భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
రోహిణీ కార్తె ఎండలు, ఉడుకులు, నీరసాలు… ఆనవాయితీగా నా భార్య వేసవి సెలవులకి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. లీవు దొరకకపోవడం వల్ల నాకు కుదరలేదు. తిరిగి వచ్చేటప్పుడు ఆవకాయ లాంటివి లగేజీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అప్పటికి వెళదామని అనుకుంటున్నాను. నాకు చేతనైనదేదో వండుకుతింటూ గడుపుతున్నాను.
ఆదివారం అవడం వల్ల లేచేసరికి ఉదయం ఎనిమిది. అంతలోనే పాలవాడు, పనిమనిషి వాళ్ల వాళ్ల కర్తవ్యాలు నిర్వర్తించి వెళ్లేసరికి పూర్తిగా తొమ్మిది. కప్పులో కాచిన పాలు, కాఫీ పౌడరు కలుపుకొని, టీవీ, ఫ్యాన్ స్వీచ్లు వేసుకొని కప్పు మూతికి అందిస్తున్నానోలేదో, సరిగ్గా అదే టైముకి మా పక్క ఇంట్లోంచి కేక. ఆయనా మా ఆఫీస్ ఆయనేలెండి, ‘‘ఇంట్లో ఉన్నావా? ఇలా బయటకు రా ఒకసారి’’.
హడావిడి చూస్తే ఏదో కొంపలు మునిగి ఉంటాయి అనుకుంటూ చేతిలో కప్పుతోనే బయటకు నడిచాను. నాలుగు అడుగుల గోడకి ఇటు నేను అటు ఆయన.
‘‘మన ఆఫీస్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు రిలీజయ్యాయట, తెలిసిందా వార్త ?’’ అదీ విషయం.
‘‘నాకు తెలియలేదండీ, చెప్పండి ! చెప్పండి ! నేను కొత్త బాసు దగ్గరకు వెళుతున్నానా? మనకి కొత్త బాసు ఎవరైనా వస్తున్నారా?’’ ఆతృతగా అడిగాను, మొత్తానికి సవివరంగా వివరాలు తెలిశాయి. నా పేరు లేదని నాకూ, తన పేరు ఉందని ఆయనకు, వెరశి ఇద్దరికీ కూతంత సేపు నిరాశ. ఇంత నిరాశా నిస్పృహలోనే ఫోన్ల ద్వారా వార్త దావానంలా వ్యాపించి, పావుగంటలోనే అయిదారుగురు సహాఉద్యోగులు అంతా ఇక్కడికే ప్రత్యక్షమయ్యారు. ఏదో అంతా మా చేతుల్లోనే ఉన్నట్లుగా, గతం నుండి రాబోయే సంవత్సరాల వరకు బదిలీలపై చర్చ, జరిగిన న్యాయాన్యాయాలు, ప్రాంతీయ పక్షపాత ధోరణులు, కాలక్షేపం కబుర్లు, మధ్యమధ్యలో ఫోన్లు, కాఫీలు అలా అలా గడిచిపోయింది ఆ పూటంతా. వీ•న్నింటికీ అసలు కారణం చాలా మందికి వేసవి సెలవులు కారణంగా భార్యపిల్లలిక్కడ లేరు. వాళ్లూ నాలాగే.
నెమ్మదిగా ఆకలి మొదలై టైం చూసుకునే సరికి ఒంటిగంట. అందరం ఎవరికివారే యమునాతీరే అయ్యి, ఖాళీ కప్పులు సింకులో పెట్టి, ఏమిటి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అనుకుంటూండగానే కొట్టింది మా గంటల గడియారం రెండు దెబ్బలు. అన్నంలోకి ఏముందో చూద్దామని తలుపుతీస్తే, పెరుగు కోసం సరే, ఇకదేనికీ నా మీద ఆధారపడవలసిన అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేసింది మా ఫ్రిజ్. అలాంటప్పుడే కదా ! దీనజనుల్ని ఆదుకునే ఆపద్భాందవి ఆవకాయ జాడీ•ని ఆశ్రయించేది, అని్ఞ ప్తికి వచ్చింది నాకు.
చకచకా అన్నం కుక్కర్ పెట్టేశాను, స్నానానికి అలా వెళ్లాను, ఇలా వచ్చాను. దేవుడికేసి దీనంగా ప్లీజ్ అన్నట్లు చూసి, ఖంగారు ఖంగారుగా మూడు దణ్ణాలు పెట్టేసి, పూజ కూడా అయ్యిందనిపించాను. అంతలోనే మీల్స్రడీ.. మీల్స్రడీ…. మీల్స్ రడీ.. అన్నట్టుగా మూడు కూతలు కూసేసింది మా అన్నపూర్ణాదేవీ అవతారం కుక్కర్. కంచం, మంచినీళ్లు పెట్టుకున్నాను. పెరుగు రడీ చేశా, అన్నం వడ్డించేశా, సీలింగ్ ఫ్యాన్ స్వీచ్ కూడా వేసేశా.
ఇక్కడ ఒక విషయం, అదేమిటంటే నిలవకోసం శుచి శుభ్రత కలిగిన అలమారలో ప్రత్యేకస్థానంలో మూలవిరాట్ లాగ ‘‘పెద్ద అవకాయ జాడి’’, నిత్య అవసరాల కోసం అందుబాటులో ఉత్సవ విగ్రహం లాగ ‘‘చిన్న ఆవకాయ జాడి’’. ఇది సర్వజన సమ్మతమైన తెలుగువారి సంప్రదాయం. మాఇంట్లోనూ అంతే.
తీరా, కంచంలో అన్నం పెట్టుకున్నాక, నాకు షాక్ ఇచ్చింది మా చిన్నజాడి. అది శుభ్రంగా కడగబడి, తుడవబడి, బోర్లించబడిన అవతారంలో ప్రత్యక్షమయింది. ఇక చేసేదేముంది ? బల్లమీద ఎక్కి మూలవిరాట్ రూపం ‘‘పెద్ద ఆవకాయ జాడి’’ ని కిందకు దింపాను జాగ్రత్తగా పైనున్న వాసెన గుడ్డ తీసి, ఆకలితో కూడిన ఆతృతతో మూత తీసాను. ఒక్కసారిగా ఫ్యూజ్లు అవుట్. జాడి కడిగేసినట్టుగా లేదు కానీ, అరచెయ్యి పెట్టి మొత్తం జాడి ఊడ్చినాసరే వచ్చే ఆవకాయ ఒక్కపూటకు సరిపోతే ఒట్టు. కొత్త ఆవకాయ ఎలాగూ తెస్తాను కదా అనో ఏమో, ఈ విషయాన్ని మా ఆవిడ నాతో మాట వరసకైనా అనలేదు. మొత్తానికి జాడీ•లో చెయ్యిపెట్టి, ఊడ్చి, ఊడ్చి ఆ పూటకు సరిపడా కొంచెం ఆవకాయ పిండి లాంటిది తీస్తున్నానోలేదో, చేతిలోకి వచ్చిన ఆ కొంచెంలో కొంచెం జారు కుంటూ జాడి లోపలికే పడిపోయింది. అరచేతికి ఉన్నదాన్ని అన్నంలతో కలి పేశాను. నెయ్యివేశాను. ముద్ద కలిపాను. నోట్లో పెట్టాను. ఆహా ఏమి రుచి, శభాష్ అనుకున్నాను నాలోనేనే.
అప్పుడు కొట్టిందండి అస్సలు సిస్సలైన సెంటిమెంటల్ మానవీయతా కోణపు దెబ్బ. ఏమిటి? ఈ అవకాయకి ఎందుకింత రుచి? ఎవరు కలిపేరు దీన్ని ఇంత కరక్టు సమపాళ్లలో?… ఒక్కసారిగా నాకళ్ల ముందర టార్టాయిస్ కాయిల్ లాగ గిర్రున తిరిగింది మూడు వందల అరవై అయిదు రోజుల గతం.
గత సంవత్సరం వేసవిలో ప్రతీసారి లాగ మేమూ మా ఊరికి వెళ్లాము. వచ్చేసే రోజు ‘‘ఆవకాయకూడ తీసికెళ్లాల్రోయ్, జాడీ•లో సర్దుతున్నాను’’ వంటిట్లోంచి ఆజ్ఞాపూర్వకంగా అమ్మపెట్టిన కేక, ఇప్పుడు నా చెవిలో రింగు రింగుమంటోంది. లగేజీ ఎక్కువగా ఉండడం వల్ల అఇష్టంగానే జాడీ మోసుకొచ్చాం.. ఇష్టంగా తిన్నాం.. ఇంకా తింటున్నాం. ఇప్పుడు చివరికొచ్చింది అదే జాడి.
గత శ్రావణంలో అమ్మకు చాలా సీరియస్ అయింది.వెంటనే బయల్దేరి వచ్చేయమని ఊళ్లో ఇంటి నుండి ఫోన్. కుండపోత వర్షం. ప్రయాణంలో ఇబ్బందులు, ఫోన్ చార్జింగూ లేదు, చార్జరూ లేదు, వెరశి బరువైన ప్రయాణం. చేరేసరికి అమ్మకు ఎలా ఉంటుందోనన్న ఆందోళనల మధ్య ఊరికి చేరుకున్నాం. అప్పటికే అంతా అయిపోయింది. రోజులూ, కర్మకాండలూ పూర్తి అయ్యేదాక ఉన్నాం. అమ్మ ఆకస్మికంగా పోవడం వల్ల ఇంటి సామాన్లు ఏవీ పనికిరావని, త్యజించమని, అసలు సంవత్సరం వరకు ఇల్లు తాళం పెట్టేయమని అన్నారు పెద్దలంతా. తు.చ. తప్పకుండా అన్నీ అలాగే జరిగిపోయాయి. వారి మాటలకు గౌరవం ఇచ్చినందుకు ఏదో సాధించినంత గర్వంగా వెళ్లారు బంధువులంతా.
మళ్లీ వర్తమానంలోకి వద్దాం. ఇప్పుడు నేను నోట్లో పెట్టుకున్నది ఏమిటి? ఎవరు దీనిని సమపాళ్లలో ఇంత రుచికరంగా కలిపారు?? నాకు ఇప్పుడు అంతా అర్థ్ధం అయింది. ఇది అమ్మ తన స్వహస్తాలతో కలిపిన ఆవకాయ. ఆమె కలిపిన ఆహార పదార్ధం అనబడే ప్రసాదం తినే అదృష్టానికి చివరి అవకాశం. ఆది మరల మరలా తిరిగి రాదు… రాదు… రాదు.. అసలు అవకాశం లేనేలేదు… లేదు…లేదు.. కంచంలో కలిపిన ఆవకాయ అన్నం ముద్ద తింటుంటే ఎంతో ఆనందం, ఆర్ద్రత•తో కూడిన విచారం. ఆందోళనామనోభారం. ఒకే క్షణంలో అన్ని కోణాలను సమపాళ్లలో ఆస్వాదించాను, అనుభవించాను. అమ్మపోయిన రోజుకంటే ఎక్కువ కలతగా ఉంది.అలా భోజనం అయ్యిందని పించా.. వేళ్లు చీకుతూ, మొత్తానికి చెయ్యి కడిగాను. అనుభవాలు, జ్ఞాపకాలు నెమరువేస్కుంటూ మంచం మీదకి ఒరిగాను. చిన్న కునుకు పట్టింది, అంతలోనే కల, ఎవరో ఒకావిడ పిల్లాడికి సైకిల్ తొక్కడం నేర్పుతోంది. వాడు పడిపోబోయిన ప్రతీసారి ఆమె ఒక్కటే చెబుతోంది ‘‘నీకు నువ్వే బేలన్స్ చేసుకోవాలి, తొక్కుతూ ఉండు. ప్రతీసారి అమ్మ నీ వెనకే ఉండి పట్టుకోదు’’.
అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అమ్మగుర్తుకు వస్తే ఆర్తితో కూడిన భారం, కల గుర్తుకు వస్తే కొంచెం ధైర్యం.అమ్మదూరం అయినప్పుడు కూడా బంధువు లెంత ధైర్యం చెప్పినా, నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి పది పదిహేను రోజులు పట్టింది. ఇప్పుడు ఈ తరుణంలో ఎవరున్నారు నాకుతోడు? అప్పుడు అర్థ్ధం అయింది నాకు.. జాడీ•లోంచి తీసేటప్పుడు కొంచెం ఆవకాయ చెయ్యిజారి మరలా జాడీలో ఎందుకు పడింది అన్న విషయం.
ఆ కొంచెం ఆవకాయనే నేను రెండు వారాలు ఆయుర్వేద మందు పరిమాణంలో ఒక్క అన్నం ముద్దలో కలుపుకొంటూ తిన్నాను. చివరకు జాడీ•లో అన్నం వేసి ఊడ్చి ఊడ్చి కూడా తిన్నాను. అలా అలా, నాకు నేనే పడిపోకుండా బేలన్స్ చేసుకున్నాను. నా మనసుకి నేనే ధైర్యం చెప్పుకొని, ఇవన్నీ అందరికీ ఎదురయ్యే మానవీయతా కోణా..నేనేమీ ప్రత్యేకం కాదు అనుకుని సరిబెట్టు కున్నాను. అందుకే మా ఇంట్లో ఆవకాయ మారినా, జాడీ మాత్రం ఇప్పటి వరకు అదే.
ఏదో ఒకరోజు చేయి జారితే ఆ జాడీ కూడా అమ్మదగ్గరికి చేరుతుందనే నగ్నంసత్యం ముందే తెలుసుకొని, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని, మధుర జ్ఞాపకాలే శాశ్వతం అని, అవి కూడా మనం ఉన్నంతవరకే…. అది జాడి కాదు, వేదాంత మంజూష. ఇదీ నేను అవగతం చేసుకున్న అమ్మ ఆవకాయ భాండంలో అంతర్లీనంగా దాగివున్న సత్ జీవన మార్గం బోధించే ఉపనిషత్ సారం.
– గుంటూరి ప్రసాద్