జాగృతి (2001-10) దశాబ్ది కథలు – సమగ్ర పరిశీలన సిద్ధాంత గ్రంథకర్త డా।। శంకర్‌ అనంత్‌. ‌బాల్యం నుండి అఖండ భారత నిర్మాణం పట్ల అభినివేశం, సాంస్కృతిక సామరస్యం పట్ల ఆసక్తి ఉన్నందున కొన్ని వందల జాగృతి ‘కథలను’ పరిశీలించి సిద్ధాంత గ్రంథాన్ని ఐదు ప్రకరణాలుగా వర్గీకరించి నిబద్ధతతో విశ్లేషించాడు.

మొదటి ప్రకరణంలో జాగృతి వారపత్రిక ప్రారంభం, ఆశయాలను ఆదర్శాలను వివరించాడు. స్వాతంత్య్రానంతరం భారతీయ సంస్కృతినీ, జాతీయ దృక్పథాన్నీ ప్రబోధించే లక్ష్యంతో జాగృతి పత్రిక (1948) ఆవిర్భవించింది. సామాజిక సేవ ద్వారా ఐహిక ఆముష్మికాలను ఉద్బోధించి సమాజాన్నీ, పఠితలోకాన్నీ జాగృతం చేయడమే పరమావధిగా పత్రిక పురోగమిస్తున్నది. ప్రారంభం నుండి కూడా ప్రామాణికమైన కథలను జాగృతి ప్రచురిస్తున్నదని, దానినే కొనసాగిస్తున్నదని  వివరించాడు.

రెండో ప్రకరణంలో జాగృతి కథల విశిష్టతను, ఇతివృత్తానుశీలనం గూర్చి చర్చించాడు. మూడో ప్రకరణంలో ఇతివృత్తానుసారంగా భారతీయ సంస్కృతీ విశిష్టత, మతాంతరీకరణ కథలు, హింసావాద వ్యతిరేక కథలు, కుటుంబ జీవన కథలు సేవాధర్మ కథలు, దయావాత్సల్యాల ప్రతిబింబించే కథలు, భారతీయ సంస్కృతీ పరిరక్షణ కథలు, నైతిక విలువల ప్రబోధించే కథలు, సామాజిక చైతన్య కథలుగా వర్గీకరించి విశ్లేషించాడు. భారతదేశ వికాసానికి స్వదేశీ ప్రాధాన్యం ఎంతో అవసరం. జాతీయోద్యమానికీ, స్వాతంత్య్ర సాధనకీ స్వదేశీ భావన ప్రధానమైన కారణం. అందులో భాగంగా దేశాన్ని ప్రేమించే జాతీయ దృక్పథానికి దోహదం చేసే కథలనే జాగృతి స్వీకరించింది. వ్యక్తి నిర్మాణం నుండి విశ్వనిర్మాణంవరకు సానుకూల దృక్పథంతో ఆలోచింపజేసే రచనలను జాగృతి  గౌరవించింది.

న్గావ ప్రకరణంలో జాగృతి కథల్లో జాతీయ దృక్పథాన్ని సాకల్యంగా చర్చించాడు. జాతీయతను గూర్చి ఆచార్య బి.రామరాజు. గడియారం వేంకట శేషశాస్త్రి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డివంటి ప్రముఖుల అభిప్రాయాలను క్రోడీకరించి జాతీయతను, జాతీయ దృక్పథాన్ని వివరంచడం బావుంది. జాతీయ దృక్పథంతో వచ్చిన వడాల రాధాకృష్ణ ‘తోడు-నీడ’, పుప్పాల కృష్ణమూర్తి ‘అంధేరేమే అన్వర్‌’, ‌కొంపెల్ల లక్ష్మీసమీరజ ‘రుధిరయాత్ర’, ప్రఫుల్లచంద్ర ‘విషాదంలో భారతమ్మ’ వంటి కథల గురించి విశ్లేషించాడు.

ఐదో ప్రకరణంలో జాగృతి ప్రత్యేక సంచికల్లో దీపావళి ప్రత్యేక సంచిక కథల పోటీ నిర్వహించి అసంఖ్యాకంగా వచ్చిన ప్రముఖ రచయితల కథల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు కొన్ని ప్రోత్సాహక బహుమతులకు ఎంపిక చేస్తుంది. కొన్ని మంచి కథలను సాధారణ ప్రచురణకు స్వీకరిస్తుంది. అదేవిధంగా సంక్రాంతి, స్వాతంత్య్ర దినోత్సవం, ఉగాది ప్రత్యేక సంచికలను ప్రచురిస్తారు. వీటిలో కూడా మంచి కథలను ప్రచురిస్తారు. దశాబ్ది కాలంలో ప్రత్యేక సంచికల ద్వారా బహుమతులు పొందిన రెండువందల కథలను రచయిత పరిశీలించాడు. 2007 దీపావళి ప్రత్యేక సంచికలో బహుమతులు పొందిన ఐదు కథలను విశ్లేషించాడు.

ఆంధప్రదేశ్‌లో (ఉభయ తెలుగు రాష్ట్రాల్లో) ప్రముఖ కథా రచయితలు మధురాంతకం రాజారాం; ఇల్లిందుల సరస్వతీదేవి, పవని నిర్మల ప్రభావతి, మాదిరెడ్డి సులోచన, డా।। పాకాల యశోదా రెడ్డి, డా।।కొలకలూరి ఇనాక్‌ ‌వంటి రచయితలు జాగృతి కథా పోటీల్లో పురస్కారాలు పొందినవారే. జాగృతి ద్వారా ప్రముఖ కథా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు పొందామని సగర్వంగా చెప్పుకున్నారు.

ఇతర పత్రికల ప్రత్యేక సంచికలకు, జాగృతి దీపావళి ప్రత్యేక సంచికకు స్పష్టమైన భేదం ఉంది. జాగృతి కథా పోటీల్లో సందర్భోచితమైన అంశానికి ప్రాధాన్యత సంతరించుకొనే విధంగా ఉంటుంది. ఉదాహరణకు 2002 దీపావళి ప్రత్యేక సంచికను దేశరక్షణ ప్రత్యేక సంచికగా రూపొందించారు. అందులో కథలు, కవితలు, వ్యాసాలు అన్నీ దేశరక్షణ ఇతివృత్తంగా వచ్చినవే. జాగృతి పోటీ కథల్లో సాధారణంగా భారతీయ సంస్కృతి, దేశభక్తి, నైతిక విలువలు, మానవీయ విలువలు, త్యాగశీలత, గృహస్థ జీవన ప్రాశస్త్యం వంటి ఇతివృత్తాలతో కథలు వ్రాయాలని సూచిస్తారు. పోటీని వచ్చిన కథల్లో బహుమతి కథల్లో కాక, మరికొన్ని మంచి కథలను సాధారణ సంచికల్లో ప్రచురిస్తారు.

రచయిత కథలకు జీవం వంటి శిల్పరీతులు ప్రత్యేక ప్రకరణంలో సవివరంగా చెపితే సమగ్రంగా ఉండేది. శిల్ప విశిష్టతను అనుసరించి కథల ప్రామాణికత ఉంటుంది.

ఐదు ప్రకరణాలకు అనుబంధంగా రచయిత మరో ఐదు అనుబంధాలను చేర్చాడు. మొదటి అనుబంధంలో జాగృతి ప్రారంభ సంచిక ముఖ చిత్రాన్ని, సంపాదకీయాన్ని చేర్చాడు. రెండో అనుబంధంలో జాగృతి రచయితలు, సంపాదకులతో జరిపిన ఇంటర్వ్యూలను ప్రచురిం చాడు. మూడో అనుబంధంలో కొంతమంది రచయితలు ఫోటోలు, జీవిత విశేషాలను వివరించాడు. నాల్గవ అను బంధంలో జాగృతిలో ప్రచురితమైన కొన్ని కథల చిత్రాలను చేర్చాడు. ఐదో అనుబంధంలో దశాబ్ది జాగృతి కథలు- వాటి రచయితల జాబితాను పేర్కొన్నాడు.

ఈ సిద్ధాంత గ్రంథం జాగృతి పత్రిక కథలపై పాఠకులకు అవగాహన కలిగిస్తుంది. మరో దశాబ్దం (2011-20) జాగృతి కథల పరిశోధ నకు ఆధారంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రచయిత గ్రంథాన్ని పఠనీయమైన శైలిలో రచించాడు. కథా రచన మీద ఆసక్తి ఉన్నవారు, కథా రచయితలుగా ఎదుగుతున్నవారు, పరిశోధకులు చదువదగిన గ్రంథం ‘జాగృతి కథలు – సమగ్ర పరిశీలన (2001-10)’.

జాగృతి కథలు – సమగ్ర పరిశీలన (2001-10)’ (సిద్ధాంత వ్యాసం)

రచయిత : డా।।శంకర్‌ అనంత్‌

‌వెల : రూ.300/-

ప్రచురణ : జాతీయ సాహిత్యపరిషత్‌,

‌భాగ్యనగర్‌ ‌శాఖ, తెలంగాణ

ప్రతులకు : రచయిత డోర్‌ ‌నెం – 12-5-91/101,

సాయినివాస్‌, ‌విజయపురి, తార్నాక, సికింద్రాబాద్‌ – 7. ‌

చిరునామా నుండి పొందవచ్చు.

– డా।।పి.వి.సుబ్బారావు

About Author

By editor

Twitter
Instagram