జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి జ్యేష్ఠ బహుళ తదియ – 08 ‌జూన్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


కొవిడ్‌ 19 ‌పాజిటివ్‌ ‌కేసులు మనదేశంలో రెండు లక్షలకు చేరుకున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌లను దేశం అధిగమించింది. మొన్నటిదాకా కొవిడ్‌ ‌కేసులలో పదో స్థానంలో ఉన్న మనం హఠాత్తుగా ఏడో స్థానానికి చేరుకున్నాం. ఇవి కలవరపెట్టే వార్తలు. మరణాల రేటు తక్కువే. అది మాత్రం సంతోషించదగ్గదే. కానీ పెరిగిపోతున్న కేసులు, పర్యవసానాల గురించి పట్టించుకుంటున్నవారు స్వల్పంగానే ఉన్నారని అనిపిస్తుంది. అదేదో కేంద్రం బాధ్యత అన్నట్టే కొన్ని పార్టీలు భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ సంగతి అలా ఉంచితే, ఐదో దశ లాక్‌డౌన్‌ ఆరంభమైంది. దీని ఉద్దేశం, లాక్‌డౌన్‌ ‌నుంచి దేశాన్ని సాధారణ పరిస్థితులలోకి తీసుకురావడం. ఇది దశల వారీగా జరిపించడం ఇందులో భాగం. ఇది మంచిదే. కానీ ఈ విషయంలో రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోతే వచ్చే సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇందుకు మంచి ఉదాహరణ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు. లాక్‌డౌన్‌ ‌నుంచి సడలింపు వచ్చిందన్న సాంత్వన, చిరకాలంగా వాయిదా పడుతున్న ప్రయాణాలకు అవకాశం వచ్చిందన్న తృప్తి సాధారణ ప్రజలకు లేకుండా పోయాయి.

ఐదో దశ లాక్‌డౌన్‌ ‌ప్రకారం రాష్ట్రాల మధ్య రాకపోకల మీద నిషేధం తొలగిపోయింది. కానీ తెలంగాణ నుంచి ఆంధప్రదేశ్‌ ‌వెళుతున్న ప్రయాణికుల అగచాట్ల గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే బాధ కలుగుతుంది. అది కూడా ఒక్కొక్క సరిహద్దు దగ్గర ఒక్కొక్క నిబంధన. కొన్నిచోట్ల ఈపాస్‌లు అడుగుతున్నారు. కొన్నిచోట్ల వివరాలు తీసుకుని పంపేస్తున్నారు. ఒకటిరెండు చోట్ల క్వారంటయిన్‌ ‌ముద్ర వేసి సాగనంపుతున్నారు. ఇంకొన్నిచోట్ల అసలు అనుమతించడం లేదు. ఇవన్నీ పత్రికలలో వచ్చిన విషయాలే.

ఇక్కడే ఒక ప్రశ్న. రైళ్లు తిరగడానికి కూడా నిర్ణయం జరిగింది. ఇక సరిహద్దులలో పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నవారిని నిరోధించడంలో అర్థం ఏముంది? రైళ్లను అనుమతించిన తరువాత ఇతర వాహనాలలో వచ్చిన వారిని కూడా అనుమతించవలసిన అవసరం లేదా? ఈ రెండు రకాల ప్రయాణాలు చేసి వచ్చిన వారికి సమానంగానే క్వారంటైన్‌ ‌సూచిస్తున్నారు కూడా.

దాదాపు రెండుమాసాలు తీవ్ర ఆంక్షల మధ్య ఉండిపోయిన ప్రజలు ఇప్పుడు స్వస్థలాకు వెళ్లాలని అనుకోవడం అసహజం కాదు. ఒకపక్క పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత ఎవరూ ఆగరు. అవసరాలు అలాంటివి కావచ్చు. ఢిల్లీలో కేసులు సంఖ్య అసాధారణంగా పెరిగిపోతున్నది. దీనితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సరిహద్దులు మూసివేశారు. ఈ చర్య పక్క రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్‌, ‌హరియాణాలకు ఆగ్రహం కలిగించింది. రాకపోకలకు అనుమతిస్తూ  కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది. దీనిని రాష్ట్రాలు అనుసరించాలి. ఇక్కడ కూడా రాజకీయాలంటే ఎలా? ఇది తాజా సంగతి. ఇంతకు ముందు జరిగిన సంఘటన లను కూడా గుర్తు చేసుకోవాలి. దేశంలో వలస కార్మికులను స్వస్థలాలకు తీసుకువెళ్లడానికి శ్రామిక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఎంత గందరగోళం జరిగింది? పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాష్ట్రానికి ఆ రైళ్లను అనుమతించ లేదు. అలాగే రాజస్తాన్‌ ‌కూడా వ్యవహరించింది. ఒకపక్క కాంగ్రెస్‌ అధిష్టానం వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని గగ్గోలు పెట్టింది. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందుకు భిన్నమైన విధానం అవలంబించారు.

ఈ విషయంలో బీజేపీయేతర పార్టీల వైఖరి అత్యంత వివాదాస్పదంగానే ఉంది. అంతిమంగా దీని ప్రభావం పడేది సామాన్య ప్రజల మీదే. ఇక్కట్లు పాలయ్యేది వారే. లాక్‌డౌన్‌ ‌ప్రకటనలకు సంబంధించి కేంద్రం ప్రతిసారి రాష్ట్రాలను సంప్రతించింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఆ నిర్ణయాన్ని అమలు చేసే సమయంలో రాష్ట్రాలలో ఎందుకు తలెత్తుతున్నాయి? ఎందుకంటే రాజకీయమనే సమాధానం వస్తుంది. ప్రధాని మోదీ చెప్పినట్టు కరోనా మీద పోరు మూడో ప్రపంచ యుద్ధానికి తీసిపోదు. ఇందులో నెగ్గాలంటే భారత్‌ ‌వంటి దేశంలో సయోధ్యతోనే వీలువుతుంది. కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం ప్రకటిస్తే దానికి సవరణలు సూచించడమో, లేదంటే వంకలు పెట్టడమో ధ్యేయంగా వ్యవహరించడం సరికాదు. రెండు నెలల సుదీర్ఘ స్వచ్ఛంద నిర్బంధం తరువాత స్వేచ్ఛను పొందిన పౌరులను నిరాశ పరచడం ఏ పార్టీకీ, ఏ ప్రభుత్వానికీ కూడా మంచిది కాదు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram