జూలై 29 గురు పౌర్ణమి సందర్భంగా
హిందూ సమాజంలో అనాదిగా గురుపూజ పద్ధతి ఆచరిస్తూ వస్తున్నారు. గురుపూజ రోజున గురువును దర్శించుకొని ఆశీర్వచనాలు పొందిన ఒక నమ్మకంతో జీవితాన్ని సాగించడం అనేది మన సంస్కృతిలో విడదీయరాని భాగమైంది. తన జీవితంలో ఒడుదొడుకులను తట్టుకొనేలా వ్యక్తిని నడిపించేది ఈ గురు మార్గ దర్శనమే. దీనికి కులంతో సంబంధం లేదు. పేద, ధనిక అందరూ గురువు ముందర సమానమే.
అయితే ఈ గురువు ఎవరు? చీకటిని పారద్రోలేవాడు గురువు. అనగా మనలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించేవాడు. ఒక ఉపనిషత్‌లో ఒకడు నేను 22 మంది గురువులను కలిగి ఉన్నాను అంటారు. అంతమంది ఎవరు అంటే పలానా జంతువు నుండి నేను ఓర్పును నేర్చుకున్నాను. కనుక అది నా గురువు. ఫలానా పక్షి నా గురువు ఎలాగంటే సుదూరంగా ఉన్న వస్తువును చూడటం దాని నుండి నేర్చుకొన్నాను. ఈ విధంగా 22 గుణాలను పశుపక్ష్యాదుల నుండి నేర్చుకున్నానని అంటారు. మనిషి / పక్షి / జంతువు ఇలా ఏదైనా సరే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. గురువు లేకుండా ఎలాంటి సకారాత్మక పనిని ప్రారంభించలేమనేది మన హిందువుల విశ్వాసం. కనుక అన్ని కులాల్లో, అన్ని పంథాలలో, అన్ని మతాలలో వారి వారి గురువులు ఉన్నారు. ఈ విధంగా సంస్థగా/ కుల/మతపరంగా/వ్యక్తిగతంగా కావచ్చు, గురుపరంపర అనేది కొనసాగుతూ వస్తున్నది.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించాక గురువుగా ఎవరినైనా తీసుకోవాలని డాక్టర్జీ ఆలోచించారు.. సంఘం ప్రారంభించిన 1925 విజయదశమి రోజున గురువు గురించి ఆలోచించలేదు. రెండు సంవత్సరాల తర్వాత 1927లో ఒక రోజు శాఖ చివరలో డాక్టర్జీ సూచన ఇస్తూ రేపు గురుపూజ కనుక మన సంప్రదాయం ప్రకారం గురుదక్షిణ ఇవ్వడం ఆచారం. కనుక, గురువుకు సమర్పించేందుకు ఎంత పెద్ద మొత్తమైనా, చిన్న మొత్తమైనా పర్వాలేదు. కానీ, అందుకు సిద్ధమై రేపు రండి. ఇక అదనపు సూచనలు ఏమీ ఉండవు అని అన్నారు. శాఖకు అనేక నెలల నుండి వస్తున్న స్వయంసేవకులు డాక్టర్జీ చెప్పిన విషయాలను చర్చించుకోవడం మొదలుపెట్టారు. డాక్టర్జీ రేపు గురుపూజ అని చెప్పారు. కానీ, ఇంతకీ గురువు ఎవరు? మనం ఎవరిని గౌరవించి, పూజించాలి? సంఘానికి గురువుగా ఎవరుంటారని చర్చించుకున్నారు. డాక్టర్జీ సంఘాన్ని స్థాపించారు. ఆయనే మన ఇంటికి వస్తారు. మన బాగోగులు చూసుకుంటారు.తల్లిదండ్రుల తర్వాత ఆయనే మనల్ని ప్రేమిస్తారు. కాబట్టి, ఆయన మనకు గురువు. ఈ వాదన పట్ల వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మెజారిటీ స్వయంసేవకులు డాక్టర్జీని గురువుగా పూజించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆర్యసమాజంలో దయానంద సరస్వతిని పూజిస్తారు. రామకృష్ణ మిషన్‌లో రామకృష్ణ పరమహంసను ఆరాధిస్తారు. అలాగే, ఎన్నో సంస్థలు ఇదే చేస్తాయి. కనుక, సంఘం డాక్టర్జీని పూజించడంలో తప్పు లేదు, సహజం కూడా.
మరుసటిరోజు స్వయంసేవకులందరూ శాఖలో కలిసారు. శాఖలో ప్రతిరోజూ భగవాధ్వజాన్ని ఎగురవేసే వారు. కానీ, అదే గురువు అని వారికి ఎవరూ చెప్పలేదు. అందువల్ల వారు ముందు రోజులానే ఆ రోజున కూడా భగవాధ్వజాన్ని ఎగురవేశారు. ప్రాథమిక వ్యాయామాల తర్వాత వారంతా వరుసల్లో కూర్చున్నారు. అప్పుడు డాక్టర్జీ స్వయంసేవకుల ముందుకు వచ్చి గురుపూజ గురించి వివరించారు. అది చాలా క్లుప్తమైన ఉపన్యాసం. ‘‘ఈ భగవాధ్వజం గురువుగా సంఘం ఆమోదించింది’’ ఇది ఆనాటి వారి ఉపన్యాసంలోని సారాంశం. నేను మొదటగా గురుపూజ చేస్తాను. తర్వాత మీరంతా ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి పూజించండి అని చెప్పారు. తొలి గురుపూజను సంఘ వ్యవస్థాపకులు డాక్టర్జీ చేశారు. తర్వాతే ఇతరులు ఆయనను అనుసరించారు. తన చర్యల ద్వారా, గురువు ఎవరో వెల్లడించడంతో, డాక్టర్జీ గురువు కాదని, సంఘ సంస్థాపకునితో సహా అందరికీ భగవాధ్వజమే గురువు అని నాటి స్వయంసేవకులకు అర్థమైంది. ఈ రకంగా సంఘంలో గురుపూజ ఉనికిలోకి వచ్చింది.
డాక్టర్జీ భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు ఎంచుకున్నారు? ఏ వ్యక్తీ కూడా పరిపూర్ణుడు కాడు. కానీ, మనందరం ఆయనను గురువుగా భావించాం. ఆ రోజుల్లో సంఘ స్వయంసేవకులెవరికి ఆయనలో లోపాలు కనిపించలేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన గురువు అయితే, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కాని, దానిని డాక్టర్జీ ఆమోదించలేదు. ఎందుకంటే, వ్యవస్థ అంతా కూడా నిరపేక్షంగా ఉండాలని, వ్యక్తి ఆరాధనగా మారకూడదని మనసారా కోరుకున్నారు. దీని వెనుక రహస్యం ఏమిటి? ఆర్‌ఎస్‌ఎస్ భారత్‌లో ఒక ఉద్యమంగా ఉండాలన్నదే లక్ష్యం. హిందూసమాజ పునరుజ్జీవనమే లక్ష్యం. హిందూ సమాజం క్షీణించి, నిరాశతో, శిథిలమై, పరాజయం పాలై, దిగజారి అంతిమంగా విదేశీ శక్తులపై ఆధారపడుతూ, పరాధీనగా మారింది. ఇలాంటి సమాజాన్ని పునరుజ్జీవింప చేయాలి. దానికి ముందు వరుసలో ఉండవలసిన దూతలు ఎవరంటే, మనమే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (స్వయంసేవకులం). కనుక, సంఘం ఒక ఉద్యమంగా, ఒక సంస్థగా ఉండాలే తప్ప వ్యవస్థ కాకూడదు. ఎందుకంటే, వ్యవస్థ ఎప్పుడూ పరిమితమైందే. నిర్మాణం అనేది అపరిమితమైంది, నిత్యం ఎదిగేది. ప్రలు పెరిగే కొద్దీ పెరిగేదీ, సమస్యలను పరిష్కరిస్తూ ఎదిగేది. సంఘాన్ని ఒక ఉద్యమంగా, ఒక నిర్మాణంగా భావించారు. ఇంతటి సృజనాత్మక• నిర్మాణానికి ఒకే వ్యక్తి గురువుగా ఉండలేడు. ఎందుకంటే, వారి జీవితకాలం పరిమితం. తర్వాత మరొకరిని గురువుగా భావించవచ్చు. కానీ. అంతిమంగా ఆ వ్యక్తుల ఇష్టాయిష్టాలతో మనం ప్రభావితం అవుతాం. అందుకే, డాక్టర్జీ ముందు చూపుతో, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక వ్యక్తి గురువుగా ఉండకూడదని నిర్ణయించారు. అతడు పరిపూర్ణుడే అయి వుండవచ్చు, కానీ గురువు నిరపేక్షంగా ఉండాలి. ఈ గురువును ఎలా ఎంపిక చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు, సంఘ ఆదర్శమే గురువు కావాలని భావించారు. ఎందుకంటే, ఆదర్శం నిరపేక్షంగా ఉంటుంది. మనం సాహిత్యాన్ని చదివో, ఉపన్యాసాలకు ప్రభావిత మయ్యో, దాని ఆదర్శాల పట్ల ఆకర్షితమయ్యో సంఘంలో చేరాం. ఒక వ్యక్తి మీకు ప్రేరణను ఇవ్వవచ్చు, మార్గదర్శిగా ఉండవచ్చు కానీ సిద్ధాంతపరంగా చూసినప్పుడు ఆదర్శమే గురువు తప్ప వ్యక్తి కాదు. కనుక, మనకు మార్గదర్శనం చేసే సంఘ ఆదర్శాలే మనకు గురువు అని డాక్టర్జీ నిర్ణయించారు. మొదటగా సంఘానికి ఆదర్శమే గురువు. కానీ, ఆచరణాత్మకంగా, భౌతిక స్థాయిలో చూసినప్పుడు ఆదర్శానికి ఒక రూపం ఉండదు. రసాయన శాస్త్రపరంగా చెప్పాలంటే, దానికి రంగు, బరువు ఉండదు. అది వాయువు కాదు, ఘనం కాదు, ద్రవం కాదు. కనుక, ఆదర్శమనేది నిరాకారమైనది. దానికి మనకు మార్గదర్శనం చేసే, ప్రేరేపించే శక్తి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, అది ఆత్మ వంటిది. మనం ఆత్మను చూడం, దాని బురువు ఎంతో మనకు తెలియదు. దాని రంగు, వాసన మనకు తెలియదు. కానీ, అది ఉనికిలో ఉంటుంది. అలాగే, ఆదర్శం కూడా ఉనికిలో ఉంటుంది. అది నిరాకారమైనా, రంగు, వాసన ఏమీ లేనిదైనా. ఆ ఆదర్శమే మన గురువు. కానీ, ఒక ఆచరణాత్మక వ్యక్తికి శూన్యంలోకి చూసే ఆ నిరాకార ఆదర్శం సరిపోదు. అతడికి ఆదర్శానికి సంబంధించిన ఒక భౌతికమైన వస్తువు కావాలి. అది తాను చూడగలిగే, దృష్టిపెట్టగలిగే, ఏకాగ్రతతో ఉండగలిగే ఒక వస్తువై ఉండాలి. కనుక, ఆదర్శాన్ని భౌతికంగా చూపాలి. నిరాకారమైన ఆదర్శాన్ని, సాకారంగా మార్చాలి. దీనితో, డాక్టర్జీ మన ఆదర్శానికి ప్రాతినిధ్యం వహించగలిగినది ఎవరు అని ఆలోచించారు. శాశ్వతమైన ఆదర్శానికి ప్రాతినిధ్యం వహించగల శాశ్వతమైన వస్తువు ఏమిటి?ఆ దృష్టికోణంలో ఆయన ఆలోచించారు. విగ్రహంలోకి సాక్షాత్తు భగవంతుడే ప్రవేశించినట్టు. ఆ భగవంతుడిని మనం సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడని అంటాం. కాని అత్యంత ఉన్నతమైన, గొప్ప ఆత్మలు మాత్రమే ఆ ఉత్కృష్టమైన స్థాయికి చేరగలవు. మనం మానవులం, కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే, విజ్ఞత కలిగిన వ్యక్తి అనంతమైన దానికి ప్రాతినిధ్యం వహించేందుకు విగ్రహాలను తయారు చేశాడు. అనంతమైన దానికి ప్రాతినిధ్యం వహించే పరిమితమైన వ్యక్తీకరణ- మూర్తి. ఈ మూర్తి పూజ ద్వారానే మనం ఈశ్వరపూజ చేయగలం. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్ ఆదర్శం నిరాకారమై నప్పటికీ, దానిని సాకారం చేయవలసి వచ్చింది. అప్పుడు డాక్టర్జీ భగవాధ్వజం ఆదర్శంగా ఉండగలదని ప్రతిపాదించారు.
ఈ రకంగా ఆయన భగవాధ్వజాన్ని ఎంపిక చేశారు. కానీ, భగవాధ్వజమే ఎందుకు? దానికి చారిత్రికమైనవి, సాంస్కృతమైన అనేక కారణాలున్నాయి. కాషాయం అంటే భగవా. ఇది వేదాలలో ప్రస్తావనకు రావడమే కాదు, అగ్నికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. హిందూ సంస్కృతిలో అగ్ని అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలోనే తొలి ధార్మిక సాహిత్యమైన వేదాలలోని ‘అగ్నిమీళే పురోహితం’ అని చెప్పబడింది. ఆ అగ్ని రంగు భగవాధ్వజం రంగే. కనుక, ఈ ధ్వజం మన యజ్ఞానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. త్యాగానికి ప్రతినిధి. అలాగే ఉదయించే సూర్యుడి రంగు కాషాయమే. అస్తమించే సూర్యుడి రంగు కూడా. కనుక, సూర్యుడు, అగ్ని మనకు వెలుతురు ఇస్తాయి. అటు అగ్ని, ఇటు సూర్యుడికి కూడా కాషాయ రంగే ప్రాతినిధ్యం వహిస్తుంది. మనం వెలుగును ఒక రూపంగా ఆరాధించినప్పుడు, ఆదర్శంగా తీసుకున్న క్రమంలో భగవాధ్వజం ఆలోచన వచ్చింది. కనుక, భగవాధ్వజం అగ్ని దేవుడికి, సూర్యదేవుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సంస్కృతంలో అగ్ని వ్యుత్పత్తి ఏమిటి? దాని అర్థం పైకి చూస్తూ, పైకి ఎగిసి పడేదే అగ్ని. మనం అగ్నిజ్వాలలను చూసినప్పుడు, అది పైకి వెళ్తుంది తప్ప కిందకు వెళ్లదు. ఒక కాగడాను వెలిగించి, దానిని కిందకు తిప్పి ఉంచినా, దాని జ్వాలలు పైకే వెడతాయి. ఎప్పుడూ పైకే చూస్తుంది. అగ్నిఅనగా ముందుకు నడిపించేది అని అర్థం. మనం ఎప్పుడూ ముందు చూపుతో ఉండేవాళ్లం, ఉన్నతత్వాన్ని చూసేవాళ్లం. పునరుత్థానం చెందాలని కోరుకునే పతనమైన సమాజానికి ఇది ఒక మంచి చిహ్నం. సూర్యుడినే తీసుకుందాం, విజయం సాధించిన సమయంలోనూ, పరాజయం పాలైనప్పుడు కూడా అతడు ఆశను కోల్పోడు. విజయంలో ఏ రంగులో ఉంటాడో, ఓటమిలోనూ అదే రంగులో ఉంటాడు. కనుక, కృష్ణ భగవానుని ప్రకారం ‘సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ’ జయాపజయాల్లోనూ, సుఖదుఃఖా ల్లోనూ సమచిత్తం, సమభావంతో ఉండాలి. అటువంటి సమభావం సూర్యుడిలో ఉంది. కనుక, ఆయన ఉదయించినప్పుడు ఎలా ఉంటాడో, అస్తమించే సమయంలోనూ అలాగే కనిపిస్తాడు. కనుక, యుద్ధ సమయంలోనూ, శాంతి కాలంలోనూ సమభావన ఉండాలి. ఆ సమభావనకు ఈ కాషాయ రంగు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, అగ్నిని పావక అని కూడా అంటారు. హిందీలోనూ, సంస్కృతంలోనూ పావక అంటే దేనినైనా పవిత్రం చేసేది అని అర్థం. మీరు అగ్నిలో ఏమి వేసినా, అది శుద్ధి అవుతుంది. అంటే, అగ్ని శుద్ధి చేసే స్వభావం కలిగినది. మనలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి, మన జీవితాన్ని పవిత్రం చేసే గురువు మనకు కావాలి. గతంలో అనేక పాపాలు చేసి ఉండవచ్చు, తప్పు మార్గంలో నడిచి ఉండవచ్చు. వాటిని శుద్ధి చేసే మార్గదర్శి మనకు ఉండాలి. అగ్ని అనేది శాశ్వతంగా శుద్ధీకరణ చేసేది. అదే భగవారంగు. కనుక, ఈ భగవా జెండా మన సంస్కృతికి సంబంధించిన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
యజ్ఞం అంటే ఏమిటి? మనం ఆహుతి ఇవ్వాలి. అంటే, మనం తర్పణం ఇవ్వాలి. తర్పణం అంటే అర్పణ. అర్పణ అంటే సమర్పణ. సమర్పణ అంటే సంపూర్ణ అంకితభావం. షరతులు లేని అంకిత భావం. దీనినే సమర్పణ అంటారు. అదే యజ్ఞం. జీవితమే ఒక యజ్ఞం కావాలంటే, మనకు అంకితభావమనే గుణం ఉండాలి. త్యాగం చేసే స్వభావముండాలి. దాని నుంచి సంతృప్తి వస్తుంది. స్వయంసేవకులందరిలో ఈ లక్షణాలన్నీ పొందుపరచాలన్నది డాక్టర్జీ లక్ష్యం. అంకితభావం లేకుండా సంఘం ఎదుగలేదు. ఆధునిక కాలపు సుఖాలను త్యాగం చేయకుండా సంఘం పెరగలేదు. కనుక, మనం మన జీవితాలను అంకితం చేయాలి, అవసరం లేని వాటిని త్యాగం చేయాలి. ఈ అంకితభావపు రంగు భగవా అనే అగ్ని రంగు. కనుక, డాక్టర్జీ ఈ భగవాధ్వజాన్ని మన గురువుగా ఎంపిక చేశారు. ఇదే చారిత్రిక, సాంస్కృతిక, ధార్మిక కారణం. అగ్ని, సూర్యుని విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక, మన ధ్వజంపై ఒక పదం కానీ, ఒక గుర్తు కానీ ఉండదు. ఎందుకంటే, గుర్తు అనేది ఇతరుల నుంచి వేరుచేసే ఒక ప్రత్యేక అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఉదాహరణకు, ఒక సంకేతంపై భగవా ముద్ర వేస్తే, అది ఆ ప్రత్యేక సంస్థకు చెందుతుంది. రామకృష్ణ మిషన్‌ను తీసుకుంటే దాని భగవాధ్వజం దానికే చెందింది. అలాగే, చిన్మయ మిషన్ విషయమూ అంతే. భవిష్యత్తులో మొత్తం వ్యవస్థీకృత సమాజం ఉండాలనేది డాక్టర్జీ భావన. అందుకే సంఘానికి చెందిన భగవాధ్వజంపై ఎటువంటి గుర్తు ఉండాలని డాక్టర్జీ కోరుకోలేదు.
చరిత్రలోకి వెళితే, ప్రతి భగవద్గీత పుస్తకంలో ముద్రించే అర్జునుడి రథంపై ఉన్న జెండా రంగు ఏమిటి? ఆ జెండా రంగు కాషాయం/భగవా. అలాగే, గీతాప్రెస్ ముద్రించిన వాల్మీకి రామాయణం చిత్రాలు ఉన్నాయి. వాటిని సంఘం చొప్పించలేదు. వాల్మీకి రామయణంలో దాని రంగు భగవానే. అలాగే, బ్రిటిష్ వారు మన దేశంలోకి వచ్చేవరకూ ప్రతి రాజు తాలూకు, అది మైసూరు రాజు కావచ్చు, మరొకరు కావచ్చు. కానీ రంగు ఒకటే, అది భగవా. కనుక, ఈ భూమిపై ఉన్న రాజులందరూ ఈ భగవాజెండాను కలిగి ఉన్నారు. అయితే, వారి మధ్య ఉన్న తేడాలను గుర్తించేందుకు, వాటిపై వివిధ సంకేతాలను ముద్రించుకున్నారు. అర్జునుడు తన జెండాపై కపి అంటే హనుమను కలిగి ఉన్నాడు. అందుకే, ఆయన జెండాను కపి ధ్వజం అన్నారు. మరొక రాజు జెండాపై మొసలి ఉన్నది, కనుక దానిని మకర ధ్వజమన్నారు. రంగు ఒకటే కానీ సంకేతం భిన్నమైంది, దానితో వారిని గుర్తించేవారు. చారిత్రకంగా, ఈ రాజులందరూ ఈ భగవారంగును ఉపయోగించారు. అలాగే, సన్యాసులందరూ ఏ ప్రాంతంవారైనా ఒకటే రంగు ధరిస్తారు. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా ఒక్కసారి వారు సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ప్రతి రంగునూ విసర్జించి, అందరూ భగవాను ధరించారు. ఇది మన ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహించే రంగు. అది త్యాగానికి, నిస్వార్ధతకు రంగు, దైవత్వంవైపు పయనించే వారి రంగు, ఇది మొత్తం సమాజాన్ని వసుధైక కుటుంబంగా భావించి పని చేసే వారి రంగు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఆ రంగు ప్రాధాన్యాత అది. క్లుప్తంగా, ఈ భగవారంగు మన భూమి క్షత్రియత్వానికి, బ్రహ్మత్వానికీ, భారత శాశ్వత కర్తవ్యానికీ ప్రతినిధి. కనుక, డాక్టర్జీ మన జెండా రంగు ఇదే ఉండాలని సరిగా ఎంపిక చేసి, ఎగురవేశారు. ఆయన ఎంత లోతుగా ఆలోచించి ఉండవచ్చు. అందరినీ కలుపుకుపోయే గుణం ఆ రంగుకు ఉంది. అది భౌగోళిక, మతపరమైన, తాత్విక భేదాలన్నింటినీ అధిగమిస్తుంది. ఇది అన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అన్నింటినీ కలుపుకుపోయే తత్వం అన్నది గొప్ప గుణం. వ్యక్తిగతం కానిది, ఆపేక్ష లేనిది నిరంతరం ప్రవహిస్తుంది. ఈ నిత్యత్వం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వ్యక్తి మరణిస్తాడు కానీ ఆదర్శం మరణించదు. భగవా ఒక ఆదర్శానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే, అది తరాలు మారుతున్నా కొనసాగుతుంది. వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ భగవా నిరంతరం కొనసాగుతుంది.
క్రీడలకు చెందిన ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఫోర్ ఇంటు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్ జరుగుతోంది. దాని ట్రాక్‌లను వృత్తాకారంలో వేశారు. నాలుగు లేదా ఐదు ట్రాకులతో ఒక పెద్ద సర్కిల్ క్రీడాకారులు పరుగు తీసేందుకు ఏర్పాటు చేశారు. జట్టులో నలుగురుంటారు. ఆ సర్కిల్‌లో నలుగురు వ్యక్తులు సమానదూరంలో ఉంటారు. వారి చేతిలో బాటెన్ ఉంటుంది. వారు వేగంగా పరుగుతీస్తారు. పావు వంతు సర్కిల్‌ను పూర్తి చేసిన తర్వాత, అక్కడ నిలబడి ఉన్న తమ జట్టు సభ్యుడికి ఆ బాటెన్‌ను అందచేసి, పరుగు ఆపేస్తారు. బాటెన్ అందుకున్న వ్యక్తి పరుగులు తీయడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి సగం దాకా వెళ్ళినప్పుడు రెండవ జట్టుని ఆపి, వారి నుంచి బాటెన్‌ను అందుకుని, పరుగు ప్రారంభిస్తుంది. ఇప్పుడు మొత్తం ఆ సర్కిల్‌లో పరుగులు తీసిందెవరు. అది నలుగురు సభ్యులున్న జట్టు. వీరిలో ఏ ఒక్కరూ మొత్తం ఆ వృత్తంలో పరుగెత్త లేదు. వారి బాటెన్ చేతులు మారి, పరుగు పూర్తి చేసింది. కాని, క్రీడాకారులు పావు వంతు మాత్రమే పరుగుతీశారు. ఇక్కడ వ్యక్తికిగల పరిమితిని చూడవచ్చు, బాటెన్‌కున్న శాశ్వతత్వాన్ని చూడవచ్చు. ఆ బాటెన్ భగవా వంటిది. దీనిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడికి అందించగా, శ్రీకృష్ణుడు తర్వాతి తరానికి అందచేశాడు. అలా తదుపరి తరాలకు అది అందుతూ వచ్చింది. మహారాణా ప్రతాప్ తరం నుంచి శివాజీ తరం వరకు, శివాజీ తరం నుంచి తర్వాతి తరానికి, దాని నుంచి డాక్టర్జీ వరకు అదే బాటెన్ అందింది. భగవాన్ శ్రీరాముడి చేతిలో ఉన్న ఆ బాటెనే, నేటి డాక్టర్జీ చేతులకు అందింది. అలా తరతరాలుగా అందచేసిన ఆ బాటెనే భగవాధ్వజం. ఈ రకంగా, వ్యక్తి శాశ్వతం కాకపోయినప్పటికీ, భగవా శాశ్వతంగా నిలిచింది. ఈ భగవాను ఆర్‌ఎస్‌ఎస్ స్వీకరించింది. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ నుంచి ఎటువంటి గుణాలను ఆశిస్తుంది? జాతీయంగా, సాంస్కృతికంగా జాగృతం కాకుండా, ఎవరుపడితే వారు స్వయంసేవకులు కాలేరు. తమకున్న దురలవాట్లను మానుకొని, శీలవంతులు కానంత వరకూ ఎవరూ స్వయంసేవకులు కాలేరు. నిస్వార్ధమైన, స్వీయ ప్రేరిత, జాతీయ భావాలు కలిగి, జాతికి అంకితమై, శీలవంతులై, అద్భుతమైన పనితీరు ప్రదర్శించేవారు మాత్రమే కాగలరు.
అందుకే, స్వయంసేవకులు కావడం అంత తేలిక కాదు. స్వయంసేవకుడు అయ్యేందుకు, ఆర్‌ఎస్‌ఎస్ అనే ఈ శక్తివంతమైన సంస్థ చేపట్టిన ఉద్యమంలో తాను కూడా భాగమయ్యేందుకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకోవాలి. ఆ మార్పును తీసుకువచ్చేందుకు మనకు ప్రేరణను ఇచ్చేదే ఈ భగవాధ్వజం. మీ జీవితాన్ని అంకితం చేయాలని భగవాధ్వజం పిలుపునిస్తున్నది. ఈ పని కోసం ఎక్కువ సమయం కేటాయించాలి, నిస్వార్ధంగా ఉండాలి. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించు కోకూడదు. బహిర్గతంగా మనిషి రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు, నోరు వంటి అవయవాల రూపంలో ఉంటాడు. ఇలా వ్యక్తి పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అంతర్గతంగా, వ్యక్తి ఈ అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ, తన గురించి మినహా ఇతరుల గురించి ఆలోచించకపోతే అతడిని వ్యక్తిగత మనిషి అంటారు. అదే మనిషి, తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని, దానిని తాను నివసించే గ్రామానికి, సమాజానికి విస్తరింపచేస్తే అతడిని సామాజిక మనిషి అంటారు. అలాగే, అతడు తన వ్యక్తిత్వాన్ని జాతీయ సరిహద్దుల వరకు విస్తరింపచేసే అతడిని జాతీయ వ్యక్తి అనవచ్చు. కనుక, మహాత్మాగాంధీ జాతీయ మనిషి (నేషనల్ మ్యాన్) అని అనవచ్చు. డాక్టర్జీ జాతీయ మనిషి. మన గ్రామాల్లో కూడా సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేసే మంచి వ్యక్తులు ఉంటారు. వారు సామాజిక మనుషులు. కేవలం తన గురించి, తన కుటుంబం గురించి మాత్రమే పట్టించుకునే వ్యక్తి ఉండవచ్చు. అతడిని సామాజిక మనిషి అనలేం కానీ, కుటుంబీకుడు అనవచ్చు. కుటుంబంలో భాగమైనప్పటికీ, భార్య, పిల్లల గురించి ఆలోచించకుండా కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తిని స్వార్ధపరుడు అనవచ్చు. అవయవాలన్నీ ఒకేరకంగా ఉన్నప్పటికీ, అంతర్గతంగా వేరువేరు భావాలు ఉన్నందున స్వార్ధపరుడు, వ్యక్తిగత మనిషి, సామాజిక మనిషి, జాతీయ మనిషి, విశ్వవ్యక్తి అని భిన్నపద్ధతులలో పిలుస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో వ్యక్తిగత మనిషిగా సంఘానికి పరిచయమై క్రమంగా జాతీయభావాలతో నిండిన మనిషిగా విస్తరించగలడు. ఆ జాతీయ వ్యక్తిని స్వయంసేవకుడంటారు. వ్యక్తిగత మనిషి నుంచి జాతీయభావాలతో నిండిన మనిషిగా మారే క్రమంలో – సంఘంలో చేరే ముందు మంచి శీలవంతుడైన అతడు వ్యక్తిగత మనిషే. అతడు స్వార్ధపరుడు కాకపోవచ్చు కాని అతడు తన కులం గురించి ఆలోచించవచ్చు. అపుడు అతడు జాతీయ వ్యక్తి కాలేడు. కాని అతడు తన కుల అస్తిత్వాన్ని, కుటుంబ గుర్తింపును వదిలి అతని భావాలను దేశంవరకూ విస్తరింప చేస్తే, అప్పుడు అతడు జాతీయ భావాలతో నిండిన వ్యక్తి అవుతాడు. చైనా మన ఉత్తర సరిహద్దులపై దాడి చేసినప్పుడు అతడు ఇక్కడ ప్రశాంతంగా పడుకోలేడు. వాస్తవంగా చైనా ఆతడి ఊరి సరిహద్దుల్లో ఒక్క అంగుళంపై కూడా దాడి చేసి ఉండకపోవచ్చు, అయినా అతడికి నిద్రపట్టదు. చైనా మన దేశంలోకి ప్రవేశించిందను కుంటాడు తప్ప తన గ్రామం, తన ఆవరణ గురించి ఆలోచించడు. ఆ విధంగా జాతీయభావాలను కలిగించ గల శక్తి ఈ భగవారంగుకే ఉంది. మనం దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారమైనా కావచ్చు. ఇది పూర్తిగా అందరినీ కలుపుకుపోతుంది. కనుక, భగవాధ్వజం (రంగు) మనకు జాతీయ గుర్తింపును ఇస్తుంది. గురుపూజోత్సవం సందర్భంగా దానిని పూజించడమనేది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. ఈ రోజున, మనం గురువుగా స్వీకరించిన భగవాధ్వజాన్ని పూజిస్తాం.