హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అనుక్షణం హింసాకాండతో అట్టుడికిన బాంగ్లాదేశ్‌లో ఎట్టకేలకు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఫిబ్రవరి 17న బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌ఎస్) నాయకుడు, దివంగత మాజీ అధ్యక్షురాలు ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో, భారత్- బాంగ్లాదేశ్ సంబంధాలు తిరిగి గాట్లో పడతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన వెంటనే దౌత్యపరంగా మనదేశం వేగంగా పావులు కదిపింది. తారిక్ రహమాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మనదేశం తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇరుదేశాల మధ్య ఆర్థిక, భద్రత, సన్నిహిత సహకారాలను పెంపొందించుకోవాలని కోరుతూ ప్రధాని రాసిన లేఖను, బాంగ్లా కొత్త ప్రధానికి అందజేశారు. రహమాన్‌ను మనదేశానికి ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఎన్నికల్లో విజయం సాధించగానే తారిక్ రహమాన్‌కు అన్నిదేశాలకంటే ముందుగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ, ప్రస్తుతం దెబ్బతిన్న సంబంధాల స్థానంలో మునుపటి స్నేహం కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తాజా పరిణామాలను పరిశీలిస్తే నూతన ప్రభుత్వం భారత్‌తో సమతుల్య సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే చైనా, పశ్చిమ దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇదే సమ యంలో అంతర్గతంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీతో కూడా సఖ్యంగా మెలగాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవడం విశేషం. ఇక మనదేశంతో సంబంధాల విషయానికి వస్తే నీటి పంపకాలు, సరిహద్దు నిర్వహణ, అసమతుల్య వాణిజ్యం వంటి అంశాల విషయంలో తారిక్ రహమాన్ ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య అనుసంధానత, వాణిజ్యంపై రెండు ప్రభు త్వాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఇక ముందు బాంగ్లాదేశ్‌తో సంబంధాలు ప్రధానంగా జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వ పరిరక్షణ కేంద్రంగానే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. గడచిన దశాబ్దకాలంలో పరస్పర సహకారం, పూర్తిస్థాయి విశ్వాసంతో కొనసాగిన సంబంధాలకు ఇది భిన్నం.
భారత్‌తో సంబంధాలు
దక్షిణాసియాలో బాంగ్లాదేశ్ మనకు అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరుదేశాల మధ్య జరిగే వాణిజ్యం విలువ వార్షికంగా 13 బిలియన్ డాలర్లు! షేక్ హసీనా ప్రభుత్వ పతనంతోనే ఈ వాణిజ్య స్వర్ణయుగం ముగిసింది. మళ్లీ అంతటిస్థాయికి వాణిజ్యం చేరుకోవడం ప్రస్తుత బీఎన్‌పీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆధారపడి ఉంది.నువ్వు ఒక అడుగు ముందుకేస్తే…నేను నాలుగు అడుగులు ముందుకు వస్తానన్న రీతిలో భారత్ వ్యవహరిస్తోంది. యూనస్ హయాంలో జరిగిన పరిణామాలను పక్కనబెట్టి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే, అక్కడి అధికా రులు, జమాతే ఇస్లామీ వంటి విపక్షాలతో మనదేశ అధికారులు సమావేశమయ్యారు. ముఖ్యంగా అట్టడుగుకు చేరిన ద్వైపాక్షిక సంబంధాలను గాట్లో పెట్టడమే ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సహకారం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల అనుసంధానత, ఇంధనంతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశముంది. బాంగ్లాదేశ్ నుంచి మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చొరబాట్లు!
గతంలో బీఎన్‌పీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చొరబాట్ల స్థాయి విపరీతంగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ‘‘పరస్పర భద్రత కోసం కలిసి పనిచేయడం’’ అన్న వ్యూహాన్ని ముందుకు తీసుకు వచ్చారు. కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే చైనా, పాకిస్తాన్‌లతో కూడా సన్నిహితంగా మెలగాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ ముఖ్యంగా పాకిస్తాన్‌తో వ్యవహరించే తీరును మన ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవహారశైలి ప్రాంతీయ శాంతి సుస్థిరతలపై కనబరచే ప్రభావంపై అంచనా వేస్తోంది. అక్రమ చొరబాట్లను నిరోధిం చడం, బాంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను కఠినంగా నియంత్రించే చర్యలను కొత్త ప్రభుత్వం తక్షణమే చేపట్టాలన్నది భారత్ అభిప్రాయం. ఇరుదేశాల మధ్య గంగానదీ జలాల ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అగ్రస్థానంలో ఉంచింది. ఇటీవల టీ20 క్రికెట్ మ్యాచ్ విషయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బాంగ్లాదేశ్ కొత్త క్రీడలమంత్రి ఈ విషయంలో ఇప్పటికే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడం సానుకూల పరిణామం. కొత్తగా ఏర్పడిన బీఎన్‌పీ ప్రభుత్వం నుంచి సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, బాంగ్లా చొరబాట్లు, అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు, హత్యలు మనదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి.
సంబంధాల విధ్వంసకుడు యూనస్
షేక్‌హసీనా పాలనా కాలాన్ని భారత్- బాంగ్లాదేశ్ సంబంధాల్లో స్వర్ణయుగంగా పోల్చవచ్చు. ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టి, ప్రభుత్వ సలహాదారుగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఇరుదేశాల సంబంధాలు వేగంగా పతనమయ్యాయి. ఈ కాలాన్ని ‘‘భారత విద్వేష’’ యుగంగా పరిగణిం చాలి. హసీనాను తమకు అప్పగించాలని బాంగ్లాదేశ్ మన దేశంపై ఒత్తిడి తీవ్రం చేసింది. అందుకు అంగీకరించకపోవడంతో, ఇది మిత్రవైఖరి కాదంటూ విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో ‘‘ఇండియా ఔట్’’ ఉద్యమాన్ని అధికారులు, కొన్ని మతతత్వ గ్రూపులు మొదలుపెట్టాయి. భారత్‌పై విద్వేషం పరాకాష్టకు చేరుకుంది. వాణిజ్య పరిమితులు విధించడంవల్ల భారత వస్తువులు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకు అవసరమైన నూలు దిగుమతులు నిలిచిపోయాయి. మనదేశం నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వస్త్రపరిశ్రమలు వరుసగా మూతపడటంతో లక్షలాదిమంది కార్మికులు వీధులపాలయ్యారు. ఇంతగా దేశ ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నప్పటికీ, యూనస్ ‘‘మేం భారత్‌కు లొంగి ఉండే ప్రసక్తే లేదు’’ అని తెగేసి చెప్పడం అతని మూర్ఖత్వానికి పరాకాష్ట! అంతేకాదు ఫిబ్రవరి 16న తన వీడ్కోలు ప్రసంగంలో మాట్లా డుతూ, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు (సెవెన్ సిస్టర్స్) చుట్టూ భూభాగాలతో పర్యవేష్టితమై ఉన్నందువల్ల, సముద్రతీరం ఉన్న బాంగ్లాదేశ్‌తో వాణిజ్య సంబం ధాలు పెట్టుకున్నట్లయితే ఇవి మరింత సుసంపన్నమై ఉండేవని వ్యాఖ్యానించడం, కేవలం భారత సార్వ భౌమాధికారాన్ని ప్రశ్నించడమే! ఇరు దేశాల మధ్య ఇంతటి ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ ఏప్రిల్, 2025లో ప్రధాని నరేంద్రమోదీ, యూనస్‌ల మధ్య బ్యాంకాక్‌లో చర్చలు జరిగాయి. సరిహద్దు సమస్య, నీటి వాటాలు, మైనారిటీల రక్షణ వంటి అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.
పాక్‌తో సంబంధాలు
బాంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ తన వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ముఖ్యంగా భారత ఈశాన్య ప్రాంతంలో తన ఉనికిని మరింత విస్తరించు కునేందుకు ఉపయోగించుకున్నదన్న విశ్లేషణలు మీడియాలో వచ్చాయి. యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆకస్మాత్తుగా బాగ్లా-పాక్‌ల మధ్య స్నేహం పెరగడాన్ని చూస్తే 1971కి ముందు నాటి కాలం గుర్తుకు వచ్చింది. ఐఎస్‌ఐ తనకు అనుకూల జమాతే ఇస్లామీ, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శిబిర్‌ల సహాయంతో హసీనా వ్యతిరేక ఆందోళనతో పాటు హింసాకాండ సుదీర్ఘకాలం పాటు కొనసాగే విధంగా వ్యూహాన్ని అమలు చేసిందనేది నిపుణులు చెప్పే మాట. ఇదే సమయంలో పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా ప్రజల్లో భారత వ్యతిరేకతను విపరీతంగా ప్రచారం చేయడమే కాకుండా హింసాకాండ ఉధృతంగా కొనసాగేందుకు కావలసిన ఆజ్యం పోసింది. భారత్-బాంగ్లాదేశ్‌ల మధ్య భద్రతా సహకారం బలహీనపడటంతో, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద నెగళ్లను రాజేసేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిం చింది. ఈ తీవ్రవాదులకు బాంగ్లాదేశ్ స్వర్గధామంగా మారడం గమనార్హం.
భారత్-బాంగ్లా సంబంధాలను దెబ్బతీసి, తనకు అనుకూల ఇస్లామిక్ వ్యవస్థను ఒకవైపు, మరోవైపు చైనాతో బాంగ్లా సంబంధాలు బలపడేవిధంగా పాకిస్తాన్ తన వ్యూహాలను అమలు చేసింది. మే, 2025లో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఒక వీడియో విడుదల చేసింది. హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది తామేనని అందులో పేర్కొంది. విధ్వంసాన్ని సృష్టించి ఈ పనిని విజయవంతంగా పూర్తిచేసినట్టు వివరించింది. యూనస్ హయాంలో బాంగ్లాదేశ్ యుద్ధ నౌక, పాక్ నౌకా విన్యాసాల్లో పాల్గొనడం 1971 తర్వాత ఇదే మొదటిసారి! సిలిగురి కారిడార్ సమీపంలో తీస్తానది పునరుద్ధరణ ప్రాజెక్టును చైనా మద్దతుతో చేపట్టాలని యూనస్ నిర్ణయించాడు. ఇక్కడ భారత్ భద్రతా పరమైన సమస్యలను ఎంతమాత్రం ఖాతరు చేయ లేదు. పాకిస్తాన్‌తో చారిత్రక సంబంధాల పునరుద్ధరణ కోసం తహతహలాడారు. ఇందుకోసం పాకిస్తాన్ జనరల్స్‌ను పదేపదే తమ దేశంలోకి ఆహ్వానించారు. ‘‘గ్రేటర్ బాంగ్లాదేశ్’’ పేరుతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలను కలిపి రూపొందించిన వివాదా స్పద మ్యాప్‌ను పాకిస్తాన్ జనరల్‌కు బహూక రించడంతో దుమారం రేగింది.
హిందువులపై దాడులు
గత ఆగస్టులో చెలరేగిన విధ్వంసకాండలో పలు హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయి. కేవలం 2024లోనే మైనారిటీ హిందువులపై 2000 దాడులు జరిగాయంటే బాంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల ఎంతటి వ్యతిరేకత పెరిగిపోయిందీ అర్థమవుతుంది. 2024, ఆగస్టు 4-20 మధ్యకాలంలో మతోన్మాదులు విచ్చలవిడిగా హిందువుల ఆస్తుల విధ్వంసం, వ్యాపార ప్రదేశాలు, ఇళ్లపై దాడులు దహనకాండకు పాల్పడ్డారు. ఈ లూటీలు, దహనకాండలో 1700 హిందూ కుటుంబాలు వీధినపడ్డాయి. 82 మంది హిందువులు హత్యకు గురయ్యారు. అల్లరిమూకలు వీరి ఆస్తులను బలవంతంగా ఆక్రమించుకున్నాయి. 152 హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయి. 2021లో దుర్గాపూజ సందర్భంగా 50 దేవాల యాలు, హిందువుల ఇళ్లు దాడుల్లో ధ్వంస మయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 9మంది మరణించారు. వివిధ జిల్లాల్లో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసకాండ జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో వస్త్రపరిశ్రమలో పనిచేసే దీపూ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని హింసించి బహిరంగంగా సజీవదహనం చేశారు. డిసెంబర్, 2025లో చిట్టగాంగ్‌లోని రావ్‌జాన్ ఏరియాలో హిందువులను ఇళ్లలో ఉంచి బయట తాళం పెట్టి మరీ ఇళ్లను తగులబెట్టారు. నవంబర్, 2024లో చిన్మయ కిషన్ దాస్‌ను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న కారణంగా అరెస్ట్ చేయడంతో, ఛట్టోగ్రామ్‌లో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. అయితే వీటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు కొన్ని మతపరమైన విధ్వంసంగా, రాజకీయ విభేదాలు, స్థానికంగా ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడులుగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో దైవదూషణపై విపరీత ప్రచారం, రాజకీయ అనిశ్చితి లేదా దుర్గాపూజ సమయాల్లో అల్లర్లు, విధ్వంసం జరుగుతోంది. ముఖ్యంగా గోపాల్‌గంజ్ వంటి హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలపైనే ఈ దాడులు జరగుతుండటం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం భద్రతాదళాలను దించి, పరిస్థితిని చక్కబెట్టినా ఫలితం ఉండటంలేదు. మైనారిటీలకు ఎటువంటి భద్రత లేకపోవడంతో, వీరి రక్షణకోసం ‘‘బాంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ’’ వంటి పార్టీల ఆవిర్భావం జరిగింది. మన విదేశాంగ శాఖ బాంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఎప్పటి కప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూవస్తోంది. బాంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవా లని ఐక్యరాజ్య సమితిని, పశ్చిమ దేశాలను 125 అంతర్జాతీయ గ్రూపులు అర్థించాయంటే, అక్కడ హిందువుల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉన్నదీ అర్థమవుతుంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్