ఈ ఆధునిక యుగంలో యుద్ధం చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. యుద్ధంలో గెలిచిన వారికి అనేక ప్రయోజనాలు లభించొచ్చు. కాని యుద్ధం మాత్రం ప్రాణనష్టానికి, వాతావరణ కాలుష్యానికి ప్రధాన హేతువనేది నిర్వివాదాంశం.

ఎందుకంటే ఇప్పుడు జరిగే యుద్దాలన్నీ అతి శక్తివంతమైన పేలుడు రసాయనాలను (ఎనర్జిటిక్ మెటీరియల్స్) ఉపయోగించి చేసేవే. వీటి ప్రయోగం ద్వారా సమీప వాతావరణంలో రసాయనాలతో కూడిన వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, తీవ్ర ఉష్ణోగ్రతలు, లోహారజనుతో కాలుష్యం, రేడియో ధార్మిక కాలుష్యం, జీవ రసాయన కాలుష్యం లాంటివి ఏర్పడతాయి. అంతేకాక భూమిమీద మానవ మనుగడకు, అవసరాలకు ఉపయోగించే ఇంధనాలు, లోహాలు, రబ్బర్, ప్లాస్టిక్, ఆయిల్, సిమెంట్ మొదలైన వస్తువులు యుద్ధంలో నాశనమై, వాటిలోంచి వెలువడే అత్యంత విషపూరిత పదార్ధాలు వాతావరణాన్ని కొన్ని దశాబ్దాలవరకు ప్రభావితం చేస్తాయి. కాబట్టి యుద్ధ ప్రయోజనాలతో పాటు ఈ కాలుష్య పరిమాణాలను లెక్క కట్టి జరిగే నష్టాన్ని బేరీజు వేసుకుంటే యుద్ధాలను చేపట్టక పోవడమే మంచిదనిపిస్తుంది.

యుద్ధ తంత్రాలను, యుద్ధంలో వాడే అస్త్ర, శస్త్ర సామాగ్రిని అనాదినుంచీ పరిశీలిస్తే ఒకప్పుడు సైనికులు చిన్న, చిన్న బాంబులను ఉపయోగిస్తూ, ప్రత్యర్థిని భయబ్రాంతులకు గురిచేస్తూ, ప్రత్యర్థి భూమిని ఆక్రమిస్తూ, లోపలికి చొచ్చుకుని వెళ్లి ఆక్రమించేవారు. ఇది ల్యాండ్ వార్ – భూమిపై జరిగే యుద్ధం. ఇందులో సైనిక బలం ఎక్కువగా ఉండి, రసాయన ఆయుధాల ఉపయోగం పరిమితంగా ఉండేది. దీన్నే కన్వెంషనల్ వార్ ఫేర్-సంప్రదాయ యుద్ధం అనే వారు. అందుకే ఆ యుద్ధాలలో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉండేది. ఆధునిక యుగంలో ముఖ్యంగా 20, 21 శతాబ్దాలలో శాస్త్ర, సాంకేతికతలు (సైన్స్ టెక్నాలజీ) విపరీతంగా అభివృద్ధి చెంది, పరిశోధనలు ద్వారా తీవ్ర విధ్వంసకర ఆయుధాలతో (వెపన్స్ అఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టాలతోపాటు, వాతావరణ కాలుష్యం జరుగుతోంది. దీనిని మోడరన్ వార్ ఫేర్ – ఆధునిక యుద్ధం అంటాము. తద్వారా యుద్ధాలు మానవాళి మనుగడకు గొడ్డలి పెట్టులాగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం క్షిపణులు, డ్రోన్ల యుగం. ఇదివరకు యుద్ధాలు ప్రధానంగా రెండు దేశాలమధ్య జరిగితే ఇప్పుడు అనేక దేశాల కూటముల మధ్య జరుగుతున్నాయి. దీనివల్ల ఒక యుద్ధంలో అనేక దేశాలు అంటే అధిక భూభాగం ప్రభావితమౌతోంది. ఉపయోగించే ఆయుధాల సంఖ్య కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటోంది. తత్ఫలితంగా జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా ఎక్కువే. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఆయుధ సామాగ్రి తయారీలో పర్యావరణ కాలుష్యం మితంగానే ఉంటుంది కానీ ఆయుధాలను పేల్చినప్పుడు కాలుష్యం మాత్రం విపరీతంగా ఉంటుంది.

యుద్ధం పేలుళ్ల వల్ల కలిగే వాయు కాలుష్యం, నేల, నీటిలోకి చేరే విషపూరిత రసాయనాలు, సైనిక ఇంధన వినియోగం వల్ల వెలువడే భారీ కర్బన ఉద్గారాలద్వారా తీవ్రమైన, దీర్ఘకాలిక పర్యావరణ నష్టం కలుగుతుంది. మౌలిక సదుపాయాల విధ్వంసం తరచుగా పారిశ్రామిక వ్యర్థాలు, వ్యర్థ సంక్షోభాలకు దారితీస్తుంది, అదే సమయంలో మందుపాతరలు, పేలని ఆయుధాలు, పారవేసిన మందుగుండు సామగ్రి దశాబ్దాల పాటు భూమిని, సముద్రాలను కలుషితం చేస్తూ, శాశ్వత ఆరోగ్య ప్రమాదాలను, పర్యావరణ వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి.

రక్షణ రంగంలో పరిశోధన-అభివృద్ధి

యుద్ధ పరికరాలను, రక్షణ సామాగ్రిని రూపొం దించడంలో ప్రముఖ దేశాలన్నీ విపరీతమైన లక్ష్యాలతో, విపరీతంగా ఖర్చుచేస్తూ పరిశోధనలు తీవ్రతరం చేసాయి. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్‌లు, ఐరన్ డోమ్స్-గగనతల రక్షణ వ్యవస్థలు, ఇంటర్ సెప్టార్స్ – శత్రు క్షిపణులు, డ్రోన్, విమానాలకు అవరోధకాలు, జలాంతర్గాములు, మాక్ 10 కి మించిన వేగంతో వెళ్లే యుద్ధ విమానాలు, క్లస్టర్ బాంబర్‌లు, ఏకకాలంలో అనేక క్షిపణులను ప్రయోగించే వాహక వ్యవస్థలు, భూగర్భ అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు, ఇతర ఖండాలలోనూ సైనిక స్థావరాల ఏర్పాటు, సాగర విన్యాసాలు, సముద్రాలలో విపరీతమైన యుద్ధ సామాగ్రి మొహరింపు, ఆయుధాల ఉత్పాదక సామర్థ్యం పెంపు వంటి విషయాల్లో అగ్రరాజ్యాలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నాయి. రణరంగంలో పోటీ తత్వాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చు, నష్టాలు, పర్యావరణ విఘాతం తప్ప మానవాళికి నిజమైన లాభమేదీ లేదని తెలిసికూడా ఈ రంగంలో విపరీతమైన పోటీ నానాటికి పెరుగుతోంది. సనాతన ధర్మం పునాదిగా ఉన్న మన భారత దేశంతో పాటు బహుకొద్ది దేశాలు మాత్రమే యుద్ధం కేవలం అనివార్యమైతే తప్ప చేయకూడదనే ఆలోచనతో ఉంటే చాలా దేశాలు కారణాలు వెతుకుతూ యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్న ఈ తరుణంలో అనవసర యుద్ద కాంక్షలు తగ్గించు కోవడం ఎంతైనా అవసరం.

ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు

ఐక్యరాజ్యసమితి – ఐరాస 2022లో యుద్ధాలవల్ల జరిగే విధ్వంసాలను విశదీకరిస్తూ ఒక ప్రతిని విడుదల చేసింది. యుద్ధం పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఉండడానికి 27 మార్గదర్శకాలను సూచించింది. అయితే ఈ మార్గదర్శకాలను యుద్ధాలు చేసే దేశాలు, కూటములు ఏమేరకు ఖాతరు చేస్తున్నాయి, పాటిస్తున్నాయి అన్నది విశదంగా పరిశీలించి నివేదికలు పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యుద్ధవిరమణ – శాంతి పునరుద్దరణ

యుద్ధ విరమణ నిజంగా అనుకున్న శాంతిని తెస్తుందా? ఇది సందేహాస్పదమే. ఎందుకంటే యుద్ధమే జరగకూడదు కాని జరిగితే దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. యుద్ధ విరమణ జరిగినా మానవాళికి నిజమైన సుఖ శాంతులుండవు. యుద్ధ విరమణ వల్ల ఒక తాత్కాలిక ఘర్షణ ముగుస్తుంది కాని అది అంతటితో అది ఆగిపోడు. ఇది మరో శాశ్వత ఘర్షణకు దారితీస్తుంది. అదే వాతావరణ కాలుష్య ఘర్షణ. దీన్నే ఎన్విరాన్మెంటల్ కాన్‌ఫ్లిక్ట్ అని అంటారు. యుద్ధమంటే దేశాల మధ్య ఘర్షణ. ఇది కొంత కాలం మాత్రమే ఉండొచ్చు.. కాని దానివల్ల ఉత్పన్నమయ్యే ఎన్విరాన్మెంటల్ కాన్ఫ్లిక్ట్ మాత్రం తరతరాలుగా మానవాళిని పట్టి పీడిస్తుంది. కాబట్టి యుద్ధం అనివార్యమైతే అది వాతావరణం కాలుష్యం కాకుండా ప్రత్యర్థి మూల శక్తి, యుక్తులు అంటే ప్రత్యర్థి ముఖ్య ప్రణాళికలు జరిగే స్థావరాలు, కేంద్రాలు మాత్రమే నిర్వీర్యం చేయాలి. సామాన్యు లకు ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగకుండా ఉండాలి. యుద్ధానంతరం జన జీవనం అస్తవ్యస్తం కాకుండా చూడాలి. అదే అసలు సిసలైన రణ నీతి అవ్వాలి. ఆ రోజు కోసం యావత్ మానవాళి ఎదురు చూస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


ఎనిమిది దుష్ప్రభావా

యుద్ధాలలో ఉపయోగించే యుద్ధ సామాగ్రి (ammunition) వల్ల ముఖ్యంగా 8 రకాలైన ప్రదూషకాలు (pollutants) ప్రకృతి/ వాతావరణంలోకి విడుదలవుతాయి.

  1. యుద్ధంలో ఉపయోగించే రసాయనిక పేలుడు పదార్ధాలవల్ల జరిగే ఏర్పడే రసాయన కాలుష్య కారకాలు (కెమికల్ పొల్యూటెంట్స్). వీటివల్ల కర్బన ఉద్గారాలు, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విష వాయువులు విడుదలై, ఆమ్ల వర్షాలు, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. క్షిపణుల వల్ల అల్యూమినియం ఆక్సైడ్, బ్లాక్ కార్బన్, క్లోరిన్ వాయువులు వంటి కాలుష్య కారకాలు విడుదలవుతాయి. ఇవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి.
  2. యుద్ధ పరికరాల్లో ఉపయోగించే ఖనిజ/దాతు/లోహ/ లోహ మిశ్రమ కాలుష్య కారకాలు (మెటలర్జికల్ పొల్యూటెంట్స్). ఖన్పుి, భార లోహల అవశేషాలు చాలాకాలం భూమిలో ఉండిపోయి భూమి సహజత్వాన్ని, భూగర్భ జలాలను అంతులేని పరిమాణాల్లో దెబ్బతీస్తాయి.
  3. పేలుళ్ల వల్ల భూమిమీద జరిగిన విధ్వంసం వల్ల కాంక్రీట్, రాళ్లు, ఇసుక రేణువులు ఇంకా అనేక రకాలైన భవన నిర్మాణ పదార్ధ సంబంధ కాలుష్యం (కన్‌స్ట్రక్షన్ పొల్యూటెంట్స్)
  4. చమురు / ఇంధన స్థావరాల విధ్వంసం ద్వారా భూమిమీద, నీటిలో, సముద్రంలో కాలుష్యం (చమురు ద్వారా నీటి కాలుష్యం)
  5. పేలుళ్ల వల్ల ఉత్పత్తి అయ్యే విపరీత శబ్దాల వల్ల, ప్రకంపనలవల్ల విడుదలయ్యే శబ్ద కాలుష్యం (సౌండ్ పొల్యూషన్)
  6. అణు కేంద్రాల పేలుడు ద్వారా విడుదలై చిరకాలం దుష్ప్రభావం చూపే రేడియో దార్మికత
  7. జీవరసాయనాలు యుద్ధంలో వాడితే జీవసంబంధమైన కాలుష్యం (బయాలజికల్ పొల్యూషన్)
  8. ఇప్పుడు కొత్తగా డర్టీ బాంబులు వస్తున్నాయంటున్నారు. వీటివల్ల వర్ణించడానికి/గుర్తుపట్టడానికి సాధ్యం కాని కాలుష్యాలు వాతావరణంలోకి విడుదలయ్యి చిరకాలం ఉండే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులకు సైనిక ఘర్షణలు గణనీయంగా దోహదపడతాయి, ప్రపంచవ్యాప్త గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో సుమారు 5.5% సైనిక రంగం కారణంగానే వెలువడుతున్నాయని గణాంకాలు తెలియ చేస్తున్నాయి.

“సర్వేజనాః సుఖినోభవంతు”

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE