మనం హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ ‌తింటే దేశ జీడీపీ పెరుగుతుంది. అదే అమ్మ లేదా భార్య అంతకంటే రుచిగా, ఆరోగ్యంగా ఇంట్లో వండి పెడితే దేశ సంపద పెరగదు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి లెక్కల్లోనే మహిళల శ్రమ పట్ల ఓ కనిపించని కోణం ఉంది.  ఉదయం అందరికంటే ముందే లేచి, రాత్రి అందరూ పడుకున్నాక కూడా విశ్రమించని గృహిణి శ్రమను మన సమాజం ఉచిత సేవగా చూస్తుంది. కానీ, ఆధునిక ఆర్థికశాస్త్ర కోణంలో చూస్తే… ఈ ఉచిత సేవలే దేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఒక సాధారణ మధ్య తరగతి గృహిణి శ్రమకు మార్కెట్‌ ‌పరంగా విలువ కడితే అది ఏ ఐటీ ఉద్యోగి జీతానికీ తక్కువ కాదు.

ఉద్యోగం చేసే పురుషుడికి ఆఫీస్‌ ‌పని ముగియగానే విశ్రాంతి దొరుకుతుంది, కానీ మహిళకు ఆఫీస్‌ ‌ముగిసిన వెంటనే ఇంట్లో రెండో  షిఫ్ట్ ‌మొదలవుతుంది. ఈ ద్వంద్వ భారాన్ని మోయలేక ఎంతోమంది చదువుకున్న మహిళలు తమ వృత్తిజీవితాన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. భారతదేశంలో 25 నుండి 59సంవత్సరాల వయస్సు గల మహిళలు ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలు ఉచిత గృహ సేవలకు కేటాయిస్తున్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుల్లో ఈ శ్రమకు భావనాయుక్త ఆదాయం (నోషనల్‌ ఇన్‌కమ్‌) ‌లెక్కించాలని స్పష్టం చేసినా, సమాజంలోనూ, ప్రభుత్వ గణాంకాల్లోనూ దీనికి తగిన గుర్తింపు లభించడం లేదు. అటు ఆఫీస్‌, ఇటు ఇల్లు ఏ బాధ్యతను వదలకుండా మహిళలు అనుభవిస్తున్న ద్వంద్వ భారం వారిని తీవ్రమైన ‘టైమ్‌ ‌పావర్టీ’ (సమయ దారిద్య్రం)లోకి నెట్టేస్తోంది. ఈ కనిపించని శ్రమను గుర్తించకపోతే, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ‘బామోల్‌ ‌కాస్ట్ ‌డిసీజ్‌’, ‌జనాభా సంక్షోభంవంటి ముప్పులను భారతదేశం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అభివృద్ధి చెందిన దేశాలలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరిగినా, సరైన కుటుంబ సహకారం, వ్యవస్థ లేక జనాభా రేటు పడిపోతోంది. ఫలితంగా ఆయా దేశాలు బామోల్‌ ‌కాస్ట్ ‌డిసీజ్‌ ‌బారిన పడుతున్నాయి.

ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసు, ఇంటి పనులను రెండింటినీ బ్యాలెన్స్ ‌చేయాల్సి రావడం వల్ల విపరీతమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.  భారతదేశంలో మహిళల శ్రమశక్తి భాగస్వామ్యం తక్కువగా ఉండటానికి ఇది కూడా ప్రధాన కారణం. పురుషులు ఇంటి పనుల కోసం 45 నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయిస్తు న్నారు అని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.  ఇది శ్రమ విభజనలో ఉన్న అసమతుల్యతను చూపుతోంది. ఇంటి పని కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదనే స్పృహ, పురుషులలో బాధ్యతను పంచుకునే తత్వం పెరిగినప్పుడే ఈ ద్వంద్వ భారం తగ్గుతుంది.

ప్రస్తుత మన దేశ అధికారిక స్థూల దేశీయోత్పత్తి కేవలం మార్కెట్లో డబ్బు చేతులు మారే లావాదేవీలను మాత్రమే లెక్కిస్తుంది. ఆర్థికవేత్తలు చెప్పే ప్రకారం చూస్తే మనం బట్టలు డ్రైక్లీనింగ్‌కు ఇస్తే దేశ సంపద పెరుగుతుంది, అదే భార్య ఇంట్లో ఉతికితే పెరగదు. భారత ప్రభుత్వ ‘టైమ్‌ యూజ్‌ ‌సర్వే’ ప్రకారం, మహిళల ఉచిత సేవలను గనుక దేశ ఆర్థిక వ్యవస్థలో లెక్కిస్తే… భారతదేశ అధికారిక జీడీపీ విలువకు అదనంగా కనీసం 15% నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మహిళల ఆర్థిక సహకారం ఏంటో ప్రపంచానికి స్పష్టమైన గణాంకాలతో తెలుస్తుంది.

ఇల్లు ఊడవడం, వండడం, పిల్లల, వృద్ధుల సంరక్షణ వంటి పనులను సమాజం బాధ్యత లేదా ప్రేమ అనే పేరుతో చూస్తుంది తప్ప, దాని వెనుక ఉన్న శ్రమను గుర్తించదు. దీన్ని ‘అన్‌పెయిడ్‌ ‌కేర్‌ ‌వర్క్’ అం‌టారు. మహిళలు ఇంట్లో చేసే కనీస నాలుగు గంటల ఉచిత సేవలకు గనుక ఆర్థిక విలువ కట్టి,  ఒక బయటి వ్యక్తిని పనికి పెట్టుకుంటే ఎంత ఖర్చవుతుందో అంత విలువ జీడీపీలో చేరిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు మహిళల శ్రమ దేశ పురోగతికి ఎంత పునాదిగా ఉందో స్పష్టమైన గణాంకాలతో నిరూపితమవుతుంది.

ఇంటి సేవలకు విలువ కట్టడానికి ఆర్థికవేత్తలు ప్రధానంగా రెండు పద్ధతులను ఉపయోగిస్తారు.

మార్కెట్‌ ‌రీప్లేస్‌మెంట్‌ ‌పద్ధతి

ఇంట్లో మహిళలు చేసే ప్రతి పనిని విడివిడిగా చూసి, అదే పనిని బయటి వ్యక్తులతో చేయిస్తే ఎంత ఖర్చవుతుందో లెక్కించడం. హోటల్‌ ‌నుండి భోజనం తెప్పించడానికి లేదా వంట మనిషికి ఇచ్చే జీతం. పిల్లల లేదా వృద్ధుల సంరక్షణ, బేబీ సిట్టర్‌ ‌లేదా ప్రొఫెషనల్‌ ‌కేర్‌ ‌టేకర్‌ ‌ఫీజు, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, హౌస్‌ ‌కీపింగ్‌ ‌లేదా మెయింటెనెన్స్ ‌వంటివి అన్నీ ఈ ఉచిత సేవల్లోకే వస్తాయి. ఈ సేవలన్నింటికీ మార్కెట్‌ ‌రేట్ల ప్రకారం నెలవారీ ఖర్చు లెక్కిస్తే, ఒక సాధారణ గృహిణి చేసే శ్రమ విలువ నెలకు వేల రూపాయల్లో కొన్నిసార్లు ఐటీ ఉద్యోగి జీతంతో సమానంగా ఉంటుంది.

ఒక మహిళ 7గంటలు ఇంట్లో ఉచిత సేవలు చేయకుండా, బయట మార్కెట్లో ఉద్యోగం చేసి ఉంటే ఆమె విద్యార్హత, నైపుణ్యాల బట్టి ఎంత సంపాదించగలదో లెక్కించడం కూడా ఒక పద్దతి.  అంటే ఇంటి పని కోసం ఆమె ఎంత సంపాదనను త్యాగం చేసిందో చెప్పేదే ఈ పద్ధతి.

విలువ వల్ల మార్పు

మహిళల్లో  ఆత్మగౌరవం పెరుగుతుంది: ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావుగా అనే మాటల స్థానంలో, వారి శ్రమకు ఒక గుర్తింపు లభిస్తుంది.

న్యాయపరమైన రక్షణ

ప్రమాదవశాత్తు ఒక గృహిణి చనిపోతే, ఆమె కుటుంబానికి ఇచ్చే బీమా లేదా నష్టపరిహారాన్ని లెక్కించడానికి సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు గృహిణి శ్రమ ఆర్థిక విలువను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

పాలసీల రూపకల్పన

ప్రభుత్వం మహిళల కోసం పథకాలు లేదా పెన్షన్లు ప్రవేశపెట్టేటప్పుడు వారిని ఉత్పాదకత లేనివారిగా కాకుండా, కనిపించని ఆర్థిక భాగస్వాములుగా గుర్తిస్తుంది. అందుకే, ఇంట్లో చేసే సేవలు ఉచితం కావచ్చు…కానీ అవి అమూల్యమైనవే కాక వాటికి ఆర్థిక విలువ కట్టడం సాధ్యమౌతుంది.

సమాజం గుర్తించకపోయినా, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గృహిణి శ్రమ విలువను చట్టపరంగా అంగీకరించింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని లెక్కించే సందర్భాల్లో కోర్టులు చారిత్రాత్మక తీర్పులను ఇచ్చాయి.

2021 నాటి ఒక కీలక కేసులో ఒక గృహిణి ఇంట్లో చేసే శ్రమ, ఆఫీసులో భర్త సంపాదించే సంపాదన కంటే ఏ మాత్రం తక్కువ కాదని, ఆమె సేవలకు కచ్చితమైన భావనాయుక్త ఆదాయం లెక్కించాల్సిందేనని  సుప్రీంకోర్టు స్పష్టం  చేసింది. అంతే కాదు గృహిణి శ్రమను తక్కువ చేసి చూడటం లింగ సమానత్వానికి విరుద్ధం అని పేర్కొంది. ఈ తీర్పు గృహిణుల శ్రమకు దక్కిన ఒక పెద్ద నైతిక విజయం.

మార్పు ఎక్కడ రావాలి?

గృహిణి శ్రమకు విలువ కట్టడం అంటే ఆమెకు కుటుంబం జీతం ఇవ్వాలని కాదు… ఆమె చేసే పనికి గౌరవం, గుర్తింపు ఇవ్వడం. ఈ మార్పు కేవలం ప్రభుత్వ లెక్కల్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ రావాలి. ఇంటి పని కేవలం మహిళల బాధ్యత అనే ఆలోచన నుండి బయటపడి, పురుషులు కూడా ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో సమానంగా భాగ స్వాములు కావాలి.

పరిస్థితి అధ్యయనం

అభివృద్ధి చెందిన దేశాలలో, కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం అనేది కుటుంబ వ్యవస్థ దెబ్బతినేలా చేసింది. అక్కడ సంతానోత్పత్తి రేటు  భర్తీ రేటు కంటే గణనీయంగా పడిపోయింది, వృద్ధుల జనాభా వాటా పెరిగింది, బంధువులు లేని ఒంటరి వృద్ధుల శాతం ఆందోళనకరంగా పెరిగింది. దీనివల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు జీడీపీలో పెద్ద వాటాను వృద్ధుల సంరక్షణ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ సంరక్షణ పరిశ్రమ ఎంతో శ్రమతో కూడుకున్నది, కాబట్టి ఇది బామోల్‌ ‌వ్యయ సంక్షోభానికి (బామోల్‌ ‌కాస్ట్ ‌డిసీజ్‌) ‌లోనవుతుంది. అంటే కాలక్రమేణా సంరక్షణ అందించే ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. జపాన్‌, ‌దక్షిణ కొరియా, పశ్చిమ ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలు నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే.

సంతానోత్పత్తి రేటు క్షీణత

అభివృద్ధి చెందిన దేశాలలో జీవన వ్యయం పెరగడం, మహిళలు కెరీర్‌కు ప్రాధాన్యత, ద్వంద్వ భారం మోయలేకపోవడం వల్ల చాలామంది పిల్లలను కనకూడదని లేదా ఒక్కరితోనే ఆగిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో జనాభా స్థిరంగా ఉండటానికి కావలసిన భర్తీ రేటు పెరగటం లేదు. ప్రస్తుతం దక్షిణ కొరియా, జపాన్‌, ఇటలీ వంటి దేశాలలో ఇది ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీనివల్ల యువ జనాభా తగ్గి, దేశాలు వృద్ధాప్యం వైపు వేగంగా దూసుకుపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, ఒంటరితనం కూడా భారీగా పెరుగుతున్నాయి.

సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు లేకపోవడం, సామాజిక వైయక్తీకరణ పెరగడం వల్ల వృద్ధులను చూసుకునే బంధువులు కరవయ్యారు. జపాన్‌ ‌లాంటి దేశాల్లో ఒంటరిగా జీవిస్తూ, ఎవరికీ తెలియకుండా వృద్ధులు మరణించే కోడోకుషి (ఒంటరి మరణాలు) అనే భయంకర సామాజిక సమస్య దీనివల్లనే పుట్టుకొచ్చింది. ఆర్థికవేత్త విలియం బామోల్‌ ‌చెప్పిన ‘కాస్ట్ ‌డిసీజ్‌’  ‌సంరక్షణ రంగానికి వంద శాతం వర్తిస్తుంది.

ఐటీ లేదా మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌రంగాల్లో సాంకేతికత వల్ల ఒక ఉద్యోగి చేసే పని సామర్థ్యం రేటు పెరుగుతుంది. కానీ, ఒక వృద్ధుడిని లేదా రోగిని చూసుకోవడానికి ఒక మనిషి ఇచ్చే సమయం, సానుభూతి మారవు. టెక్నాలజీ వచ్చినా ఒక నర్సు లేదా కేర్‌టేకర్‌ ‌చేయాల్సిన శ్రమ తగ్గదు. ఇతర రంగాల్లో  జీతాలు పెరుగుతున్నప్పుడు, కేర్‌ ఇం‌డస్ట్రీలో కూడా పని చేసేవారికి సమానంగా జీతాలు పెంచాలి లేకపోతే ఆ పనిలో ఎవరూ చేరరు. ఉత్పాదకత పెరగక పోయినా జీతాల ఖర్చు పెరగడం వల్ల, కాలక్రమేణా వృద్ధుల సంరక్షణ అనేది ప్రభుత్వంపై, కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారంగా మారుతుంది.

మనకు ఎలాంటి హెచ్చరిక?

భారతదేశం ప్రస్తుతం యువ జనాభా ఎక్కువగా ఉన్న కాలంలో ఉంది. కానీ, మనం కూడా అభివృద్ధి చెందిన దేశాల తప్పుల నుండి పాఠాలు నేర్చుకోకపోతే అటువంటి పరిణామాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని ఆపడం దీనికి పరిష్కారం కాదు. ఎందుకంటే దేశ ఆర్థిక వృద్ధికి వారి భాగస్వామ్యం అవసరం.  కెరీర్‌ ‌కోసం వారు కుటుంబాన్ని లేదా పిల్లలను పూర్తిగా వదులుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే… ప్రభుత్వం, సమాజం కలిసి సంస్థాగత మద్దతు అందించాలి. నాణ్యమైన, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన చైల్డ్ ‌కేర్‌ ‌సెంటర్లు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి తేవాలి. పురుషులు ఇంట్లో బాధ్యతలను సమానంగా పంచుకోవడం, ఫ్లెక్సిబుల్‌ ‌వర్క్ ‌సంస్కృతిని తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ పాశ్చాత్య దేశాల సంక్షోభం మన దేశానికి రాకుండా చూసుకోగలం.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

About Author

By editor