“మళ్లీ మిస్సయ్యిందా..?” స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 24, శనివారం రాత్రి అమెరికాలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది అన్న వార్త వినగానే నా సహోద్యోగి అన్న మాట ఇది. 2016 నుంచి ఇప్పటిదాకా తాజాగా జరిగిన దానితో లెక్క వేసుకుంటే ఆయనపై 15 హత్యాయత్నాలు జరిగాయి. నాకు తెలిసి అమెరికా చరిత్రలో ట్రంప్‌కు ముందు పనిచేసిన దేశాధ్యక్షుల్లో ఏ ఒక్కరిపైనా ఇన్నిసార్లు హత్యాయత్నాలు జరిగినట్టు దాఖలాలు లేవు. గడచిన పదేళ్లుగా టంప్ర్ వ్యవహారశైలి పట్ల కొద్దిపాటి అవగాహన ఉన్నవారికి సైతం శనివారం నాటి దాడి నిజమైందా లేక నాటకీయంగా సృష్టించిన ఘటనా అనే సందేహం రావడం సహజం. దీనికి నిదర్శనం అన్నట్టుగా హోటల్‌ వద్ద దుండగుడి హత్యాయత్నం విఫలమవ్వడంతో, సోషల్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో నిండిపోయింది. లెఫ్టిస్టులు, రైటిస్టులు అనే తేడా లేకుండా చాలావరకు ఖాతాలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ దాడిని “స్టేజ్‌డ్ – నాటకీయంగా సృష్టించినది” అని ఆరోపించాయి. సోషల్ మీడియా విశ్లేషణల సంస్థ ట్వీట్‌బైండర్ ప్రకారం, ఆదివారం మధ్యాహ్నానికి, 3,00,000కు పైగా పోస్టులలో “స్టేజ్‌డ” అనే పదం కనిపించింది.

తమ ఆరోపణకు మద్దతుగా వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ఇంటర్నెట్ వినియోగదారులు(నెటిజన్లు) చేసిన వాదనల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పడిపోతున్న ప్రజాదరణ నుంచి, ఇరాన్ యుద్ధం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ కాల్పుల ఘటనను కల్పించారు అనే మాట గట్టిగా వినిపించింది. మరికొందరైతే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వైట్ హౌస్‌లో నిలిచిపోయిన బాల్‌రూమ్ నిర్మాణ పనుల పునరుద్ధరణకు మద్దతు కూడగట్టుకోవడానికే ఈ కాల్పుల ఘటన అని పోస్టులలో రాసుకొచ్చారు. నిజానికి, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ తన బాల్‌రూమ్ గురించి ప్రస్తావించారు. ఈ ఘటన దాని నిర్మాణం ప్రాముఖ్యతను చూపిస్తుందని ఆయన అన్నారు. అలాగే మరుసటి రోజు ఉదయం ట్రూత్ సోషల్‌లో కూడా దీనిని పేర్కొన్నారు. ఇంతలో, పలువురు ట్రంప్ మద్దతుదారులు కొత్త బాల్‌రూమ్ అవసరాన్ని పునరుద్ఘాటించడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఈ త్వరితగతిన, సమన్వయంతో కూడిన ప్రతిస్పందన ఒక పెద్ద కుట్రకు సాక్ష్యమని నెటిజన్లు ఆరోపించారు. ఘటన తర్వాత కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. అవి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.నిర్దేశిత కార్యక్రమానికి ముందు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతున్న వీడియోను నెటిజన్లు లక్షలాది సార్లు వీక్షించారు. ఆ వీడియోలో ఆమె ట్రంప్ చేయబోయే ప్రసంగం గురించి మాట్లాడుతూ “ఈ రాత్రి గది(బాల్‌రూమ్)లో  కాల్పులు జరుగుతాయి” అని అన్నారు. ఆన్‌లైన్‌లో ఇది మరిన్ని ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అమెరికా విషయానికి వచ్చేసరికి “కాల్పులు జరగడం” అనేది మాటల తూటాలు పేలుతాయి అని చెబుతూ ఒకరిని విమర్శించడానికి లేదా ఎగతాళి చేయడానికి ఉపయోగించే ఒక సాధారణ జాతీయ పదం. ఫాక్స్ న్యూస్‌కు చెందిన మరో వీడియో కూడా ఈ కుట్రపూరిత గందరగోళానికి ఆజ్యం పోసింది. ఆ ఛానెల్ వైట్ హౌస్ కరస్పాండెంట్ ఐషా హస్నీ, ఆ సాయంత్రం తన అనుభవాన్ని స్వయంగా వివరిస్తున్న వీడియో అది. “ఈ రాత్రి సురక్షితంగా ఉండండి” అని లీవిట్ భర్త తనతో చెబుతుండగా ఆమె కాల్ కట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఆన్‌లైన్‌లో, తన కాల్ సమయంలో బాల్‌రూమ్‌లో సిగ్నల్ సరిగ్గా లేదని స్పష్టం చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ వద్దకు చేరుకోవడానికి ముందే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న వీడియోపైన కూడా నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి కంటే ముందుగా ఉపాధ్యక్షుడిని ఎందుకు తరలించారని నిలదీశారు. ఇన్ని సందేహాల మధ్య దాడి వెనుక నాటకీయ కల్పన అనే వాదనను వమ్ము చేయాల్సిన బాధ్యత వైట్‌హౌస్ మీద ఉందనేది అక్షర సత్యం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE