తాలిబన్‌లో మార్పు సాధ్యమా?

మే 19వ తేదీన ప్రధానంగా జాతీయ మీడియాలో వచ్చిన ఒక వార్త గట్టి కుదుపు వంటిది. ఎందుకంటే, కశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్భాగమని తాలిబన్‌ ‌చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త అది. ఉగ్రవాద రహిత కశ్మీర్‌ అన్న భారత్‌ ‌తాజా ఆకాంక్షకు ఇది శుభ సూచకంగా కనిపించినా, దీని వెనుక మర్మం లోతయినది. ఈ క్షణంలోనే తీర్పు చెప్పేది కాదు. భారత్‌ ‌మీద పాకిస్తాన్‌ ‘‌పవిత్ర యుద్ధానికి తాలిబన్‌ ‌మద్దతు లేదనీ, కశ్మీర్‌ అం‌శం భారత్‌ అం‌తర్గతమనీ తాలిబన్‌ అధికార ప్రతినిధి చేసిన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఇలాంటి ట్వీట్‌ అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇస్లామిక్‌ ఎమిరేట్‌కీ, భారత్‌కీ స్నేహసంబంధాలు సాధ్యం కాదంటూ తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహేల్‌ ‌షాహీన్‌, ‌జబియుల్లా ముజాహిద్‌ల పేరిట వెలువడిన ఒక నకిలీ ట్వీట్‌కు సమాధానం ఇవ్వవలసి రావడమే ఇందుకు కారణం.

అఫ్ఘానిస్తాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అం‌టే తాలిబన్‌ అధికార వ్యవస్థ ఇతర దేశాల అంతర్గత వ్యహారాలలో జోక్యం చేసుకోదని, ఇదే ఎమిరేట్‌ ‌విధానమని కూడా ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేయడం గమనించాలి. గమనించవలసిన మరొక అంశం కూడా ఉంది. అఫ్ఘానిస్తాన్‌ ‌విషయంలో భారత్‌ ‘‌ప్రతికూల పాత్ర’ పోషిస్తున్నదనీ, సౌత్‌ ‌బ్లాక్‌ (‌రక్షణ వ్యవహారాల శాఖ) తాలిబన్‌ను ఇప్పటికీ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తున్నదనీ కతార్‌లోని తాలిబన్‌ ‌రాజకీయ వ్యవహారాల కార్యాలయం ఉప నాయకుడు షేర్‌ ‌మహమ్మద్‌ అబ్బాస్‌ ఇటీవలనే నిరసన గళం వినిపించి నప్పటికీ సుహేల్‌ ‌షాహీన్‌ ‌భారత్‌ అం‌తర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోబోమని చెప్పడం పెద్ద మలుపుగానే ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ తాలిబన్‌ ‌గతం తెలిసినదే కాబట్టి ఈ పరిణామాన్ని తొందరపడి విశ్లేషించే సాహసం వారు చేయలేక పోతున్నారన్నది నిజం.
ఈ పరిణామం గురించి భారత విదేశ వ్యవహారాల శాఖ ఆచి తూచి అడుగు వేయదలచినట్టు కనిపిస్తున్నది. తాలిబన్‌ అధికార ప్రతినిధి వ్యాఖ్య మీద ఇప్పటి వరకు స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం. తాలిబన్‌ ఇలాంటి ఒక విధానం వైపు మొగ్గు చూపడం వెనుక కారణం లేకపోలేదని వార్తలు వచ్చాయి. అఫ్ఘానిస్తాన్‌లో శాంతిని నెలకొల్ప డంలో భారత్‌ ‌కీలక పాత్ర పోషించగలదని వారు భావిస్తున్నారు. సుహేల్‌ ‌వివరణకు ఒక రోజు ముందు వచ్చిన ట్వీట్‌ ‌కారణంగా ఇప్పుడు ఈ వైఖరిని చెప్పినప్పటికీ, మే ఆరంభంలోనే ఒక భారత పత్రికతో మాట్లాడినప్పుడు కూడా అధికార ప్రతినిధి ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. మా జాతీయ ప్రయోజనాలు, పరస్పర ప్రయోజనాల గుర్తింపు ప్రాతిపదికలుగా భారత్‌ ‌సహా ఇరుగు పొరుగుతో సత్సంబంధాలనే మేం కోరుకుంటాం. భవిష్యత్తులో అఫ్ఘాన్‌ ‌పునర్‌ ‌నిర్మాణంలో, సహకారంలో భారత్‌ను స్వాగతిస్తా మని చెప్పారు. 2019 ఆగస్టులో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని, అక్కడ వలసలు, ఆస్తులకు సంబంధించిన 35ఎ నిబంధన ఎత్తివేసినప్పుడు కూడా అఫ్ఘాన్‌కు, కశ్మీర్‌ ‌సమస్యకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌ ‌ప్రతినిధులు చెప్పడం మరొక అంశం. అఫ్ఘానిస్తాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అం‌టే జాతీయ ఇస్లాం ఉద్యమం. ఇది ఆక్రమణకు గురైన సొంత దేశం గురించి పోరాడుతున్నది. ఇంతకు మించిన ఎజెండా ఏదీ మాకు లేదు అని కూడా స్పష్టం చేశారు.
తాలిబన్‌ అమెరికాతో ఒప్పందానికి వచ్చిన తరువాత కూడా, మాలో మార్పు వచ్చింది చూడండి అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఆ రెండు వర్గాల మధ్య ఫిబ్రవరి 29న ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి అఫ్ఘాన్‌తో భారత్‌ ‌కూడా చర్చించాలని అమెరికా కోరిక. అంటే, తాలిబన్‌, ‌భారత్‌ ‌సంబంధాలలో కొత్త అధ్యాయం మొదలు కావాలన్నదే ఆయన ఉద్దేశం. మే రెండో వారంలోనే అఫ్ఘాన్‌లో అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్షాద్‌ ‌భారత్‌ ‌వచ్చారు. అమెరికా-తాలిబన్‌ ఒప్పందం తరువాత ఆయన భారత్‌ ‌రావడం అదే మొదటిసారి. నిజానికి మే 18న సుహేల్‌తో పాటే అఫ్ఘాన్‌ ‌విదేశ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గ్రాన్‌ ‌హెవాద్‌ ‌కూడా భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అఫ్ఘాన్‌కు పెద్దఎత్తున సాయం చేస్తున్న దేశాలలో భారత్‌ ఒకటనీ, అఫ్ఘాన్‌ అభివృద్ధి, పునర్‌ ‌నిర్మాణాలలో ఆ దేశం సహకరిస్తున్నదని ఆయన అన్నారు. అఫ్ఘాన్‌లో శాంతిని నెలకొల్పే పక్రియలో భారత్‌ ‌కీలకంగా ఉండగలదని హెవాద్‌ ‌కూడా పేర్కొన్నారు. హెరాత్‌ ‌దగ్గర ఒక డ్యామ్‌ను నిర్మించడంలోను, కాబూల్‌లో పార్లమెంటు భవనం నిర్మాణంలోను భారత్‌ అఫ్ఘాన్‌కు సహకరిస్తున్నది.
అమెరికా అవసరాలు అమెరికాకు ఉన్నాయి. ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం అమెరికా అఫ్ఘాన్‌లో ప్రవేశించింది. కాలం గడిచే కొద్దీ ఈ చర్య అమెరికాకు ముందు నుయ్యి వెనక గొయ్యి తీరుగా అయిపోయింది. ఇక్కడ సైన్యం వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశంగా అవతరించింది. మొత్తంగా పరిశీలిస్తే అఫ్ఘాన్‌ అం‌శం అమెరికాకు పెనుభారంగా మారింది. అక్కడ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకువస్తామని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. పదవీకాలం పూర్తి కావస్తున్నది. కానీ ఆ హామీ నెరవేర్చుకునే అవకాశం చిక్కలేదు. తాలిబన్‌తో తాము ఒప్పందం చేసుకున్నాం కాబట్టి, తమకు సన్నిహితంగా ఉన్న భారత్‌ ‌కూడా వారితో సఖ్యంగా ఉండాలని ట్రంప్‌ ఆశపడుతున్నారు. కానీ అమెరికా అభిమతాన్ని ఆగమేఘాల మీద నెరవేర్చే అవకాశం భారత్‌కు ఏమాత్రం లేదు. ఇంతకీ తాలిబన్‌ ‌లేదా అఫ్ఘానిస్తాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆ ‌దేశంలో ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థ ఏమీ కాదు. రాజకీయ పక్రియకు ప్రతీక కాదు. దేశంలో మూడొంతులు ఆ సంస్థ అధీనంలో ఉన్న మాట మాత్రం నిజం. దీనికి తోడు నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు దాదాపు ప్రహసనంగా ముగిశాయి. ఇద్దరు ప్రత్యర్థులు తాను దేశాధ్యక్షుడినంటే, కాదు తానేనని వీధిన పడ్డారు. ఇది తాలిబన్‌కు లాభించింది.
భారత్‌ ‌దృష్టికోణం నుంచి చూస్తే, పాతిక సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో పాకిస్తాన్‌తో కలసి తాలిబన్‌ ‌కూడా రక్తపాతం సృష్టించిన మాట మరచిపోవడం కష్టం. విమానాన్ని హైజాక్‌ ‌చేసి ఖైదీలను విడిపించుకున్న ఘనత కూడా వీరికి ఉంది. అందుకే భారత్‌ ‌ట్రంప్‌ ‌చెప్పినా కూడా అంతగా ఆచి తూచి వ్యవహరిస్తున్నది. ఉగ్రవాదులను నెత్తిన పెట్టుకుని అమెరికా, అంతకంటే ముందు పాకిస్తాన్‌ ఎలాంటి ఫలితాలను అనుభవిస్తున్నాయో తెలిసిన తరువాత కూడా భారత్‌ ఆ ‌పని చేయడం కష్టం. అఫ్ఘాన్‌ను ఆక్రమించిన సోవియెట్‌ ‌రష్యాను నిలువరించడానికి అమెరికా తయారు చేసిన ప్రతికూల వ్యూహంలో భాగం తాలిబన్‌. ‌మరొక నిజం కూడా ఉంది. అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌బలంగా ఉన్నారు. కానీ అక్కడ తాలిబన్‌ ‌మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలు నెరపడం లేదు. ఇంకా కొన్ని సంస్థలు కూడా అదే పనిలో ఉన్నాయి. తాలిబన్‌ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కొద్దికాలం అదేమిటో అక్కడి ప్రజలు రుచి చూశారు. తాలిబన్‌ ఆధిపత్యం కింద మిగిలిన ఉగ్రవాద సంస్థల వైఖరి ఎలా ఉండబోతున్నదో మాత్రం ఇప్పుడే తెలియదు. ఇప్పుడున్న సంక్షుభిత స్థితి పునరావృత్తం కాబోదని ఎవరూ చెప్పలేరు. అప్పుడు అంతర్జాతీయంగా వచ్చే విమర్శలలో తాలిబన్‌తో సయోధ్య నెరపిన దేశంగా భారత్‌ ‌పేరు వినపడుతుంది. ఇది మంచిది కాదు. అఫ్ఘాన్‌ ‌చిచ్చుకు సోవియెట్‌ ‌రష్యా, ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో నాడు ఆ కమ్యూనిస్టు బ్లాక్‌తో తలపడిన అమెరికాలే కారణమని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. చరిత్ర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చరిత్ర కూడా ఎవరి పాత్రనూ దాచి పెట్టదు. ఇంతకీ కశ్మీర్‌ ‌భారత్‌లో అంతర్భాగమని ట్రంప్‌ ‌చెప్పిన మాటనే తాలిబన్‌ ‌వల్లించడం లేదని చెప్పగలమా? ఎవరిని నమ్మడం?
ఈ నేపథ్యంలో అఫ్ఘాన్‌తో ఆచి తూచి వ్యవహరించాలన్న భారత్‌ ‌వైఖరి శాస్త్రీయంగా కనిపిస్తుంది. అమెరికా చెప్పిందని తాలిబన్‌తో సర్దుపోవడమనే ఆలోచన ఆత్మహత్యాసదృశం అవుతుంది. అమెరికా వైదొలిగిన తరువాత తాలిబన్‌ ఎలా ఉంటారు? పాకిస్తాన్‌ ‌ప్రభావం వారి మీద ఎలా ఉంటుంది? తాలిబన్‌, ఇతర ఉగ్రవాద సంస్థలకు ఇప్పటికీ మార్గదర్శి పాకిస్తాన్‌ ఇం‌టర్‌ ‌సర్వీసెస్‌ ఇం‌టెలిజెన్స్. ఇది దాచేస్తే దాగని సత్యం. తాము ఏ దేశానికీ పరోక్షంగా పోరాడే సేనలం కాబోమని తాలిబన్‌ అధికార ప్రతినిధి ప్రకటించి ఉండవచ్చు. అది పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నదే కూడా. అలా అని అమెరికా సలహా మేరకు తాలిబన్‌తో భారత్‌ ‌సర్దుకుపోతే, అది పాకిస్తాన్‌కు కొత్త ఆయుధం ఇచ్చినట్టే. భారత్‌ ‌మీద పరోక్ష దాడిని పాకిస్తాన్‌ ‌పెంచుతుంది. తాలిబన్‌తో భారత్‌ ‌సర్దుకుపోయిందన్న మాట పాకిస్తాన్‌కు ఎలానూ రుచించదు. ఆ దేశ సైన్యం, ప్రజలు మాత్రమే కాదు, ఖబర్‌స్తాన్‌లలో ఉన్న ఆ దేశ మాజీ పాలకుల ఆత్మలు కూడా మండిపడతాయి. పాకిస్తాన్‌ ఇష్టానిష్టాలు ఎలా ఉన్నా, భారతీయులకు కూడా ఆ పరిణామం రుచించేది కాదు. అదొక చేదు అనుభవంగానే ఉండిపోతుంది. ఇంకా చెప్పాలంటే, తాలిబన్‌, ‌భారత్‌ ‌కలసి పనిచేయడమనే పరిణామం చోటు చేసుకోరాదన్న అభిమతానికి అప్పుడే అతి పెద్ద అభిమానగణమే తయారయినట్టు కనిపిస్తున్నది. లేకపోతే, భారత్‌-అఫ్ఘాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ‌సయోధ్య అసాధ్యమని ముందే చాటుతున్న ఆ ట్వీట్‌ ‌లోకం మీద అలా ఉరుములేని పిడుగులా ఎందుకు విరుచుకు పడుతుంది? ఈ ట్వీట్‌ ‌వెనుక పాకిస్తాన్‌ ‌లేదని కూడా అనలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *