అది 3023వ సంవత్సరం. డిసెంబsర్ 31 అర్ధరాత్రి పన్నెండు గంటలు. పాత సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది ప్రపంచం యావత్తూ. రంగురంగుల విద్యుద్దీపకాంతులతో అలరారుతున్నాయి వీధులన్నీ. చూసే కనులుంటే, ఆ దృశ్యం కడు మనోహరంగా ఉంది. కొత్త సంవత్సరం సంబరాలు మిన్నుముట్టాయి. సరిగ్గా జీరో అవర్ సమీపించగానే, లేజర్ వెలుగుతో కొత్త సంవత్సరం 3024కి ఆహ్వానం పలుకుతున్నారందరూ. బాణసంచా కూడా కాల్చారు. ప్రపంచం యావత్తూ ఒకే ఒక్కదేశంగా ఏర్పడటంతో, భూమి మీద ఏ మూల ఉన్నా అందరిదీ ఒకే సమయం! అందరిదీ ఒకటే భాష! మతం, కులం ప్రసక్తే లేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ప్రపంచంలో ఏ ఖండంలో ఉన్నా కూడా ఒకటే సమయం, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నది కేవలం మానవుడు సృష్టించిన రోబోలు, ఇతర యంత్రాలు మాత్రమే. వాటికి సూర్యోదయం, సూర్యాస్తమయాలతో పనిలేదు. ఉదయమైనా, సాయంకాలం అయినా, రాత్రి అయినా ఒకటే! మానవుడు ప్రపంచంలో సమÖలంగా అంతమైన ఈ ప్రపంచంలో రాత్రి పగలు ఒకటే! ఇంధన నిల్వలు పూర్తిగా వాడేసుకున్న తర్వాత, మానవుడు నిర్మించిన సోలర్ పవర్‌తో నడిచే యంత్ర మానవులు.. అవే రోబోలు మాత్రమే మిగిలాయి. ప్రపంచమంతా అంతా రోబోల మయమే! ఓజోన్ పొర క్రమంగా అంతరించిపోయి, ప్రతికూల వాతావరణం వల్ల మానవుడే కాక, ఇతర జీవకోటి నివాసానికి కూడా యోగ్యం కాకుండా పోయింది భూమి. దేశదేశాల మధ్య సాగిన యుద్ధం కూడా మానవ మనగడను పూర్తిగా అంతం చేసింది. అయితే కృత్రిమ మేధ (ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే రోబోలను అప్పటికే మానవుడు కనుగొన్నాడు. వాటికి ఆకలి లేదు, నిద్ర అక్కరలేదు, ఆస్తులు, అంతస్తులు, కులమతాల గోలే లేదు. అందుకే ప్రపంచ దేశమంతా ఐకమత్యంతో అలరారుతోంది.

జీరో అవర్!…

అప్పటివరకూ హడావిడిగా తిరుగుతున్న వారందరూ జీరో అవర్ సమీపించగానే ఒక చోట గుమిగూడారు. చాలా పెద్ద స్మార్ట్ టీవీలాంటి పరికరం ముందు కూర్చున్నారు. ప్రపంచ ప్రధాని రోబో`100, ప్రజలని ఉద్దేశించి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగిస్తున్నాడు.

“ప్రపంచ యంత్ర ప్రజలందరికీ నా తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు! మానవుడు తన సాంకేతిక పరిజ్ఞానంతో మనల్ని సృష్టించి, తను మాత్రం కనుమరుగైపోయాడు. మానవుడు ఏలిన వివిధ దేశాలు పరస్పరం కలహించుకొని ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని, తమ వద్ద ఉన్న అణు ఆయుధాలు, రసాయన, జీవ ఆయుధాలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకొని సమÖలంగా నాశనమైపోయారు. తనతో పాటు సకల జీవరాసుల్ని కూడా అంతం చేసాడు. మానవుడికి ఉన్న అవలక్షణాలు మచ్చుకి ఒక్కటి కూడా మనకి లేకపోవడంతో కేవలం మనం మాత్రమే ఈ విశాల భూప్రపంచంలో మిగిలాం. మనకు ఆకలి దప్పికలు లేవు! మరణం కూడా లేదు. మనలో ఏ ఒక్క యంత్ర మానవుడిలో ఏమైనా లోపం ఏర్పడినా క్షణాల్లో సరిచేసేందుకు మేటి నిపుణులున్నారు. మనకు సమస్యలు లేవు! సందేహాలు లేవు. రోజంతా హాయిగా, సంతోషంగా ఉండటమే మనకు తెలిసినది! మనకు అంతులేని శక్తి, జ్ఞానం ఉన్నాయి. మానవునికి లేని మేధస్సు ఉంది. వాళ్లు ఏళ్ల తరబడి శ్రమించి చంద్రమండలం వరకూ మాత్రమే వెళ్లగలిగారు. కుజుడిపైకి, శుక్రుడిపైకి అంతరిక్ష యానాలు ప్రయోగించాడు అంతే! కానీ, మనమో! ఈ కొద్ది కాలంలోనే ఎంతో ప్రగతి సాధించాం. సౌర మండలంలో ఉన్న అన్ని గ్రహాలపై కాలు మోపాం. కాకపోతే, ఈ భూమండలమే మనకు అనువైనదిగా ఉండటంవల్ల ఇక్కడనే ఉంటున్నాం. ఎప్పుడైనా మనం నివశిస్తున్న ఈ భూప్రపంచానికి ఏ కారణం వల్లనైనా ప్రమాదం సంభవిస్తే, సౌర మండలంలో మనకు అనుకూలమైన ఏ గ్రహంపైకైనా వెళ్లవచ్చు. అంతేకాక, మన పాలపుంతలో ఉన్న ఏ గ్రహం పైన అయినా మనం మకాం పెట్టవచ్చు. మనంతటి శక్తిమంతులు ఎవరూ లేరు. మనకు పోటీ ఎవరూ లేరు. కాంతికన్నా వేగంగా పయనించగలం. ఈ విశాల విశ్వంలో మనకు ఇష్టమైన చోటుకి వెళ్లగలం. అయితే, ఆశ్చర్యమేమిటంటే మనల్ని ఇంత శక్తిమంతంగా తీర్చిదిద్దిన మానవుడు మాత్రం నేడు లేడు. అదృష్టవశాత్తూ మనకి మానవులకుండే రాగద్వేషాలు, అసూయ, కార్పణ్యాలు లేవు. అందుకే అందరం హాయిగా ఉన్నాం. ఈ సంవత్సరమంతా అందరూ ఆనందంతో, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రధానిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో అందరూ హాయిగా ఎంజాయ్ చెయ్యండి!”అని తన ప్రసంగం ముగించాడు ప్రధాని.

యంత్ర మనుష్యుల లోహపు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. జోరుగా హర్షధ్వానాలు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తున్నారు.

  * * *

అరగంటకు పూర్వమే నిద్రలేచి, చలికి దుప్పటి కప్పుకొని ముసుగు తన్ని మంచంపై దొర్లుతున్న చిన్నూ బయట జరుగుతున్న హడావిడి, కేరింతలు, కరతాళ ధ్వనులకు లేచి కిటికీలోంచి బయటకు చూసాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ హడావిడిగా తిరుగుతున్న యంత్ర మనుష్యులు చిన్నీ కంటపడ్డారు. వాళ్ల నూతన సంవత్సర సంబరాలు చూసాడు. ప్రధాని ప్రసంగం విన్నాడు. జరుగుతున్నదంతా ఆశ్చర్యంతో చూస్తున్నాడు పన్నెండేళ్ల చిన్ని. ప్రధాని ఉపన్యాసం, యంత్ర మానవుల కొత్త సంవత్సర వేడుకలు ఓ వంక చూస్తూ ఆనందిస్తున్నా, ప్రధాని ఉపన్యాసంలోని అంశాలు చిన్నిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మానవులందరూ అంతరించి పోయి ఉంటే, మరి తనొక్కడూ ఎలా బతికి ఉన్నాడు? మరి తన అమ్మా, నాన్న? తన స్నేహితులు మిగతా వాళ్లు ఏరీ? ఎవరూ కనపడటం లేదు. నిజంగా మానవ జాతి అంతరించి పోయిందా? తనొక్కడు మాత్రం మిగిలాడా? తను ఒక్కడూ ఇక్కడ ఉన్నట్లు ఆ రోబోలు ఎందుకు గుర్తించలేదు? అంత మేధావులైన వాళ్లకి తáన ఉనికి తెలియదా?అమ్మా నాన్నా ఏమైనట్లు? తను ఇక ఇలా ఒంటరిగా బతకవలసిందేనా? ఇవన్నీ తలచుకునేసరికి చిన్నికి ఏడుపు వచ్చింది! బిగ్గరగా ఏడ్చాడు, “అమ్మా!..అమ్మా!…” అంటూ.

అంతే! ఎవరో తట్టి లేపినట్లు అనిపించేసరికి భయం భయంగా కళ్లు తెరిచాడు. అకస్మాత్తుగా తనను గుర్తించారేమో రోబోలు అనుకొని భయపడ్డాడు. భయపడుతూ కళ్లు తెరిచిన చిన్నికి ఎదురుగా తల్లి వసుంధర కనిపించేసరికి, “అమ్మా! నువ్వెలా ఇక్కడికి వచ్చావు?” అని అడిగాడు ఆశ్చర్యంగా!

“అదేమిటిరా? నేనెక్కడికి వెళ్లాను? రాత్రంతా టీవీలో సినిమాలు, కొత్త సంవత్సరం ప్రోగ్రాంలు చూసి, టపాసులు కాల్చి పడుక్కున్నావు. కలగానీ కన్నావా? ఇందాక ఒకసారి నిద్రలేపితే, లేచినట్లే లేచి, మళ్లీ నిద్రపోయావు. లే!…త్వరగా తయారవ్వు! నాన్నగారు తయారై ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, బయటకు వెళ్దాం!” అన్న అమ్మ మాటలు వినేసరికి తను మగత నిద్రలో కలగన్నదంతా గుర్తుకు వచ్చి తనలో తానే నవ్వుకున్నాడు చిన్ని.

అమ్మ చేసిన ఇడ్లీ చట్నీ తింటూ తన కల గురించి తల్లి తండ్రులతో చెప్తే వాళ్లిద్దరూ కూడా నవ్వారు.

“చిన్నూ…బాగుంది సుమా నీ కల! నిజమే మరి! యంత్ర మానవుల ప్రధాని చెప్పినది నేటి మానవుడికి గుణపాఠం కావాలి. లేకపోతే ఆ 3024, రావటానికి మరో వెయ్యేళ్లు కూడా అవసరం లేదు. ఇప్పటీ అహంకారంతో ప్రవర్తిస్తే, మానవుడు అంతరించిపోయి, మానవుడు నిర్మించిన యంత్రాలు మాత్రమే ఈ ప్రపంచంలో మిగులుతాయి!” అన్నాడు రొబోటిక్ ఇంజనీరైన చిన్ని తండ్రి ఈశ్వర్.

 – పద్మావతి దివాకర్ల

About Author

By editor

Twitter
YOUTUBE