వరదల తర్వాత ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి రైతులు బయటపడేందుకు, వారి జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సమగ్ర సహాయక, పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆదాయం పొందేలా చేయడంలోనూ మహిళలకు సాయపడింది. అలాగే, 5,000 మందికి పైగా విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను అందించింది. అసోం రాష్ట్రంలోని శివసాగర్, చరైడియో, జోర్హాట్,  గోలాఘాట్ జిల్లాల్లో లక్షలాది మందిని అతలాకుతలం చేసిన వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజలు వరద అనంతర సమస్యలను ఎదుర్కోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తూ, బీకేఎస్‌తో పాటుగా అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులు తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవడంలో సహాయపడుతున్నాయి.

ఈ ఏడాది జూలై 19న సిబ్‌సాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో వరద నీరు ఉప్పొంగినప్పుడు, అది వేలాది రైతు కుటుంబాల వరి పొలాలు, ఇళ్లు, జీవనోపాధి రూపంలో ఉన్న వారి కలలను కొట్టుకుపోయింది. నాగాలాండ్ కొండల నుండి వచ్చిన  వరద ప్రవాహానికి చాలా మంది రైతులు నెలల తరబడి ఎంతో శ్రద్ధతో సాగు చేసిన పంటలు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వరదల్లో 75,000కు పైగా పశువులు, ఇతర జీవరాశులు కొట్టుకుపోవడం వల్ల వేలాది రైతు కుటుంబాల భవిష్యత్తు దెబ్బతింది. ఈ సంక్షోభ సమయంలో బీకేఎస్ రంగంలోకి దిగింది. కేవలం సహాయక సామగ్రిని అందించడమే కాకుండా, రైతులు తిరిగి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడంలో సహాయపడేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వచ్చింది. అత్యవసర సహాయ చర్యగా మొదలైన ఈ కార్యక్రమం, ఆ ప్రాంతంలోనే అత్యంత సమగ్రమైన వరద పునరావాస ప్రయత్నాలలో ఒకటిగా విస్తరించింది. వరద బాధితులైన దాదాపు 5,000 కుటుంబాలు తమ జీవితాలను తిరిగి నిర్మించుకుని, మళ్లీ స్వయంసమృద్ధిని సాధించేలా చేయడమే ఈ సంస్థ లక్ష్యం.

శివసాగర్, చరైడియో జిల్లాలను వరదలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఇళ్లు నీట మునిగిపోగా, చేతికి వచ్చిన పంటలు నాశనమయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే, బీకేఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు రంగంలోకి దిగి తక్షణ సహాయాన్ని అందించారు. శివసాగర్ జిల్లాలో సుమారు 300 మంది వరద బాధితులకు అత్యవసర సహాయ సామగ్రిని అందించారు. అత్యవసరమైన వారికి సహాయం అందేలా చూసేందుకు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేశారు. అయితే, కేవలం సహాయక సామగ్రిని పంపిణీ చేయడంతోనే ఈ సంస్థ ఆగిపోలేదు. లఖింపూర్, జోర్హాట్, దిబ్రూగఢ్, ధేమాజీ, మోరిగావ్, నల్బారీ, కామరూప్ జిల్లాల నుండి 200 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తల బృందాన్ని సమీకరించి, వారిని ప్రభావిత ప్రాంతాలకు పంపింది. వీరు సహాయక సామగ్రి పంపిణీ నుండి ఇళ్ల పునర్నిర్మాణం వరకు అన్ని పనులలోనూ సహాయపడ్డారు. వ్యవ సాయంపై ఆధారపడిన వారికి, వరదల వల్ల కలిగే అసలైన నష్టం కేవలం ఇళ్లలోకి నీరు చేరడం మాత్రమే కాదు. సాగు చేసిన పంటను కోల్పోవడం కూడా. బీకేఎస్ తన కృషిని ప్రధానంగా ఈ అంశంపైనే కేంద్రీకరించింది. వరదల వల్ల పంటను కోల్పోయిన రైతులకు వరి నారును సమకూర్చి పంపిణీ చేసింది. తద్వారా నీరు తగ్గిన తర్వాత వారు తిరిగి సాగును ప్రారంభించే అవకాశం కలిగింది. కేవలం శివసాగర్ జిల్లాలోనే, ఈ ప్రయత్నం ద్వారా వ్యవసాయ భూమిలో తిరిగి పంటలు వేయడానికి వీలు కలుగుతుందని, తద్వారా వరి పంటను కోల్పోయిన 600 మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఈ మద్దతు శివసాగర్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న జోర్హాట్ జిల్లాలోని తియోక్‌లో, మరో 100 మంది రైతులకు బీకేఎస్ చేరువయ్యింది. వరి సాగును పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వారికి నారును అందించింది.

మహిళారైతులకు జీవనాధారం

శివసాగర్‌లోని మహిళా రైతులకు ఒక అదనపు జీవనాధారం లభించింది. వరద బాధితులైన 50 మంది మహిళా రైతులకు ఒక క్వింటాల్ పుట్టగొడుగుల విత్తన ప్యాకెట్లను పంపిణీ చేసింది. వరి సాగులాగా కాకుండా పుట్టగొడుగుల పెంపకానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో, ఇది వారికి త్వరగా ఆదాయం పొందే మార్గంగా మారింది. శివసాగర్‌లోని వరద ప్రభావిత గెలెకి ప్రాంతానికి చెందిన సన్నకారు టీ (తేయాకు) రైతులకు కూడా బీకేఎస్ అండగా నిలిచింది. వారి టీ తోటలను తిరిగి కోలుకునేలా చేయడంలో భవిష్యత్తులో వాటిని సుస్థిరంగా నిర్వహించడంలో సహాయపడేందుకు, వారిలో 50 మందికి  సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ పురుగుమందులను  అందించింది. కేవలం రైతులే కాకుండా, రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు తమ విద్యను కొనసాగించడంలో కూడా బీకేఎస్ సహాయం చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలలో అసోం చవిచూసిన అత్యంత భయంకరమైన వరదలు పంటలు, ఇళ్లను దెబ్బతీయడమే కాకుండా, వేలాది మంది విద్యార్థుల పుస్తకాలు, నోట్‌బుక్‌లు, ఇతర సామాగ్రిని కూడా కొట్టుకుపోయేలా చేశాయి. 5,000 మందికి పైగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, నోట్‌బుక్‌లు, పెన్నులు, పెన్సిళ్లను విద్యార్థులకు బీకేఎస్ అందించింది. మరో సంస్థ అయిన ‘శ్రీమంత శంకరదేవ్ సాంస్కృతిక సొసైటీ’, బీకేఎస్‌తో కలిసి శివసాగర్ జిల్లాలోని వరద బాధితులైన 3,000 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, జామెట్రీ బాక్సులు(స్త్రవశీఎవtతీy bశీఞవs), పెన్నులు, నోట్‌బుక్‌లను పంపిణీ చేసింది. “తమ ఇళ్ల నుండి పుస్తకాలు, నోట్‌బుక్‌ల వరకు అన్నీ కోల్పోయిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. రానున్న కాలంలో వారికి వివిధ మార్గాల్లో సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని బీకేఎస్ (అసోం, మేఘాలయ, నాగాలాండ్) రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి కృష్ణ కాంత బోరా అన్నారు. వరదల తదనంతర పరిస్థితులు బాధితులకు అత్యంత క్లిష్టంగా మారాయి. దీనికి స్పందిస్తూ, బీకేఎస్ జోర్హాట్ జిల్లా విభాగం ప్రభావిత గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు, సంప్రదాయ మూలికా వైద్య సేవలను ఏర్పాటు చేసింది. సుమారు 100 మంది స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా, దాదాపు 500 మంది వరద బాధితులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. చికిత్స అందించారు. అలాగే, స్థానికంగా లభించే ఔషధ మొక్కలు,  ఇంటి చిట్కాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టారు. మరోవైపు, శివసాగర్‌లో మోరిగావ్ జిల్లాకు చెందిన 50 మందితో కూడిన స్వచ్ఛంద కార్యకర్తల బృందం నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వీరు వరద ప్రభావిత గ్రామాలను శుభ్రపరచడం, దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించడం, బాధితుల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడ్డారు.

అన్నదాతకు అండగా..

వినాశకరమైన వరద తర్వాత 5,000 మంది రైతులు తమ జీవనోపాధిని పునర్నిర్మించుకోవడానికి సాయం చేయడమే లక్ష్యంగా భారతీయ కిసాన్ సంఘ్ పక్కా వ్యూహాలతో పనిచేస్తోంది. అయితే, ఇది రాత్రికి రాత్రే జరగదు. వరద నీరు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి, తక్షణ సంక్షోభం వార్తల్లోంచి మాయమైన చాలా కాలం తర్వాత కూడా వ్యవసాయం, పశుసంపద, గ్రామీణ జీవనోపాధులకు నిరంతర మద్దతు అవసరం.

అయితే, ఇప్పటికే జరిగిన పని పరిమాణాన్ని బట్టి చూస్తే, ఆ సుదీర్ఘ ప్రయాణానికి పునాది ఇప్పటికే పడింది.“మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాము. పరిస్థితిని అంచనా వేసి, ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాము. నిపుణులు, మా నిస్వార్థ స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో, వరద ప్రభావిత ప్రాంతాల రైతుల ముఖాల్లో త్వరలోనే తిరిగి చిరునవ్వులు పూయించగలమనే పూర్తి నమ్మకం మాకు ఉంది,” అని బీకేఎస్‌కు చెందిన కృష్ణ కాంత బోరా అన్నారు.

సీఎం సహాయనిధికి విరాళం

వరద సహాయక చర్యలలో తరచుగా నిర్లక్ష్యానికి గురయ్యే పశువుల యజమానులకు కూడా మద్దతు లభించింది. వరదల వల్ల పశువులు, పశుసంపద నష్టపోయిన వారి నష్టాలను తగ్గించడానికి, బీకేఎస్ రెండు ట్రక్కుల పశుగ్రాసాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేసింది. క్షేత్రస్థాయి పనులతో పాటు, బీకేఎస్ రాష్ట్ర ప్రభుత్వ బృహత్తర సహాయక యంత్రాంగానికి కూడా మద్దతునిచ్చింది. సంఘ్‌తో అనుబంధం ఉన్న మూడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 3 లక్షలు విరాళంగా అందించాయి. ఇది కష్టాల్లో ఉన్న ఇతరులకు అండగా నిలబడాలనే నిస్వార్థపూరితమైన ప్రయత్నానికి నిదర్శనం.

ముఖ్యాంశాలు

–              శివసాగర్ జిల్లాలో 50 మంది స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో మూడు వందల మంది వరద బాధితులకు సహాయక సామగ్రి అందింది.

–              శివసాగర్‌లో వ్యవసాయ భూమిలో వరినాట్లు వేశారు. ఈ చర్య వల్ల 600 మందికి పైగా రైతులు లబ్ధి పొందారు.

–              ఏడు జిల్లాల నుండి 200 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక, పునరావాస పనులలో నిమగ్నమై ఉన్నారు.

–              5,000 మందికి పైగా విద్యార్థులు పాఠశాల యూనిఫారాలు అందుకున్నారు. శివసాగర్‌లోని 3,000 మంది విద్యార్థులకు అదనంగా స్కూల్ బ్యాగులు, జామెట్రీ బాక్సులు, పెన్నులు, నోట్‌బుక్‌లు అందాయి.

–              మూడు రైతు సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3 లక్షలు విరాళంగా అందించాయి.

–              100 మంది స్వచ్ఛంద కార్యకర్తల మద్దతుతో ఏర్పాటు చేసిన శిబిరాలలో సుమారు 500 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్స పొందారు.

–              మోరిగావ్‌కు చెందిన 50 మందితో కూడిన స్వచ్ఛంద కార్యకర్తల బృందం శివసాగర్‌లో నాలుగు రోజుల పాటు పారిశుధ్య పనులు, గృహ పునర్నిర్మాణ పనులలో నిమగ్నమైంది.

–             వరద బాధితులైన పశువుల యజమానులకు రెండు ట్రక్కుల పశుగ్రాసం పంపిణీ జరిగింది.

–              50 మంది మహిళా రైతులకు జీవనోపాధి పునరుద్ధరణకు పుట్టగొడుగు పంటకు సంబంధించిన విత్తనాలు, ఇతర సామాగ్రి అందింది.

–              శివసాగర్‌లోని గెలెకిలో 50 మంది సన్నకారు తేయాకు రైతులకు సేంద్రియ ఎరువులు , సేంద్రియ పురుగుమందులు అందాయి.

–       సుమారు 5,000 వరద బాధిత కుటుంబాలకు పునరావాస మద్దతు, వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధిని పునర్నిర్మించుకోవడంలో సాయంపై భారతీయ కిసాన్ సంఘ్ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది.

ఆర్గనైజర్ సౌజన్యంతో

About Author

By editor