హైదరాబాద్‌ ‌మహానగరం చెరువైంది. కాలనీలన్నీ నీట మునిగాయి. వీధులు కాలువలయ్యాయి. కార్లు పడవలైనాయి. ద్విచక్ర వాహనాలు మరబోట్లుగా మారాయి. చెరువులు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. భారీ వరదలకు కొట్టుకుపోయి కొందరు విగత జీవులుగా దొరికితే.. మరికొందరు కొన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇంకొందరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వరద ఉధృతికి లారీలు సైతం కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. చాలా చోట్ల విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయి రెండు మూడు రోజులు అంధకారంలోనే ఉన్నారు. రోడ్లన్నీ తెగిపోయి కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌స్తంభించిపోయింది. కొందరైతే వాహనాలతో పాటే వరదల్లో కొట్టుకుపోయారు. అక్టోబర్‌ 12, 13 ‌తేదీల్లో రాజధానిలో కురిసిన కుండపోత వర్షం తర్వాత కనిపించిన దృశ్యాలివి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది.


రాత్రి వీధిలో నిలిపిన కారు తెల్లారేసరికి పక్కవీధిలో కనిపించింది. ఇంటిముందు ఉంచిన ద్విచక్ర వాహనం అసలేమయ్యిందో పత్తా లేదు. ఇంట్లో రాత్రి కుటుంబసభ్యులంతా నిద్రపోయారు. కానీ, తెల్లారేసరికి ఎవరు ఎటువైపు కొట్టుకుపోయారో తెలియదు. కొందరు వరదల్లో కొట్టుకుపోయినా భూమ్మీద నూకలుండి బతికితే, బతికినందుకు సంతోషపడే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులంతా వరదల్లో సమాధి కావడాన్ని చూసి జీవితమంతా ఆ జ్ఞాపకాలు వెంటాడుతుంటే గుండెకోతను ఎలా ఎదుర్కోవాలో తెలియక కుమిలిపోతున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు హైదరాబాద్‌లో వరద విలయాన్ని కాదు.. కాదు.. ప్రళయాన్ని చవిచూపింది. రోడ్లు ఏవో, కాలువలేవో తెలియకుండా పోయింది. దాదాపు 90శాతం సెల్లార్లు మునిగిపోయాయి. కాలువలు, నాలాలు కూడా మహా ప్రవాహాలను చవిచూశాయి. మనుషులు చీమల్లా నీళ్లల్లో కొట్టుకుపోయారు. దాహం తీర్చే నీరే దారుణమైన పరిస్థితిని కల్పించింది.

నగరంలో ఎక్కడ చూసినా జలవిలయం సృష్టించిన బీభత్సం ఇంకా కనిపిస్తోంది. ఏ వీధిలో చూసినా నీళ్లల్లో కొట్టుకుపోయిన వాహనాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బురద మేటలు దర్శనమిస్తున్నాయి. నానిన ఇళ్ల గురుతులు కలచివేస్తున్నాయి. ఇళ్లల్లోంచి కొట్టుకుపోయిన సామాగ్రి గుండెను పిండేస్తోంది. ప్రవాహ ఉధృతికి ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయిన దృశ్యాలు జలవిలయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కట్టుబట్టలతో మిగిలిన వాళ్ల కన్నీళ్లు వరద నీటిలోనే కలిసిపోతున్నాయి.

విలయం సృష్టించిన వరదలతో హైదరాబాద్‌ ఒక్కసారిగా అతలాకుతలమైంది. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందే గ్రహించినా, ఈ స్థాయిలో నగరం మునిగి పోతుందని అంచనా వేయలేదు. ఫలితంగా అధికారులు అవసరమైనంత మేర సహాయక కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. ఇళ్లు మునిగి, మూసీలో కొట్టుకుపోయి, నిర్వాసితులుగా మారిన వాళ్లకు పునరావాసం కల్పించే ఏర్పాట్లు ఆలస్య మయ్యాయి. ఫలితంగా జనం అష్టకష్టాలు పడ్డారు.

జోరువాన, కుండపోత, దంచికొట్టిన వాన, ఎడతెరిపిలేని వాన, కుంభవృష్టి.. ఎలా చెప్పుకున్నా ఆ వర్షం మాత్రం హైదరాబాద్‌ ‌జ్ఞాపకాల్లో భాగం కానుంది. వందేళ్లక్రితం నాటి వరదల గురించి ఎలాగైతే కథలుగా చెప్పుకుంటున్నామో 2020 అక్టోబర్‌లో వచ్చిన ఈ వరదల గురించి కూడా ఇకపై చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇక్కడా, అక్కడా అనే తేడా లేదు. నగరమంతా నరకయాతనకు గురిచేసింది ఈ వర్షం, వరద. ఎంతోమందిని కన్నీళ్లపాలు చేసింది. పదుల సంఖ్యలో ఇళ్లల్లో కడుపుకోత మిగిల్చింది. వందల సంఖ్యలో జనాన్ని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేసింది.

ఈ జల ప్రళయంతో నగరంలోని నాలాలు, చెరువులన్నీ పొంగిపొర్లాయి. కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. శరవేగంగా ప్రళయ రూపంలో చెరువుల్లోని నీరు కాలనీలను ముంచెత్తింది. కార్లు, వ్యాన్లు, లారీలు బొమ్మల మాదిరిగా నీళ్లలో తేలియాడాయి. చాలా మంది ఎత్తైన ఇళ్లు, డాబాలపైకి ఎక్కి ప్రాణాలను దక్కించుకున్నారు. కళ్లముందే తమ వాహనాలు, ఇళ్లలోని సామాన్లు, పశువులు వరద నీటిలో కొట్టుకుపోయినా ఏం చేయలేని పరిస్థితి.

నగరంలోని పాత ఇళ్లన్నీ బీటలు వారాయి. గోడలు కూలిపోయాయి. కొందరు ఆ శిథిలాల కింద సమాధి అయ్యారు. పాత ఇళ్లల్లో, బలహీనమైన గోడలు కలిగిన ఇళ్లల్లో ఉండవద్దని.. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో, సమీపంలోని కమ్యూనిటీ హాళ్లలో ఉండాలని జీహెచ్‌ఎం‌సీ అధికారులు, ప్రభుత్వం ప్రకటించాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ ‌జంట జలాశయాలైన హిమాయత్‌ ‌సాగర్‌, ఉస్మాన్‌ ‌సాగర్‌లు నిండిపోయాయి.

హైదరాబాద్‌ ‌శివార్లలోని ఘట్‌కేసర్‌, ‌హయత్‌ ‌నగర్‌ ‌ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. 32 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం చరిత్రలోనే అరుదు అని, అందుకే నగరం ఈ స్థాయిలో వరద తాకిడికి గురయిందని నిపుణులు చెబుతున్నారు.  యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండలోని వెంకటపల్లిలో 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా అనేక ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 239 ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకుపైగా, 419 ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 125 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. సరిగ్గా 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. ఉప్పల్‌ ‌చెరువు పొంగి పొర్లడంతో వరంగల్‌, ‌యాదాద్రి – హైదరాబాద్‌ ‌రహదారి నదిలా మారింది. వాహనాలన్నీ మునిగిపోయాయి. విజయవాడ- హైదారాబాద్‌ ‌దారిలో పలుచోట్ల హైవే మీదకు నీరు చేరి ఆ మార్గంలో కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శంషాబాద్‌ ‌సమీపంలో హైవే రోడ్డు దెబ్బతినడంతో కర్నూలు, అనంతపురం, బెంగుళూరు మార్గాలు కూడా మూసుకుపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

మూసీ నది వెంట ఒక్క హైదరాబాద్‌లోనే 200 దాకా ట్రాన్స్‌ఫార్మర్లు నదీ ప్రవాహంలో కొట్టుకు పోయాయని ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో నగరవాసులు రెండు మూడు రోజులు చీకట్లో ఉండక తప్పలేద. విద్యుత్‌ ‌తీగలు తెగిపోయి కొందరు విద్యుత్‌ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.

వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి భారత సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. వరద ముంచెత్తిన ప్రాంతాలలో నిర్వాసితులుగా మారిన ప్రజలను సైనికులు, సేవాభారతి కార్యకర్తలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వాళ్లకు ఆహార పొట్లాలు అందించడంతో పాటు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు చేర్చారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పడవలను కూడా వినియోగించాల్సి వచ్చింది. పునరావాస కేంద్రాల్లో కూడా సైనికులు సేవలందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ‌జీహెచ్‌ఎం‌సీ రెస్క్యూ టీమ్స్, ‌డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్, ‌స్థానిక పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

అక్టోబర్‌ 13, 2020.. ‌హైదరాబాద్‌ ‌చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయింది. మరుసటి రోజు సాయంత్రందాకా సృష్టించిన జల విలయం లక్షలాది మందికి చీకటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ పరిణామాలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రెండు రోజుల పాటు అధికారికంగా సెలవులు ప్రకటించింది. జనం అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావద్దని హెచ్చరికలు జారీచేసింది.

ఈ బీభత్సానికి చలించిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. వరదల కారణంగా తలెత్తిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎలాంటి చర్యలైనా చేపట్టాలని సూచించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మూసీ మహోగ్రరూపం

ముందు తరం, ఈ తరం కూడా చూడని వరద హైదరాబాద్‌లో పోటెత్తింది. వందేళ్ల క్రితం హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయని, ఇళ్లన్నీ మునిగి పోయాయని, మూసీ నది ఉప్పొంగి ప్రళయరూపం చూపించిందని చరిత్ర పుస్తకాల్లో చదివాం. పిల్లకాలువలా, మురికి కాలువలా కనిపించే మూసీనదిని చూసి ఇదా వరదలు పోటెత్తి నగరాన్ని ముంచెత్తిన మూసీ నది? అని ఒకింత సందేహ పడ్డాం. కానీ, ఇప్పుడు స్వయంగా కళ్లతో చూశాం. నిన్న మొన్నటిదాకా మురికినీటి నిలయంగా, పిల్ల కాలువ మాదిరిగా కనిపించిన మూసీనది ఊహించని రీతిలో పోటెత్తింది. నది ఒడ్డున ఉన్న ఇళ్లను, వాహనాలను లాక్కెళ్లింది. ఒడ్డును దాటుకొని, కొన్ని కిలోమీటర్ల మేర ఉగ్ర ప్రవాహాన్ని చూపించింది.

– సుజాత గోపగోని, సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
Instagram