‘‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’’లో, దక్షిణ భారత భాషాపదాల ఆధారంగానే ఆంగ్లంలో మ్యాంగో వచ్చిందంటారు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన ‘మామిడిపండు’ అనే వ్యాసంలో దాని పుట్టు పూర్వోత్తరాలు చరిత్రను వివరిస్తూ పూర్వ హైదరాబాదు ప్రాంతంలో దాదాపు పాతిక వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉండేవని పేర్కొన్నారు.
మామిడి పండ్లు వచ్చేది ఎందుకంటే జీవితం కాసింత రసభరితం చేసుకొండయ్యా అని గుర్తు చేయడానికి, ఉదయాన అల్పాహారానికి కూర్చుని చద్దన్నంలో మామిడిరసం జుర్రుకుంటూ, వేడి వేడి పూరీలను మామిడిరసంలో ముంచుకుంటూ, సువర్ణ కాంతిలో మెరిసే మామిడి ముక్కలు మెరుపులతో ముఖాన్ని శోభిస్తూ, జిహ్వకు స్వర్గం అందడం అంటే ఏమిటో అనుభవిస్తూ బ్రతుకును కాస్త రుచిమధురం చేసుకోమని చెప్తుంది. లోకాన మంచి కానీ, మామిడి రుచిగాని బహుకొద్ది. అందువలన దొరికిన ప్రతీ లిప్తను జుర్రుకోమంటుంది కాలం.
మామిడికాయలే కాదు, మామిడి ఆకులు శుభానికి, శ్రేయస్సుకు, ఆనందానికి శక్తిమంతమైన చిహ్నాలు. వీటిని చూడపత్రం అని పిలుస్తారు. తెలుగు సంస్కృతిలో ఉగాది, వివాహాలు లేదా గృహప్రవేశాలు వంటి ఏ శుభకార్యమైనా ప్రధాన ద్వారానికి మామిడితోరణం కట్టడంతో ప్రారంభిస్తాం. అవి లక్ష్మీదేవికి, సంతానోత్పత్తికి ఎదుగుదలకు, సంవృద్దికి ప్రతీకలు అలాగే మామిడి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు కాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని నిపుణులు కనుగొన్నారు. పాదాల పగుళ్లు, కడుపులో పురుగులు, చెవినొప్పి, కంటినొప్పి, దంత సంబంధ వ్యాధులను అదుపు చేసే గుణం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
పిందె నుండి పండు వరకూ మామిడి రుచే వేరు. ఆ పండ్లను చిన్నా పెద్దా అంతా ఆస్వాదిస్తారు. అయితే వీటిని వెరైటీగా కూడా తినవచ్చును. మామిడి తాండ్ర, మామిడి పాల్దా, మామిడి ఊరగాయ, రకరకాల పచ్చళ్లుగా తయారు చేసుకోవచ్చును. మాంగోజ్యూస్ రుచి సరేసరి.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ఓ రైతు, ఒకే మామిడి చెట్టుకు 14 రకాల మామిడి పండ్లను పండిస్తున్నాడు. దిటాలా గ్రామానికి చెందిన ఉకాబాయ్ బట్టీ ఇంటి పెరడులో ఓ దేశీయ మామిడి చెట్టు ఉన్నది. దానికి పలురకాల మామిడి పండ్లను పండించాలనుకున్నాడు.
సంగారెడ్డి జిల్లాలోని కొండా లక్ష్మణ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఫల పరిశోధన స్థానంలో మేంగోమేళా నిర్వహించారు. ఇందులో సుమారు 300 రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు.
వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్ మొత్తం మామిడి పండ్ల సువాసనతో నిండిపోతుంది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది మామిడి పండును ‘‘పండ్లరాజు’’ అని పిలుస్తారు. తియ్యటి రుచి, రసంతో నిండిన మామిడి కేవలం రుచికేకాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలను ఈ ఒక్క పండు అంది స్తుంది. మామిడిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండులో విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సంవృద్ధిగా వుండి, ఇతర శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ -సి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేవారికి మామిడి ఎంతో మేలు చేస్తుంది.
ఒకరోజు బహదూర్‌షా జాఫర్‌తో కలిసి మీర్జాగాలిబ్ మామిడితోటకు షికారు కెళ్లారు. అది విరగకాసి ఉంది. మీర్జా గాలిబ్ ప్రతీ పండును కళ్లు చికిలించి చూస్తున్నాడు ‘ఏమిటయ్యా మీర్జా అలా చూస్తున్నావు?’ అని జాఫర్ అడిగాడట. ‘జహాపనా! ప్రతి పండు మీద తినేవాడి పేరు ఉంటుందని అంటారు. నా పేరు రాసిన పండ్లు ఏవైనా ఉన్నా యేమో అని వెతుకుతున్నా’ అన్నాడు జాఫర్ నవ్వి ఆ సాయంత్రం బుట్టలతో మీర్జా ఇంటికి పండ్లు పంపాడు.
బాబర్ ఇండియా మీదికి దండెత్తి వచ్చాక ‘నేను నా నేలను తిన్న తియ్యని ద్రాక్ష ఏదీ, ఆ మధుర కర్బూజా ఫలమెక్కడ? అని అడిగాడట, అవి ఇక్కడ దొర కవు కాబట్టి మామిడి పండు కోసిపెట్టారట. ‘సరైన మామిడి పండు దొరకాలే కాని దాని అబ్బలాంటి కాయ మరేదీ లేదని’ బాబార్ నామాలో రాసుకున్నాడు. నూర్జహాన్ పేరున ఓ మామిడి నమోదైంది. అక్బర్ మామిడికి దాసుడు బిహార్‌లో దర్భంగా దగ్గర లక్షమామిడి చెట్లతో తోట వేయించాడు. దాని పేరు ‘లఖీబాగ్’. మొగలుల దగ్గర పని జరగాలంటే మామిడి పండ్ల బుట్ట ఇస్తే సరి. అమీర్ ఖుస్రో మామిడికి ఫఖర్-ఏ-గుల్షన్ తోటలకు గర్వకారణం అని కీర్తించాడు. కర్నూల్ జిల్లా బనగాని పల్లెలో నవాబులు తమ మామిడి తోటలన్నీ శోధించి శ్రేష్టమైనా ‘బేనిషాన్’ వెరైటీని వృద్ధిచేసి రైతులకు మొక్కలు పంచాడు. నేడు మనం తినే బంగినిపల్లె అదే.
మామిడి భారత్‌దే. దీనికి ఆరువేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈశాన్య భారతంలో పుట్టి బౌద్ద సన్యాసుల వల్ల, పర్షియన్ (ఇరాన్) వర్తకుల వల్ల, పోర్చుగీసు వారివల్ల ప్రపంచానికి పాకింది. వేదాల్లో ‘‘ఆమ్ర’’ అని ప్రస్తావన వుంది. భూమిని చుట్ట డానికి బదులు తన చుట్టూ తిరిగిన వినాయకునికి మామిడి పండును బహుమతిగా ఇచ్చాడట శివుడు, అంటే అది జ్ఞానఫలం. బుద్దునికి ఆమ్రపాలి తన మామిడి తోటను దానం చేయడం విదితమే. జైన మహావీరుడు 30 ఏళ్ల వయస్సులో ఇల్లు వదిలి ‘‘జ్ఞాన ఖండవనం’’ అనే మామిడి తోటలో దీక్ష తీసుకున్నాడు. రాయలవారి తల్లికి బంగారు మామిడి పండ్లు దానం చేయాలని ఉండేదట అది తీరక పోయేసరికి ‘ప్రాయశ్చిత్తంగా బంగారు మామిడి పండ్లు ఇస్తేనే స్వర్గ ప్రాప్తి’ అని హఠాయించిన వారికి తెనాలి రామలింగడు కాల్చిన ఇనుప కడ్డీతో వాతలు వేశాడని జనశ్రుతి. రాయల వారే స్వయంగా తోటలు పెంచార••. ఆముక్తమాల్యదలో మామిడి చివురు ప్రస్తావన ఉంది.
హంపీలోని సుప్రసిద్ద విరూపాక్ష దేవాలయం వెనుక శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి పురాతనమైన మామిడి తోటలున్నాయి. వీటిని ప్రత్యేకంగా కోతుల బెడదను అరికట్టడానికి అప్పట్లో ‘కోతిమాన్య’గా పిలిచిన ఈ తోట నేటికీ ఉంది. 20కి పైగా భారీ మామిడి చెట్లు నేటికీ ఉన్నాయి.
ఉర్దూ కవి గాలిబ్‌కు మామిడి పళ్లంటే చాలా ఇష్టం. తన మిత్రునికి మామిడి పళ్లంటే నచ్చేది కాదు. ఒకరోజు ఇద్దరూ కలిసి నడుస్తుంటే ఓ గాడిద మామిడి వాసన చూసి వదిలేసిందట. వెంటనే గాలిబ్ మిత్రుడు అన్నాడట. గాలీబ్ గాడిదలు పండ్లు తినడం లేదు అని. అందుకు గాలిబ్ అన్నాడట, గాడిదలే మామిడి పళ్లు తినవని, తెలుగు సాహిత్యంలో మామిడిచెట్టు సారవంతానికి మాధుర్యానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రగాఢమైన ప్రతీక. యవ్వనంలో పచ్చికాయ పులుపు నుండి వృద్దాప్యంలో పండిన పండు తీపి జ్ఞానానికి ప్రతీక. ఇది తరచుగా జీవిత దశలకు ప్రతీకగా కన్పిస్తుంది.
మామిడిచెట్టు మీద తెలుగు సినిమాలో ఎన్నో పాటలు వచ్చాయి. గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి. ఒక గూటిలో రామచిలకుంది, ఒక గూటిలో కోయలుంది అని ఆత్రేయ రాయగా ‘మావి చిగురు తినగానే – కోయిల పలికేనా, కోయల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా’ ఏది ముందు జరిగిందాని దేవులపల్లి వారు ప్రశ్నించారు. మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే. మాటలు రాని కోయలమ్మ పాడును లే… అంటూ ఆశలు రేకెత్తించారు దాశరధి. మావిచిగురు తిని మీకు శుభమని మేలు కొలిపేను గండు కోయల అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పలికారు. ఇలా ఎంతో సాహిత్యం ఉంది.
సంస్కృతంలో ఆమ్రము, చూతము, రసాలము, సహకారము, హిందీ, ఉర్దూలో ఆమ్ తమిళ, కర్ణాటక భాషల్లో మాంగాయి, యనియు, మావికాయ, మాగాయ. ఫ్రెంచ్, పోర్చుగీసు, ఇంగ్లీషువారు దక్షిణంలోని రేవులలో నిలిచిపోయినప్పుడు మన మాగాయే పోర్చుగీసు వారు మాంగే అని, ఇంగ్లీషు వారు మాంగో అని పిలిచారు. మామిడి యురోప్ దేశాలలో పెరగదు. ఇరాన్, అరేబియా, ఈజిప్టులలో ఈ వృక్షం పెరగదు.
మనదేశంలో వేయికి పైగా మామిడి వెరైటీలున్నాయి. అల్పోన్సో, తోతాపూరి, బేనిషాన్, దశహరి, కేసర్, హిమాం పసంద్, రసాలు, చెరుకురసం, పంచదారకల్తీ, నూజివీడు రసాలు, ఇలా ఎన్నో రకాలు దేని రుచి దానిదే
భారత్ నుండి సుదూర ప్రాంతమైన అమెరికాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మామిడిపండ్లను చేర్చటంలో సియాటిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రకాశ్ గుప్తా అత్యంత కీలక పాత్రను పోషించారు. ఈ మొత్తం సరఫరా పక్రియను మాంగో డిప్లమసీ మామిడిదౌత్యంగా పేర్కొన్నారు.
నంద్యాల జిల్లాకు చెందిన మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తన పొలంలో జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఖరీదైన మిరాయా జాకీ మామిడి రకంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 20 రకాల మామిడి మొక్కలను సాగు చేస్తున్నారు. తన పొలాన్ని ఒక ప్రయోగ క్షేత్రంగా మార్చి, విభిన్న రకాల మామిడిసాగు చేస్తున్నారు. మియాజాకీ మామిడి పండ్లను బాంగ్లాదేశ్‌లో కిలో లక్ష రూపాయల వరకూ పలికింది. ఆయన ‘‘రెడ్ ఐవరీ’’ రకం మామిడిని పండించారు. మామిడికాయ కేజీన్నర బరువుం టుంది. దాని టెంకమాత్రం 30 గ్రాములే ఉంటుంది. అట్కిన్స్ రకం మామిడి డయాబెటిక్ పేషంట్ల కోసం పండిస్తున్నారు. ఎక్కువ తియ్యగా వుండే ‘‘హనీడ్యూ’’ రకాన్ని కూడా పండిస్తున్నారు. అమెరికన్ పాలిమర్, సెన్సేషన్ రకాలను కూడా ఆయన పండిస్తున్నారు.
హైదరాబాదులో నవాబ్ ముఖరబ్‌జంగ్, అజమలీఖాన్ అనే వారు మామిడి తోటలను అభివృద్ధి చేశారు. వారిలో అజమలీ ఖాన్ కనిపెట్టిన అజమస్సర్ జాతిపండు ప్రసిద్ధి కెక్కింది. అజమలీ తోట పండ్లను విక్టోరియా రాణికి, 7వ ఎడ్వర్డు రాజుకు, ఆఫ్గన్ అమీరైన అబ్దుల్ రెహమాన్‌కు పంపారట.
మంచిజాతి మామిడిపండ్లకు నాటి పాలకుల పేరిడిరి. ‘‘సూరెబెహిప్త్’’ అని పార్శీ వారన్నారు అంటే స్వర్గంలోని ఫలమని అర్థం. తైమూరీ అనే ఫలం తైమూర్ లంగడా పేరున వచ్చినది, జహంగీర్, నూర్జహాన్, ఇలా అనేక జాతుల మామిడి పండ్లకు వారి పేరు పెట్టారు.
పూర్వం ఒక పర్ష్యా సర్దారు హిందూస్థాన్‌కు వచ్చి మామిడి పండ్లను రుచి చూసి తన దేశానికి. ఇరాన్ పాదుషా ఏమి విశేషాలు అని అడుగగా మామిడి రుచిని వర్ణించాడు కాని, అర్థం కాలేదు వెంటనే తేనె తెప్పించి ఒకరి పెద్దగెడ్డమునకు పూసి దానిని నాకిన కొంత కొంత మామిడి రుచి యర్థమగునని తెలిపెనట.
ఈజిప్టులో మామిడిని ‘‘అమ్మన్‌రా’’ అని పిలుస్తారు. ఈజిప్టులో ఇద్దరు దేవుళ్లకు తగాదా రాగా అమ్మన్‌రా వారి తగాదా తీర్చాడట, వారు హిందూస్తాన్‌కు వచ్చి మామిడి పండుకొని రా దేవునకు బహుమానంగా ఇచ్చారట, నాటి నుండి ఆ పండును అమ్మన్‌రా అని పిలుస్తున్నారట.
మామిడి పండ్లలో చిన్న నిమ్మకాయ సైజు నుంచి చిన్న గుమ్మడికాయ సైజు వరకూ ఉంటాయి. ఇవి రెండు రకాలు పీచు రసం కలిగినవి, కండ కలిగినవి. రంగుల విషయానికొస్తే ఎర్రనివి, ఆకు పచ్చనివి, పసుపు వన్నె కలవు. శ్రీ కరణి అను పేర మామిడి పండు రసముతో కలిపి సిద్దము చేయు దానిని శ్రీ కరిణి యందురు. రసాల దద్నం అని రత్నావళి అనే సంస్కృత నాటకంలో వర్ణించినారు.
‘‘మామిడి కాయల పండుగ’’ గురించి చాలామందికి తెలియదు. మామిడి సీజన్ ప్రారంభం కాగానే జరుపుకునేది ఈ పండుగ అరకు, పాడేరు, చింతపల్లి, రంప చోడవరం, సీతంపేట బుట్టాయగూడెం, పోలవరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కొండరెడ్లు, భగత, కొండదొర, వాల్మీకి, మాలి, సవర తదితర తెగలవారు మొదటిపండును దుర్గమ్మకు పెడతారు, తరువాతే వారు తింటారు.
ప్రపంచ మామిడి ఉత్పత్తిలో భారత్ సుమారు 45 శాతం వాటాతో అగ్రస్థానంలో వున్నది. అనేకాని 5 శాతం మించి ఎగుమతి చేయలేకపోతున్నాం. మనకన్నా మెక్సికో, థాయ్‌లాండ్, పెరూ, బ్రెజిల్ వంటి దేశాలే ప్రపంచ మార్కెట్‌లో మెరుగ్గా నిలుస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్దం పుణ్యమాని పశ్చిమాసియా మార్కెట్లో గిరాకీ లేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు