సేపయినా మరిది కనపడలేదనేది స్ఫురణకు వచ్చింది. ఇంతలో అనిల్‌ ‌కనిపించాడు. ‘‘బాబాయి ఏడిరా…?’’ అంటుంటే… ‘‘తన గదిలోనే వున్నాడమ్మా’’ చెప్పాడు.

రాజేష్‌ ‌లోపలికి వస్తూ ఈ మాటలు విని, ‘వాడి సంగతి తెలిసిందే గదా… కానీ…’ అన్నట్టుగా ఆమె వైపు చూశాడు.

రాజేష్‌, అమూల్యా ఇద్దరూ – రాత్రింబవళ్లు ఇద్దరు పెద్దవాళ్లతో అవస్థలు పడుతున్నా పట్టించుకోడు మధు. తన లోకం తనది. మొదట్నుంచీ ముభావమే. చదువు సరిగా అబ్బక, కుంటుకుంటూ క్లాసులు దాటించి బి.టెక్‌ ‌మెకానికల్‌ ‌చేశాడు – కొత్త రాష్ట్రాల్లో లక్ష పరిశ్రమలూ, కోటి అవకాశాలూ రానున్నాయని ఆశపడ్డారు. రాష్ట్ర పరిస్థితులు ఆశలన్నింటినీ బుగ్గి చేశాయి. బయట ఎక్కడో ఒక పదిహేనువేల  ఉద్యోగంలో చేరాడు. అదేమి కర్మో- ఓ నెల క్రితం చేస్తున్న ఆ ఉద్యోగమూ ఊడింది. దానితో నిరాశ, నిస్పృహలతో కుంగి గది వదిలి బయటకు రావటం లేదు.

‘అసలు జరిగిన విషయాన్నయినా అర్థం చేసుకున్నాడా లేదా?’ అనుకుంటూ అతని గది వైపు అడుగులేసింది అమూల్య.

—————–

అత్తమ్మ పోయి నాలుగోరోజు. ఇల్లంతా మనుషులున్నట్టున్నది. రాజేష్‌ ‌పెద్దక్కయ్య, మాణిక్యం, బావగారు బంగారయ్య, కూతురు స్వరాజ్యంతో వచ్చారు. మరో ఇద్దరు ఆడపిల్లలు రాలేదు. రెండో అక్క గౌరి ఆమె కూతురు శ్రీదేవితో వచ్చింది. కొడుకూ, భర్తా రాలేదు. ఇద్దరు మగపిల్లలతో చెల్లెలు కామేశ్వరీ, ఆమె భర్త నరసింహం వచ్చారు.

వాళ్లందరికీ అమూల్య తల్లిని ఇంట్లో పెట్టుకుని సాకటం – కంట్లో నలుసు పరిస్థితి. దానికితోడు ఆమె పెన్షనంతా దాచేసి, లెక్కా పత్రం లేకుండా రాజేష్‌ ‌చేతే ఖర్చు చేయిస్తున్నదేమోనని అనుమానం. వచ్చినప్పుడల్లా ఏదో విధంగా తమ తమ తత్త్వాల్ని మాటల రూపంలో గుచ్చి బాధపెడ్తూనే వుంటారు.

అమూల్యకి ఊపిరి సలపనంత పని. వంట మనిషికి అన్నీ అందించి వండించటం, వచ్చిన వాళ్లకి గౌరవ మర్యాదలకి లోటు లేకుండా చూడటం ప్రధానంగా పెట్టుకుని ప్రవరిస్తోంది. అయినా, ఆడపడుచుల నిష్టూరాలూ, ఎత్తి పొడుపులూ, వెటకారాలూ. అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం.

అటు పోయినా, ఇటు వచ్చినా అందరూ అమూల్యని పిలుస్తూనే వున్నారు. మధ్య మధ్య అనిల్‌, ‌చంద్రికల అవసరాలు చూడటం వాళ్ల గునుపుల్ని సమర్థించటం.. పదిమంది ఉన్నప్పుడు అంతకు ముందులా వస్తువులకీ ‘క్రమశిక్షణ’ వుండదు కదా! ప్రతి అస్తవ్యస్తతకీ ‘అమూల్యా! ఏమిటిది?’ అంటూ రాజేష్‌, ‌పిల్లలేమో వాళ్ల వస్తువుల స్థానభ్రంశంతో చిరాకు పడ్తున్నారు.

సాయంత్రం కాఫీలయినై. మాణిక్యం తన ఘోషంతా తమ్ముడితో చెప్పుకుంటోంది. గోడవారగా వున్న గౌరి లేచి వచ్చి అమూల్య దగ్గరగా కూర్చుంది. అక్క చెబుతున్న విషయాన్నే తనకు అనుకూలంగా చెప్పటం మొదలు పెట్టింది.

అమూల్యకి బాగా తెలిసిన వ్యవహారమే ఇది. వాళ్లూ వీళ్లూ కలిసినప్పుడు వీళ్లిద్దరూ – ఎవరికి వారు మధుని తమ అల్లుడిగా చేసుకోవాలని పోరుతూ ఉంటారు. రాజేష్‌ ‌తానుగా ఏమీ చెప్పరు. అతని తల్లి నవ్వేసి వూరుకునేది. మధు మాట్లాడడు. అలాగని ఇద్దరికీ సరాసరి మధుని నిలదీసే తెగువ లేదు. అడిగి అతని చేతో ‘నో’ అనిపించుకోవటం ఇష్టం లేదు.

అమూల్య లేచి తన పనిలోకి దిగింది. రాత్రికి భోజనాలు చేసేవాళ్లకి వంట, ఫలహారం చేసేవాళ్లకి అవీ తయారైనాయి.

అక్కాచెల్లెళ్ల మాటల ఉధృతి చిలికి చిలికి గాలివానగా మారింది. స్వరాల స్థాయి పెరిగింది. ఎప్పటివో తవ్వుకొచ్చి వాదించుకుంటున్నారు. వాళ్ల జ్ఞాపకశక్తికి అమూల్య ఆశ్చర్యపోతూ వుంటుంది. వాళ్ల వాదన జోరు తిరిగి తిరిగి అమూల్య, రాజేష్‌ల మీద పడింది. పెట్టుపోతల నిష్టూరాల కుంపటిని కుమ్మరించారు. అంతా వింటున్న అమూల్యకి ఈ కుమ్మపొగ కొత్త కాకపోయినా – మనసుకు బాధ కలిగించింది.

తానీ యింటినీ మెట్టి పాతికేళ్లు. ఈ పాతికేళ్లల్లో రాజేష్‌ ‌తరపు వాళ్లే తన వాళ్లనకుంది. చివరి వాళ్లయిన కామేశ్వరినీ, మధునీ తన పిల్లల్లాగానే అనుకుంది. పెద్ద ఆడపడుచు లిద్దర్నీ ఏనాడూ ఎడంగా చూడలేదు. రాజేష్‌ ‌కసురుకున్నా, కాదన్నా – తాను ఒప్పించి వాళ్లకు సహాయమందించింది. నిజానికి అట్లా చేస్తేనే కదా- బంగారయ్య ‘క్లాత్‌ ‌స్టోర్‌’ ‌ప్రారంభించిందీ; ఇవాళ్టికి ఇంత సంపాదించు కున్నదీనూ. ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అని తానెప్పుడూ మిగిలిన ఇద్దరికన్నా- ఓ వీసం ఎక్కువగా ఆదరిస్తూనే వున్నది. పిల్లల చదువుల ఫీజులూ, అచ్చట్లు ముచ్చట్లకీ, పేరంటాలకీ – తానే ముందుండి సక్రమంగా చేసేది.

రెండో ఆడపడుచు గౌరి – కొడుకు ఇంటర్‌లోకి రాగానే తల్లి దగ్గరికి వచ్చి డబ్బు అడిగింది. ఆమె లేదు పొమ్మంటే కలగజేసుకుని సర్దిపంపింది. కుటుంబంలో పొరపొచ్చాలు లేకుండా అందరూ ఒకటిగా వుండాలని తానుగా చేయాల్సినదంతా చేస్తూనే వున్నది.

కామేశ్వరి ఇంటర్‌ ‌కాగానే దూరపు చుట్టం నరసింహంతో ప్రేమ అన్నది, అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుక్కూచుంది. అతనప్పుడే ఐ.టి.ఐ. పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అత్తమ్మ, రాజేష్‌ -‌వాళ్ల పెళ్లికి ససేమిరా వీల్లేదన్నారు. ఇంట్లో రోజూ వాళ్ల ముగ్గురికీ షష్టాష్టకం. మధ్య మధ్య తనకీ తిట్లు తప్పేవి కావు. చివరికి తనే చొరవ తీసుకుని నరసింహం తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించింది. తీరా ముగ్గులోకి దిగేసరికి కట్నం కావాలన్నారు. అందరికీ నచ్చజెప్పి, పరిస్థితుల్ని సర్దుబాటుజేసి – పెళ్లికి సానుకూలమయ్యేట్టు చేసింది.

వాళ్లిద్దరికీ తామంటే అభిమానం, ప్రేమ. అది చూసిన అక్కలిద్దరికీ – రాజేష్‌, అమూల్య- కామేశ్వరి దంపతులకు ఎక్కువగా ఏవో పెట్టేస్తున్నారన్న అనుమానం. అమూల్యకు సంబంధించినంత వరకూ తామంతా ఒక చిన్న సమూహం. అందరూ బాగా ఉండాలి – అందులో మనముండాలి – అనే కోరికా, ఆకాంక్ష.

‘‘మమ్మీ…. రేపు మాథ్స్ ‌టెస్ట్…. ఒకటి రెండు నువ్వు చెప్పాల్సిందే. ప్లీజ్‌ ‌మమ్మీ’’ అంటూ వచ్చాడు అనిల్‌.

ఆలోచనల నుంచీ మరలి – తమ గదిలోకి వెళ్లి వాడికి లెక్కలు చెప్పసాగింది.

‘‘భోజనాల సమయం. అంతా కూర్చున్నారు. మధు రాలేదు. ఎవరికి తోచిన కామెంట్స్ ‌వాళ్లు చేస్తున్నారు. ‘అయినా, తన మనసులో మాటేమిటో చెప్పేస్తే, మా దారి మేం చూసుకుంటాం కదా!’ అని. అమూల్య మధు గదికి వెళ్లింది. ఇటుగా నిలబడి లోపలికి దృష్టి సారించింది. గదిలో బెడ్‌లైట్‌ ‌వెలుతురు. పిలిచింది. ‘‘ఊఁ…’’ అతని స్వరం పీలగా వుంది. లోపలికి వెళ్లి లైట్‌ ‌వేసింది. సీ•లింగ్‌కేసి చూస్తూ పడుకున్న వాడల్లా వదినని చూసి లేచి కూచున్నాడు. కళ్లు తుడుచుకున్నాడు.

‘‘మధూ….’’

అమూల్య స్వరంలోని ఆర్ద్రతకి మధుకి ఏడుపు పొంగుకొచ్చింది. దగ్గరికి వెళ్లి ‘‘ఛ…. ఛ…ఏంటిది మధూ… పసిపిల్లవాడిలా….’’ అనునయంగా అని, ‘‘రా…. భోజనం చేద్దువుగాని, వాళ్లందరినీ నువ్విలా తప్పించుకు తిరగటం బాగుండదు’’ అన్నది. ‘‘నా మనసు బాగా లేదు వదినా, వాళ్ల ఇష్యూ వేరు, నా సమస్య వేరు’’ అని ‘‘నేనిప్పుడు రాను. నన్నొదిలేయ్‌ ‌వదినా’’ అంటూ పడుకున్నాడు. అమూల్యకు తెలుసు. ఉద్యోగం పోయినప్పటి నుంచీ మధు కుంగి పోతున్నాడు. తన కౌన్సిలింగ్‌ ‌కొంతవరకే పనిచేస్తున్నది. అతని బ్యాచ్‌ ‌వాళ్లంతా పెద్ద పెద్ద ఉద్యోగాలకి వెళ్లిపోయారు. తన పరిస్థితి అందని మ్రాని పండయిందని బాగా డిప్రెషన్‌ ‌ఫీలవుతున్నాడు.

‘అతనిక రాడు’ అనుకుని బలవంతం చేయదలచు కోక ఇవతలికి వచ్చేసింది.

—————————

ఇవ్వాళ తొమ్మిదోరోజు. నిత్యకర్మ జరుగుతోంది.

తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచింది అమూల్య. కాఫీ కలుపుతుంటే, వచ్చాడు రాజేష్‌, ఇద్దరూ ఆ రోజు జరగాల్సిన పనులూ, కావలసిన అవసరాల గురించి మాట్లాడుకుంటుంటే – అనిల్‌ ‌వచ్చాడు. అప్పటికప్పుడే లేచి చదువులో పడ్డాడు. చంద్రిక కూడా లేచి చదువుకుంటోందిట. ఏదో ప్రాబ్లమ్‌ ‌రావట్లేదంటే, చేసి చూపి పంపింది. ‘వీళ్లిద్దరికీ నీ క్రమశిక్షణ బాగానే వచ్చింది’ అన్నాడు రాజేష్‌. ‘‘‌పోన్లెండి… నాది శిక్షణ, మీది శిక్షా’’ అని నవ్వేసింది. తనకి కోపం ఎక్కువ అని భార్య భావన! ఇదీ – రాజేష్‌ అభిప్రాయం!

ఆ పగలంతా అక్కాచెల్లెళ్లు వాళ్ల రొటీన్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఆ రొటీన్‌లో మూడొంతులు – ఒకరిమీద ఒకరు విసుర్లూ, రోషాలూ, కోపాలూ ప్రదర్శించుకోవటమే! చివరికి ముగ్గురూ కలిసి- పోయిన తల్లినీ, ఉన్న అన్నా వదినల్నీ నెపమెన్నటం! ఈసారి మాత్రం ‘మధు’ కేంద్రమైనాడు. పెళ్లి సమస్య మాత్రం – నాలుగు నిష్టూరాలూ, నలభై దెప్పి పొడుపులూ అయినా అంగుళం కదలకుండా మొరాయించింది.

సాయంత్రం ఆరు దాటుతుండగా-

వర్థనీ, రమాదేవీ, రూపాలీ- మరో ఇద్దరు సహోపాధ్యాయినులు – స్వరూప, వాణి వచ్చారు. అమూల్యని పలకరించి పోవటానికి. పరామర్శలు, ఆడపడుచుల పరిచయాలూ అయినై. సేవాభారతి కార్యక్రమం బాగా జరిగిందని, ఆ విశేషాలు చెప్పారు వర్థనీ, రూపాలీ. ‘‘ఈసారి మనంతట మనమే సాయిబాబా గుళ్లో అన్నదానం నిర్వహిద్దామని ప్లాన్‌ ‌చేస్తున్నాం’’ అని తన ఉద్దేశం చెప్పింది వర్థని. తర్వాత కాఫీలు తాగి సెలవు తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ గేటు దగ్గర రమాదేవి అన్నది ‘‘ఆరోగ్యం జాగ్రత్త అమూల్యా!’’ ‘‘మనుషుల్ని భరించటమే కాక, ఇలాంటప్పుడు మనసుల్నీ భరించాలి కదే’’ అని! నవ్వేసి లోపలికొచ్చింది అమూల్య.

ఆ రాత్రి – పొద్దుపోయేదాకా అమూల్యా, రాజేషూ రాబోయే మూడురోజుల కార్యక్రమాల గురించీ, ఆ ఏర్పాట్ల గురించీ తయారవుతుంటే, పక్కన- మాణిక్యం, గౌరీ తమ తమ కూతుళ్ల పెళ్లి గురించిన చర్చల్లో కూరుకుపోయారు. స్వరాజ్యం – శ్రీదేవీల గుణగణాల బేరీజు ఎక్కువైపోయింది. మాణిక్యం కుడిఎడమల తర్కంలో పైమెట్టెక్కి ‘అయినా చదువూ సంధ్యా లేకుండా దాన్నలా నువ్వే చెడ గొట్టినవ్‌’ అం‌ది చెల్లెలితో. శ్రీదేవి గురించిన ఈసడింపు ఇది. ఎందుకనో గౌరి ఏమీ అనలేదు. సాధారణంగా అలా మౌనం వహించదు.

ఇది వింటున్న అమూల్య మనసు నొచ్చుకుంది. ‘‘ఫర్వాలేదులే వదినా. చదువంటే డిగ్రీలే కాదుగా. శ్రీదేవి సంగీతంలో రాణిస్తున్నది కదా! ఏమో ఎవరు చూడొచ్చారు – రేప్పొద్దున తనో పెద్ద సెలబ్రిటీయే కావచ్చు’’ అన్నది. గౌరి మొహం సంతృప్తితో మెరిసింది. మాణిక్యమేమో ఠక్కున ‘‘అవునే- అమూల్యా. మీ సపోర్టుంటే ఎవరైనా ఏమైనా కావచ్చు’’ అన్నది. వెటకారం అర్థమౌతూనే ఉన్నా ప్రతి సమాధానం ఏమీ ఇవ్వలేదు అమూల్య.

‘‘చాల్లేగానీ, వెళ్లి ప్రశాంతంగా పడుకోండి. రేపట్నుంచీ చాలా పన్లు’’ అంటూ తానూ లేచాడు రాజేష్‌, అమూల్య లేచి తల్లి గదిలోకి వెళ్లింది. ఆమె కలత నిద్రలో ఉసురుసురంటోంది. ఆమె దుస్తులూ, పక్కా సర్ది, ఆ గదిలోనే గోడవారాగా ఉన్న దీవాన్‌మీద నడుం వాల్చింది.

‘బోలు మాటలు ఎన్ని చెప్పుకున్నా, ఏ ఉద్విగ్నతలకూ, ఉద్వేగాలకూ లోనైనా – కాల నిర్ణయం కష్టసాధ్యమే….’

రాత్రి-రెండో జాములో నడుస్తున్నది.

—————–

కర్మాంతరాలయినై. పదమూడోరోజు ఎటువారటు వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ – మాణిక్యం, బంగారయ్య, గౌరి – మధు పెళ్లి విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావించి వెళ్లారు. ‘‘వాళ్లందరి ఏడుపూ అదే… రాత్రి జరిగిన ఘటనల పర్యాలోచనలో తల్లి పెన్షన్‌ ‌ప్రసక్తి తెచ్చాడు రాజేష్‌. ‌నిజమేమిటో నీకూ నాకూ తెలుసు. పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ పుణ్యాలూ, మధు చదువూ, అమ్మ వైద్యం – అవన్నీ డబ్బు ఖర్చు లేకుండా గాలిలో జరుగుతాయనుకుంటారు వాళ్లు. అంతెందుకూ – ఇప్పుడీ ఖర్చు కాలేదూ- రెండు లక్షలు’’ అని వేష్టపడ్డాడు.

పధ్నాలుగో రోజు ఉదయాన్నే అమూల్య తల్లి చెప్పింది. ‘‘అమ్మా! ఇంటికి వచ్చీపోయే బంధువులూ, బలగం, నువ్వూ రాజేషూ ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సొస్తుందో తెలీదు. నీకు స్కూలూ, అతనికి ఆఫీసూ బాధ్యతలు. అందుకని, ఈ రాత్రికి వెళ్లి గుళ్లో నిద్ర చేసి రండి’’ అని.

ఈ ఆలోచన మంచిదే అన్నాడు రాజేష్‌. ‌రెండు సందుల ఆవల వెంకటేశ్వరస్వామి గుడి. వెళ్లి వాళ్లతో మాట్లాడి వచ్చాడు.

– రాత్రి పది దాటిన తర్వాతే, పనులన్నీ ముగించుకుని గుడికి వచ్చి పడుకున్నారు అమూల్యా, రాజేష్‌. ఇద్దరి మనసుల్లోనూ అవ్యక్త ఆలోచనలు. ఎప్పటికో కునుకు పట్టింది.

గేటు దగ్గర ఎవరో అరుస్తుంటే ఉలిక్కిపడి లేచింది అమూల్య. టైమ్‌ ‌మూడున్నర! రాజేష్‌ ‌కూడా లేచాడు.

వెళ్లి చూస్తే – చంద్రిక, అనిల్‌! ‌వాచ్‌మెన్‌ ‌లేచాడు. గేటు తీశాడు. ‘‘ముందు ఇంటికి రండి తెలుస్తుంది’’ అంది చంద్రిక.

ఆ ఆందోళనతోనే హడావిడిగా పరిగెత్తుకుపోయి ఇంట్లోకి అడుగుపెట్టారు. చంద్రిక, అనిల్‌ ‌సరాసరి మధు గది దగ్గరికి నడిచారు. వాళ్ల వెంట తల్లీ తండ్రీ!

చంద్రిక చూపించిన స్థలం చూసి నిర్ఘాంత పోయారు అమూల్య, రాజేష్‌. ‌గుండెలు చిక్కబట్టి నట్లయినై. తలుపు అడుగు నుంచీ రక్తం! చారికలు చారికలుగా… ప్రవహిస్తోంది. తలుపు వేసి ఉంది. బలవంతాన పగలగొట్టాడు రాజేష్‌. ‌మంచం మీద చెయినాన్చి పడుకుని ఉన్నాడు మధు. చేతి నరానికి గాటు. అక్కడ్నుంచే రక్తస్రావం!

చెప్పవలసిన దానికంటే చేయవలసిందే ఎక్కువ. సమయం తరుముతుంటే, దాన్ని నిలువరిస్తూ ఉరుకులూ పరుగులూ… మెడికో లీగల్‌ ‌కేసు. హాస్పిటల్‌ ‌ఖర్చు. ఇతర డిమాండ్లు. రాజేష్‌ ‌దగ్గర డబ్బు లేదు. తల్లికి చెప్పి ఆమె డబ్బు తీసిచ్చింది అమూల్య. అందుకు అహరహమూ శ్రమించింది అమూల్య. శారీరకంగా, మానసికంగా ఆమె పెద్ద పరీక్షనే ఎదుర్కొన్నది.

————

రోజులు గడిచిపోతున్నై. వృత్తీ, వ్యావృత్తీ మొదలైనై.

మధుకి తల్లీతండ్రీ గురువూ దైవం అన్నీ తానే అయి, అతన్ని మనుషుల్లో పడేసింది అమూల్య. అతన్ని కుంగుబాటు నుంచీ బయటపడేసి, ఆత్మస్థైర్యం నింపి మళ్లీ ఉద్యోగార్థిని చేయగలిగింది. ఫెయిల్యూర్‌ ‌స్టోరీస్‌ అన్నీ విషాదంతాలు కావని ఋజువు చేసేందుకు ఆమెకు దైవకృప కూడా సహకరించింది.

మూడ్నెల్లు తిరిగేసరికి మధుకి మంచి పేకేజ్‌తో ఉద్యోగం వచ్చింది!

———

స్టాఫ్‌రూమ్‌లో-

‘‘సేవాభారతి కార్యక్రమం. జైలు ఆవరణలో మొక్కలు నాటటం. మన గ్రూప్‌ ‌దానికి ముఖ్య కార్యకర్తలం. నువ్‌ ‌రావాలి’’ అమూల్యని అడిగింది వర్థని. ఆమె సమాధానం చెప్పేలోగానే రూపాలీ అన్నది ‘‘స్టాక్‌ ‌రిప్లై వద్దు తల్లీ’’ అని.

నవ్వింది అమూల్య. ‘‘నా మనసులో మాట చెబుతాను’’ అని ‘‘మీరేమైనా అనుకోండి, ఫ్రెండ్స్- ‌గృహిణిగా నా ప్రాధాన్యం నా కుటుంబమే. సామాజిక సేవ, సాంఘిక అభ్యుదయం – ఇంటి నుంచే కదా మొదలవ్వాలి. రోగగ్రస్తురాలైన తల్లి, చదువుల్లో ఉన్న పిల్లలు, నిరుద్యోగి మరిది… ఇలా వీళ్ల జాగ్రత్త తీసుకోవటమే నా బాధ్యతగా భావించాను. నా చుట్టూ ఉన్న వాళ్లని ఆదరించటమే నేను చేయగలిగిన ఉత్తమ సేవ. దీనివల్లనే మా శ్రీదేవి ఇవాళ సంగీత కారిణి కాగలిగింది. మా మధు మంచి ఉద్యోగీ కాగలిగాడు. రేప్పొద్దున శ్రీదేవికి భర్తా అవుతాడు. నా పిల్లలూ చదువుల్లో రాణిస్తున్నారు. ఈ కుటుంబ పరిధిని దాటి బయటి సమాజసేవ అవశ్యం కావల సిందే. దాన్ని మీ వంటి గృహిణులు నిర్వహించాలి. గో ఎ హెడ్‌- ‌ప్లీజ్‌. ‌నేను మా అమ్మ శేషజీవితం సుఖమయం చేసే బాధ్యతని చూసుకుంటాను. నన్ను ఇక్కడికి పరిమితం కానీయండి!’’

రమాదేవి ఠక్కున నిలబడి చప్పున చప్పట్లు కొట్టింది. మిగిలినవారూ ఆమెని అనుసరించారు!

About Author

By editor

Twitter
Instagram