‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


యుద్ధ స్కంధావారం వద్దనున్న భవంతి లోనికి ప్రవేశించింది రుద్రమ.
మందిరాల నిండా రకరకాల వస్తువులు ఉన్నాయి కానీ మనుష్యుల అలికిడి లేదు. అసలు గణపతిదేవుని బంధించిన ఆనవాలు కూడా కనపడటం లేదు. ఏమైనా ఆనవాలు ఉన్నదేమో కానీ ఈ జన ప్రభంజనం వల్ల రుద్రమకు కించిత్‌ ‌కూడా లభించలేదు.
ఉసూరుమంటూ రుద్రమ, లెంకలు బయటకు వచ్చారు.
జనం దొరికిన వస్తువులు పట్టుకుని పరుగులు పెడుతున్నారు..
క్షణక్షణానికి ఆమెకు ఆందోళన పెరిగిపోతోంది.
ఎక్కడ తన కన్నతండ్రి? ఎక్కడ కాకతీయ రాజ్యాధినేత??
ఆ జనసందోహం నుండి దూరంగా వెళ్లి ఓ రాతిపై కూలబడింది. లెంకలు ఇంకా లోపల వెదకుతున్నారు.
ఉన్నట్టుండి లోపలినుండి ఓ గావుకేక వినబడింది. అది పశుపతిలెంకది.
చివ్వున లేచి జనాన్ని తోసుకుంటూ లోపలికి పరుగుపెట్టింది. భవనం వెనుక చావడిలో ఇద్దరు కాకతీయ పల్లకి బోయలు శవాలై పడిఉన్నారు.ఒకడు కొనఊపిరితో ఉన్నాడు.ఒళ్లంతా రక్తసిక్తం. ఊపిరి పీల్చడానికి ఆయాస పడుతున్నాడు. లెంకలు అతనిని కాపాడడానికి విశ్వయత్నం చేస్తున్నారు. రుద్రమను చూడగానే వాడు చేతులు జోడించడానికి యత్నించాడు కాని రుద్రమ కిందకువంగి అతని చేతులు పట్టుకుంది.
‘‘ఏమైంది.. తండ్రిగారు ఎక్కడ? ఎటు తీసుకు పోయారు? మీరంతా ఎంతవరకు వెంబడించారు.’ ప్రశ్నల వర్షం కురిపించింది.
అతడు ఒక్కొక్క మాటే కూడబలుక్కుంటూ, ‘‘ఆ యమ్మ ఎవరో దుర్మార్గురాలు. మహారాజుగారిని అనరాని మాటలు అంటూ చేయి చేసుకుంటోంది. అక్కడే కొందరు లెంకలను చంపేసింది. కొందరు లెంకలు, పల్లకి బోయిలం వెంటపడ్డాం. కాని వాళ్ల ధాటికి ఆగలేకపోయాం. చస్తూనే వెంట పడుతూనే ఉన్నాం. చివరికి మేం ముగ్గురం ఇక్కడివరకూ పోరాడాం. కానీ ఓడిపోయాం యువరాణీ! మహా రాజులవారిని తాళ్లతో కట్టేసి ఈడ్చుకుపోయారు.’’ చెబుతూనే స్పృహ తప్పాడతను.
నవనాడులు కుంగిపోయాయి రుద్రమకు.
లెంకలు అతనికి శుశ్రూష చేస్తుండగా ఆమె బయటకు వచ్చింది. అప్పటికి జనం కోష్టాగారం అంతా కొల్లగొట్టుకుని పోయారు. సందడి తగ్గింది. ఆ రాక్షసి ఎదురయితే ఖండఖండాలుగా నరికేయాలనివుంది. కానీ ఎలా?ఎప్పుడు?ఎక్కడ ఆ పిశాచి ఎదురౌతుంది?
మరి కాసేపటికి కాస్త కోలుకున్న ఆ బోయీ, ‘‘ఆమె మహారాజుగారిని చిత్రహింసలు పెట్టి చంపుతుందట. తన సోదరిని చంపిన చోటే మహారాజుల వారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతుందట. ఇంకా ఏవేవో..’’
రుద్రమకు అర్థమైంది. అగ్నిపర్వతం బద్ధలై లావా ఎగసిపడుతోంది.
బో• చెప్పిన వైనం.. చెవుల్లో గింగుర మంటోంది.
‘‘ఆమె సోదరిని చంపిన చోటే మహారాజుల వారిని ముక్కలు ముక్కలుగా…’’అంటే అంటే.. తండ్రిని దేవగిరికోటలోని ఆ కోష్టాగారం వద్ద??
‘‘దేవుడా..!!’’ కుప్పకూలిపోయింది.
లెంకలు మొత్తంగా బయటకు వచ్చారు. ‘‘బో• కోలుకుంటున్నాడు యువరాణీ..’’ చెప్పాడు పశుపతిలెంక.
ఆమెకు ఏమీ వినిపించడం లేదు. కనిపించడం లేదు.. అంతా శూన్యం! చీకటి!!
‘‘మహారాజుగారి లెంకలు, బో•లు కొందరు ఎవరైనా ఇంకా ఆ కిరాతకుల వెంట పడుతున్నారేమో.. ప్చ్.. ‌తెలియదు. మనం కదలాలి యువరాణీ..’’
ఆమె కరచరణాలు కదలడం లేదు. ఎంత కిరాతకురాలు ఆ కవ్వల??!!
పశుపతి మళ్లీ అన్నాడు. ‘‘మహారాజుగారు ఏమాత్రం ప్రతిఘటించడం లేదట. ఆమె కొడితే భరిస్తున్నారట.ఎంత అవమానం..ప్చ్..’’
‌రగిలిపోతున్నాడు పశుపతి. మిగిలినవాళ్లూ అదే ఉద్వేగంతో కదలాడు తున్నారు.
తెలియవస్తున్న ప్రతి మాటా.. ప్రతి పనీ రుద్రమను నిర్ఘాంతపరుస్తున్నాయి. దిమ్మెరపోయేలా చేస్తున్నాయి.
దిగ్భ్రమతో కాలు చెయ్యి కదలడం లేదు. వెర్రిచూపులు చూస్తోంది.
‘ఎంత పగ పెంచుకుంది?’ లిప్తకాలంలో వెయ్యిసార్లు అనుకుంటోంది.
కళ్ల ముందు కవ్వల పిశాచిలా ఉవ్వెత్తున ఎగసి ఆకాశమంతా ఆక్రమించి వికటాట్టహాసాలు చేస్తోంది.
‘‘రా.. చూసుకుందాం.. చేతనైతే నీ తండ్రిని కాపాడుకో. నువ్వొచ్చేసరికి నీ తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి కట్టగట్టి అందిస్తాను. నెత్తిన పెట్టుకుని అనుమకొండ తీసుకుపో..’’
ఇలాంటివే ఏవేవో.. చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆ శత్రువే రుద్రమకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చినట్లయ్యింది. చివ్వున లేచి నిలుచుంది.
‘శహభాష్‌. ‌నువ్వు నాకు తగిన శత్రువ్వి. తేల్చుకుందాం..నువ్వో నేనో. వస్తున్నాను. నువ్వు దేవగిరిలోనే కాదు. హిమాలయాల్లో దాగినా వదలను. నా తండ్రిని రక్షించి తీరుతాను. ఆయనను తెలుగు ప్రజలకు అందిస్తాను. నేను ఈ పోరాటంలో ఆహుతి అయినా సరే.. నా తండ్రిపై ఈగ వాలనివ్వను. నిన్ను వదలను..’
లేచి కళ్లు తుడుచుకుని…‘‘మనం దేవగిరి వెళ్లాలి. తండ్రిగారిని అక్కడికి తీసుకుపోతోంది ఆ పాపిష్టిది. మనం వీలయినంత వేగంగా వెళితే ఆ పిశాచిని, దాని కిరాతక బృందాన్ని పట్టుకోవచ్చు కూడా. కాకపోతే మన చావో గెలుపో తేలేది దేవగిరి కోటలోనే’’ చెప్పింది.
ఎక్కడ బెలగావి.. ఎక్కడ దేవగిరి.. వేల యోజనాల దూరం!
కాని వెళ్లక తప్పదు. మరో మార్గం లేదు.
పూర్తి నిర్ణయంతో రుద్రమదేవి అశ్వాన్ని అధిరోహించింది. లెంకలు ఆమె ముందు వెనుకగా గుర్రాలను పరుగెత్తిస్తున్నారు.
ఏకైక లక్ష్యం మహాపురుషుడు గణపతిదేవుని తెలుగు సామ్రాజ్యాధినేతగా తెలుగు సమాజానికి అందించాలి!!
కానీ దైవం మరొకటి తలచినట్లుంది!!
* * *
ఎక్కడో దారి తెన్నూ తెలియని కీకారణ్యం..
బాలభగవానుని లేత కిరణాలతో పక్షుల కిలకిలరావాలు.. గాలిదేవుడు ఉదయమే ఉత్సాహంగా గంతులేస్తున్నట్లు.. మహావృక్షాలు ఉదయమే వ్యాయామం చేస్తున్నట్లు తీవ్రంగా కదలాడుతూ రివ్వురివ్వున గాలి..
రాత్రి తాలూకూ నిద్ర మగత విడివడి మెలకువ వచ్చింది గణపతిదేవునికి. కదిలి లేచి కూర్చున్నాడు. రాత్రి గొల్లన నిర్మించి లోపల అడవి గడ్డిపై ఏదో దుప్పటి లాంటిది పరచి తల్పంగా చూపించినప్పుడు తలవొంచుకుని దానిపై మెల్లగా కూలబడ్డాడు. కాసేపటి తర్వాత మెల్లగా ప్రక్కకువాలగా మరి కాసేపటికి నిద్ర పట్టింది.
తెల్లవారినట్లుందని గుర్తించాడు. లేచి మెల్లగా గొల్లెనకున్న తెర తొలగించుకుని బయటకు వచ్చాడు.
ఎదురుగా తిమ్మప్ప, గౌరయ్య..
తన బృందం నుండి తన కోసం కవ్వల నిర్దేశించిన ఇద్దరు పరిచారకులు. పరిచారకులైనా, స్నేహితులైనా, శత్రువులైనా వాళ్లే!!
ఆయనను చూసి ఇద్దరూ వినయంగా బాగా వంగి నమస్కరించారు.
పరిచారికలకు జవాబు చెప్పే సంప్రదాయం మహారాజులకు ఉండదు కాబట్టి పలకరింపులాగా చిన్నగా శబ్దించి విశాలంగా వొళ్ళు విరుచుకున్నాడు గణపతి దేవుడు.
తిమ్మప్ప అన్నాడు మెల్లగా తగ్గుస్వరంతో, ‘‘కాలకృత్యాలకు.. వెళదామా.. మహారాజా?!!’’
‘‘ఊ..’’ అని దీర్ఘంగా నిశ్వసించి కాస్త కదిలాడు. వాళ్లిద్దరూ ఆయనకు దారి చూపుతున్నట్లు ముందు కదిలారు. వాళ్లను అనుసరిస్తూ, మౌనంగా చిన్నచిన్న అడుగులతో నడక ప్రారంభించి.. చుట్టూ పరీక్షగా చూస్తూ ముందుకు పోతున్నాడు.
అది కారడవి.. సందేహంలేదు. దగ్గరలో మానవ నివాసాలు, మానవ కదలికలు ఉండే అవకాశం లేని దట్టమైన కీకారణ్యం. ఎందుకు? ఏవిటి? ఎక్కడికి? అనే ప్రశ్నలకు జవాబులు ఆయన వద్ద లేవు. అసలు ఆ ప్రశ్నలే రాత్రి చచ్చి పోయాయి.
జరిగింది ఏవిటో, తనిక్కడకు ఏలా వచ్చాడో.. కవ్వల బృందం ఎలా తనను ఇక్కడికి తెచ్చిందో గుర్తు చేసుకుంటే గుండేలవిసిపోతున్నాయి అ మహా యోధునికి.
ఎవరైనా దాడిచేసి శరీరంపై ఉన్న ఆభరణాలు దోచుకుని పారిపోయే నిర్జన పరిస్థితుల్లో లేడు. పూర్తి స్థాయి యుధ్ధ క్షేత్రంలో కాకతీయ స్కంధావారంలో ఉన్నాడు. తోడుగా క్షణక్షణం యుద్ధ వార్తలను అందుకుని చర్చిస్తున్న తిక్కనామాత్యులున్నారు. చుట్టూ ఎంతోమంది సాధారణ సైనికులున్నారు. అందరిని మించి మహాయోధులైన తన అంగరక్షకులు న్నారు. ఏ కీడు శంకించిందో.. రుద్రమ రెండంచెల భద్రతను ఏర్పరచింది. గోల్లెనదాటి యుద్ధ క్షేత్రానికి రావద్దని గౌరవంగానూ, ఆజ్ఞగానూ చెప్పింది. తను అలాగే కేవలం తిక్కనామాత్యునితో కలసి యుద్ధ తంత్రాలు చర్చిస్తూ లోపలే ఉన్నాడు గాని బయటకు రాలేదు. అలాంటిచోట ఓ ఆడది తన యోధులతో గోల్లెనలోకి ప్రవేశించి తిక్కనామాత్యుని కొట్టి, పక్కకు నెట్టి తన అంగరక్షకులను అతి కిరాతకంగా చంపేస్తూ తనను పట్టి ఈడ్చుకుంటూ లాక్కెళ్లి పల్లకిలో పడేసి అడ్డొచ్చిన సైనికులను, తన పల్లకి బో•లను నిర్దాక్షిణ్యంగా ఖడ్గాలతో నరికేస్తూ ముందుకు దూసుకుపోతూ స్కంధావారం నుండి బయటకు తీసుకుపోయారంటే ఆమె తెగువ, ప్రణాళిక, వాళ్ల మొరటుదనం వణుకు పుట్టిస్తోంది.
అడవిలో నడుస్తూ నిన్న జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకుంటున్నాడు గణపతిదేవుడు. శత్రువులను ఇలా అపహరించి తీసుకుపోవడం ఆయనకు తెలియని అనుభవం. యుద్ధ క్షేత్రాలలో ఎదురెదు రుగా నిలబడి ధర్మయుద్ధం చేయడమే ఆయనకు తెలిసిన యుద్ధనీతి. మరో విధానపు శత్రుత్వం ఆయనకు తెలియనిది.
ఓ చెరువు వద్దకు వచ్చాక కాలకృత్యాల నిమిత్తం ఆ ఇద్దరు పరిచారకులు ఆయనను వదలి కాస్త దూరం వెనక్కు వెళ్లారు.
కాలకృత్యాలు తీర్చుకున్నాడు గణపతిదేవుడు.
తనను కవ్వల అపహరించి బంధించి తన గుప్పిట పెట్టుకోవడం ఆయనకు సంభ్రమంగా ఉంది. ఆలోచనలన్నీ నిన్న జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ మనోఫకంపై కదలాడుతున్నాయి.
ఈ కవ్వల పటాలం యుద్ధ్ద స్కంధావారం నుండి తనను వ•డు నాలుగైదు చోట్లకు తీసుకు పోయారు. ఎదిరించిన తన అంగరక్షకులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తన ప్రియతమ పల్లకి బో•లు కూడా తిరగబడగా, ఆ కిరాతక బృందం వాళ్లను కూడా వదలలేదు. కొందరిని చంపేశారు.
రుద్రమ రెండు అంచెల అంగరక్షక బృందాలను ఏర్పాటు చేసింది.
కాని కవ్వల మరింత తెలివి మీరిన దుర్మార్గు రాలు. గతంలో గణపతిదేవుని అంగరక్షకుల ప్రతిభను చూసిన కవ్వల ఈసారి సాధారణ యోధులైన తన అంగరక్షకులను తొలగించింది. నరభక్షకుల్లాంటి కిరాతకులను ఏర్పాటు చేసుకుని గొల్లెనపై దాడి చేసిందని ఆయనకు అర్థ్ధమైంది. వాళ్లు ఎక్కడో సమాజానికి దూరంగా మనుష్యులను నిర్దాక్షిణ్యంగా చంపడానికే పుట్టిన్నట్లున్నారు. సైనికుల కంటే మరింత బలిష్టంగా చూపులకే భయం కొల్పుతున్నారు. యుద్ధ శిక్షణ పొందిన ఆయన అంగరక్షకులంతా ఆ దురాత్ములపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆయనను రక్షించలేక పోయారు. కొందరు అక్కడికక్కడే చనిపోయారు. కొందరు పల్లకి వెంట పరుగులు పెడుతూ కత్తులు ఝుళిపించినా.. పల్లకిని ఆపలేకపోయారు. కాళ్లు, చేతులు తెగి రహదారులలో క్రిందపడి గిలగిల కొట్టుకున్నారు.
అన్ని అడ్డంకులను లాఘవంగా తొలగించు కుంటూ పగలల్లా ప్రయాణించి రాత్రి కూడా ప్రయాణిస్తూ వచ్చి వచ్చి అర్ధరాత్రి వేళ ఇక్కడ ఆగింది.
గాడాంధకారం.. మిణుగురుల మిలమిలల్లో ఎవ్వరూ స్పష్టంగా తెలియడం లేదు. పల్లకి పరుగులతో ఒళ్లంతా మాంసపు ముద్ద అయ్యింది. తన అనుయాయులతో ఆమె దూరంగా వెళ్లింది. కిరాతకుల్లో ఇద్దరు గణపతిదేవుని వద్ద ఆయనకు సహాయకుల్లా ఉండి, అప్పటికప్పుడు గుర్రాల మీదున్న గోల్లెన సంచులను తెచ్చి గొల్లెన నిర్మించారు. గడ్డిలాంటిది లోపల పరచి దానిపై ఓ కంబళి పరిచారు.
‘‘విశ్రమించండి ప్రభూ’’ అన్నారు.
ఆయన కవ్వల కోసం తలతిప్పి అన్నివైపులా చూశాడు.
కాస్త ఆవలగా తన అంగరక్షక బృందంతో తీవ్రంగా చర్చిస్తూ కనపడుతోంది బాలకవ్వల.
ఓ ఇద్దరూ తినడానికి ఏవో ఆకులలో అందించారు.
మౌనంగా తిన్నాడు.
రాత్రి ఆమెను అడిగాడు. ‘‘మనం.. నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావ్‌ ‌కవ్వలా..’’ అని.
‘‘ఏం.. ఎక్కడికో నీకు చెప్పి తీసుకుపోవాలా??’’ పాము చివ్వున పడగ విప్పినట్లు కెవ్వున అరచింది.
నిరుత్తరుడై మౌనాన్ని ఆశ్రయించాడు.
చాలామంది స్థితప్రజ్ఞులలాగే గణపతిదేవుడు కూడా ఎదుటివారు రెచ్చిపోయినప్పుడు స్వరం తగ్గించి,లేదా మౌనంగా ఉంటాడు. సర్వశక్తి మంతుడైన మహాపాలకుడు అయినా పరిస్థితులకు తగ్గట్లు మసలుకోవడం అతనికి పుట్టుకతో వచ్చిన ప్రజ్ఞ.
అసలు ఇప్పటి ఈ ప్రత్యేక పరిస్థితి చాలా చాలా విచిత్రమైనది.
తన హృదయంలో మధురోహలు ఏమైనా ఉన్నాయంటే అవి పెద్దకవ్వల సృష్టించినవి. అవి నిత్యనూతనం. ఆ మనోహర మహిమాన్విత మధుర లోకం నుండి ఆయన బయటకు రావడానికి ఇష్ట పడడు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, దండించినా అన్నీ భరించదానికే ఆయన మనస్సు, శరీరవ• సన్నద్ధం కాని ఆ మధురలోకాన్ని విడిచి రాడు.. ఎప్పటికీ!!
అందుకే ఆయన ఈ బాలకవ్వల నిర్వహిస్తోన్న పగ అనే కార్యకలాపాన్ని మౌనంగా భరిస్తున్నాడు. మరింతగా భరించడానికి.. అవసరం అయితే అందుకు తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధమై ఉన్నాడు. ఆయనకు తన రాజ్యం, తన కుటుంబం, తన బాధ్యతలు బరువులు అన్నీ తెలుసు. వాటిని మర్చిపోయినవాడు కాదు. కానీ వాటికి ప్రత్యామ్నా యాలు ఉన్నాయి. తను లేకపోతే రాజ్యపాలన, కాకతీయ వంశం ఆగిపోదు. తను లేకపోతే ఆంధ్ర రాజ్యస్థాపన ఆలస్యం అవుతుందేమో కాని పూర్తిగా ఆగిపోదు.
కానీ కానీ.. కవ్వల ప్రేమ లోకాన్ని అతడు వదలుకోలేడు.
అందుకే బాలకవ్వల చర్యలకు ఆ మహా ప్రేమికుడు గణపతిదేవుడు సహకరిస్తున్నాడు. అవన్నీ అతనికి వినోదంగా,ఆమె తత్వానికి.. అంటే ఆమెలో జీర్ణించుకుపోయిన పిచ్చి పగకు తగినట్లుగా అనిపిస్తున్నాయి.
అవును మరి.. ఆమె అక్క కోసం ఆమె ఇలా చేయడం సబబేనేమో..’
గణపతిదేవునిలో ఉదాసీనతతో కూడిన ఓ తాత్విక ధోరణి ఉవ్వెత్తున ఎగసి నిలిచిపోయింది.
అందుకు అతడు తన రాచరికాన్ని శౌర్య పరాక్రమాలను కూడా కాసేపు పక్కన పెట్టి బాల కవ్వలకు సహకరిస్తున్నాడు.
* * *
మహాఘటికుడు బెలగావి మహావణిజుడు నానప్పశెట్టి..
ఘటికుడు అంటే అతనికి నీతి, నియమాలు, అనుబంధాలపై గౌరవం తక్కువ. సమాజం పట్ల, విలువల పట్ల హేళన, తూష్ణీభావం ఎక్కువ. వాణిజ్యంతో సమస్త ప్రపంచాన్ని కొనగలమన్న ధోరణి అప్పుడప్పుడే పెరుగుతున్న మహా వణిజులకు ప్రతినిధి ఈ నానప్ప.
గతంలో మహారాజులు వణిజులను అంతగా గౌరవించేవారు కాదు. విదేశీ వర్తకులతో అమాత్యులు నిర్ణయించిన ఓ విధానాన్ని అనుసరించి ఏదో తూతూ మాత్రంగా మాట్లాడేవారు. అలాంటిది ఇటీవల సమాజంలో వణిజులకున్న పట్టును గుర్తించిన మహారాజులు వారికి రాచవంశస్తులతో సమాన స్థాయి, గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. మహారాజులు, చక్రవర్తులు కూడా తనతో స్నేహం చేస్తారంటే కారణం తన మహత్తర వాణిజ్య సామ్రాజ్యమేనని అతని గట్టినమ్మకం. తన అఖండ వ్యాపార సామ్రాజ్యం ముందు సాధారణ రాజులు తలవంచు తారని అతని అనుభవం!! మహారాజులకు భయపడటం, తలవాల్చడం,వినయం చూపడం కేవలం మర్యాదపూర్వకమైన అతి నటన మాత్రమే!!
రాజ్యపాలక వ్యవస్థపై అతనికున్న చులకన భావన వల్ల రాజకుటుంబ స్త్రీలంటే నానప్పకు వల్లమాలిన వ్యామోహం ఏర్పడింది. సాధారణ వ్యభి చారుణులు, గణికలను సొమ్ముతో తేలిగ్గా కొనగలడని అతనికి నూనూగు మీసాల రోజులలోనే అనుభవమయ్యింది. దాంతో వారిపై మోజు ఇప్పుడు లేదు. మహారాణులు, రాచకుటుంబ స్త్రీలు అంటే శృంగార పైత్యం ఎక్కువయ్యింది.
ఇప్పుడు అతని కంటికి నదరుగా.. అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది దేవగిరి రాజ్య వాణిజ్య సందివిగ్రహి బాలకవ్వల!!
ఆమెను ఎలా స్వంతం చేసుకోవాలి?తన అంతఃపురంలో ఎలా బంధించాలి? •ను ఆమె లావణ్యాన్ని తనివి తీరా ఎలా అనుభవించాలి?అనే ఊహల్లో నిరంతరవ• విహరిస్తుంటాడు.
ఇలా విహరిస్తున్న నానప్పశెట్టి ఓ అడవిపందికి శెట్టిల సంప్రదాయ దుస్తులు తొడిగినట్లుంటాడు. నంగినంగిగా మాట్లాడతాడు. మాటకు మాటకు మధ్య నాలుక అడ్డుపడుతుంటుంది.అతనికి పుట్టుకతో వచ్చిన వైకల్యాలపట్ల అతడు సిగ్గుపడడు. పైగా మరింత అసహ్యంగా వాటిని ప్రదర్శిస్తాడు. ఎదుటివారు ఆ నత్తి మాటలకు స్పందిస్తూ జవాబివ్వడం అతనికి మరింత రంజుగా ఉంటుంది. అనవసరంగా నవ్వుతాడు. నవ్వినప్పుడు అతని బంగారు పళ్లు కనిపించాలని తహతహలాడతాడు.
అందరు వణిజ ప్రముఖుల్లాగే నానప్పశెట్టి తనకు అందిస్తున్న సహకారం పట్ల బాలకవ్వల ముగ్ధురాలై పోయింది. కోరింది ‘ఎందుకు ఏవిటి’.. అని ఎదురు ప్రశ్నించకుండా లిప్తల కాలంలో అన్నీ ఏర్పాటు చేయడం ఆమెను సంతోషపరచింది. తన పగ తీర్చుకోవడానికి ఇతగాడు మరింత ఉపయోగ పడుతున్నాడు అని లోలోన మురిసిపోయింది. అదంతా దేవగిరి ప్రభువులపై గౌరవంతో అతడు చూపిస్తున్న సహకారంగా భావించింది కాని లోలోపలి కాముకదృష్టిని ఆమె గుర్తించలేదు. పగ, ప్రతీకారాలతో కళ్లు వ•సుకుపోయిన వారికి బుర్ర, బుద్ధి కూడా వ•సుకుపోయి ఉంటాయి.
ఆమె తన ఆంతరంగిక సహాయ, అంగరక్షక బృందాలుగా సంప్రదాయ యుద్ధ్దవీరులకు బదులు అతి దుర్మార్గులైన నరరూప రాక్షసులను ఏర్పాటు చేయాలని కోరగా.. ఎందుకు? అని అడగకుండా ఏర్పాటు చేశాడు నానప్ప. ఆమె కోసమే అన్ని చేస్తున్నా… లోలోపల ఆమె కోరికల పట్టిక అతనిని ఆశ్చర్యపరచింది.
ఆమె కేవలం దేవగిరి వాణిజ్య విగ్రహిగా ప్రవర్తించడంలేదు. యోధురాలిలా నిరంతరం యుద్ధ్దతంత్రాలు మాత్రమే కాదు.. ప్రత్యేకించి కాకతీయరాజ్యం, దాని సామంతరాజ్యాల నాశనం, తెలుగుప్రజలను హింసించడం.. తెలుగువారిపై కక్షకట్టి వారి నాశనాన్ని కోరడం.. అందుకు వణిజులను రెచ్చగొట్టి, తెలుగుభాష మాట్లాడేవారికి దైనందినంలో ఇబ్బందులు కలగజేయడం.. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ ఆమె ఆశయం ఏవిటో.! ఏమి సాధించాలని అనుకుంటోందో అతనికి ఓ పట్టాన స్పురించలేదు.
అందుకే అతడు తన మనుష్యులు ఇద్దరిని ఆమె బృందంలో చేర్చాడు.
వాళ్లే తిమ్మప్ప, గౌరయ..
వాళ్లిద్దరూ గణపతిదేవుని వ్యక్తిగత సహాయకులుగా బాలకవ్వలే నియమించేలా తెలివిగా ప్రవర్తించి.. విజయవంతంగా నిరంతరం ఆయన సరసన ఉంటున్నారు.
ఈ అతి తెలివితేటలే నానప్పను ఎవ్వరూ చూడని.. వినని దారుణమైన చావుకు గురిచేశాయి.
* * *
‘‘మహారాజా.. తెల్లవారింది..’’
‘‘మహారాజా.. తెల్లవారింది..’’
చటుక్కున మెలకువ వచ్చింది మహారాజు గణపతిదేవునికి. మునగదీసుకుని పల్లకిలో నిద్రపోతున్నవాడల్లా కదిలి లేచాడు. ఒళ్లు విరుచుకోవాలన్నా బయటకు రావాలి.. మెల్లగా తెర తొలగించుని చూశాడు. ఎప్పటిలాగే కీకారణ్యం.. దగ్గరగా కమ్ముకున్న బలిష్టమైన చెట్లు.. ఆకాశాన్ని తాకుతున్నట్లున్న వాటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు. కింద ఎండు కట్టెలు.. పెద్ద పెద్ద ఆసనల్లా బలిష్టమైన పెద్ద వృక్షాల మొదళ్లు .
అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు.. చల్లని ఉదయరాగాలకు స్పందనగా తలలూపుతున్నట్లు దగ్గరగా తాకుతూ కదలాడుతున్న లేత కొమ్మల ఆకులు.. ఏదో కమ్మని ధ్వని అంతటా పరచుకుని తెలుస్తోంది.
రాజప్రాసాదంలో ఉదయం నిద్రలేపే మహా సంగీతజ్ఞుల గానాలాపన నుండి ఈ సహజ ప్రకృతి గానాలాపనకు నిద్ర లేవడం ఇప్పుడిప్పుడే అలవాటౌతోందా మహారాజుకు.
దగ్గరగా తిమ్మప్ప, గౌరయ.. ఎప్పటిలాగే చేతులు కట్టుకుని తలవాల్చి నిలబడి ఉన్నారు.
నేలపై ఆన్చిన పల్లకి గుడ్డ నుండి బయటకు వచ్చాడు.
అప్పుడు చూశాడు ఎదురుగా ఓ కొత్త వ్యక్తిని. ఉలిక్కిపడి కళ్లు చికిలించి చూశాడు. ఆ కొత్త వ్యక్తి కూడా అప్పటికే నోరు తెరచి గణపతి దేవుని అబ్బురంగా చూస్తున్నాడు. చొంగ కారుతున్నా గుర్తించడం లేదు. అది దిక్కులు తెలియని కీకారణ్యం కావడంతో అక్కడ కనిపించిన ప్రతివ్యక్తి అక్కడికి ప్రత్యేకించి పని ఉంటేనే వస్తారని ఆయనకు తెలుసు.
గణపతిదేవుడు అటూఇటూ నలుదిక్కులా గబగబా తలతిప్పి చూశాడు. కవ్వల ఎక్కడ? అన్నట్లు.
ఆమె, ఆమె బృందం ఎవ్వరూ కనిపించలేదు.
అప్పుడు కదిలి ముందుకు వచ్చాడు తిమ్మప్ప.
‘‘మహారాజా.. వారు మహావణిజులు నానప్ప శెట్టిగారు. శెట్టిగారూ.. వారే కాకతీయ మహా ప్రభువులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులవారు.’’
ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారొక క్షణం..
ముందుగా మేల్కొన్నవాడు గణపతిదేవుడు.
‘‘కవ్వల మహారాణీవారు.. ఆమె ఎక్కడ తిమ్మప్పా.?.’’ అడిగాడు.
‘‘ఆమె .. ఆమె ఇక్కడ లేరు ప్రభు..’’ తల వంచుకుని చెప్పాడు తిమ్మప్ప.
చొంగ కార్చుకుంటూ చూస్తున్న నానప్ప, కిసకిసా వెకిలిగా నవ్వి,‘‘నిన్ను ఎక్కడికో ఎత్తుకుపోతున్న దాని దగ్గర నుండి నిన్ను నా దగ్గరికి రప్పిచ్చా. ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరుగా..’’
మళ్లా ఒళ్ళంతా ఊపుతూ నవ్వాడు నానప్ప.
అప్పటివరకు నానప్పను.. అతని వికార శరీరాన్ని.. అతడు తనను చూస్తున్న రోత చూపును భరిస్తున్న గణపతిదేవుడు చివ్వున కదిలి తల మరింత ఎత్తాడు.
‘అది? అది… అని ఎవరిని అంటున్నాడు వీడు?’
నానప్ప మాటలకు ఆయన స్పందన ఏమైవుంటుందోనన్నట్లు చివ్వున చూశాడు తిమ్మప్ప. చూసిన తిమ్మప్ప భయంతో బెరుకుగా అడుగు వెనక్కు వేశాడు.
వణిజుడు నానప్పశెట్టి వెకిలి మాటలకు గణపతిదేవుడు ఉద్రిక్తుడౌతున్నాడు.
ఇది గమనిస్తున్నాడు తిమ్మప్ప.
ముడుచుకుని మౌనముద్రలో నున్న ఓ మహాపర్వతం ఏదో అనుకోని సంఘటనకు చటుక్కున కదిలి తల ఎత్తినట్లుంది తిమ్మప్పకు. వారం రోజులుగా గణపతిదేవుని దగ్గరగా చూస్తోన్న తిమ్మప్పకు ఆయనపై ఓ ఆరాధనాభావం మనస్సంతా ఆక్రమించుకుని ఉంది. ఆయన ప్రతి కదలిక, ప్రతి చూపు, ప్రతి నవ్వు మహోదాత్తంగా ఉంటాయి తిమ్మప్పకు. ఎప్పుడూ మహారాజులను దగ్గరగా చూడని ఆ అడవి వ•ర్ఖ బలాఢ్యునికి•.. ఓ రాజ్యానికి మహారాజు, ఓ మహా మేధావి అయిన వీరాధివీరుడు, వేల లక్షల సైన్యాలపై సైన్యాధిపతులకే సైన్యాధిపతి అయినవాడు, అనేకానేక మండలాల పాలకులకే పాలకుడైన మహా మండలేశ్వరుడు, విస్తృతమైన అనేకానేక రాజ్యాలను జయిస్తూ తన రాజ్యంలో కలుపుకుంటూ మహాసామ్రాజ్యజైత్రయాత్రగా సాగిపోతున్న ఓ చారిత్రక మహాపురుషుని సమక్షంలో తాను ఉన్నానన్న స్పృహ అతనికి అప్పుడప్పుడే తెలుస్తోంది.

(సశేషం)

– ‌మత్తి భానుమూరి

About Author

By editor